‘ఒకసారి ఒక చిత్రమైన సంఘటన జరిగింది. నేను ఒక చోట ఎక్కడో కూర్చొండిపోయాను. కళ్ళు మూసుకొని కూర్చొన్నాను. దాదాపు 25- 30 నిమిషాల పాటు.

నేను కళ్ళు తెరిచేసరికి నా చుట్టూ జనం గుమిగూడి ఉన్నారు. ఒకాయన తన జాతకం ఎలా ఉందో చెప్పమంటాడు. మరొకాయన తన కూతురు పెళ్లెప్పుడవుతుందో చెప్పమంటాడు. ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలేవో అడుగుతున్నారు. అసలు, వాళ్ళందరూ ఎక్కడినుంచి వచ్చారో కూడా నాకు అర్థం కాలేదు. తరవాత వాళ్ళే చెప్పారు, ‘ మీరిక్కడ ఇలాగే 13 రోజుల పాటు చలనం లేకుండా కూర్చొని ఉన్నారు’, అని!

ముడుచుకొని ఉన్న కాళ్ళు చాచటానికి నేను ప్రయత్నించాను, మోకాళ్ళు బాగా పట్టేసి ఉన్నాయి. రెండు గంటలపాటు మర్దన చేసి, వేడి నీళ్ళ కాపడం వగైరాలన్నీ చేస్తే గానీ, నా కాళ్ళు స్వాధీనం లోకి రాలేదు. నేను అక్కడ కదలకుండా 13 రోజులు కూర్చొని ఉన్నానని వాళ్ళన్నారు కానీ నాకు మాత్రం ఏ 25-30 నిమిషాలు మాత్రమో గడిచినట్టు అనిపించింది. మీరు మీ శరీరాన్నుంచి దూరంగా జరిగిన కొద్దీ, కాలానికి మీ మీద ఉండే అదుపూ, అధికారం సడలిపోతూ ఉంటాయి. అలాంటి వారిని ‘సమయాధిపతులు’ అంటాం. వీళ్ళు ఏదో విధంగా కాలానికి అతీతులైపోయిన వ్యక్తులు. కాలాన్ని మీ వశంలో ఉంచుకోగలిగితే, ఇక మీకు సమయం అనే దాంతో నిమిత్తం ఉండదు !’ అంటారు సద్గురు.

వినటానికి ఇదేదో అద్భుతంగా ఉన్నది కదా? కానీ సద్గురు దీనిని గురించి చెప్పేదంతా విన్నారంటే, మరింత ఆశ్చర్యపడతారు. పైగా, “ఇదేమీ పెద్ద ఘన కార్యం కాదు. ఈ కౌశల్యాన్ని ఎవరైనా అలవరచుకోవచ్చు” అంటారాయన.

నిజంగానే? ఎవరయినా కాలాన్ని జయించ గలరా? ‘నిశ్చయంగా!’ అని సద్గురు ప్రశాంతంగా నవ్వుతూ ఉంటే, అది ఒక సవాలు గానూ, ఒక ఆహ్వానం గానూ ధ్వనిస్తుంది. ఇక మీరు ఆయనను తరవాతి ప్రశ్న అడగక మానరు. ఆ తరవాత ఇంకో ప్రశ్న. దాని తరవాత ఇంకొకటి...

ఆయనతో ముఖాముఖి గంట సేపు సాగింది. ఆయన మాటలన్నిటిలోనూ సునిశితమైన మేధస్సూ , చక్కని చమత్కారాల రూపంలో ఆయనదైన ముద్రా తొణికిసలాడుతూనే ఉన్నాయి.

ఈ సంభాషణలో ఆయన మన జీవన విధానం గురించి కొన్ని కఠోర సత్యాలనూ, రహస్యాలనూ మన ముందుంచుతున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకొనే ఉపాయాలు వివరిస్తున్నారు. సద్గురుతో సంభాషణలో ముఖ్యాంశాలు:

ప్రశ్న: మీరు మా కుతూహలం బాగా రేకెత్తించారు. కాలానికి అతీతులమవటం ఎలా?

సద్గురు: కాలాన్ని అధిగమించి అతీతులయ్యేందుకు మీరు ప్రయత్నించనక్కర్లేదు. మీ శరీరానికి ఉండే సహజమైన భౌతిక ధర్మాలను అధిగమించగలిగితే, మీరు కాలానికి అతీతులైపోయినట్టే.

అసలు మనుషులు గడుస్తున్న కాలాన్ని తమంతట తాము ఎలా గుర్తించగలుగుతున్నారు? కేవలం శరీరం ద్వారానే. ఇది మధ్యాహ్నం అని ఎలా తెలుస్తుంది? పొద్దున ఉపాహారం తిన్నారు. ఇప్పుడు భోజనం సమయమయింది. ఒక భోజన సమయాన్నుంచి మరొక భోజన సమయం దాకా కాలాన్ని లెక్క పెట్టుకొంటున్నది శరీరమే. ఒక సారి లఘు శంక తీర్చుకొన్నాక, మళ్ళీ ఆ అవసరం వచ్చేదాకా గడిచే సమయాన్ని మీ శరీరం గుర్తించగలదు. రోజు గడిచేకొద్దీ శక్తి తగ్గి అలసట కలగటం, ఇక నిద్రకు ఉపక్రమించాలి అనిపించటం, వీటన్నిటి ద్వారా మనం గడుస్తున్న సమయాన్ని గ్రహిస్తుంటాం.

నేను మిమ్మల్ని ఇక్కడే మూడు గంటలు కూర్చోపెట్టి ఉంచాననుకోండి. మీ శరీరం కదలిక కావాలి అని కోరుతుంది. మీకు శరీరమే లేదనుకోండి, అప్పుడు నేను పది వేల సంవత్సరాలపాటు మిమ్మల్ని ఇక్కడ కూర్చో పెట్టినా మీకే సమస్యా ఉండదు! మీకు ‘సమయం’ అనే ధ్యాస శరీరం వల్లనే కలుగుతున్నది. గడియారాన్ని చూస్తూ కూర్చుంటే, పెద్ద ముల్లు ఒక చుట్టూ తిరిగివచ్చేసరికి ఒక గంట. చంద్రుడు ఒకసారి భూమిని చుట్టివ చ్చేసరికి, ఒక నెల. భూమి సూర్యుడి చుట్టూ ఒక ప్రదక్షిణం చేసేందుకు పట్టే సమయం ఒక సంవత్సరం. ప్రకృతిలో ఇలా అన్నీ చక్రాలుగా, వలయాలుగా పునరావృతం అవుతూ ఉండటం ప్రకృతి ధర్మం.

ప్రశ్న: మరి ఆ భౌతిక ధర్మాలను అధిగమించాలంటే ఏం చేయాలి?

