మన వ్యక్తిత్వానికి మనం ఎంత ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే, మనం అంత ఎక్కువగా మనల్ని గతంతో కట్టి పారేసుకుంటాము. మనం ఈ భారాన్ని పక్కన పెట్టగలిగితే, జీవితాన్ని, ఇంకా మరణాన్ని కూడా మనం సునాయాసంగా దాటవచ్చని సద్గురు చెబుతున్నారు.

సద్గురు: ప్రస్తుతం, మీరు దేనినైతే “నేను” అని అంటున్నారో, అది మీ మనస్సులో మీరు సేకరించుకున్న ఒక విధమైన సమాచారం మాత్రమే. మీరు “నేను మంచి వ్యక్తిని”, “నేను చెడ్డ వ్యక్తిని”, “నేను అహంకారిని,” “నేను సౌమ్యమైన వ్యక్తిని ” అని అన్నప్పుడు లేదా మరేదైనా అన్నప్పుడు, ఇవన్నీ కేవలం మనస్సు యొక్క నిర్మాణాలు మాత్రమె. మరో మాటలో చెప్పాలంటే, ఇదంతా గతం తాలూకూ పోగు - మీరు మీ గతాన్ని బట్టి జీవిస్తున్నారు అంతే. గతాన్ని తీసివేస్తే, చాలా మంది ప్రజలు అయోమయంలో పడిపోతారు. వారికి ప్రతిదీ కూడా గతం మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిత్వం అనేది గతానికి చెందినది. కాబట్టి వ్యక్తిత్వం ముఖ్యమైనదిగా ఉన్నంత వరకూ, ‘మునుపటి క్షణం ప్రతిదాన్ని నియంత్రిస్తుంది’ అని దానర్థం. ప్రస్తుత క్షణం ఇక ముఖ్యమైనది కాదు.

మీరు మోస్తున్న వ్యక్తిత్వం అనేది ఒక చనిపోయిన వస్తువు. మీరు మీ భుజాలపై మృతదేహాన్ని మోస్తున్నప్పుడు, మీరు చాలా దూరం నడవలేరు. అలాగే మీరు శ్మశాన వాటిక వైపు మాత్రమే వెళతారు. మీరు మృతదేహాన్ని మరీ ఎక్కువసేపు మోస్తూ ఉంటే, మీరు భయంకరమైన వాసనలను భరించాల్సి ఉంటుంది. మీ వ్యక్తిత్వం ఎంత బలంగా ఉంటే, దుర్వాసన అంత ఎక్కువగా ఉంటుంది.

గతాన్ని వెనుకే వదిలివేయడం

మీరు మీ గతాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే జీవితంలో చాలా దూరం వెళ్ళగలుగుతారు. ఇది ఒక పాము దాని కుబుసాన్ని విడవడం లాంటిది. ఈ క్షణం అది దాని శరీరంలోని ఒక భాగం, తరువాతి క్షణం అది దాన్ని విడిచి, వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతుంది. ఒకరు ప్రతి క్షణం, కుబుసాన్ని విడిచిపెట్టే ఒక పాములాగా ఉన్నప్పుడు మాత్రమే, అభివృద్ధి సాధ్యపడుతుంది. ఒకరు తన గతం తాలూకు భారాన్ని మోసుకుంటూ రాకపోతే, అప్పుడు అతను నిజంగా ఒక పాపము అంటని వ్యక్తి. పాపం లేనివాడు అంటే అతను తన జీవితంతో ఏమీ చేయలేదని కాదు. అలా అయితే అతను ఒక శవంతో సమానం. అతను జీవితాన్ని తెలుసుకోవటానికి ఒక వ్యక్తి చేయగలిగే ప్రతిదాన్ని చేశాడు, కాని అతని చర్యలు ఎన్నడూ అవశేషాలను మిగల్చలేదు, లేదా అతను చేసిన ఆ చర్యల నుండి, అతను ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకోలేదు.

మునపటి క్షణాన్ని ఈ క్షణంలోకి తీసుకురాని వ్యక్తి మాత్రమే అన్నింటినుండి విముక్తుడౌతాడు.

మీరు శుకుడి గురించి విన్నారా? అతను వ్యాసమహర్షి కుమారుడు. శుకుడు ఒక స్వచ్ఛమైన జీవి, నిజంగా పాపం లేని వాడు. అతని జీవితంలో ఒక ప్రత్యేక సంఘటన జరిగింది. ఒక రోజు, అతను నగ్నంగా అడవిలో ఒక్కడే నడుస్తూ వెళ్తున్నాడు. అతను నడుస్తున్నప్పుడు, అక్కడ ఒక సరస్సు ఉంది, అక్కడ కొందరు జల కన్యలు లేదా అప్సరసలు స్నానం చేస్తున్నారు. వారు అడవిలో ఒంటరిగా ఉండటంతో, మహిళలందరూ కలిసి నగ్నంగా స్నానం చేస్తూ, నీటిలో ఆడుకుంటున్నారు. శుకుడు ఆ సరస్సు వద్దకు వచ్చి, వారి వైపు చూసి, వారిని దాటి వెళ్ళిపోతాడు. ఆ స్త్రీలు సిగ్గుపడలేదు, తమను తాము దాచుకోవడానికి ప్రయత్నించలేదు. వారు తమ ఆటను కొనసాగించారు. శుకుడు వారిని దాటి వెళ్ళిపోయాడు.

