మనం క్రిందటి వ్యాసంలో దేవవ్రతుడి గురించి చదివాము. ఇప్పుడు దేవవ్రతుడు ఎందుకు భీషణమైన  ప్రతిజ్ఞ చేసి భీష్మ పితామహుడిగా ఎందుకు పిలువబడ్డాడో చదువుదాం..

మత్స్యగంధి, పరాశురుడు

మత్స్యగంధి నల్లటి ఛాయతో అప్పటికి పెరిగి పెద్దదయ్యింది. మత్స్యరాజు దాసుడు ఆమెని చక్కగా పెంచి పెద్దచేశాడు. యమునా నది దాటటానికి ఆమె ఒక పడవను నడుపుతూ ఉండేది. పరాశర మహర్షి ఒకరోజు యమునానది తీరానికి వచ్చి నదిని దాటటానికి పడవ కొరకు చూసి మత్స్యగంధి పడవలో నది దాటుతుండగా వీరిద్దరూ ఒకరికొకరు ఆకర్షితులయ్యారు.

తన సోదరుడు మత్స్యరాజు రాజభవనంలో ఉండగా తను చేపలవాళ్ళతో కలిసి ఉండటం మత్స్యగంధికి బాధాకరంగా ఉండేది. మునితో తన సంబంధం, తనని మంచి స్థాయికి తీసుకు వెళ్ళగలదని భావించింది. ఇద్దరూ  యమునా నదిలోని ఒక చిన్న దీవిలో నివసిస్తూ ఆమె ఒక కొడుకుకి జన్మనిచ్చింది. ద్వీపంలో పుట్టినవాడుకనుక అతడిని ద్వైపాయనుడని, నల్లగా ఉండటంవల్ల క్రిష్ణుడని పేర్లు పొందాడు. క్రిష్ణద్వైపాయనుడే వేదాల సంకలనకర్త, మహాభారత రచయిత అయిన వేదవ్యాసుడు.

పరాశరుడు బాలుడిని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళేముందు మత్స్యగంధికి ఒక వరం ఇచ్చి వెళ్ళాడు. ఆ వరం వల్ల మత్స్యగంధికి చేప వాసన పోయి ఆమె శరీరం నుండి ఇప్పటివరకూ ఏ మానవుడూ ఎప్పుడూ ఎరుగనటివంటి దివ్యమైన సుగంధం రావడం ప్రారంభమయ్యింది. ఈ బ్రహ్మండమైన సుగంధం కారణంగా దాన్ని "సత్యం యొక్క సుగంధం"గా భావించి మత్స్యగంధి తన పేరు సత్యవతిగా మార్చకుంది. ఇది ఆమె ఆకర్షణగా మారింది.

వివాహమాడమని సత్యవతిని వేడుకున్న శాంతనుడు

శాంతనుడు ఒక రోజు సత్యవతిని చూసి ప్రేమలో పడ్డాడు. సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆమెని వివాహమాడతానని కోరాడు. తన పెంపుడు కూతురుని పెళ్ళిచేసుకోవాలని తహ తహ లాడుతున్న చక్రవర్తిని చూసి, దాసుడు ఇది మంచి అవకాశంగా భావించాడు. "నా కూతురికి పుట్టిన పిల్లలు కురువంశానికి కాబోయే రాజులు కావాలి" అని షరతు పెట్టాడు. "ఇది సంభవం కాదు. నా కుమారుడు దేవవ్రతుడిని యువరాజు చేసాను, కురు వంశానికి ఇంతకన్నా గొప్ప రాజు దొరకడు" అన్నాడు శాంతనుడు.

"ఆటువంటప్పుడు నా కూతురిని మర్చిపో" అని సమాధానమిచ్చాడు మత్స్యరాజు. శాంతనుడు ఎంత ప్రాధేయపడినా పట్టువదలని మత్స్యరాజు "మీ ఇష్టం. నా కూతురు కావాలనుకుంటే ఆమె సంతానానికి రాజ్యాధికారం ఇవ్వాలి, అది వీలు కాకుంటే మీరు మీ రాజ భవనంలో సంతోషంగా ఉండండి" అని సమాధానమిచ్చాడు.

శాంతనుడు నిరుత్సాహంతో  రాజభవనానికి తిరిగి వచ్చాడు. సత్యవతిని మర్చిపోవడం కష్టంగా ఉంది, ఆమె సుగంధం అతనిని వెంటాడుతూ తిరిగి బాధాసముద్రంలో ముంచి రాజకార్యాలకి దూరం చేసింది. దేవవ్రతుడు తండ్రితో "రాజ్యంలో అంతా గొప్పగా ఉంది, మరి మీ చింతకు కారణమేమిటి" అని ప్రశ్నించాడు. తన చింతకు కారణం కొడుకుతో చెప్పడానికి సిగ్గుపడి తల ఊపుతూ మౌనంగా ఉండిపోయాడు శాంతనుడు.

కర్తవ్యపరాయణుడైన దేవవ్రతుడు తండ్రి రధచాలకుడి వద్దకు వెళ్ళి "వేటకు వెళ్ళి తిరిగి వచ్చిన దగ్గర నుండి మా తండ్రిగారు దుఃఖంలో ఉన్నారు, ఏమి జరిగింది"? అని అడిగాడు. "జరిగిన విషయమంతా నాకు పూర్తిగా తెలియదు, మీ తండ్రిగారిని మత్స్యరాజు వద్దకు తీసుకువెళ్ళాను, అయన ఎంతో ఉత్సాహంగా అతని ఇంట్లోకి వెళ్ళారు కాని తిరిగి వచ్చేటప్పుడు ఎంతో బాధతో బయటకు వచ్చారు" అని వివరించాడు.

దేవవ్రతుడు తీసుకున్న ఘోరమైన శపధం

తండ్రి దుఃఖానికి కారణం వెదకటానికి దేవవ్రతుడు స్వయంగా బయలుదేరి వెళ్ళాడు. మత్స్యరాజు దాసుడు "మీ తండ్రి నా కూతురిని వివాహమాడతలిచాడు. నేనడిగింది ఒక్కటే, నా కుమార్తెకు పుట్టబోయే సంతానం కాబోయే రాజులు కావాలని. ఇది చిన్నవిషయం దీనికి నువ్వే అడ్డంకి" అని వివరించాడు. దేవవ్రతుడు వెంటనే "ఇది సమస్య కానే కాదు, నేను రాజు కావలసిన అవసరం లేదు, సత్యవతి సంతానమే రాజు కావచ్చు, నేను రాజ్యాధికారం తీసుకోనని ప్రమాణం చేస్తాను" అని సమాధానమిచ్చాడు. దాసుడు పట్టు వదలకుండా "యవ్వనంలో, ఉత్సాహంతో ఇప్పుడు నువ్వు గొప్పగా చెప్పవచ్చు, కాని రేపు నీ సంతానం సిం హాసనం కొరకు పోట్లాడవచ్చు" అన్నాడు. అందుకు దేవవ్రతుడు "సత్యవతి సంతానానికి అడ్డు లేకుండా ఉండడానికి నేను ముందెప్పుడూ వివాహం చేసుకోను, పిల్లలని కనను" అన్నాడు.

దాసుడు భోజనం చేస్తూ చాపలోని ముళ్ళని ఒక్కటొక్కటిగా వేరుచేస్తూ దేవవ్రతుడుని చూసి "నువ్వు చిన్నవాడివి, ప్రపంచ విషయాలు ఇంక బాగా తెలియవు, పెళ్ళి చేసుకోకుండా కూడా పిల్లలని కనవచ్చు" అన్నాడు. దేవవ్రతుడు అందుకు "ఆ సమస్య లేకుండా ఉండగలదని తనకి తానే తన వృషణాలను తొలగించి, నేనిప్పుడు సంతానం పొందడానికి అసమర్ధుడిని, ఇప్పుడు మీకు పూర్తిగా నమ్మకమేనా?" అని అడిగాడు. దాసుడు వివాహానికి ఒప్పుకున్నాడు. విషయం తెలిసిన వారంతా "ఇది ఒక వ్యక్తి తనకి తానే విధించుకోగలిగే అతి కఠినమైన శిక్ష" అని అప్పటినుండి దేవవ్రతుడిని "భీష్ముడు"అని పిలువసాగారు. శంతనుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు.

ఇంకా ఉంది...

మరిన్ని మహాభారత కథలను చదవండి: మహాభారతం