సద్గురు: యోగ శాస్త్రం అంతా దాన్ని గురించే! మీ శరీర వ్యవస్థను ఈ బ్రహ్మాండపు వ్యవస్థ - cosmic system – కు అనుగుణంగా ఎలా అనుసంధానం చేయాలి అన్న దాన్ని గురించే. మీ శరీరంలో ఉన్న రక రకాల చక్ర భ్రమణాల - cycles-కూ, ఈ బ్రహ్మాండంలోనూ, ఈ సౌరకుటుంబం వగైరాల లోనూ కనిపించే మరింత పెద్ద చక్ర భ్రమణాలకూ ఒక సంబంధం ఏర్పడి ఉంది. ఈ రెంటికీ మధ్య అనుసంధానం సరిగా ఉంటే, మీకు శరీరం అనే స్పృహ అతి తక్కువగా ఉంటుంది. అప్పుడు మీ శరీరాన్ని మీరు ఎలా కోరుకొంటే, అలా వాడుకోవచ్చు. శరీరం గురించిన ధ్యాస మరీ ఎక్కువైపోతే, ఇక అదే మిమ్మల్ని నిర్బంధంగా నడిపిస్తుంది. యాంత్రికంగా, చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. అలా చేయకపోతే, మీరు గొప్ప యాతనను అనుభవిస్తారు. మీరు మీ భౌతిక శరీరంతో ఎంతగా గుర్తించుకుంటారో (identification), అంత పూర్తిగా మీరు కాలం అనే శక్తికి లోబడిపోతారు. భౌతిక క్రియలలో నిమగ్నమైనప్పుడు మనుషులు ఎప్పుడూ గడియారం మీద ఒక కన్ను వేసి ఉంచుతారు. వాళ్ళకు కాలం నడవదు! కొంచెం బుద్ధి జీవులై, పుస్తక పఠనం లాంటి వ్యాసంగాలు ఆరంభిస్తే, ఇక ఎంత సమయం ఎలా గడిచిపోతున్నదో తెలియదు. తెలియకుండానే గంటలు గడిచి పోతూ ఉంటాయి. ఈ బుద్ధి జీవి దశను కూడా దాటి , ధ్యానం అభ్యసిస్తే, సమయం అలా జారిపోతుంది.

నా దినచర్య ఎలా సాగుతుందంటే, ఒక కార్యక్రమంలో కూర్చొన్నానంటే, 10-12 గంటలపాటు అలాగే కూర్చొనిపోతాను. మిగిలిన వాళ్ళు దప్పిక తీర్చుకొనేందుకనో, బాత్ రూమ్ కు వెళ్ళి వచ్చేందుకనో విరామాలు తీసుకొంటారు. నేను మాత్రం అలాగే కూర్చొని ఉంటాను. అదేదో గొప్ప ఘనకార్యమని కాదు. మనిషి మీద శరీరానికి సాధారణంగా ఉండే అదుపు తగ్గిపోయిందని. అలా జరిగితే, మీరు మీ శరీరాన్ని ఉపయోగించుకొంటారే తప్ప, మీ శరీరం మిమ్మల్ని ఉపయోగించుకోలేదు అని. అదే సరయిన స్థితి.

ప్రశ్న: మీరు ఆధ్యాత్మికతలో యోగాభ్యాసానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటానికి కారణం ఆదేనా?

సద్గురు: మీ భౌతిక శరీరం అనేది ఏదో ఒక మామూలు వస్తువు కాదు. అదొక మహాద్భుతమైన యంత్రం. దాన్ని మీరు అన్నీ వేళల్లోనూ కార్యోన్ముఖంగా, సిద్ధంగా ఉంచాలి. లేకుంటే మీరు జీవితపు లోతులను సమగ్రంగా అనుభవించలేరు.

ఈ మధ్య నేను తిరుపతి వెళ్ళాను. ఒక చోట, ఒక స్కూల్ బస్సు నా కారు ముందు ఆగింది. అందులోనుంచి దిగిన పదిమంది పిల్లలలో అయిదుగురిది ఊబ కాయం ! ఈ రోజుల్లో స్కూలు పిల్లలని మీరు గమనించి చూస్తే, వాళ్ళకెప్పుడూ మహా ‘బోరు’ గానే ఉంటుంది. పదేళ్ళు కూడా రాక ముందే పిల్లలు తమ స్మార్ట్ ఫోన్ లో ఈ బ్రహ్మాండాన్నంతా చూసేసి ఉంటారు. తమకన్నీ తెలుసనే అనుకొంటారు. ఇలాంటి పిల్లలు ముందు ముందు జీవితంలో ఏం సాధించగలుగుతారు? మంచి ఉద్యోగం సంపాదించుకొని, ఎంతో కొంత డబ్బైతే ఆర్జిస్తారు. కానీ అదే సర్వస్వం కాదు కదా? వీళ్ళు చెట్లు ఎక్కలేరు, పరుగులు తీయలేరు, డాన్సులు చేయలేరు, జీవితాన్ని ఏ విధంగానూ అనుభవించలేరు. నేటి ఉత్సాహశూన్యులైన పిల్లలు, రేపటి ఉత్సాహశూన్యులైన పెద్దలౌతారు. అప్పుడు ఉల్లాసం కోసం వాళ్లకేదయినా ఉత్ప్రేరకం అవసరమౌతుంది. అందుకే మద్యం వైపూ, మాదక ద్రవ్యాల వైపూ మళ్ళుతారు. వాళ్ళ కు ‘దుమ్ము దులిపేసే’టంత ఉత్సాహాన్నిచ్చేది మరేదీ కనిపించక, శరీరంలోకి ఏవేవో రసాయనాలను ఎక్కించుకొంటుంటారు!

