యువత – సత్యం: విశ్వరహస్యాల గురించి ఊసులాటలు
సద్గురు, 'యువత- సత్యం' (Youth 'N Truth ) లక్ష్యాన్ని విశదీకరిస్తున్నారు. ఈ నాటి యువత ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తున్నారు. యువత తమ శక్తిని నిర్మాణాత్మకంగా వినియోగించుకోగలిగితే సాధ్యమయ్యే అద్భుతాల గురించి చెప్తున్నారు.

వచ్చే సెప్టెంబర్ లో సద్గురు దేశవ్యాప్తంగా అనేక విశ్వ విద్యాలయాలలో , కళాశాలలలో యువతతో చర్చా వేదికలు జరపబోతున్నారు. ఈ సభలలో యువతీ యువకులు తమకు తోచిన ఏ విషయం మీదనయినా సద్గురు నుండి స్పష్టత కోరవచ్చు. ఎలాంటి ఆంక్షలూ, నిషేధాలూ ఉండవు . ఈ 'యువత - సత్యం' ఉద్యమం లక్ష్యాల గురించిన ప్రశ్నలకు సద్గురు ఇచ్చిన సమాధానాలు ఈ క్రింద చూడవచ్చు . వీటిలో ఆయన ఈ నాటి యువత ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తున్నారు . యువత తమ శక్తిని నిర్మాణాత్మకంగా వినియోగించుకోగలిగితే సాధ్యమయ్యే అద్భుతాల గురించి చెప్తున్నారు .
ప్రశ్న: ఒక జాతిని పురోగతి బాటలో నడిపే శక్తి యువతకే ఉంటుంది. నిత్య జీవితంలో యువతకు ఆదర్శంగా నిలవగల ఆదర్శప్రాయులు అరుదయ్యారు. యువత అశాంతిగా, నిరుత్సాహంగా ఉన్నారు. ఉద్యోగాల కొరతను ఎదుర్కొంటున్నారు. అలాంటి యువతకు మీరిచ్చే సలహా ఏమిటి?
సద్గురు: యువత అంటే రూపు దిద్దుకొంటున్న మానవాళి. వారికి, సమాజంలో పెద్దలకున్నంత వంచన ఉండదు. కనక, వారికి ప్రపంచంలో ఒక కొత్త సంభావ్యత (possibility) సృష్టించుకోగల అవకాశం ఇంకా నిలిచే ఉంటుంది. కానీ, పెద్ద తరాల వారు తమలో ఎలాంటి మార్పులు రావటానికీ ఇష్టపడకుండా, కృషి చేయకుండా, యువత మాత్రం ఏదో అద్భుతం సాధించాలని ఆశింస్తే అది పగటి కలే అవుతుంది.సాధారణంగా యువతలో ఉత్సాహ శక్తి ఉరకలు వేస్తూ ఉంటుంది. అయినా వాళ్ళకు ప్రతిస్పందించే స్వభావం ఎక్కువ. కనక, ఈ లోకంలో సవ్యంగా, వివేకవంతంగా ఎలా జీవించవచ్చో తెలిపే స్ఫూర్తిని పెద్దలు ప్రదర్శించకపోతే, యువతరం జీవన విధానం మన తరంలో కంటే అధ్వాన్నంగా రూపుదిద్దుకొంటుంది. మీ వయసు ఎంతయినా సరే, మీరు పడుచు తనపు ఉత్సాహంతో కదిలి, మీ వల్ల గూడా మార్పు సాధ్యమవుతుందని వారికి చూపటం అతి ముఖ్యం.
అద్భుత సాఫల్యాలకు ఆరంభ దశ
భారత దేశంలో 50 శాతం జనాభా యువత. ఆరోగ్యం, లక్ష్య సాధన దృష్టీ, అవసరమైన శిక్షణా లేని అర్థ శత కోటి యువత అంటే అది వినాశానికి రహదారి ! కానీ అదే యువత ఆరోగ్యవంతులుగానూ, తమ లక్ష్యాల మీద దృష్టి కేంద్రీకరించిన వారు గానూ, సుశిక్షితులుగానూ ఉంటే, ఎంతో సాధించి చూపేందుకు అవకాశం కలుగుతుంది.
ప్రస్తుతం ఈ దేశం ఒక అద్భుత సంభావ్యత (possibility) ఆరంభ దశలో ఉంది. ఎన్నో తరాలుగా ఈ దేశ ప్రజలు ఒక విధమైన పరిస్థితుల చట్రంలో జీవిస్తూ వస్తున్నారు. ఇప్పుడు, మొట్టమొదటిసారిగా మనం ఈ ప్రజా బాహుళ్యాన్ని ఒక స్థాయి జీవన ప్రమాణాల నుంచి మరొక స్థాయికి చేర్చే లక్ష్యాన్ని సుసంభవం చేయగల స్థితిలో ఉన్నాం.
ఈ సంభావ్యతను పూర్తిగా సాకారం చేయగలమా లేదా అనేది మనం యువతకు ఇవ్వగల సహకారంమీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు, ఎంతటి స్థిర చిత్తులై ఉన్నారూ, ఎంతటి సుశిక్షితులూ, ఎంత సామర్థ్య శాలులూ అన్న అంశాలు ఈ దేశం పురోగతిని శాసిస్తాయి.
'యువత- సత్యం' ఆవిష్కరణ
యువతకు అపారమైన వినాశాన్ని సృష్టించే శక్తీ ఉంది, ఆ శక్తిని సకారాత్మకంగా, నిర్మాణాత్మకంగా వినియోగించేందుకు అవసరమైన స్థైర్యం కలిగిస్తే, అద్భుతమైన, నిర్మాణాత్మక మైన ఘనకార్యాలను సాధించగల సామర్థ్యమూ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా యువతలో రావలసిన అతి ముఖ్యమైన మార్పు ఏమిటంటే, వాళ్ళు ఆలోచనాశీలులు కావాలి. వాళ్ళు విద్యార్థి దశలో ఉన్నా, వృత్తి సంబంధమైన శిక్షణలో ఉన్నా, లేక కేవలం తమకు తోచిందేదో చేసుకు పోతూ జీవితం గడుపుతున్నా, వాళ్ళు మరికొంత స్థిరంగా స్తిమితంగా ఉంటే, మనం 'యువ శక్తి ' అని పిలిచే మహత్తరశక్తిని సద్వినియోగం చేయవచ్చు. అలాంటి సద్వినియోగం అటు యువతకూ, ఇటు సమాజంలో ఇతరులకూ కూడా శ్రేయోదాయకం అవుతుంది.
ఈ లక్ష్యాన్ని చేరే దిశగా, మేము 'యువత- సత్యం' అనే పేరుతో, యువతకు స్ఫూర్తినీ సాధికారతనూ ఇచ్చే ఒక ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఆరంభించబోతున్నాం. ఈ కార్యక్రమం సెప్టెంబర్ మూడవ తేదీన మొదలవుతుంది. మేము వివిధ రాష్ట్రాలలో అనేక విశ్వ విద్యాలయాలలో, ఇతర సంస్థలలో విద్యార్థులతో సమావేశాలు జరుపుతాం. వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ప్రశ్నలు అడగమని వారిని ఆహ్వానిస్తాం. అవి పరిష్కారించుకునేందుకు వారికి సరళమైన సాధనాలు అందిస్తాం.
విశ్వరహస్యాల గురించి ఊసులాటలు
ఈ సమావేశాలు ఉల్లాసకరమైన ఊసులాటలలా సాగబోతున్నాయి. అతి ప్రాచీన కాలం నుంచి కూడా, ఏదయినా విషయం గురించి అసలు నిజం తెలుసుకోవాలంటే, అది మనుషులు పరస్పరం ముచ్చట్లు చెప్పుకొనేటప్పుడు జరిగేది తప్ప, ఆధికారిక సందేశాల ద్వారా జరిగేది కాదు. వార్తా పత్రికలలో ఏదో వార్త కనిపిస్తుంది. మీరు పూర్తిగా దాన్ని అనుసరించి పోలేరు. నలుగురినీ అడుగుతారు. ఎవరో వివరం చెప్తారు. అది యథార్థమవుతుంది. కనక, ఊసులాటల ద్వారానే సత్యం వ్యాప్తి పొందుతుంది, జ్ఞానబోధ గ్రంథాలవల్ల కాదు. ఊసులాట ముచ్చట్లలో కొన్ని అతిశయోక్తులూ, పునరుక్తులూ చోటు చేసుకోవచ్చు. కానీ, అన్నీ విని, వాటిని అవసరం బట్టి వడబోసి, అసలు విషయం పట్టుకోవటం ప్రజల క్రమంగా అలవాటవుతుంది.
సోషల్ మీడియా వచ్చిన తరవాత, ఊసులాటలు అంతర్జాతీయమైపోయాయి. ఇప్పుడు ఊసులాట కబుర్లంటే, కేవలం ఉన్న ఊళ్ళో ముచ్చట్లు మాత్రమే కాదు. అందుకే దీన్ని మరో స్థాయికి చేర్చాలని నాకో భావన కలిగింది. మీరు మార్మికుడితో ముచ్చట్లాడితే, అది విశ్వ రహస్యాల గురించిన ఊసులాట అవుతుంది!!
'సద్గురు, నేను పాతికేళ్ళ వయసప్పుడే మీ దగ్గరికి వచ్చి ఉంటే, ఎన్నెన్నో పనులు చేయగలిగే వాడిని !' అని నాతో చాలా మంది అంటూ ఉంటారు. అందుకే, ' సరే, నేరుగా యువతతోనే సమావేశాలు జరిపి చూద్దాం, వాళ్ళను సత్యానికెంత సన్నిహితంగా చేర్చగలమో!' అని నాకనిపించింది.
జీవితం కాస్త అటూ ఇటూ తారాటలాడుతుంది కానీ సత్యం మాత్రం సూటిగా వెళ్ళే సరళ రేఖ లాంటిది. ప్రశ్నేమిటంటే, 'ఆ సత్యానికి నువ్వు ఎంత సన్నిహితంగా ఉన్నావు?' అని. ఒక రోజు కాలంలోనో, ఒక జీవితమంతటిలోనో, దాన్ని నువ్వు ఎన్ని సార్లు స్పృశించి చూడగలుగుతున్నావు? నీ జీవితంలో సార్థకతా, లోతూ, సారం దాని మీదే ఆధారపడి ఉంటాయి. దాన్ని స్పృశించినప్పుడల్లా మీలో ఒక మహాద్భుతమేదో జరుగుతుంది. అదే మిమ్మల్ని పరుగెత్తిస్తుంది !!