ప్రశ్న: నేను ఏడాదిన్నర నుండి యోగా చేస్తున్నాను, ఎంత వేచి ఉన్నానో అంత నిరాశ చెందుతున్నాను. నేను ఏ స్థాయిలో ఉన్నానో నాకు ఎలా తెలుస్తుంది?

సద్గురు : స్థాయిలన్నవి సాపేక్షమైననవి. మీరు ఒక సంవత్సరం ముందు ఆరంభించినవారికన్నా ఒక స్థాయి ముందుండాలని కోరుకుంటున్నారా? మీ బుర్రలో ఇలాంటి స్థాయిల ఆలోచనలున్నంతవరకు ఆధ్యాత్మికతే లేదు. మీలో నిరాశ సరిపడా పేరుకుపోయినప్పుడు, మీకు యోగా పై విసుగొచ్చి, దీంట్లో నేను ఎటూ చేరలేకపోతున్నా అనిపించినపుడు సాధన చేస్తూ ఉండండి. ఈ మొత్తం యోగా ప్రక్రియ ఎలా నిర్మించబడిందంటే మీరు జాగరూకత లేకుండా ఇది చేయలేరు. ఎప్పుడైతే మీరు జాగరూకులై, ఏ విధమైన ఆకాంక్షా లేకుండా కేవలం సాధన మాత్రం చేస్తారో, అప్పుడు మీలో ఒక విస్ఫోటనం జరుగుతుంది. నేను ఏ స్థాయిలో ఉన్నాను, నేను ఒక అడుగు ముందుకు వేస్తున్నానా? అనే ఆలోచనలలో ఉండి విపరీతమైన పోటీలో ఉంటే మీరు ఉన్న చోటే ఉంటారు. కాబట్టి స్థాయిల గురించి మర్చిపోండి.

భవబంధాలా లేక విముక్తా?

పూర్తి అంకితభావంతో ఉంటూనే దానిలో చిక్కుకోకపోవడమే సారాంశం. ఉదయాన్నే మీ సాధన చేయండి. మీకు నేర్పించబడిన మిగితా అంశాల పట్ల రోజంతా జాగరూకులై ఉండండి. మీ జీవితంలో ప్రతి విషయం యోగమయం అయ్యే విధంగా దీన్ని ఆచరించండి. మీరు కూర్చున్నా, నిల్చున్నా, తింటున్నా, నిద్రిస్తున్నా ప్రతిదీ యోగమే అవ్వాలి. యోగా అంటే మిమ్మల్ని మీ ఉత్కృష్ట స్వభావానికి చేరువ చేసేది. మీరు మీ శరీరం, మనసు, భావోద్వేగాలు ఇంకా శక్తిని ఉపయోగించి భవబంధాల్లో చిక్కుకు పోవాలనుకుంటున్నారా లేక విముక్తి పొంది అత్యున్నతమైన పరమానంద పరిమాణాన్ని పొంది, మీరు అద్భుతమైన స్థితికి చేరుకోవాలనుకుంటున్నారా? మిమ్మల్ని నిర్భందించే సాధనాలు ఇంకా మీకు విముక్తినిచ్చే సాధనాలు వేరు వేరు కాదు.

మీ శరీరం, మనసు, భావోద్వేగం ఇంకా శక్తి అన్నీ పనిచేస్తున్నాయి, కానీ వేరు వేరు మనుషులకు వేరు వేరు స్థాయిలలో పని చేస్తున్నాయి, కొందరిలో శరీరం ఆధిపత్యం వహించవచ్చు, మరికొందరిలో మనసు ఇంకొందరిలో భావోద్వేగాలు, ఇంకొందరిలో శక్తి ఆధిపత్యం వహించవచ్చు. ఈ కల్పనలో పాళ్ళు ఒకొక్కరికీ ప్రత్యేకంగా/వైవిధ్యంగా ఉండొచ్చు కానీ అందరిలో ఇవే నాలుగు పదార్థాలు. మీరు ఈ నాలుగింటి సమాహారం. ఈ నాలుగింటినీ మీకు సరైన పరిమాణాలలో సమతుల్యం చేసి మిమ్మల్ని ముందుకు నడిపించేదే యోగ.

మీ సాధనను ఒక సమర్పణగా చేయండి.

మీకిచ్చిన ప్రాధమిక సాధన మీలోని ప్రధానమైన అంశాలను జాగృతం చేసేందుకు రూపకల్పన చేయబడింది. ఒక్కొక్కరికి ఒక్కో సమయం పట్టడానికి వివిధ కారణాలు ఉంటాయి. దాని గురించి మీరు ఆందోళన చెందొద్దు. మీరు ఒక నిబద్ధతతో ఉన్నారు. మీరు కేవలం చేయండి. మీకు ఇలా చేయడం తెలియకపోతే ఒక అర్పణలా చేయండి. “ఇది నా కోసం కాదు, నేను రోజూ నా యోగా చేస్తాను, నా గురువుకు సమర్పణగా”. ఇది మీలోని ఈ పోటీ తత్వాన్ని తొలగించేందుకు సులువైన సాధన.

మీ సాధనను అర్పణగా చేయడం ఒక సామాన్య సాధనం - మీలో ఉన్న స్థాయిల అంచనాను వదిలించుకోవడానికి.

మీరు నేను ఏ స్థాయిలో ఉన్నానని అడిగితే అదొక అంతులేని ప్రక్రియ. “నేను నా కన్నా ముందు గానీ తరువాత గానీ ఆరంభించినవారికన్నా ఒక అడుగు ముందున్నానా?” మీ సాధన ఒక అర్పణలా చేయడం మీలోని ఈ వ్యర్థమైన ఆలోచనలు పక్కన పెట్టి కేవలం సాధనపై దృష్టి పెట్టే సరళ పద్దతి. ఆధ్యాత్మికతైనా మరేదైనా సరే కేవలం మీరు కోరుకున్నంత మాత్రాన జీవితంలో అన్నీ జరిగి పోవు. మీరు మీ సామర్థ్యాన్ని అందుకనుగుణంగా మార్చుకున్నప్పుడు జరుగుతుంది. అది డబ్బు, ప్రేమ లేదా ఆధ్యాత్మికత గానీ మరేదైనా గానీ మీరు సరైన పనులు చేసినప్పుడే ఈ ప్రపంచం మీకణుగుణంగా మారుతుంది, లేదంటే అలా జరగదు.

ఒక రోజు ఒక వ్యక్తి సెప్టిక్ ట్యాంక్లో పడ్డాడు, మెడలోతు మురుగులో మునిగాడు. బయటకు రావడానికి చాలా ప్రయత్నం చేసాడు, కానీ రాలేకపోయాడు. కొద్ది సేపటి తరువాత “మంటలు మంటలు” అని అరవటం మొదలు పెట్టాడు. చుట్టుపక్కల వారు ఇది విని ఫైర్ బ్రిగేడ్ వాళ్ళను పిలిచారు. వారొచ్చి చుట్టూ చూసారు కానీ మంటలు కనిపించలేదు. అంతలో వారు ఈ వ్యక్తిని చూసి బయటకు లాగారు. “ఎందుకు మంటలు మంటలు అని అరిచావు మంటలు ఎక్కడా లేవుగా” అనడిగారు. అప్పుడావ్యక్తి నేను “మురుగు మురుగు” అంటే ఎవరైనా వచ్చేవారా? అని అడిగాడు. మీరు సరైన పనులు చేసినప్పుడే మీకు సరైనవి జరుగుతాయి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు