సద్గురు, మట్టిని పునరుజ్జీవింపజేయాల్సిన ఆవశ్యకత గురించి ఇంకా మట్టిసారాన్ని రక్షించడానికి ఉన్న 5 మార్గాల గురించి తెలియజేస్తున్నారు.

విషయ పట్టిక
1. భూసారం క్షీణించిపోవడానికి గల 3 కారణాలు
1.1 వ్యవసాయ పారిశ్రామికీకరణ
1.2 మాంసం వినియోగం ఇంకా పశువుల మేత
2. భూసారం క్షీణించిపోవడం వల్ల కలిగే 4 పర్యవసానాలు
       2.1 మానవుల ఆరోగ్యం క్షీణిస్తుంది
2.2 మట్టిలో సేంద్రీయ సారం తగ్గుతుంది
2.3 వరద ఇంకా కరువుల విష వలయాలకి దారి తీస్తుంది
2.4 ఆహార కోరత, పౌర కలహాలకు కారణమవ్వవచ్చు

భూసారం క్షీణించిపోవడానికి గల 3 కారణాలు

#1 వ్యవసాయ పారిశ్రామికీకరణ 

సద్గురు: మనం చాలా యాంత్రికమైన, పారిశ్రామీకరించిన వ్యవసాయాన్ని ప్రారంభించినప్పటి నుండి, ప్రపంచమంతటా నేలలోని సేంద్రీయ పదార్థం గణనీయంగా తగ్గింది. ఏ నేల అయినా వ్యవసాయానికి పనికొచ్చేదిగా ఉండాలంటే, అందులో కనీసం 3 నుండి 6% వరకు సేంద్రీయ పదార్థం ఉండాలి, కానీ ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో, ఇది 1% కంటే తక్కువగా ఉంది. భారతదేశంలోని 62% మట్టిలో సేంద్రీయ పదార్థం 0.5% కంటే తక్కువగా ఉంది. ఇది ఇలా ఎందుకు జరిగింది? 

మనం ఒక టన్ను పంట పండించాము అంటే, దానర్థం మనం నేల పైపొరలోని ఒక టన్ను మట్టిని తీసేశాము అని. మరి దాన్ని తిరిగి బర్తీ చేయడం ఎలా? పొలంలో జంతువులు, చెట్లు ఉన్నప్పుడు సహజంగానే అది తిరిగి  భర్తి అయ్యేది, ఎందుకంటే సేంద్రీయ సారాన్ని మట్టిలోకి తిరిగి చేర్చే ఏకైక మార్గం, చెట్ల నుండి వచ్చే పచ్చని చెత్త ఇంకా జంతువుల వ్యర్థాలు. ప్రజలు, ఒక ట్రాక్టర్ పని అంతటినీ చేస్తుందని అనుకుంటారు. ఒక ట్రాక్టర్ మట్టిని దున్నుతుంది, కానీ అది జంతువులు ఇంకా చెట్లు చేసినట్లుగా నేలను సారవంతం చేయలేదు.

#2 మాంసం వినియోగం ఇంకా పశువుల మేత

ప్రస్తుతం, ప్రపంచంలో 5.1 కోట్ల చదరపు కిలోమీటర్ల భూమి సాగు చేయబడుతోంది. వీటిలో 4 కోట్ల చదరపు కిలోమీటర్లు జంతువులను పెంచడానికి ఇంకా వాటి ఆహారం కోసం ఉపయోగించబడుతుంది, అంటే అది 75%. మాంసం వినియోగాన్ని 50% తగ్గించినట్లయితే, మట్టిని పునరుత్పత్తి చేయడానికి 2 కోట్ల చదరపు కిలోమీటర్ల భూమి అందుబాటులోకి వస్తుంది. ఎనిమిది నుంచి పదేళ్ళ వ్యవధిలో మనం ఈ మట్టిని పునర్నిర్మించగలం.

భూసారం క్షీణించిపోవడం వల్ల కలిగే 4 పర్యవసానాలు

#1 మానవుల ఆరోగ్యం క్షీణిస్తుంది

భారతదేశంలో నేల పరిస్థితి చాలా దారుణంగా ఉంది, పోషక విలువల స్థాయిలు ఘోరంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా భారత దేశంలో పండించే కూరగాయల్లోని పోషక విలువలు, గత ఇరవై ఐదు సంవత్సరాలలో ముప్ఫై శాతం పడిపోయాయి. ప్రపంచంలో మిగతా అన్ని చోట్లా, వైద్యులు మాంసాహారం నుండి శాఖాహార ఆహారాలకు మారాలని ప్రజలకు చెబుతున్నారు. కానీ భారతదేశంలో, వైద్యులు మాంసాహారానికి మారమని సలహా ఇస్తున్నారు. ప్రపంచమంతా మాంసాహారం నుండి శాకాహార జీవన విధానానికి మారడానికి ప్రయత్నిస్తుంటే, చాలా వరకూ శాకాహారులుగా జీవించిన మన దేశంలో, మనం తినే ఆహారంలో తగినంత పోషకాలు లోపించడం వల్ల మనం మాంసానికి మారడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలా జరగడానికి ఏకైక కారణం మనం మట్టిని జాగ్రత్తగా చూసుకోకపోవడమే. మట్టిలోని సూక్ష్మ పోషకాలు ఎంత గణనీయంగా తగ్గిపోయాయంటే, మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న భారతీయ పిల్లలలో, డెబ్భై శాతానికి పైగా పిల్లలలో నేడు రక్తహీనత ఉంది.

