ieo-blog-mid-banner

ప్రశ్న: బయట అంతా ప్రశాంతంగా ఉన్నకొద్దీ లోపల అలజడి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. అంతరంగంలో కలిగే అలజడులు, లోలోపలి నస గురించి కొంత అవగాహన కలిగిస్తారా?

సద్గురు:: మీ అంతరంగంలో గందరగోళం లేదు. అది ఎప్పుడూ గోలగా లేదు. అంతరంగంలో శబ్దం అనేది ఉండదు. సమస్య ఏమిటంటే మీకు ఎక్కువగా పనిలేదు కాబట్టి మీరు జరిగిన విషయాలను నెమరు వేసుకుంటున్నారు. చాలామంది తామెంతో కార్యమగ్నులమై ఉన్నామని అనుకుంటారు. కాని నిజానికి వారు తమ సమయంలో అరవైశాతాన్ని ఎదో పరధ్యానంలో గడుపుతున్నారు. ఇది నెమరువేయడం లాంటిది. మీరు ఇంకా నిన్న జరిగిన విషయాలను తలచుకుంటున్నారు. ఆవులు, మేకలు తాము నిన్న తిన్న ఆహారాన్ని నోటిలోకి తెచ్చుకుని నములుతూ ఉంటాయి. మీ శరీరంలో అటువంటి సౌకర్యం లేదు కాబట్టి, మీ మనసులో అటువంటి ఏర్పాటు ఒకటి చేసుకున్నారు! ఇది పరిణామ క్రమంలో ఎదురైన సమస్య.

నెమరువేయడం ఆపండి

దక్షిణ భారతదేశపు మార్మికతలో, యోగా సాంప్రదాయంలో, ఎవరైనా తమ పూర్వకర్మ వల్ల సంతోషంగా ఉండి, ప్రస్తుతం అందుకు తగినట్లు ఏమీ చెయ్యనప్పుడు , తమిళంలో “అయ్యో! పళయ సాదం” అంటారు. అంటే చద్దన్నం. శక్తి, బలం అనే విషయాలకు వస్తే, నిన్న తిన్న ఆహారం ఇవాళ కూడా మన శరీరంలో పనిచేస్తూనే ఉంటుంది. అలాగే నిన్ననో, పదేళ్ళ క్రితమో, గతజన్మలోనో మనం చేసిన మంచి పనుల తాలూకూ ఫలితాలను మనం ఇంకా అనుభవిస్తూనే ఉండి ఉండవచ్చు. కాని మనల్ని మనం మరింత మెరుగ్గా మార్చుకునే ప్రయత్నం చెయ్యకుండా ఉంటే, త్వరలోనే అది తరిగిపోతుంది. చద్దన్నం కొంత సేపయ్యాక పాడైపోతుంది. ఎంతో అద్బుతంగా ఉన్నది కాస్తా, అసహ్యంగా మారుతుంది.

మీ అంతరంగంలో గొడవ, స్పందన, శబ్దం ఏమీ లేవు. అదంతా మీ తలలోనే ఉంది. ఎందుకంటే మీరు నెమరు వేసుకుంటున్నారు. మీరు ఏదైనా పనిలో నిమగ్నమైనప్పుడు మీ మనసులో జరుగుతున్న కొన్నింటిని మరచిపోతారు. కానీ మీ చేతులకు ఎప్పుడు పనిలేకుండా పోతుందో అప్పుడు మనసు మళ్ళీ పరుగెడుతుంది. దాన్ని ఆపాలని ప్రయత్నించకండి. అందుకు ఒకటే మార్గం ఉంది, మీరు దాని నుండి దూరంగా ఉండడమే!

