యోగ మొదలు పెట్టాలనుకునే వారికీ, కానీ ఎక్కడ నుండి మొదలు పెట్టాలో తెలియని వారికి, ఈ మార్గాన్ని గురించి తెలుసుకొని, ఒక సాధనను ఎంచుకుని, ఒక గురువును కనుగొని, మరింత చేయాలనుకునే యోగా ఔత్సాహికులకు వచ్చే సాధారణ సందేహాలకు సద్గురు సమాధానం ఇస్తున్నారు.

1. యోగా అంటే ఏమిటి? యోగాలో ఆసనాల పాత్ర ఏమిటి? యోగా ద్వారా మనం ఏమి సాధించాలి?

సద్గురు: ఈ రోజున సాధారణంగా అందరూ అపార్థం చేసుకుంటున్నట్లుగా, యోగ అనేది ఒక రకమైన వ్యాయామం కాదు. “యోగ” అసలు అర్థం ఐక్యత. ఆధునిక శాస్త్రం, ఈ మొత్తం ఉనికి ఒకే శక్తి అని రుజువు చేస్తోంది. కానీ మీరు దాన్ని ఆ విధంగా అనుభూతి చెందడం లేదు. మీరు ఒక ప్రత్యేక జీవి అన్న ఈ భ్రమని మీరు ఛేదిస్తే, ఇంకా ఉనికి యొక్క ఏకత్వాన్ని అనుభూతి చెందితే, అదే యోగ. ఈ అనుభూతి వైపుగా మిమ్మల్ని తీసుకువెళ్లడానికి అనేక విధానాలు ఉన్నాయి. వాటిలో ఆసనాలు అనేవి ఒక అంశం.

దీనికి వేరే పార్శ్వాలు కూడా ఉన్నాయి, కానీ సరళంగా చెప్పాలంటే, మిమ్మల్ని మీరు పరిశీలిస్తే మీరు కోపంగా ఉన్నప్పుడు ఒక విధంగా కూర్చుంటారు, మీరు సంతోషంగా ఉంటే మీరు మరొక విధంగా కూర్చుంటారు, మీరు వ్యాకులతతో ఉంటే ఇంకో విధంగా కూర్చుంటారు. చైతన్యం యొక్క ప్రతి స్థాయికీ లేదా మీరు అనుభూతి చెందే ప్రతి మానసిక ఇంకా భావోద్వేగ పరిస్థితులకు మీ శరీరం ఒక నిర్దిష్టమైన భంగిమలను తీసుకుంటూ ఉంటుంది. ఈ విధమైన ఎరుకతో, భంగిమల ద్వారా మీకు కావలసిన స్థితిని తీసుకువచ్చేదే ఆసన విద్య. ఎరుకతో మీరు మీ శరీరాన్ని వేర్వేరు భంగిమలలోకి తీసుకువెళ్లినప్పుడు, మీరు మీ చైతన్యాన్ని పెంచవచ్చు. మీ శరీరం పనితీరును తెలుసుకోవడం, ఒక నిర్దిష్టమైన వాతావరణాన్ని ఏర్పరచటం, ఇంకా శక్తిని ఒక నిర్దిష్ట దిశగా ప్రసరింప చేయడం కోసం మీ శరీరాన్ని ఉపయోగించడమే, యోగాసనాల ఉద్దేశ్యం.

2. చాలామంది యోగా గురువులు ఉన్నారు, వారు యోగా టీచింగ్ సర్టిఫికెట్లను ఇస్తున్నారు. కానీ ఒక అసలైన యోగా టీచర్ అయ్యే విధానం ఎలా ఉంటుంది?

సద్గురు:చూడండి యోగా అనేది అంతర్గత సాంకేతికత, బాహ్యమైన సాంకేతికత కాదు. ఒకరు వెన్ను నొప్పి నుండి ఉపశమనం కోసం వచ్చినా, లేదా మార్మికతను అన్వేషించడానికి వచ్చినా, మొట్టమొదట మేము వారికి ఒకే దాన్ని నేర్పిస్తాము. ఎందుకంటే, అదే సాధనాన్ని ఎలా ఉపయోగించుకుంటారు అనేదాన్ని బట్టి, అది ఆ వ్యక్తులలో వేరువేరుగా పని చేస్తుంది.

