ప్రశ్న: సద్గురు, అసలు విద్యార్థుల జీవితంలో ఆధ్యాత్మికత ఎందుకు, ఎలా ప్రవేశిస్తుంది?

సద్గురు:ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ ఆరంభమయిందంటే మీరు సత్యాన్వేషణ మార్గం పట్టినట్టు. ఒక మతపరమైన నిష్ఠ కలిగిందంటే, మీరు నమ్మకాల మార్గం పట్టినట్టు. దురదృష్ట వశాత్తూ, ఈ రోజుల్లో, విజ్ఞాన శాస్త్రజ్ఞులూ, విద్యాధికులూ కూడా విశ్వాసాల బాటనే పడుతున్నారు. నిజానికి చురుకైన మెదడు ఉన్న ఏ ప్రాణి కైనా సత్యాన్వేషణ సహజ లక్షణం. కనక, విద్యార్థులకు, ఆధ్యాత్మిక జిజ్ఞాసతో సంబంధం కలిగితే అదొక పరిపూర్ణతను కలిగిస్తుంది. వాళ్ళు సత్యాన్వేషణలో ఉన్నామని వాళ్ళు గుర్తించనుకూడా లేకపోవచ్చు. కానీ, వాళ్ళకు అన్ని విషయాల గురించిన యథార్థ తత్త్వం తెలుసుకోవాలని ఆసక్తి మాత్రం ఏర్పడి ఉంటుంది. అంటే వాళ్ళు సత్యాన్వేషకులయినట్టే!

కానీ మీరు ఈ సత్యాన్వేషణ మార్గాన్ని ఒక పద్ధతి ప్రకారం ఫలోన్ముఖులై అనుసరిస్తున్నారా? లేక, ఏదో కుర్ర వయసులో ఉన్నప్పుడు మాత్రం ఆ ప్రశ్నలూ ఈ ప్రశ్నలూ వేస్తూ, వయసు ముప్ఫయి దాటగానే అవన్నీ మరిచిపోయి ఓ బొద్దింకలా, ఎలాగోలా ఇంత కూడు మాత్రం సంపాదించుకొంటే చాలనుకొంటారా ? ఒక లద్దెపురుగులా తిరిగి, తిరిగి ఇంత తిండో, ఇంత డబ్బో, మరొకటో పోగు చేసి పెట్టుకోవటం మించి, చాలామంది చేస్తున్నదేమీ కనిపించదు.

ప్రశ్నలు సజీవంగా ఉంచటం

మీలో కలిగే ప్రశ్నలను సజీవంగా ఉంచుకోగలిగారంటే, మీరు సహజంగానే సత్యాన్వేషకులన్న మాట. సమాధానం దొరకని ప్రశ్న ఏదయినా ఉంటే, దాన్ని అలా ఎలా వదిలేస్తారు ? మీ జీవితానికి సంబంధించిన ఏ ప్రశ్నకయినా సమాధానం రాబట్టాల్సిందే! కానీ ఆ ప్రశ్నను బహుకాలం సజీవంగా ఉంచేందుకు కేవలం మీ బుద్ధికీ, తెలివి తేటలకూ శక్తి చాలదు. కొంత సమయం గడిచిన తరవాత అవి ఓ వంకర మార్గం వెతికేసుకొంటాయి. పదేళ్ళ వయసులో మీరెలా ఉండేవారో, ఇప్పుడలా లేరు. అప్పటికీ ఇప్పటికీ, కొంత వరకూ వంకరమార్గాలకూ, అడ్డ దోవలకూ అలవాటు పడ్డారు. దురదృష్టవశాత్తూ మీరు ముప్ఫయ్యో పడిలోకి చేరేసరికి, మీకు మరింత వక్రత్వం అలవడుతుంది. మీకు తెలిసింది సున్నాయే అయినా, ' ఈ విశ్వాన్నతా ఆ దేవుడే సృష్టించాడు!' అంటూ సిద్ధాంతీకరించటం కూడా ఆరంభిస్తారు.

సాధారణంగా, లోకంలో మనిషి కొంత వయసు వచ్చి వ్యక్తుడయ్యాడు అంటే, అతగాడికి తెలియవలసినవన్నీ తెలిసే ఉంటాయని లోకమంతా భావించటం సహజం. ఆ వ్యక్తి గూడా తనకు తెలియనివన్నీ తెలిసినట్టే నటిస్తూ ఉంటాడు. కానీ మీరు మాత్రం ' నాకు తెలిసిందేదో నాకు తెలుసు, తెలియనిది తెలియదు! ' అని ఒప్పుకోగలిగే స్థితి లోనే ఉండి పోవాలని నా కోరిక.

