సద్గురు: మార్మిక ప్రక్రియగా పరిగణించబడే దేనినైనా మీరు ప్రయత్నించే ముందు, మీలోని ప్రాధమిక మూలకాలను స్థిరపరచడం ఎంతో ముఖ్యం. వీటినే యోగ శాస్త్రంలో పంచ భూతాలు లేదా మహా తత్త్వాలు అంటారు. ఈ శరీరం, భూమి, విశ్వం ఇంకా ఈ బ్రహ్మాండం, సమస్తమూ కేవలం పంచ భూతాల కేళి(అభివ్యక్తమే). శరీర నిర్మాణం ఎలాంటిదంటే, అందులో నీరు అత్యధికంగా ఉంటుంది. ఇంకా భూమి, గాలి, అగ్ని, మిగతా భాగం ఆకాశంతో కూడి ఉంటుంది.

ఈ ఐదు మూలకాలు మీలో ఎలా ప్రవర్తిస్తాయి అనేది అంతటినీ నిర్థారిస్తుంది. భూతం అంటే మూలకం. భూతశుద్ధి అంటే ఈ మూలకాల దోషం నుండి విముక్తి పొందడం లేదా మూలకాలను శుద్ధి చేయడం. అంటే దానర్థం భౌతిక స్వభావం నుండి విముక్తులు కావడం. చాలా మంది పూర్తిగా వారి భౌతిక, మానసిక ప్రక్రియల అధీనంలో ఉన్నారు. మన భౌతికత అనేది మనం పోగుచేసుకున్నది. అదేవిధంగా, మన మానసిక ప్రక్రియ అనేది స్మృతుల రూపంలో మనం పోగుచేసుకున్నది.

ఈ రెండు ప్రక్రియల మధ్య, అస్తిత్వ పరంగా మీరు ఎవరు, మీ అస్తిత్వ స్వభావం ఏమిటి అనేది పూర్తిగా లోపించింది. ఇప్పటికీ మీ అనుభూతిలో లేని పార్శ్వాలను, మార్మికంగా పరిగణించే పార్శ్వాలను మీరు చేరుకోవాలనుకుంటే, మీరు మొదటిగా చేయవలసింది మీలోని ఐదు మూలకాల శుద్ధీకరణను ప్రారంభించడం. ఈ మూలకాలు స్వచ్చంగా ఉన్నప్పుడు, ఏది భౌతికం, ఏది మానసికం, అలాగే ఏది అస్తిత్వపరమైనది అనే తేడాను మీరు స్పష్టంగా తెలుసుకుంటారు.

పంచభూతాలను శుద్ధి చేసే ప్రక్రియలు – Process for Cleansing Pancha Bhoothalu

నీరు

ఈ ఐదు మూలకాలలోకెల్లా నీరు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఎందుకంటే శరీరంలో అధిక శాతం నీరు ఉంటుంది. మీరు త్రాగే నీటి పట్ల తగిన శ్రద్ధ తీసుకోవాలి. కేవలం దాని స్వచ్చత, అంటే క్రిములు లాంటివి లేకుండా చూసుకోవడమే కాకుండా మీరు దానిని ఎలా ఉంచుతున్నారు, దానితో ఎలా వ్యవహరిస్తున్నారు అనేదాని పట్ల కూడా శ్రద్ధ అవసరం. ఇప్పుడు వైజ్ఞాన పరంగా ఉన్న ఒక బలమైన ఆధారం వలన, ఒక ఆలోచన, భావోద్వేగం, ఒక స్పర్శ నీటి అణువుల నిర్మాణాన్ని మార్చడంతో పాటు నీరు మీ వ్యవస్థలో ప్రవర్తించే తీరుని గణనీయంగా మార్చగలవు అని తెలుసుకున్నాము.