కాబట్టి, ప్రస్తుతం మీరు అర్థం చేసుకోగలిగిన దానికంటే ఎంతో అతీతమైనది, చాలా గొప్పది మీ చేతుల్లో పెట్టినప్పుడు, మిమ్మల్ని మీరు ఒక నిర్దిష్టమైన స్థితిలో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం - అంటే, మీ ఎదురుగా కూర్చుని ఉన్న వ్యక్తి మీ కన్నా చాలా ముఖ్యమైన జీవం కావాలి. దీనినే ఉపాసన అంటారు. అంటే మీరు ప్రధాన ఆసనం మీద కూర్చోవడం లేదు, మీ జీవితంలో అంతర్గతంగా మీరు ‘ఉప’ ఆసనం మీద కూర్చుంటున్నారు అన్నమాట. ఎవరైతే యోగా నేర్పించాలి అనుకుంటున్నారో, ముఖ్యమైన విషయం ఏమిటంటే - మీరు పక్కన నిల్చోవడం(మీకు మీరు ముఖ్యం కాదు), మీరు అక్కడే ఉంటారు కానీ పక్కన నిల్చోవడం. మీరు ఇది చేయగలిగితే, అప్పుడు మీ అవగాహనకి ఇంకా మీ అనుభవానికి అతీతమైన పార్శ్వాలు తెరుచుకుంటాయి. ఇది ఒక గొప్ప వరం, ఎందుకంటే మీకు అతీతమైన చాలా అద్భుతమైనది ఏదైనా మీరు చేయగలిగితే, అదే ఏ మనిషికైనా ఎంతో గొప్ప విషయం.

3.ఈ రోజున సోషల్ మీడియా ఉంది, యూట్యూబ్ ఇంకా ఇతర సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, అవి మీకు ఇంట్లోనే యోగా నేర్పిస్తాయి. యోగాను ఈ విధంగా నేర్చుకోవడం సురక్షితమైనదేనా ?

సద్గురు:

కాని, ‘ఉపయోగ’ అనేది ఒకటి ఉంది. అది మీకు శారీరక ఇంకా మానసిక ప్రయోజనాలను చేకూర్చుతుంది, కానీ ఆధ్యాత్మిక పార్శ్వాలను అంతగా తాకదు. ఉపయోగాకు ఆ స్థాయి నిబద్ధత అవసరం ఉండదు, అలాగే దాన్ని సరిగ్గా చేయనప్పుడు ఏమంత సమస్య లేదు, ఎందుకంటే మీరు దాన్ని సరిగ్గా చేయకపోవడం అనేది ఏదీ ఉండదు - అది చాలా సులువైనది!

భారతీయ భాషలలో ఉపయోగ అనే పదం ‘ఉపయోగకరమైనది’ అన్నట్టుగా ఉంటుంది. కానీ వాస్తవానికి దాని అర్థం ఏమిటంటే ‘ఉప – యోగ’ లేదా ‘ముందు స్థాయి యోగ’. దీనిని మీరు ఐదు నిమిషాల్లో నేర్చుకోవచ్చు. దీనిని మీరు ఎక్కడైనా చేయవచ్చు, ఇంకా దీని ప్రయోజనాలు చాలా గొప్పగా ఉంటాయి. యోగాని ప్రపంచానికి పెద్ద ఎత్తున పరిచయం చేయడానికి ఉప యోగ అనేది ఒక సురక్షితమైన మార్గం. ఒకసారి ప్రజలు దాని ప్రయోజనాలను అనుభూతి చెందాక, సహజంగానే వాళ్ళు యోగాను మరింత సీరియస్ గా చేయాలనుకుంటారు, అప్పుడు యోగా వారి జీవితంలోకి రావాలి.

4. భారతదేశం బయట యోగా అద్భుతమైన ప్రాచుర్యాన్ని పొందింది, కానీ అది ఇతర యోగా సాధనలకు జన్మనిచ్చింది - అంటే పూల్ యోగా లేదా నియాన్ యోగా వంటి వాటికి. ఇది యోగ సాధనను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?

సద్గురు: ఎప్పుడైనా సరే, ఏదైనా ఒక స్థాయి దాటి ప్రాచుర్యాన్ని పొందింది అంటే అప్పుడు ప్రపంచమంతటా దాని చుట్టూ వ్యాపారాలు ఉంటూనే ఉంటాయి. వీటి వల్ల మనం దారి తప్పకూడదు, వ్యాకుల పడకూడదు. వారు దాన్ని సరిగ్గా నేర్పిస్తున్నారా? ఈ విషయం మీద సందేహాలు ఉన్నాయి. వారిలో కొందరు సరిగ్గా నేర్పిస్తున్నారు, కొందరు సరిగ్గా నేర్పించడం లేదు. ఈ విధమైనవి పుట్టుకురావడానికి కారణం, వాణిజ్య ప్రక్రియ. కానీ ఈ మార్పు చేర్పులు అనేవి అక్కడక్కడ పైపైన మాత్రమే జరుగుతున్నాయి. యోగ యొక్క మూల అంశం ఏ విధంగానూ చెదరలేదు.