మరణ శయ్య మీదికి చేరే నాటికి కూడా మనిషికి తెలియవలసిన విషయాలన్నీ తెలియవు. ఇది వాస్తవమేనా, లేక, లేనిపోని ఊహలన్నీ నమ్మేస్తున్నారా? . తమ జీవితకాలమంతా నాస్తికులుగా ఉండిపోయిన వారెందరో, మృత్యువు ఆసన్నం అవుతున్నకొద్దీ ప్రార్థనలు చేయటం ఆరంభిస్తారు. శంకలు లేని నిస్సంశయ మైన సత్యం అప్పుడు వారికి అవసరమనిపిస్తుంది. కానీ నిజానికి ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే, సంశయాత్మకమైన, అనిశ్చితి స్థితి(uncertainty)ని కూడా ఆనందంగా అనుభవించగలగటం. ఈ సృష్టి అంతా అనిశ్చితం అని మనకు తెలుసు. దీనినేదో నిశ్చిత స్థితిగా మార్చ వచ్చు అనే భ్రాంతిలో ఉండిపోవటానికి బదులు, ఈ అనిశ్చితితో సరిగా వ్యవహరించేందుకు సన్నద్ధత సమకూర్చుకొనే ప్రయత్నం ఆధ్యాత్మిక ప్రక్రియ. ప్రతివాళ్లూ ఒక మిథ్యాత్మకమైన నిశ్చిత స్థితి భావాన్ని (false sense of certainty) సృష్టించేందుకు ప్రయత్నించే వాళ్ళే. ' అదిగో, పైన దేవుడు కూర్చొని ఉన్నాడు. ఆయన నిన్ను కనిపెట్టే వుంటాడు. ఏమీ దిగులు పడకు!' అంటారు. మరి అలాంటిదేమీ నిజానికి జరగలేదు. మీరు సరిగా నిర్వహించిన వ్యవహారాలు సఫలమయ్యాయి. సరిగా నిర్వహించనివి, సర్వ నాశనమయ్యాయి. కానీ సృష్టి ఇంత అనిశ్చితితో నిండి ఉన్నప్పుడు, మనం నిర్వహించే కాసిని పనులు మనం సఫలంగా నిర్వహించగలిగినంత మాత్రాన అనిశ్చితి తొలగిపోయినట్టు కాదు. ఎప్పుడయినా ఏదయినా సంభవించచ్చు. రేపు ఉదయానికె మనందరం చనిపోయినా ఆశ్చర్యం లేదు.

అనిశ్చితితో యుగళ నృత్యం

మీరు ఆత్మ విశ్వాసంవల్లనో నమ్మకం వల్లనో భావజాలాల వల్లనో ఏర్పడే సునిశ్చిత స్థితి భ్రమలో పడిపోకుండా, మీరెదుర్కొనే అనిశ్చితితో మీరు సముచితంగా వ్యవహరించాలి. అందుకు ఈ అనిశ్చితి భరితమైన బ్రహ్మాండం, మిమ్మల్ని సన్నద్ధం చేస్తుంది. నిశ్చితత్వం అన్న ఒకానొక భ్రాంతిని మీకు మీరుగా కలిగించుకోవాలంటే మాత్రం, మీరు మీ బ్రహ్మాండపు విస్తృతిని కుంచింపజేయాలి. చిన్న వైశాల్యంలో ఎక్కువ కచ్చితత్వం, నిశ్చితత్వం కనిపిస్తుంది కనక మనుషులు తమ పరిధిని తాము కుంచింపచేసుకొంటారు. మీరు మీ గదిలోనే ఉండి పోయారనుకోండి. అక్కడ జరిగే వాటిలో తొంభయి శాతం విషయాల మీద మీకు నియంత్రణ ఉంటుంది. మిగిలిన పది శాతం - బొద్దింకలూ, ఇతర కీటకాలూ లాంటి చిన్న చిన్నవేవో - మీరు ఊహించని పద్ధతిలో తమ ఇచ్ఛ ప్రకారం నడుచుకొంటాయి. అదే, మీరు ఒక గదికి పరిమితం కాకుండా , మీ పరిధిని ఒక ఊరి సరిహద్దుల వరకూ పెంచుకొన్నారనుకోండి.. అప్పుడు యాభయి శాతం విషయాలు మాత్రమే మీరనుకొన్నట్టుగా జరుగుతాయి. మిగతావి ఎలా జరుగుతాయో చెప్పలేని అనిశ్చితి వుంటుంది. ఆ వైశాల్యాన్ని భూగోళం అంతటికీ వ్యాపింప జేస్తే, పది శాతం విషయాలే మీరు ఊహించినట్టుగా జరుగుతాయి. తొంభయి శాతం విషయాలు అనిశ్చితంగా ఉంటాయి.

