ప్రశ్న: సద్గురు! అయిదు వారాల క్రితం నేను నా భార్యను కోల్పోయాను. ఆమె ఎంతో మంచి మనిషి! ఇలా ఆమెకు ఎందుకు జరిగిందో నాకు అర్థం కావటం లేదు?

సద్గురు: మనకు ప్రియాతిప్రియమైన వారు మనకు దూరమైనప్పుడు - అది మరణం కారణం గానో, వ్యాధి వల్లనో, వాళ్ళు మనల్ని విడిచివెళ్ళిపోవటం చేతనో, కారణం ఏదయినా సరే! - మనం ఎదుర్కొనే పెద్ద సమస్య వాళ్ళు మన జీవితాలలో నింపిన ఉన్న ఒక ముఖ్యమైన స్థానం శూన్యంగా మిగిలిపోవటం. అయితే ఒక విషయం మాత్రం మనం అర్థం చేసుకోవాలి. మనమైనా, మనం ప్రేమించిన వారైనా, మన సన్నిహితులైనా, ఎవరైనా సరే ఎదో ఒకనాడు మరణించవలసిందే. అది ప్రకృతి ధర్మం. ఎవరు ముందు, ఎవరు వెనక అన్నది మాత్రమే ప్రశ్న.

నేనిలా అన్నప్పుడు నేనేదో చాలా కఠినంగా మాట్లాడినట్టు మీకు అనిపిస్తున్నదేమో! నా ఉద్దేశ్యం మాత్రం అది కాదు. ఇలాంటి విషయాలను మనం సరిగా అవగాహన చేసుకొని, సరిగ్గా స్వీకరించటం అవసరం. లేకపోతే, ఎప్పటికప్పుడు మనకు మనమే మన మనసుకు ఊరట కలిగించే చల్లని కల్లబొల్లి మాటలేవో చెప్పుకొంటాం. మళ్ళీ రేపు పొద్దున యథార్థం మనల్ని వేధించక మానదు. చేసిన పొరపాటే మళ్ళీ మళ్ళీ చేసుకొంటూ పోతాం.

మనమైనా, మన చుట్టూ ఉన్నవాళ్ళు అయినా ఎవ్వరూ శాశ్వతంగా ఉండిపోయే వాళ్ళు కాదు. ఈ వాస్తవాన్ని మరిచిపోకుండా ఉండటం చాలా ముఖ్యం. ఇక్కడ ఉన్నంత కాలం మనం అందరితోనూ పద్ధతిగానూ, మంచిగానూ ఉండాలి. ఒక డాక్టరు వచ్చి మీరు రేపే చనిపోబోతున్నారని చెప్పాడనుకోండి.. అప్పుడు అందరూ మీతో మంచిగానూ, పద్ధతిగానూ ఉంటారు. అలా కాకుండా, ' మరో యాభయ్యేళ్ళ దాకా నా ప్రాణానికి ఏ ఢోకా లేదు' అని మీరు చెప్పారనుకోండి, అప్పుడు మీ సాటి వారంతా మీతో మరో విధంగా ప్రవర్తిస్తారు. నిజానికి మనం రేపే మరణించబోతున్నామో లేక మరో యాభయి సంవత్సరాలు జీవించబోతున్నామో మనకు తెలియదు. ఒకటి మాత్రం తెలుసు. మరణం అనేది మీకూ, మీ తోటి వారికీ అందరికీ అనివార్యమే, ఎప్పటికో అప్పటికి రాక మానదు. ఎప్పుడు వస్తుంది అన్నది మాత్రం కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. అలాంటప్పుడు, మీరు అందరితోనూ మీకు సాధ్యమైనంత మంచిగానూ, పద్ధతిగానూ ఉంటే మంచిది గదా!

మీరు చనిపోబోతున్నారని నాకు తెలిస్తే, నేను మీతో ఎంతో మంచిగా, పద్ధతిగా ఉంటాను. కానీ, ఎప్పుడో కొన్ని సందర్భాలలో తప్ప, ఫలానా వారికి మరణం ఆసన్నమైందని ముందుగానే చెప్పలేము. కానీ, , ఏదో ఒక నాటికి అందరికీ మరణం తప్పదన్న సత్యం తెలుసు కనుక నేను మీతో ప్రేమాదరాలతో ప్రవర్తించేందుకే ప్రయత్నిస్తాను.

ఇది మనుషులందరికీ వర్తించే సత్యమే. అన్ని జీవితాలూ ఇంతే. మీ ఇంటి వాకిట్లో ఎన్నాళ్లుగానో ఉన్న చెట్టు, ఎప్పుడు చచ్చిపోతుందో ఎవరు చెప్పగలరు? మీరు ఎప్పుడు చనిపోతారో ఎవరు చెప్పగలరు? అది మనకు తెలియదు.