ప్రశ్న: మరి, మనిషికి ‘దుమ్ము దులిపేసే’టంత ఉత్సాహం రావాలంటే, రసాయనిక ఉత్ప్రేరకాలతో నిమిత్తంలేని మార్గాలు కూడా ఉన్నాయా?

సద్గురు: కేవలం కళ్ళు మూసుకొన్నంత మాత్రాన, పరమానంద స్థితిని చేరి, ఆనంద బాష్పాలు కార్చే వాళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నారు. మీలో ఉన్న ‘మీరు’తో మీకు సంపర్కం ఏర్పడితే చాలు.

మద్యమూ మాదకాలూ పుచ్చుకోవటం నైతికంగా మంచిదా కాదా అని కొందరు చర్చ చేస్తుంటారు. కానీ అసలు ముఖ్య విషయం అది కాదు. మనుషులు జీవితాన్ని పూర్తి స్థాయిలో అనుభవించాలనే ఆరాటంలో మద్యానికీ, మాదకాలకూ చేరువవుతారు. జీవితం అనే మధుర ఫలంలో వీలయినంత పెద్ద ముక్కను తమ సొంతం చేసుకొని అనుభవించాలని అందరికీ ఉంటుంది. అందుకు వాళ్ళకు మరో మార్గమేదీ కనబడక పోతే, మందు సీసాను ఆశ్రయిస్తారు. కొంత కాలం గడిచిన తరవాత, మద్యమూ పని చేయదు. అప్పుడు దానికంటే, ఇంకా శక్తిమంతమైన ఉత్ప్రేరకాల కోసం వెతుకులాడతారు. ఆ ఉత్ప్రేరకం మీ మెదడుకు చిల్లులు పొడిచి, ఛిద్రం చేసే రసాయనమైనా ఫరవా లేదు, దాని వల్ల మృత్యువే దాపురించినా ఫరవాలేదు. జనానికి కావలసింది దాని వల్ల లభించే అదనపు సుఖానుభవం. ఆ అనుభవం కోసం మనిషి తపన అంత బలవత్తరంగా ఉంటుంది.

ప్రశ్న: ఆధ్యాత్మికత ఆ తపనను తీర్చగల పరిష్కారం అంటారు, అంతేనా?

సద్గురు: ఈ రోజు మనిషి బుద్ధి మునుపెన్నడూ లేనంతగా వికసించి, నిప్పులా రాజుకొంటున్నది. మానవాళి చరిత్రలో ఎప్పుడూ లేనంతగా మనుషులు తమ స్వబుద్ధి ఉపయోగించి ఆలోచించుకోగలుగుతున్నారు. ఇవ్వాళ, స్వయంగా ఆ భగవంతుడే దిగి వచ్చి చెప్పినా, ఆ చెప్పిందేదో మీకు సహేతుకంగా తోచితే తప్ప, మీరు పట్టించుకోరు. పూర్వకాలంలో అలాంటివి వినే వారు. ఇప్పుడు, పై లోకాలూ పర లోకాలూ అనేవి క్రమంగా కూలిపోతున్నాయి. ప్రస్తుతానికి ఇది ఇంకా వ్యక్తుల స్థాయిలో ఆలోచన ధోరణిలో వస్తున్న మార్పు గానే ఉంది. కానీ క్రమంగా ఇది జాతి యావత్తులోనూ జరగబోయే మార్పు.

