ప్రతి మనిషీ, తెలిసో తెలియకనో, ఈ జీవన ప్రక్రియలో తనకంటూ ఒక గుర్తింపుని, వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. మీలో మీరు సృష్టించుకున్న ఈ రూపానికి, వాస్తవంగా ఉన్నదానికి, ఏ మాత్రం సంబంధం లేదు. మీ అంతర్గత స్వభావానికి, దీనితో ఎటువంటి పొంతనా లేదు. మీకు తెలియకుండానే మీరు తయారు చేసుకున్న ఒకానొక రూపం అది. ప్రతి ఒక్కరికీ వారి గురించి, తాను ఏమిటన్నది ఒక అభిప్రాయం ఉంటుంది. చాలా తక్కువ మంది మెలకువతో తమ వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటారు. తక్కిన వారందరికీ, వారి జీవితంలో వారు ఎదుర్కొన్న పరిస్థితులు, సంభవించిన పరిణామాలను అనుసరించి వారి వ్యక్తిత్వం రూపొందిచుకుంటారు.

సరే, ఇప్పుడు మనం, ఎఱుకతో ఒక కొత్త స్వస్వరూపాన్ని నిర్మించుకోవచ్చు కదా, మీరు నిజంగా ఎలా ఉండాలని అనుకుంటున్నారో అలాగ? మీరు గనుక తెలివైన వారైతే, ఎరుక కలిగి ఉంటే, మీ రూపాన్ని మార్చుకోవచ్చు, పూర్తిగా ఒక కొత్త రూపాన్ని, మీకు ఇష్టమైన రీతిలో, తయారు చేసుకోవచ్చు. అది సంభవమే. కానీ మీరు మీ పాత రూపాన్ని వదిలేయాల్సి ఉంటుంది. ఇది నటన కాదు. ఇదివరలో లాగా అసంకల్పితంగా కాకుండా, ఇప్పుడు మీరు ఎఱుకతో, చైతన్యంతో ప్రవర్తిస్తారు. మీకు అత్యంత సహాయకారిగా ఉండే, అటువంటి రూపాన్ని, మీ చుట్టూ అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరిచే, ఘర్షణ తగ్గించే వేసే రూపాన్నిమీరు తయారు చేసుకోవచ్చు. మీ లోపలి స్వభావానికి అతి దగ్గరగా ఉండే రూపాన్ని సృష్టించుకోవచ్చు. మీ ఆంతరంగిక స్వభావానికి అతి దగ్గరైన స్వరూపం ఏది అని అనుకుంటున్నారు మీరు? చూడండి, అంతర్గత స్వభావం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది, ఆధిపత్యం చలాయించదు కానీ శక్తివంతంగా ఉంటుంది. చాలా సూక్ష్మమైనది కానీ చాలా శక్తివంతమైనది. ఇప్పుడు మనం చేయాల్సింది అదే- మీలో ఉన్న కోపం, పరిమితులు వంటి స్థూల అంశాలను నరికి వెయ్యండి. సూక్ష్మము, అతి శక్తివంతము అయిన ఒక కొత్త స్వరూపాన్ని సృష్టించండి.

ఒకటి, రెండు రోజులు దీర్ఘంగా ఆలోచించండి. మీకంటూ ఒక నిర్దిష్ట రూపాన్ని నిర్ణయించుకోండి. మీ ఆలోచనలు, మనోభావాల ప్రాథమిక స్వభావం ఎలా ఉండాలి. మీరు సృష్టించబోయే ఈ కొత్త రూపం, మీరు ప్రస్తుతం ఉన్నదానికంటే మెరుగైనదా కాదా అని, బేరీజు వేసుకోండి. మీకు ఎటువంటి ఆటంకాలు వచ్చే అవకాశం లేని ఒక సమయాన్ని ఎంచుకోండి. మీ వెన్నుని దేనికైనా ఆనించి, హాయిగా కూర్చోండి. ఇక, కళ్ళు మూసుకుని ఊహించుకోండి- ఇతరులు అందరూ మిమ్మల్ని ఎలా అనుభూతి చెందాలి అని. ఒక సంపూర్ణమైన నూతన వ్యక్తిత్వాన్ని సృష్టించుకోండి. ఆ రూపాన్ని అతి నిశితంగా పరిశీలించండి. ఈ కొత్త రూపం, మరింత మానవత్వంతో, ఇనుమడించిన సామర్థ్యంతో, మరింత ఎక్కువ ప్రేమగా ఉన్నారేమో గమనించండి.

ఈ కొత్త రూపాన్ని మీకు వీలైనంత గట్టిగా మీ మనోనేత్రంతో చిత్రీకరణ చేసుకోండి. మీ అంతరంగంలో దాన్ని సజీవం చేసుకోండి. ఈ ఆలోచన బలమైనది అయితే, మీ రూపకల్పన శక్తివంతమైనది అయితే, అది మీ కర్మ బంధనాలని తెంచి వేయగలదు కూడా. మీరు ఉండాలనుకుంటున్న విధంగా మీ స్వరూపాన్ని శక్తివంతంగా చిత్రీకరణ చేసుకోవడం వల్ల కార్మిక పరిధులను దాటి పోవచ్చు. మీ ఆలోచనలు, భావోద్వేగాలు, చర్యల పరిమితులను అధిగమించడానికి ఇదే అవకాశం.

Love & Grace