నీటికి గొప్ప జ్ఞాపక శక్తి ఉంది. నీరు ఉన్న స్థలం చుట్టూ జరిగేదంతా నీటి అణువులలో నిక్షిప్తం అవుతుంది. మీరు దానిని ద్రవ రూపంలో ఉన్న కంప్యూటర్ అనవచ్చు. నీటిని ఒక వస్తువుగా కాకుండా జీవాన్ని రూపొందించే పదార్ధంగా మీరు చూడాలి. నీరు సజీవమైనది. మీ వ్యవస్థలోకి తీసుకునే ముందు మీరు దానితో ఎలా వ్యవహరిస్తారు అనేది ముఖ్యం.

మీరు నీటిని ఒక లోహపు పాత్రలో ఉంచవచ్చు. రాగి లేదా రాగితో కూడిన మిశ్రమ లోహంతో చేసిన పాత్ర శ్రేష్ఠమైనది. ప్రతిరోజూ ఆ పాత్రని సహజ సిద్ధమైన పదార్థాలతో కడిగి శుభ్రం చేయాలి. అలాగే నీటిని ఏ ఇతర వాసనలు, పదార్థాలు తాకని ఒక ప్రదేశంలో ఉంచాలి. దాని చుట్టూ తగినంత ఖాళీ ప్రదేశం ఉండాలి. మీరు ఇలా చేసి, నీరు జీవాన్ని నిర్మించే పదార్థం కనుక, దాని పట్ల కృతజ్ఞతతో, ఆరాధనా భావంతో నీటి పాత్రను చేతిలో పట్టుకుని, తరువాత ఆ నీటిని త్రాగండి. అది మీ వ్యవస్థలో అద్భుతాలను చేయడం మీరు చూస్తారు. ఆరోగ్యం, సమభావంతో ఉండడం అనేవి మీకు సహజంగా జరుగుతాయి.

భూమి

మీరు నడిచే భూమి ఒక మేథస్సుని, స్మృతిని కలిగి ఉంటుంది. మీరు కాంక్రీటు గోడల మధ్య నివసిస్తున్నా కూడా మీరు దేనిపైనైతే జీవిస్తున్నారో ఆ భూమితో స్పర్శలో ఉండడం ముఖ్యం. దానితో స్పర్శలో ఉండే మార్గాలను మీ కోసం ఏర్పాటు చేసుకోండి. రోజువారీ మీ చేతులు, కాళ్ళు ఏమీ తొడుక్కోకుండా, ప్రత్యేకించి అరిచేతులు, అరికాళ్లు, భూమిని తాకితే గనుక, అది మీ వ్యవస్థలోని శారీరక ప్రక్రియను క్రమబద్ధం చేస్తుంది.

కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా, మొక్కలను, చెట్లను తాకుతూ కనీసం కొద్ది నిమిషాల పాటు పెరట్లో గడిపేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే భూమి సకల జీవానికి ఆధారమైనది. మీతో సహా ప్రతీ ఇతర జీవి భూమి నుండే పుట్టాయి. దానితో స్పర్శలో ఉంటూ మీ వ్యవస్థను క్రమబద్ద పరచుకోండి.

ఆహారాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు, అది ఎవరి చేతుల మీదుగా మీకు అందుతుంది, మీరు ఎలా తింటున్నారు, మీరు దానితో ఎలా వ్యవహరిస్తున్నారు, ఇవన్నీ ముఖ్యమైన విషయాలు. అన్నిటికీ మించి మీరు తీసుకునే ఆహారం అనేది జీవం. మన పోషణ కోసం ఇతర ప్రాణులు తమ జీవితాన్ని అర్పిస్తున్నాయి. మన జీవితాల్ని నిలపడం కోసం తమ జీవితాన్ని అర్పించే ప్రాణులన్నింటి పట్ల అపారమైన కృతజ్ఞతా భావంతో ఆహారం తీసుకుంటే గనుక, ఆహారం మీలో ప్రవర్తించే తీరు ఎంతో భిన్నంగా ఉంటుంది.

గాలి

మీ శరీరపు మూలకాల సమ్మేళనంలో వాయువు కేవలం కొద్ది శాతమే ఉన్నప్పటికీ, నిమిష నిమిషానికి జరిగే ప్రక్రియని బట్టి చూస్తే, అది అత్యంత క్రియాశీలమైన మూలకం. మీరు ఎలాంటి గాలి పీలుస్తున్నారు అనేది ముఖ్యమైన విషయమని తెలిసిందే, కానీ మీరు ఎలా శ్వాస తీసుకుంటున్నారు, ఎంత ఎరుకతో తీసుకుంటున్నారు అనేది కూడా అంతే ముఖ్యమైనది.

మీకు స్వచ్చమైన గాలి అందుబాటులో ఉంటే, ఏదైనా చర్య ద్వారా శ్వాసను ఒక క్రీయాశీలక స్థితికి తీసుకురావడం ముఖ్యం

ప్రత్యేకించి పెద్ద నగరాలలో నివసించేవారు, మీరు ఎలాంటి గాలిని పీలుస్తున్నారు అనేది ఎప్పుడూ మీ చేతుల్లో ఉండదు కాబట్టి, ప్రతిరోజూ కొన్ని నిమిషాలైనా మీరు ఒక పార్కులోనో , చెరువు పక్కనో లేదా నది ఒడ్డునో, మీకు అందుబాటులో ఉన్న దాని వద్ద నడవడం మంచిది. మీకు పిల్లలు ఉంటే గనుక, కనీసం నెలకు ఒకసారి వాళ్ళని నగరం నుండి దూరంగా ప్రకృతి స్వచ్చంగా ఉన్న చోటుకు తీసుకెళ్లండి. అక్కడ వారు చిన్న కొండ ఎక్కేలా, అడవిలో నడిచేలా లేదా నదిలో ఈత కొట్టేలా, ప్రకృతికి దగ్గరగా ఉండేలా, వారి శ్వాస క్రియాశీలంగా అయ్యేలా ఏదో ఒకటి చేయండి.

ఇది కేవలం ఏరోబిక్ వ్యాయామం కాదు. అక్కడ, శరీరంలో ఇంకా బయట కూడా ఒక స్థిరమైన శ్వాస మార్పిడి జరగడం వలన, గాలి స్వచ్ఛంగా, సజీవంగా ఉందని శరీరంలోని మేధస్సు గ్రహించి, శరీరం శ్వాసించే విధానంలో తప్పకుండా మార్పు తీసుకువస్తుంది. ఈ గాలి మార్పిడితో వ్యవస్థ శుద్ధి చేయబడుతుంది. మీకు స్వచ్ఛమైన గాలి అందుబాటులో ఉంటే, ఏదైనా చర్య ద్వారా శ్వాసను ఒక క్రీయాశీలక స్థితికి తీసుకురావడం ముఖ్యం. మరీ ఊపిరి సలపనంతగా చేయనక్కర్లేదు, కొద్ది సేపు సాధారణ శ్వాస కంటే కాస్తంత దీర్ఘ శ్వాస తీసుకుంటే చాలు. ప్రత్యేకించి ఎదిగే పిల్లలకు, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే అది శరీర పొందికను, దారుఢ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మీరు రోజూ ఇలా బయటకు వెళ్ళలేకపోతే, నాడీశుద్ధి అనే సులభమైన యోగ సాధనను ఇంటి వద్దనే చేస్తూ శ్వాసను శుద్ధి చేయవచ్చు.

అగ్ని

మీ మూలకాల కూర్పులో అగ్ని మరొక భాగం. మీలో ఎలాంటి అగ్ని రగులుతుంది? అది దురాశ, ద్వేషం, కోపం, క్రోధము, కామము, ప్రేమ లేదా కరుణతో కూడినదా? మీరు అగ్ని మూలకాన్ని శుద్ధి చేస్తే, మీకు భౌతిక మరియు మానసిక శ్రేయస్సు చేకూరినట్టే. మీరు నిశ్చింతగా, ఉల్లాసవంతంగా ఉంటారు. మీలోని అగ్నిని శుద్ధి చేయగల ఒక సులభమైన ప్రక్రియ ఏంటంటే ప్రతిరోజూ కొంత సూర్యరశ్మిని గ్రహించడం. ఇతర మూలకాలన్నిటినీ మనం కలుషితం చేస్తున్నప్పటికీ, అదృష్టవశాత్తూ సూర్యరశ్మిని మాత్రం కలుషితం చేయలేము. అది స్వచ్చంగానే ఉంది. దానిని సద్వినియోగపరచుకోండి.