 

మిమ్మల్ని మీరు మనన్సు నుండి దూరం పెట్టుకోవటం:

మనస్సు నుండి మిమ్మల్ని దూరం పెట్టుకొనే మార్గాలు చాలా ఉన్నాయి. మీరు శాంభవి కాని, శూన్య కాని చేస్తున్నారా? అవి చాలా ప్రభావవంతమైన ప్రక్రియలు. లేకపోతే మీరు ఈశాక్రియ చెయ్యవచ్చు. ఇవేవీ మీకు తెలియకపోయినా ఇప్పటికిప్పుడు మీరు చెయ్యదగినది ఒకటి ఉంది. ఆది, అంతం ఎక్కడో తెలియని ఇంత పెద్ద సృష్టిలో, సౌరమండల వ్యవస్థ ఒక చిన్న బిందువు. అందులో భూమి మరింత సూక్ష్మ బిందువు. ఆ సూక్ష్మ బిందువుపై మీరు ఒక చిన్న జీవి. ఆ చిన్న మట్టిముద్ద మిద మీరు ఇక్కడ కూర్చొని మీరే విశ్వానికి కేంద్రం అన్నట్లు ఆలోచిస్తూ ఉంటారు. ఇది బుద్ధి లేనితనం. ఈ బుద్ధి లేనితనం నుండి మరిన్ని బుద్ధిలేని ఆలోచనలు పుట్టాయి. వాటిని ప్రపంచం తెలివితేటలు అనుకొన్నది. ఈ సువిశాల విశ్వంతో పోల్చిచూస్తే, మీ ఆలోచనలు ఏపాటివో గమనించండి. ఇప్పుడు ఆ వైరస్ మీ ఉనికినే ప్రశ్నిస్తోంది. అశాశ్వతమైన ఈ జీవితంతో పోల్చిచూస్తే, మీరు ఆలోచిస్తున్న విషయాలను గమనించండి. అవన్నీ ముఖ్యమని మీరు అనుకుంటున్నారు. వాటిలో ప్రతీ ఒక్క ఆలోచనా తెలివి తక్కువదేనని గ్రహించండి.



మీ ఆలోచనలు, ఉద్వేగాలు పనికి రానివని గ్రహించాక సహజంగానే మీరు వాటినుండి దూరం జరుగుతారు. మీరు దేన్ని తెలివైనదని భావిస్తారో అది మిమ్మల్ని బాధించే టప్పుడు దాని నుండి దూరంగా వెళ్ళాలని అనుకుంటారు. కానీ అది అలా కుదరదు. మీరు ఏది గొప్పదని, తెలివైనది అని అనుకుంటున్నారో అది మిమ్మల్ని ఒక బాడ్జ్ లాగా పట్టుకొని వదలదు. మీరు తెలివైన వారని ఎప్పుడు అనుకుంటారో ఆ క్షణం నుండి మిమ్మల్ని ఆలోచనలు వదలవు. మీరు చాలా తెలివైన వారైతే, మీరు కళ్ళుమూసుకొని కూర్చోలేరు. సృష్టితో పోల్చి చూస్తే మీ అస్థిత్వం ఎంత అల్ప మైనదో మీరు తెలుసుకున్నప్పుడే కళ్ళు మూసుకొని కూర్చో గలరు. తెలివైన వారికి, మూర్ఖుడికి తేడా ఏమిటంటే, తెలివైన వారికి తాము తెలివితక్కువ వారమని తెలుసు. తెలివిలేనివారికి ఆ విషయం తెలియదు. అందుకే అతను వెఱ్రివాడు.

జీవంతో, సృష్టితో పోల్చి చూసినప్పుడు మీరు ఏమి కానట్లే లెక్క. సామాజికంగా మీరు ఏదో అయి ఉండవచ్చు. మూర్ఖుల్లో, ఒక మూర్ఖుడే గొప్పవాడిగా వెలుగుతాడు. ఒక జీవంగా దానికి ఎటువంటి అర్థమూ లేదు. ఒక జీవిగా ఈ చిన్న వైరస్ మిమ్మల్ని రేపు పడగొట్టవచ్చు. మీరు అనుకుంటున్న గొప్ప, తెలివైన ఆలోచనలకు ఎటువంటి అర్థం లేదు. ఈ విషయం మీకు అర్థమైతే మీకు మీ ఆలోచనా ప్రక్రియకు మధ్య దూరం సహజంగా పెరుగుతుంది. అలా దూరం పెరిగినప్పుడు మీరు ఏమి ఆలోచించినా సమస్య లేదు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు

ieo-nov-extension