సద్గురు: కృష్ణా ఇంకా గోదావరిపై రెండు డ్యామ్‌లను నిర్మించిన ఆంగ్లేయ అధికారి సర్ ఆర్థర్ కాటన్ కి - మొట్టమొదటి సారి 1858లో నదిని అనుసంధానం చేయాలనే ఆలోచన వచ్చింది. ఎక్కువ నీటి సరఫరా ఉన్న నదులను, కాలువల ద్వారా, నీరు తక్కువగా ఉన్న నదులకు అనుసంధానం చేయాలనేదే ఇందులోని ఆలోచన. కానీ అప్పటి నుండి ఇప్పటికి రివర్ హైడ్రాలజీ శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. అతనికి ఇంగ్లండ్ ఇంకా ఐరోపాలోని నదుల గురించి అవగాహన ఉంది, అయితే అవి భారత దేశంలోని నదులకన్నా భిన్నమైన స్వభావం గల నదులు, అంటే, సంవత్సర కాలంలో యూరోపియన్ నదీ జలాల మట్టంలో వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా, ఐరోపాలోని నదులకు, సంవత్సరంలో ఏ సమయంలోనైనా ఆ వ్యత్యాసం 20% కంటే ఎక్కువ ఉండదు. కానీ భారతదేశంలో, అది 80% కంటే ఎక్కువ ఉంటుంది. వర్షాకాలంలో ఒక నదిని చూసి, ఆ తర్వాత వేసవిలో అదే నదిని చూస్తే, మీరు అసలు దానిని గుర్తించలేరు 

proposed inter basin water transfer map

 

ఒక ఉష్ణమండల దేశంలో అధిక నదీ జలాలు ఇంకా తక్కువ నదీ జలాలు అనే ఆలోచనే తప్పు, ఎందుకంటే ప్రస్తుతం, వర్షాలు పడినప్పుడు నదులు పొంగి పొర్లుతాయి. ఒకసారి వర్షాలు ఆగిపోతే నదుల్లో నీరు ఉండదు. చెక్ డ్యామ్‌లు ఇంకా వర్షపు నీటి చెరువులను నిర్మించడం స్వల్పకాలిక ప్రయోజనాల కోసం మంచిదే. దీర్ఘకాలికంగా చూసినప్పుడు, మనం చేయాల్సింది ఏంటంటే, వాన నీరు నదిలోకి త్వరగా వెళ్ళకుండా చూసుకోవాలి. ఇది జరగాలంటే, భూమిపై సహజ వృక్షసంపద ఉండాలి - వేరే మార్గం లేదు.

నదుల అనుసంధానానికి ఆర్థిక వ్యయం కూడా భారీగానే ఉంటుంది. ముఖ్యంగా, మనం నది నుండి నదికి నీటిని రవాణా చేయడానికి వేల కిలోమీటర్ల కాలువలను నిర్మించినప్పుడు, సగటున 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ఈ దేశంలో, నీటిలో అధిక భాగం ఆవిరైపోతుంది. పైగా భూమి బాగా పీల్చేసుకుంటుంది. ఆ కాలువలను ఏ విధంగా నిర్మించినా ఎక్కడో ఒకచోట లీకేజీ ఏర్పడి దాహార్తితో ఉన్న భూమి ఆ నీటిని తాగేస్తుంది.

సమస్య ఏమిటంటే, ప్రజలు నీరు లేని చోట వ్యవసాయం చేయాలనుకుంటున్నారు. శుష్క భూముల్లో తడి పంటలు పండించడానికి ప్రయత్నించడంలో అర్ధం లేదు. నీటిని రవాణా చేసి, వరి లేదా గోధుమలను పండించే బదులు, మీరు నీరు పుష్కలంగా ఉన్న ప్రదేశాలలోనే గోధుమలు ఇంకా వరిని పండించి, ఆ తర్వాత వాటిని రవాణా చేయవచ్చు.

నదులు సముద్రంలోకి చేరకపోవడం వల్ల కలిగే ప్రమాదం

అన్నింటికీ మించి,  ఈ నదుల అనుసంధానం అనే ఆలోచన, “సముద్రంలోకి ప్రవహించే నీరు వ్యర్థం” అనే భావన లోనుంచి పుట్టుకొస్తుంది. ఈ భావన పోవాలి. ఇది చాలా ప్రమాదకరమైనది, ఎందుకంటే ఆ నీరు సముద్రంలోకి ప్రవహించకుండా చేస్తే, మీరు మొత్తం నీటి చక్రానికి భంగం కలిగించినట్టే. వర్షాకాలంలో వానల పరిమాణం ఏ మాత్రం ఉంటుంది అనేది, సముద్రంలోకి ఎంత నదీ జలాలు ప్రవహిస్తున్నాయి అన్న దానిపై నేరుగా ఆధారపడి ఉంటుంది.

నదులను సముద్రంలోకి చేరకుండా ఆపడం వల్ల తీరప్రాంతాల వెంబడి ఉన్న భూమిపై కూడా ప్రభావం పడుతుంది. నది నీరు సముద్రంలోకి ప్రవహించకపోతే, భూగర్భ జలాల్లోకి లవణాలు చొచ్చుకుపోవడం (saline intrusion) జరుగుతుంది. ఉదాహరణకు, గుజరాత్‌లో, లవణీయత కారణంగా వారు సంవత్సరానికి దాదాపు 550 చదరపు కిలోమీటర్ల భూమిని కోల్పోతున్నారు. అక్కడి భూమిలో అరవై కిలోమీటర్ల దూరం వరకూ లవణీయత ఉంది. భారతదేశానికి దాదాపు 7400 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. నదీ జలాలు సముద్రంలోకి ప్రవహించకపోతే, సముద్రపు నీరు 100 నుండి 130 కిలోమీటర్ల దూరం వరకు భూమిలోకి ప్రవేశించవచ్చని అంచనా. దీని అర్థం మీరు సముద్ర జలాల కారణంగా భారతదేశ భూభాగంలో మూడింట ఒక వంతును కోల్పోతారు. అటువంటి  ప్రదేశాలలో మీరు ఒక్క మొక్కనుకూడా పెంచలేరు.

ఎక్కడ బోర్‌వెల్‌ వేసినా సముద్ర జలాలే ఉన్నందువల్ల గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయించడం అనేది గుజరాత్‌, తమిళనాడులలో ఇప్పటికే జరిగింది. కేవలం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం, అదంతా మంచినీరే.

వరద నివారణ చర్యల కోసం, విచక్షణతో కేవలం కొన్ని చోట్ల ఈ నదుల అనుసంధానం చేపడితే, అప్పుడు దాని వల్ల మేలు జరుగుతుంది. భారతదేశంలో, మనకు ఎప్పుడూ అటువంటి పరిస్థితి ఉండే నదులు కేవలం కోసి, మహానది ఇంకా బ్రహ్మపుత్ర మాత్రమే. అవసరమున్న కొన్ని చోట్ల, దాన్ని విచక్షణతో చేపట్టాలి, అంతేగానీ మొరటుగా దేశవ్యాప్తంగా నదులను అనుసంధానించడం పని చేయదు. మనకు సుస్థిరమైన పరిస్థితి ఉండాలంటే, భూమి గుండా నదులలోకి వెళ్ళే నీటిని, ఆ వేగాన్నీ తగ్గించాలి. అలా చేయడానికి వృక్షసంపద ఒక్కటే పరిష్కారం.

caca-blog-banner_0