మట్టి బలహీనపడితే, మన శరీరాలూ బలహీనపడతాయి - పోషణ పరంగా మాత్రమే కాదు, ఎంతో ప్రాథమిక స్థాయిలో.

అడవిలోకి వెళ్లి మట్టిని తీసుకొని చూస్తే, అది జీవంతో ఉట్టిపడుతూ ఉంటుంది. మట్టి అంటే అలా ఉండాలి. మట్టి బలహీనపడితే, మన శరీరాలూ బలహీనపడతాయి - పోషణ పరంగా మాత్రమే కాదు, ఎంతో ప్రాథమిక స్థాయిలో. దీని అర్థం మన తర్వాతి తరం మన కంటే బలహీనంగా ఉంటుంది. ఇది మానవాళి పట్ల మనం చేస్తున్న నేరం. మన తర్వాతి తరం మనకంటే బాలంగా ఉండాలి. వాళ్ళు మనకంటే అధ్వాన్నంగా ఉన్నారంటే, మనం ఏదో ప్రాథమిక తప్పు చేశామనే. భారతదేశంలో ఇది భారీ స్థాయిలో జరుగుతోంది, ఎందుకంటే భారతదేశంలో నేల తన బలాన్ని కోల్పోతోంది.

#2 మట్టిలో సేంద్రీయ సారం తగ్గుతుంది

మీరూ, నేనూ ఇంకా అనేక సూక్ష్మజీవులు, పురుగులు, పక్షులు, జంతువులు, చెట్లతో సహా ఈ భూమి మీద ఉన్న 87 శాతం జీవులు, సుమారు పైపొర యొక్క 39 అంగుళాల మట్టిపై జీవిస్తున్నాయి. ఇది మన భూమి మీద ఉన్న పైపొర మట్టి యొక్క సగటు లోతు. అయితే గత 70 ఏళ్ళల్లో ఈ మట్టిలో చోటుచేసుకున్న క్షీణత భయానకంగా ఉంది. గత 50 ఏళ్ళల్లో మట్టిలో జీవద్రవ్య పరిమాణం దాదాపు 80% తగ్గింది. ఇది నిజంగా జీవులకు మరణమే! మనం ఇలాగే కొనసాగిస్తే, ఈ శతాబ్దం చివరికి వచ్చేసరికి, 80% పురుగులు, కీటకాలు నశించిపోతాయని అంచనా వేస్తున్నారు.

“సరే, పురుగులు చచ్చిపోతే వచ్చే సమస్య ఏంటి? మాకు ఎలాగూ కీటకాలంటే ఇష్టం లేదు”. ఇదీ పట్టణ ప్రజల వైఖరి. అన్ని కీటకాలూ చనిపోతే, కొన్ని సంవత్సరాలలో, ఈ భూమి మీద ఉన్న జీవమంతా అంతరించిపోతుంది. పురుగులన్నీ చనిపోతే, ప్రతీది ముగిసిపోడానికి కొన్ని నెలల సమయం మాత్రమే మిగిలి ఉంటుంది. ఈ రోజే సూక్ష్మజీవులన్నీచనిపోతే, రేపే మొత్తం ముగిసిపోతుంది. మిమ్మల్ని సజీవంగా ఉంచుతున్నది అన్నీ స్థాయిలలోని ఈ సూక్ష్మజీవుల జీవి శక్తే. మనం భూమి నీట్ గా ఉండాలి అనుకుంటున్నాము, తత్ఫలితంగా మట్టిలో సేంద్రీయ పదార్థం శరవేగంగా తగ్గిపోతోంది. ఈ మట్టి సారవంతంగా ఉండాలంటే, దానికి సేంద్రీయ పదార్థం అవసరం. అది జంతు వ్యర్థాలు ఇంకా చెట్ల నుండి పచ్చని చెత్త ద్వారా మాత్రమే వస్తుంది.

మనుషులంతా రేపు కనుమరుగైపోతే, పదేళ్ళల్లో ఈ భూమి పర్యావరణపరంగా అత్యంత సంపన్నమవుతుంది. ఈ భూమి మీద అత్యంత పరిణామం చెందిన జీవులుగా భావించబడుతున్న మానవులు ఈ భూమికి ప్రాణాంతక సమస్యగా మారారు. ఈ భూమి ఆపదలో ఉందని కాదు, భూమి మనుగడ సాగిస్తుంది. కాకపోతే అది మానవ జీవితానికి ఆశ్రయం ఇవ్వలేనిదిగా అవుతుంది.