మరో 80-100 సంవత్సరాలలో, ఇప్పుడున్న మతాల వ్యవస్థలు క్షీణించి పోతాయని నేననుకొంటున్నాను. మానవ జాతి దుర్భరమైన పరిస్థితులలో జీవిస్తూ వచ్చిన పురాతనకాలంలో పై లోకాలను గురించి విశ్వసించే వారు. ఇప్పుడు మన జీవన ప్రమాణాలు ఆ పై లోకాలలో జీవితం కంటే కూడా మెరుగుగా ఉన్నాయి. ఈ నాటి మనుషులు, ‘నాకు ఏ స్వర్గమూ అక్కర్లేదు. ఇక్కడే బాగుంది!’ అంటారు. అయినా కూడా, మనిషికి ఇంకా ఇంతకంటే గొప్ప అనుభవమేదో అనుభవించాలన్న తాపత్రయం మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. మన తరం ప్రజలమందరం కలిసి, ప్రతి మనిషికీ ఒక పటిష్ఠమైన, అంతర్గతమైన అనుభవమేదో సాధించి పెట్టేందుకు గట్టి ప్రయత్నం చేయకపోతే, జనాభాలో నూటికి తొంభయి మంది మద్యాన్నీ, మాదకాలనూ ఆశ్రయించి తీరతారు. దాన్ని ఎవరూ ఆపలేరు. కాలగతిలో మనిషి చిన్న ‘అమీబా’ (amoeba) స్థాయినుంచి విశేషమైన శక్తి సామర్థ్యాలు గల జీవిగా పరిణామం చెందాడు. ఈ మహాద్భుతమైన జీవ పరిణామాన్ని మళ్ళీ వెనక్కు నెట్టేసుకొని, మానవ జాతి తిరోగమించకుండా ఉండాలంటే, ప్రపంచ వ్యాప్తంగా ఒక శాస్త్రీయమైన, విజ్ఞాన శాస్త్ర సమ్మతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ అవసరమౌతుంది.

ప్రశ్న: అన్ని విశ్వాసాలకూ, నమ్మకాలకూ దూరంగా, నాస్తికులుగా ఉండిపోతే ఏమవుతుంది?

సద్గురు: నాస్తికులూ, ఆస్తికులూ అని మనుషుల్లో రెండు విభిన్నమైన తరగతుల వాళ్ళు ఉండరు. ఈ రెండు వర్గాల మనుషులు చేసేదీ ఒకటే. తమకు తెలియని విషయాల గురించి తమకు నచ్చిన నమ్మకాలు పెట్టుకోవటం ! ఇద్దరూ సత్యాన్వేషణకు కావలసిన ధైర్యమూ, నిబద్ధతా లేని వారే. తమకు తోచిందే సత్యంగా భావించేస్తారు. వాళ్ళు ఎలాంటి విశ్వాసాలున్న సంప్రదాయంలో పుట్టారో, దాన్ని బట్టి ఒక రకమైన ఊహ సవ్యంగా, సకారాత్మకంగా అనిపించటమూ, మరొకటి విపరీతంగా, నకారాత్మకంగా అనిపించటమూ జరుగుతుంది. సత్యమేమిటో రెండు వర్గాల వారికీ తెలియదు.

మీరు నాస్తికులో ఆస్తికులో అయ్యే బదులు, ‘నాకు తెలిసిందేదో నాకు తెలుసు. తెలియనిది తెలియదు!’ అని సూటిగా మీకు మీరు చెప్పుకోగలిగారనుకోండి. అప్పుడు మీకు తెలియనిది తెలుసుకోవాలనే జిజ్ఞాసా, అందుకోసం ప్రయత్నించాలీ, శోధించాలీ అన్న కోరికా కలుగుతాయి. ఈ జిజ్ఞాస మనిషికి ఉండే సహజ గుణం. జిజ్ఞాసతో మీరు శోధించేది మీకు లభించి తీరుతుంది కూడా.

ప్రశ్న: కానీ, మా తరం ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలు దైనందిన వాస్తవాలకు సంబంధించినవి - పని ఒత్తిడీ, రావలసిన ప్రమోషన్లు రాక పోవటం, పనికిమాలిన పై అధికారులూ… , ఇలాంటివి.

సద్గురు: నేను ఆ మధ్య ముంబాయి వెళ్ళాను. అక్కడ ఓ పెద్ద ఉద్యోగస్థుడు ఒకాయన నన్ను కలిశాడు. ‘సద్గురు, ఇక ఇది భరించటం నా వల్ల కాదు. మా ‘బాస్’ నాకు నరకం చూపిస్తున్నాడు!’ అన్నాడు. ‘అయితే, నీ ఉద్యోగం ఊడిపోవాలని నా ఆశీస్సు’ అన్నాను నేను. అతగాడు భయపడిపోయాడు. ‘సద్గురు, అలా దీవిస్తారేమిటి?’ అన్నాడు. ‘నరక యాతన కలిగించే ఈ ఉద్యోగం ఎందుకు నీకు? ఇది ఊడిపోవాలి. అప్పుడు నువ్వు హాయిగా సముద్ర తీరాన నడుస్తూ, ఆనందంగా కాలం గడుపుకోవచ్చు!’ అన్నాను నేను. ఉద్యోగంలో ఉన్నప్పుడూ, అది మనకు యమ యాతనే, అలాగని ఆ ఉద్యోగం ఊడిపోయిందంటే కూడా దుర్భరమైన దుఃఖమే!

ఇది మరి మనమే నిర్ణయించుకోవలసిన విషయం. మీరు కేవలం జీవనోపాధి లభిస్తే చాలనుకొంటున్నారా, లేక జీవితాన్ని అనుభవించాలనుకొంటున్నారా? ఈ భూమిమీద కీటకాలూ, పిపీలికాలూ, పిట్టలూ కూడా బతుకు తెరువు సంపాదించుకోగలుగుతున్నప్పుడు, ఇంత పెద్ద బుర్ర ఉన్న మీకు ఏదో ఒక జీవనోపాధి దొరకదా? అదసలు సమస్యే కాదు. సమస్యేమిటంటే, మీరు మీలాగా కాకుండా మరొకరిలాగా జీవించాలనుకోవటం. అవతలి వాడితో సమానంగా నేనూ సంపాదించాలి అనుకొంటారు, ఏదో ఒక ఉద్యోగంలో చేరతారు. అవతలి వాడికున్న కారు నాకూ ఉండాలనుకొంటారు, ఏదో వ్యాపారం లోకి దిగుతారు. అవతలి వాడికున్నంత ఇల్లు నాకూ కావాలి అనుకొంటారు, నానా ఇక్కట్లూ పడతారు. మీరు పెరిగి పెద్దవుతున్న దశ లోనే, మీరు మీకు అవసరం లేని పనులేవేవో చేయాలని ఆకాంక్షలు పెంచుకొంటారు. మీకు నిజంగా చేయాలని ఉన్న పనులు మాత్రం చేయరు.

నిజంగా చేయాలని ఉన్న పనులంటే నా ఉద్దేశ్యం, చాపల్యం వల్ల కలిగే పిచ్చి ఆలోచనలన్నీ అని కాదు. మీకు నిజంగా ఇష్టమైన పనులు మీరు చేస్తుంటే, వాటి ఫలితాన్నిప్రపంచానికి మీరుగా అందించగల కానుకగా మీరు భావించగలిగితే, అలాంటి పనులు మీరు ఆనందంగా చేయగలుగుతారు. అప్పుడిక ‘పని ఒత్తిడి’ అనే మాటే ఉండదు. అలా కాకుండా, మీకు ఏ మాత్రం ఇష్టం లేని పని ఏదో చేసి, దాని ద్వారా ఏదో సంపాదించుకోవాలని మీ ఉద్దేశ్యం అనుకోండి. అప్పుడు - ఇలాంటి మాట వాడటం నాకు మనస్కరించదు, కానీ - మిమ్మల్ని మీరే అమ్మేసుకొంటున్నారు అనవలసి వస్తుంది.

ప్రశ్న: ‘భారు భోరున వైభవంగా జీవించాలి!’ అనే కోరికే ఆధునిక తరాలకు ప్రేరణ కదా? దాన్ని మనం ‘ఆకాంక్ష’ - aspiration - అంటున్నాం. అది తప్పు అని మాకు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు.

సద్గురు: సజీవంగా, చైతన్య వంతంగా జీవించి ఉండటం అనేదే మనిషికి ఉండే లక్షణాలలో అతిముఖ్య విశేషం. ‘జీవితం’ అనే తన ఈ అద్భుతమైన విశేష లక్షణాన్నే మనిషి ఆస్వాదించలేకపోతే, అతగాడు ఇక ఏ విషయాన్నీ అనుభవించ లేడు. జీవితాన్నే కనక మీరు ఆస్వాదించ గలుగుతూ ఉంటే, ఇక మిగిలినవన్నీ అముఖ్యమైన చిన్న విషయాలే. ఈ రోజు నేను కారులో వెళతాను, రేపు నాకు సైకిల్ ఉంటే దాని మీదే వెళతాను – ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. అసలు జీవితం అనే విశేషం విలువ ఏమిటో మీరు తెలుసుకోలేక పోతున్నారు, కనక విలువ లేని విషయాలనన్నిటినీ చాలా విలువైనవిగా భావిస్తున్నారు.

నేను రోజుకు ఇరవై గంటలు పైగా పని చేస్తాను. ఒకే ఊళ్ళో రెండు రాత్రులు వరసగా నిద్ర పోగలిగితే, నాకు అదే ఒక మహా భోగం ! మరి నేను పని ఒత్తిడితో నలిగిపోతున్నట్టు మీకు కనిపిస్తున్నానా? మానసికమైన ఒత్తిడి ఎప్పటికయినా నాకు ప్రాణాంతకంగా పరిణమిస్తుందా? అది అసాధ్యం. నేను అలసట వల్ల మరణిస్తానేమో గానీ, ఉత్సాహ శూన్యత (boredom) వల్ల మాత్రం మరణించను. అది ఖాయం. ఉత్సాహ రాహిత్యం వల్ల మరణించటం కంటే దారుణమైన మరణం మరొకటి ఉండనే ఉండదు. మీరు జీవితాన్ని ‘సజీవంగా’ ఆస్వాదించాలంటే, దాని నుంచి నేను ఏమి పిండుకోగలనా అని కాదు ఆలోచించవలసింది. జీవితంలో ఎలా పాలు పంచుకోగలనా అని ఆలోచించాలి.

ప్రశ్న: ఆహా, మేమూ జీవితాన్ని సజీవంగా ఆస్వాదించే స్థితిలోనే ఉంటాం, శుక్రవారం సాయంత్రం అయ్యేసరికి!

సద్గురు: ‘అమ్మయ్య దేవుడా! శుక్రవారం వచ్చేసింది!’ అనుకొంటూ ఉంటారు, అవునా?