కన్నీరు కాదు, ఆనంద బాష్పాలు!

అందుకనే, మనకు అతి సన్నిహితులయిన వారు మరణించిన సందర్భాలలో ఒక విషయం బాగా జ్ఞప్తి చేసుకోవాలి. అసలు వాళ్ళు మనకు సన్నిహితులు ఎందుకయ్యారు? వాళ్ళు మన జీవితంలో ప్రవేశించి, మన జీవితాన్ని మరింత అర్థవంతం చేసి, దాని విలువను ఏదో ఒక విధంగానో, పలు విధాలు గానో పెంచగలిగారు కనక. మనతో ఉండి, మన జీవితంలో ఆనందాన్ని పెంచగలిగిన సన్నిహితుల జ్ఞాపకాలను మనమెంతో ప్రేమాదరాలతో పదిలపరచుకొంటాం. ఎంతో ఆనందంతో వాటిని మళ్ళీ మళ్ళీ తలపోసుకొంటాం. వాళ్ళు వెళ్లిపోయారని మనం దుఃఖించకూడదు. వాళ్ళు మన జీవితాన్ని ఆనంద మయం చేసి, దాని విలువను పెంచి వెళ్లారు, కనక, వాళ్ళతో కలిగిన సంబంధం, సాన్నిహిత్యం మనకెంతో విలువైనవి. వాళ్ళు మనతో పంచుకొన్న జీవన మాధుర్యానికీ, సున్నితమైన సంబంధానికీ మనమెప్పుడూ కృతజ్ఞులమయ్యే ఉండాలి. జీవితంలో ఏదో ఒక పార్శ్వంలో, ఎన్నో కొన్ని సందర్భాలలో వాళ్ళ వల్ల మనకు మన జీవితంలో ఒక సంపూర్ణత్వం సాధించిన భావన కలిగింది. ఆ మధుర స్మృతులు మన కళ్ల వెంట ఆనంద బాష్పాలు తెప్పించాలి గానీ కన్నీరు కార్పించకూడదు.

ఏదో ఒక విధంగా వాళ్ళు మీతో ఒక అద్భుతమైన సంబంధం ఏర్పరచుకొన్నారు కనక వాళ్ళు మీ జీవితంలో ముఖ్యులయ్యారు. వాళ్ళ జ్ఞాపకాలు ఆ అద్భుతమైన అనుభవాలను తలపుకు తేవాలి. అంతే గాని, మిమ్మల్ని దుఃఖం లోకీ, క్రుంగుబాటులోకీ నెట్టేయకూడదు. ఒకవేళ మీరు అలా దుఃఖిస్తున్నారు, క్రుంగిపోతున్నారు అంటే, మీరు జీవితాన్ని గురించిన ఒక మౌలిక సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదని అర్థం. జీవితం అనిత్యం అనే నిత్య సత్యం మీకు వంటబట్టలేదని అర్థం. పుట్టిన వాళ్ళంతా - 'మంచి'వాళ్లయినా, 'చెడ్డ' వాళ్లయినా - గిట్టక తప్పదు.

సన్నిహితుల్ని పోగొట్టుకోవటంవల్ల మీకు కలిగిన నష్టాన్ని నేను తక్కువ చేసి చులకనగా మాట్లాడుతున్నాననుకోకండి. చనిపోయిన మీ సన్నిహితుల పట్ల మీకున్న భావాలను నేను అర్థం చేసుకోగలను. వాళ్ళు మీతో ఎంత అద్భుతంగా మెలిగారో ఆ విషయాలను మీరు జ్ఞాపకం చేసుకొంటూ ఉండాలనీ, వాళ్ళు వెళ్లిపోయారని దుఃఖంతో కుంగిపోకూడదనీ మాత్రమే నా ఉద్దేశ్యం. ఒక వేళ మీరు వాళ్ళకంటే ముందు వెళ్ళిపోయిఉంటే, వాళ్లకూ ఇలాంటి దుస్స్థితే కలిగేది కదా. కనక మానవోచితమైన మనోబలం ప్రదర్శించండి.

మీ మధ్య జరిగిన మధురానుభవాలను గుర్తు చేసుకోవటం, అభివ్యక్తీకరించుకోవటం అవసరం. వెళ్ళిపోయిన వాళ్ళతో మీకున్న అనుబంధం ఎలాంటిదో, అది ఒక అద్భుతమైన మధుర స్మృతిగా మీకనిపించటానికి కారణమేమిటో మీ చుట్టూ ఉన్న వారికి వర్ణించి చెప్పండి. జీవిత స్రవంతి ఎప్పుడూ ఇలాగే ప్రవహిస్తుంది.