మీ జీవితం ఒక విశాలమైన పరిమితిలో సాగాలంటే, మీరు అనిశ్చిత పరిస్థితులతో కలిసి యుగళ నృత్యం చేయటం నేర్చుకోవాలి. లేకపోతే, మీరు ప్రతి విషయంలోనూ ఒక నిశ్చిత స్థితిని వాంఛిస్తూ, మీ జీవితాన్ని సంకుచితం చేసుకొంటారు. జీవితంలో ఉన్న సామర్థ్యాన్ని (potential) అంతటినీ క్రమంగా కోల్పోతూ పోతారు.

మీరు యువ ప్రాయంలో ఉన్నసమయం మీరు నిశ్చిత స్థితి కోసం అన్వేషించవలసిన తరుణం కాదు. మీరు అనిశ్చితిని ఎదుర్కొనేందుకు సన్నద్ధులు కావలసిన సమయం. దీనికోసం మీకు ఆధ్యాత్మిక ప్రక్రియ అవసరం.

జీవితం అందించే అవకాశాలకు సిద్ధం కండి!

నేను ప్రతి రోజూ ఒక కొత్త ప్రదేశంలో ఉంటూ ఉంటాను. ఒకే తలగడ మీద రెండు రోజులు వరసగా పడుకోవటమనేది నాకు చాలా అరుదుగా లభించే భోగం. కాబట్టి నాకు నిశ్చితమైన దినచర్యలంటూ ఉండకపోవటంలో ఆశ్చర్యం లేదు. కానీ నా శరీరం మాత్రం ఈ ప్రయాణాలనూ, ఈ నిద్రలేమినీ, ఈ కఠోర పరిశ్రమతో గూడిన కార్య క్రమాన్నీ, ఎందరో యువకులకంటే బాగా తట్టుకోగలదు. నేను ఇంతటి కఠోరమైన శ్రమను తట్టుకోగలగటానికి కారణం, ఈ శరీరానికి నేను ఇరవై, ఇరవై ఐదు సంవత్సరాల పాటు అలవాటు చేసిన సంపూర్ణ సాధన. అదే నన్నిలా ఇప్పటికీ నిలిపి ఉంచుతున్నది. ఇతరులకంటే ఎక్కువ కృషి చేయగల శక్తి నిస్తున్నది.

మీ ఆకాంక్షలనూ ఆశయాలనూ అన్నింటినీ మీరు నెరవేర్చుకొనేందుకు మీ శరీరం, మీ మనసూ మీకు తోడ్పాటు ఇవ్వాలే గానీ వాటికి అడ్డు పడకూడదు. మీ మూడ్ మార్పులూ, మీ ఇష్టాయిష్టాలూ, మీ శారీరక సమస్యలూ, మీ వెన్ను నొప్పీ, మీ తల నొప్పీ- ఇవన్నీ జీవితంలో మీరు నిజంగా చేయదలచుకొన్న పనులను సాధించుకోలేని అశక్తత కలిగిస్తాయి. అలా మాత్రం జరగనివ్వకూడదు.

చాలా మందికి జీవితంలో అవకాశాలు ఎదుట నిలిచి నప్పుడు, వాళ్ళ శరీరాలూ, మనసులే వాళ్ళకు ఆటంకాలుగా పరిణమిస్తాయి. ఈ యువ ప్రాయంలో మీరు శారీరక, ఆధ్యాత్మిక సాధనలు రెండూ పెద్ద ఎత్తున చేపట్టాలి. అలా చేస్తే, సమయం వచ్చినప్పుడు, జీవితం మీ ముందు బృహత్కార్యాలు నిర్వహించే అవకాశాలను ఉంచినప్పుడు, మీ శరీరమూ మీ బుద్ధీ మిమ్మల్ని ఆపి ఉంచలేవు. అవి మీ జీవితానికి తెర చాపలు కావాలి, లంగరులు కాదు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు