మనం క్రిందటి వ్యాసంలో దుష్యంతుడు, శకుంతల కలయిక ద్వారా భరతుని ఆగమనాన్ని చదివాము. ఇప్పుడు మహారాజైన శాంతనవుడు, గంగాల కలయిక గురించి చదువుదాం..

భరత మహారాజుకు అయిదుగురు కుమారులు. పెద్దవాళ్ళవుతున్న కుమారులని చూసి భరతుడు, వీరిలో ఎవ్వరికీ రాజు కాగల అర్హత లేదని నిర్ణయించాడు. రాజవంశంలో పుట్టడం ఒక్కటే రాజు కావడానికి అర్హత కాదన్న గొప్ప నిర్ణయం మొట్టమొదటిగా తీసుకున్నది భరతుడు. ఈ వివేకాన్ని ఎంతో గౌరవించి, మన దేశానికి ఆయన పేరు పెట్టడానికి ఇది కూడా ఒక కారణం.

రాజవంశంలో పుట్టడం ఒక్కటే రాజు కావడానికి అర్హత కాదన్న గొప్ప నిర్ణయం మొట్టమొదటిగా తీసుకున్నది భరతుడు.

భరతుడు స్థిర చిత్తానికీ, నిష్పక్షపాతానికీ, సర్వజనీనతకూ మారుపేరు. సొంత సంతానాన్ని కాదని రాజ్యానికి తగిన రాజు కోసం వెదికాడు. బృహస్పతి అక్రమ సంతానమైన విథాతను రాజుగా నిర్ణయించాడు. బృహస్పతి సోదరుడి పత్ని మమత. ఒకరోజు బృహస్పతి మతి భ్రమించి సోదరుని భార్య మమతను బలవంతపెట్టగా, ఆ సంఘటనకు ఫలితమే విథాత.  భరతుడు విథాతను రాజుగా నియమించగా అతను  ఎంతో విచక్షణతో, గొప్పగా రాజ్యాన్ని పాలించాడు.

పతనమైన మహాభిషేకుడు

విథాత తరువాత పధ్నాలుగవతరం వాడు శంతనుడు. శంతనుడు పాండవులకు కౌరవులకు ముత్తాత. పూర్వ జన్మలో ఇతను మహాభిషేకుడిగా పిలువబడి జ్ఞానిగా జీవించి దేవలోక ప్రాప్తిని పొందాడు. ఒకరోజు అతను ఇంద్రసభలో కూర్చుని ఉండగా, గంగా దేవత అక్కడికి వచ్చినప్పుడు ఆమెకి తెలియకుండా చీర జారి ఆమె శరీర పైభాగం కనిపించింది. ఆనాటి పద్ధతి ప్రకారం  అక్కడున్న మిగతా పురుషులందరూ తలలు వంచుకోగా మహాభిషేకుడు దేవలోకానికి కొత్త కావడంతో గంగను చూస్తూ ఉండిపోయాడు.

ఈ అనాగరిక చర్యను చూసిన ఇంద్రుడు "నువ్వు దేవలోకంలో ఉండడానికి అనర్హుడివి, తిరిగి మానవుడిగా జన్మించు" అని శపించాడు. ఈ ఆకర్షణకు గంగకూడా స్పందించడం చూసి "ఇది చాలా తప్పు. నువ్వు కూడా వెళ్ళి మానవ జన్మలోని సుఖ దుఃఖాలను అనుభవించి నీ అహంకారం తగ్గిన తరువాత తిరిగిరా!" అని ఆదేశించాడు.

గంగా శంతనుల కలయిక

మహాభిషేకుడు తిరిగి శంతనునిగా జన్మించాడు. శంతనునికి పూర్వ జన్మ ఙ్ఞానం లేదు కానీ గంగకు తన పూర్వ జన్మ విశేషాలు గుర్తుండటంతో ఆమె శంతనుని తనవైపు ఆకర్షించడానికి సమయం కోసం ఎదురు చూస్తుంది. శంతన మహారాజు వేటకు వెళ్ళినప్పుడు పూర్తి ఎకాగ్రతతో వేటలో మునిగి, గంగా తీరంలో తన వేటపై తప్ప వేరే దేనిపై శ్రద్ధ చూపడం లేదు. గంగ తగు సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది.

వేటలో అలసిన శంతనునికి అన్న పానాదులు చుట్టు పక్కల వారు అందిస్తుంటారు, కానీ ఒకసారి ఎవరూ దగ్గరలో లేక శంతనుడు దాహంతో నీటికై గంగకోసం వెదుకుతుండగా గంగ స్త్రీగా నదినుండి బయటకు వచ్చింది. గంగను చూడగానే శంతనుడు ఆమె ప్రేమలో పడ్డాడు.

యువరాణి మత్స్యగంధి

అదే సమయంలో చేదిరాజు ‘ఉపరిచర’ అడవిలో వేటకు వెళ్ళి ఎన్నో రోజులు గడిపి, మత్స్య కన్యతో మత్స్యరాజు, మత్స్యగంధి అన్న కవలలకు తండ్రి అయ్యాడు. చేదిరాజు,  కొడుకు మత్స్యరాజుని తనతో తీసుకువెళ్ళి కూతురు మత్స్యగంధిని జాలరుల దగ్గరే వదిలేసాడు. జాలరుల మధ్య పెరుగుతూ ఈ కన్య "మత్స్యగంధి"‘చేపవాసన కలది’ అని పేరుపొందింది.

మన కధలోకి తిరిగివస్తే- శాంతనుడు తనను వివాహమాడమని గంగని వేడుకున్నాడు. గంగ "నిన్ను పెళ్ళిచేసుకుంటాను కానీ, నేను ఏమి చేసినా,  ఏమి చేస్తున్నావు , ఎందుకు చేస్తున్నావు, అని అడగటానికి వీలులేదు" అని షరతుపెట్టింది.

ఇంకా ఉంది..

మరిన్ని మహాభారత కథలు