5. యోగా క్లాసులు చెప్పే సంస్థలు ఎన్నో ఉన్నాయి. నిజమైన యోగా గురువును గుర్తించడం ఎలా?

సద్గురు: అసలు నిజమైన గురువు ఇంకా దొంగ గురువు అంటూ ఏమీ లేదు. కాని విషయమేంటంటే ఆధ్యాత్మికతనే వ్యాపారంగా చేసేవారు కొంతమంది ఉన్నారు. గతంలో ఆధ్యాత్మిక ఉద్యమాలలో క్వాలిటీ కంట్రోల్ చేయడం అనేది ఒకటి ఉండేది. కానీ వెయ్యి సంవత్సరాలకు పైగా ఒక ఆక్రమించబడిన దేశంగా ఉన్నందువల్ల, ఈ రోజున భారతదేశంలో చాలా దెబ్బతిన్నాయి. కాబట్టి హాస్యాస్పదమైవి ఎన్నో జరుగుతున్నాయి. కానీ మీరు చేయాల్సింది ఏమిటంటే, అది మీకు పనిచేస్తుందా పనిచేయడం లేదా అన్నది మీరు పరీక్షించాలి. మీకు ఏదైతే అందించబడిందో, దాన్ని మీ జీవితంలో అమలు చేయండి - అది పని చేస్తే కొనసాగించండి, పని చేయకపోతే దాన్ని మానేసి మరొక దాని కోసం చూడండి.

6. యోగా గురించి ఎంతగానో చర్చ జరుగుతున్నది, కానీ యోగ మార్గాన్ని దాని అసలు రూపంలో అనుసరించడం ఎలా?

సద్గురు: యోగా అనేది కేవలం ఉదయం, సాయంత్రం చేసే సాధన వంటిది కాదు. సాధన ఒకటి ఉంది. కానీ, అదే అంతా కాదు, ఆ ఒక్క అంశం మాత్రమే కాదు మీ జీవితంలోని ప్రతి అంశం, మీరు నడిచే విధానం, సంభాషించే విధానం, ప్రతిదీ కూడా ఒక యోగ ప్రక్రియగా కావాలి. ఇందులో అంతర్గతం కానిది ఏదీ లేదు.

యోగ అంటే అది మీరు చేసేది కాదు. యోగ అంటే అది మీరు అయ్యేది. అది ఒక చర్య కాదు, అది ఒక గుణం. మీరు మీ శరీరాన్ని, మనసుని, భావోద్వేగాలను ఇంకా శక్తులను ఒక స్థాయి పరిపక్వతకు తీసుకువస్తే, అప్పుడు మీలో ఒక విధమైన గుణం వస్తుంది. అదే యోగ. సాధనలు ఆ గుణాన్ని తీసుకువస్తాయా అంటే, కచ్చితంగా తీసుకువస్తాయి, కానీ, రోజులో కేవలం కొద్ది నిమిషాల పాటు చేసే ఒక రకమైన చర్యగా దాన్ని మేము నేర్పించము.

మీరు మీ తోటను చక్కగా చూసుకుంటే, పువ్వులు వస్తాయి. అదేవిధంగా మీరు దేన్నయితే “నేను” అంటారో, దాన్ని మీరు చక్కగా చూసుకుంటే, పూలు వికసిస్తాయి. అంటే, శాంతియుతంగా ఉండటం, సంతోషంగా లేదా ఆనందంగా ఉండటం అనేది మీకు బయట ఉన్న ఏదీ కూడా నిర్దేశించదు. అది మీరే నిర్దేశిస్తారు. ఇది ప్రతి మనిషీ కూడా తనకు తాను చేసుకోవాల్సిన విషయం. అలా జరిగేలా చేయడానికి యోగా అనేది ఒక అంతర్గత ఉపకరణం.

Editor’s Note: Learn Isha Upa-Yoga now. These 5-minute processes are easy-to-practice yet potent tools from Sadhguru to enhance health, joy, peace, love, success and inner exploration, helping one cope with the hectic pace of modern life and realize their full potential in all spheres of life.