#3 వరద ఇంకా కరువుల విష వలయాలకి దారి తీస్తుంది

మీరు గత కొన్నేళ్ళు వెనక్కి తిరిగి చూస్తే, భారతదేశంలో ఎక్కడ వరదలు వచ్చినా, మూడు నెలల్లోనే అక్కడ కరువు వచ్చేది. ఎందుకంటే భారతదేశంలో మనకు ఉన్న ఏకైక నీటి వనరులు వర్షాలు. మన నదులు, సరస్సులు, చెరువులు, బావులు నీటి వనరులు కావు. అవి వర్షపు నీటికి గమ్యస్థానాలు మాత్రమే. భారతదేశంలోని నదీ జలాల్లో కేవలం నాలుగు శాతం మాత్రమే హిమనదీయ నీరు, మిగిలినదంతా వర్షాల నుండి వచ్చేనీరే.

గత వందేళ్ళల్లో వానల రూపంలో దిగువకు వస్తున్న నీటి పరిమాణం మారలేదు. యాభై సంవత్సరాల క్రితం, వానలు 70 నుండి 140 రోజులు పడేవి. ఇప్పుడు ఇది 40 నుండి 75 రోజులలో జరుగుతోంది. అంటే కుండపోత వర్షాలు చాలా ఎక్కువ అయ్యాయి.

వర్షపు నీరు నేలపై పడినప్పుడు, అది మట్టిలో చొచ్చుకుపోయి జలాశయాలలోకి వెళ్లి ఉండాలి; కానీ మనము అన్ని చెట్లను కొట్టేసాము కాబట్టి, అది కేవలం ఉపరితలంపై ప్రవహిస్తోంది, మట్టిని హరిస్తోంది ఇంకా వరదను సృష్టిస్తోంది. నేలంతా కేవలం ఒక ఖాళీ మైదానంగా మారడం వల్ల ఇలా జరుగుతోంది. అంటే చెట్లు లేవు. నీటిని పీల్చుకోవడానికి మట్టిలో తగినంత సేంద్రీయ కార్యకలాపాలు లేవు. నీరు దిగువకు చేరినట్లయితే, బావులు, చెరువులు ఇంకా నదులలో నీరు ఉండేది. వర్షపు నీరు పట్టి ఉంచబడలేదు కాబట్టి, కొంతకాలం తర్వాత కరువు ఏర్పడక తప్పదు.

ఈ భూమి మీద అతిపెద్ద ఆనకట్ట మట్టి. ఇది సరైన స్థితిలో ఉండి ఉంటే, మట్టి అన్ని నదులలోని నీటికంటే, అది 800% ఎక్కువ నీటిని నిల్వ చేయగలుగుతుంది. కానీ మట్టిలో సేంద్రీయ స్థాయి తగ్గే కొద్దీ, నీటిని నిల్వ చేసుకోగల దాని సామర్థ్యం కూడా తగ్గుతూ పోతుంది.

#4 ఆహార కోరత అంతర్యుద్ధానికి కారణమవ్వవచ్చు

భారతదేశంలో దాదాపు 16 కోట్ల హెక్టార్ల సాగు భూమి ఉంది, అయితే ఈ నేలలో దాదాపు నలభై శాతం నేల, ఎడారి నేలగా మారింది . అంటే మరో ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాలలో, ఈ దేశంలో మనకు అవసరమైన ఆహారాన్ని మనం పండించుకోలేకపోవచ్చు. నీరు ఇంకా ఆహారం లేనప్పుడు, జరిగే అంతర్యుద్ధం అనేక రకాలుగా దేశాన్ని నాశనం చేస్తాయి. నీరు పూర్తిగా తగ్గిపోవడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పట్టణ కేంద్రాలకు వలస వెళ్ళబోతారు. ఇది ఎంతో దూరంలో లేదు. మౌళిక సదుపాయాలు లేకుంటే వీధుల్లో కూర్చుంటారేమో, కానీ అలా ఎంత కాలం? తిండి, నీళ్లు లేనప్పుడు ఇళ్లల్లోకి చొరబడతారు. నేను నిరాశావాదిని కాదు, కానీ ఇప్పడు మనం పెద్ద ఎత్తున ఏదైనా చెయ్యకపోతే, రాబోయే ఎనిమిది నుండి పదేళ్ళల్లో మనం ఈ పరిస్థితులను చూడక తప్పదు.

సంపాదకుని సూచన: చైతన్యవంతమైన ప్రపంచం(Conscious Planet) అనేది మట్టి ఇంకా ఈ భూమి పట్ల స్పృహతో కూడిన విధానాలను ప్రారంభించడానికి ఒక ప్రపంచ స్థాయి ఉద్యమం. ఒక చైతన్యవంతమైన ప్రపంచాన్ని సృష్టించి, మట్టిని కాపాడే ప్రయత్నంలో మీ సమయం, నైపుణ్యాలు ఇంకా కృషి ఎంతో విలువైనవి. భూమిత్రగా, ధరణి వీరగా లేదా కాన్షియస్ ప్లానెట్ టీమ్ మెంబర్‌గా, మీరు ఏ విధంగా అయినా మద్దతు ఇవ్వచ్చు!