చాలా మంది నన్ను ‘ఉద్యోగ నిర్వహణా - జీవితాన్ని ఆస్వాదించటం’ ఈ రెండింటి మధ్య గల సమతౌల్యం (work- life balance) గురించి అడుగుతూ ఉంటారు. ‘మీ ఉద్యోగంలో మీరు జీవించలేకపోతుంటే, ఆ ఉద్యోగం వదిలేయండి!’ అంటాను నేను. నాకు వారాంతపు సెలవులు లేవు. నేను వారంలో ఏడు రోజులూ, ఏడాదిలో 365 రోజులూ పని చేస్తాను. నన్ను చూస్తే, ‘ఈయనకు విశ్రాంతి అత్యవసరం’ అనిపిస్తున్నదా? నిజంగా మీకు ఇష్టమైన పని మీరు చేయగలిగితే, జీవితమంతా విరామ సమయమే (vacation) ! కనక, మీరు మీకు ఇష్టమైన పని చేసుకొంటూ, మీ జీవితాన్నే ఒక విహార యాత్రగా మార్చుకోండి.

జీవితానికి ముఖ్య ప్రయోజనం ‘జీవించటమే’! పెద్ద ప్రశ్న ఏమిటంటే, మీరు ఎంత ‘సజీవం’గా జీవిస్తున్నారూ అని. అయిదేళ్ళ వయసులో మీరెంత సజీవంగా ఉండే వాళ్ళు ? ఇప్పుడెంత సజీవంగా ఉన్నారు? రోజుకొకసారయినా ఈ లెక్క చూసుకోవాలి. ఈ లెక్క సరిగా లేకపోతే, జీవితమనే వ్యాపారంలో మీరు భారీ నష్టాల పాలవుతారు! ప్రతి రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు పరీక్షించుకోండి, ‘ఈ రోజు నేను నిన్నటికంటే, మెరుగయిన మనిషిగా జీవించగలిగానా?’ అని. మెరుగయిన మనిషి అంటే, నా భావం మీరు పనికొచ్చే పనులూ, పరోపకారాలూ చేయటం అని కాదు. నైతికంగా మెరుగయిన మనిషి అయ్యారా లేదా అని కాదు నా ఉద్దేశ్యం. జీవ చైతన్య రూపులుగా మీరు నిన్నటికంటే కొంత ఎక్కువ ఆనందమయంగా ఉండగలిగారా?

ఆనందం అనేది బీమా (insurance) లాంటిది. మీరు ఆనందంగా ఉన్నారంటే మీ సాటి వాళ్లందరితోనూ మీరు అద్భుతంగా మెలగగలుగుతారు. మీరు ఇంత శ్రద్ధగా ఎందుకూ కొరగాని డబ్బుల లెక్కలు వేసుకొంటున్నారు. కానీ మీరు నిజంగా లెక్కలు కట్టుకోవాల్సింది జీవితాన్ని. జీవితం కంటే, కాసుల లెక్కలు ముఖ్యమైపోయాయి!

ప్రశ్న: మరి, దీనికి పరిష్కారమేమిటి?

సద్గురు: మీరు నిజంగా మీ యోగ క్షేమాలు కోరుకొంటే, అంతర్ముఖులు కావాలి. బహిర్ముఖులై ప్రయోజనం లేదు. బ్రహ్మానంద స్థితి మీ సహజ స్థితి అయి ఉన్నప్పుడు, మీరు చేయ వలసిందేముంటుంది? ఏది అవసరమో అది మాత్రమే చేసుకొంటే చాలు. ఆనందాన్వేషణలో ఉన్న మీరు ఇప్పుడు చేయవలసిన పని ఏమిటి? ఆనందాన్ని అందించగలదేదో ఆ పని చేస్తారు. మీ జీవితానుభవాన్ని వ్యతిరేక దిశగా మార్చి చూడండి. ఈ బాహ్య ప్రపంచం నుండి ఏదో రసాన్ని పిండుకోవాలని ప్రయత్నం చేసే బదులు, జీవితాన్ని జీవించే విధానాన్ని మెరుగు చేసుకొని , జీవితమే రసవంతంగా ఉండేట్టు చేసుకోండీ. అదే పరిష్కారం!

ప్రేమాశీస్సులతో,

సద్గురు