శుకుడి కోసం వెతుకుతూ, అతని తండ్రి వ్యాస మహర్షి అతని వెనుక వచ్చాడు. అతను డెబ్బై ఏళ్ళకు పైబడిన వాడు, ఒక వృద్ధుడు, పైగా గొప్ప సాధువు. శుకుడిని వెదుకుతూ, అతను కూడా సరస్సు దగ్గరకు వచ్చాడు. స్త్రీలు అతన్ని చూడగానే, వెంటనే వారి బట్టల కోసం పరుగెత్తారు. వ్యాస మహర్షి వారితో, “నేను వృద్ధుడిని, నేను మంచిగా దుస్తులు కూడా ధరించి ఉన్నాను. నా కొడుకు యువకుడు, పైగా నగ్నంగా ఉన్నాడు. అతను మీ దగ్గరికి వచ్చినప్పుడు, మీరు ఇబ్బంది పడలేదు, కానీ నేను వచ్చినప్పుడు, మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఎందుకు? ” అని అడుగుతాడు. అందుకు వారు, “అతనిలో ఎటువంటి లైంగిక గుర్తింపూ లేదు. మాకు ఏమీ అనిపించలేదు. అతను ఒక చిన్న పిల్లాడిలా ఉన్నాడు.” అంటారు.

మునపటి క్షణాన్ని ఈ క్షణంలోకి తీసుకురాని వ్యక్తి మాత్రమే అన్నింటినుండి విముక్తుడౌతాడు. అలాగే ఆ గుణం ప్రతిచోటా పొట్టోచ్చినట్టు కనిపిస్తుంది. మిమ్మల్ని కలిసిన కొద్ది క్షణాల్లోనే, ప్రజలు తమ తల్లిదండ్రులను, భర్తలను లేదా భార్యలను కూడా విశ్వసించనంతగా మిమ్మల్ని విశ్వసిస్తారు, కారణం - కేవలం మీరు గత భారాన్ని మీతో మోయడం లేదు కాబట్టి.

వాసన పోవాలి !

మీరు గతాన్ని మీతో మోస్తూ ఉంటే, మీరు కూడా ఇతరులలానే వాసన కొడతారు. ప్రపంచం మొత్తం వ్యక్తిత్వాలతో దుర్వాసన కొడుతోంది. ప్రతి ఒక్కరికి తనదైన ఒక బలమైన వాసన లేదా వ్యక్తిత్వం ఉంది. ప్రపంచంలోని వివిధ దుర్గంధాలు ఇవే, పైగా అవి ఎప్పుడూ ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతూ ఉంటాయి. మీ కోపం, ద్వేషం, అసూయ, భయం - అన్నీ, గతం మీద ఆధారపడే వస్తాయి. మీరు గతాన్నీ ఇంకా భవిష్యత్తునూ కుడా మోస్తున్న క్షణమే, మీరు ఒక నిజమైన గాడిద అవుతారు, ఎందుకంటే భారం అలాంటిది. ఆ భారాన్ని మోస్తూ, ఎవ్వరూ కూడా తన జీవితాన్ని తెలివిగా గడపగలిగే మార్గమే లేదు.

ఒకరు ఈ వాసనను మోయకుండా ఉన్నప్పుడు, వారు ఈ ఉనికిని దాటగలుగుతారు. ఈ వ్యక్తి సంసార సాగరాన్ని ఎటువంటి శ్రమా లేకుండానే దాటుతాడు. వేరొకరికి ఏదైతే గొప్ప శ్రమగా అనిపిస్తుందో, అది ఈ వ్యక్తికి ఎటువంటి శ్రమా లేకుండా జరిగిపోతుంది. ఒకరు ఈ ప్రపంచంలో సునాయాసంగా ప్రయాణించడమే కాదు, జీవన్మరణ ప్రక్రియని కూడా సునాయాసంగా దాటేస్తారు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు

Editor’s Note: Excerpted from the ebook “Mystic’s Musings”. Read the free sample or purchase the ebook. Not for the faint-hearted, this book deftly guides us with answers about reality that transcend our fears, angers, hopes, and struggles. Sadhguru keeps us teetering on the edge of logic and captivates us with his answers to questions relating to life, death, rebirth, suffering, karma, and the journey of the Self.