కావాలనుకుంటే, ఒక సహజ పదార్థమైన వంటచెరకు లేదా కలపతో ఏ నూనె లేకుండా మంటను వెలిగించి, మూడు నిమిషాల పాటు మంటకు ఎదురుగా చేతులు చాచి, కళ్ళు తెరచి నిలబడవచ్చు. తరువాత వెనుకకు తిరిగి, మీ వెన్నుని మంటవైపు ఉంచి మూడు నిముషాలు నిలబడండి. ఈ ప్రక్రియ మీ ఓజస్సును శుద్ధి చేసి మీ వ్యవస్థలో పునర్జీవాన్ని తీసుకువస్తుంది. అది మీలోని అగ్నిని రగిలించి బయటి అగ్నితో అనుసంధానం చేస్తుంది. తూర్పు దేశాల వారు పాటించే అగ్ని సంబంధిత క్రతువులకు ఇదే ఆధారం.

అగ్నిని వెలిగించడం మీకు సాధ్యపడకపోతే, కాయగూరల నూనె లేదా నెయ్యితో దీపాన్ని వెలిగించి దాని సమక్షంలో ఉండండి. మొదట దీపానికి ఎదురుగా కూర్చోండి తరువాత వెనక్కి తిరిగి కూర్చోండి. తద్వారా మీలోని అగ్ని రగిలించబడుతుంది.

ఆకాశం

ఐదవది, అలానే మూలకాల కూర్పులో అత్యంత విస్తృతమైన పార్శ్వం కలిగినది ఆకాశం లేదా ఈథర్. ఆకాశానికి ఒక విధమైన మేథస్సు ఉంది. ప్రాథమికంగా మీరు ఆకాశ మేథస్సుకు ఎంతగా అందుబాటులో ఉన్నారనేది మీ జీవిత స్వభావం, నాణ్యత ఇంకా సామర్థ్యం అనే వాటిని నిర్థారిస్తుంది. నీరు, వాయువు, భూమి ఇంకా అగ్ని పరిమితంగా ఉంటాయి కానీ ఆకాశ పార్శ్వం అనేది అనంతమైనది. దానితో మీకున్న అనుసంధానం విస్తృతమయ్యే కోద్దీ, మీ గ్రహణశక్తి ఇంకా మేథస్సు రెండూ పెంపొందుతాయి.

ఆకాశ మేథస్సుకి మీరు మరింత అనుసంధానమవ్వడానికి ఒక సులభమైన ప్రక్రియ, సూర్యోదయం అయ్యాక, సూర్యుడు 30 డిగ్రీలు దాటక ముందు, ఆకాశం వైపు చూసి, మిమ్మల్ని ఇంకా ఈ భూమిని వాటి స్థానంలో నిలిపి ఉంచుతున్నందుకు నమస్కరించండి. సూర్యుడు 30 డిగ్రీలు దాటాక, రోజులో ఏదోక సమయంలో, మళ్ళీ పైకి చూసి నమస్కరించండి. సూర్యాస్తమయమయిన 40 నిమిషాల్లోపు ఆకాశం వైపు చూసి, మన చుట్టూ ఉన్న ఈథర్‌ అన్నిటినీ వాటి స్థానంలో నిలిపి ఉంచుతున్నందుకు మరొకసారి నమస్కరించండి.

మీరు ఆకాశాన్ని మీ జీవ శక్తులతో సహకరించేలా చేస్తే, మీ జీవితం అద్భుతంగా సాగుతుంది. మీరెన్నడూ సాధ్యం కాదనుకున్న మేథస్సు మీది అవుతుంది.


సంపాదకుడి సూచన: 2015 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సద్గురు చేసిన ప్రసంగం “5 మినిట్స్ ఫర్ ఇన్నర్ ఎక్ష్‌ప్లోరేషన్’, ఈ వ్యాసానికి ఆధారం.