అతుకుల చిత్రంలో విడి ముక్కలు 

నేను జీవం అని ప్రస్తావిస్తున్నది 'అసలైన' జీవాన్ని గురించి. జీవితంలో మీరు చేసే పనుల గురించి కాదు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ధన కనకాలూ, ఇతర ఆస్తులూ - వీటినే జీవితం అనటం సాధారణంగా చూస్తుంటాం. కానీ జీవితం అంటే ఇవి కాదు. ఇవన్నీ జీవితానికి అనుబంధాలు (accessories)మాత్రమే. జీవితాన్ని మరింత అర్థవంతం చేసుకోవాలన్న ఆశతో మీరు ధనమూ, ఆస్తిపాస్తులూ, పిల్లలూ, మానవ సంబంధాలూ మొదలైన వాటినన్నింటినీ కూడబెట్టుకున్నారు. ఎన్నో అనుబంధ వస్తువులను పోగు చేసుకున్నారు. ఎన్నో విషయాలలో తల దూర్చారు. ఎన్నో బంధాలు ఏర్పరచుకొన్నారు. వాటన్నితో 'ఇవే నేను' అనేటంత తాదాత్మ్యత ఏర్పరచుకొన్నారు. కానీ నిజంగా 'మీరు' అయిన జీవాన్ని మాత్రం మీరు అనుభవించటమే లేదు.

చాలామంది దృష్టిలో జీవితం అంటే ఇలా పోగు చేసుకొని పెట్టుకొన్న వివిధ అనుబంధ విషయాలన్నిటినీ అతికించి చేసిన అతుకుల బొమ్మ లాంటిది. ఇందులో అతికించిన ఒక్క ముక్క ఏదో పడిపోతే, జీవితమంతా కోల్పోయినట్టు బాధ పడతారు. నిజంగా చూస్తే, మీ జీవితం ఎప్పటిలాగే భద్రంగా ఉంది, దానికి లాభం లేదు, నష్టం లేదు. ఇప్పుడు దూరమైన వ్యక్తులు, మీ జీవితంలోకి ప్రవేశించక ముందు కూడా మీరు సలక్షణంగా, సజీవంగా, నవ్వుతూ, తుళ్లుతూ జీవితం సాగిస్తూనే ఉండే వాళ్ళు. దాన్ని మరింత అర్థవంతం చేస్తారనే నమ్మికతో, (లేక మరేదయినా ప్రత్యేక ప్రయోజనం ఆశించో), మీరు ఇతరులను కొందరిని కలుపుకొన్నారు. అదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడేమో ఆ సంబంధాలతో తాదాత్మ్యత పెట్టుకొని, వారిలో ఒక వ్యక్తిని పోగొట్టుకొన్నప్పుడు మీ జీవితంలోనే ఒక ముఖ్య భాగాన్ని పోగొట్టుకొన్నట్టు వ్యథ చెందుతున్నారు.

వాస్తవానికి, ఈ విశాల జీవిత స్రవంతిలో మీరు అనే ఒక చిన్న ఖండం ఎప్పటిలాగే పదిలంగా ఉంది. దాని తాలూకు అనుబంధాలు (accessories) కొన్ని కాలగతిలో రాలిపోతుంటాయి. మీకు వయసు పెరుగుతూ వెళ్ళేసరికి మీ తాతగారు చనిపోతారు. మీ నాన్నగారు వెళ్లిపోతారు. కొందరికేమో, జీవిత భాగస్వామి నిష్క్రమించచ్చు. కొంతమందికి బుర్ర మీద ఉన్న జుట్టంతా రాలిపోతుంది. కొందరికి బుర్రే లేకుండా పోతుంది! ఇది 'జోక్' కాదు. కొందరికి కాల క్రమంలో శరీరంలో కొన్ని భాగాలు పని చేయటం మానేస్తాయి. కొందరికి మానవ సంబంధాలు తెగిపోతాయి. కొందరు సంపాదననూ, పదవులనూ, హోదానూ, ఇతర విషయాలనూ కోల్పోతారు.

ఇదంతా మీ నిష్క్రమణకు సన్నాహం! క్రమంగా ఇలా మీ బరువు కొంత తగ్గిపోతూ ఉంటే, మీరు వెళ్లవలసిన సమయం వచ్చే నాటికి, మీ నిష్క్రమణ తేలిక అవుతుంది. నేనేదో మెట్ట వేదాంతం చెప్తున్నాననుకోకండి. జీవిత గమనం సాగేది ఇలాగే. మీరు జీవితాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా సూటిగా ఎదుర్కోవటానికి ఇష్టపడరు గనక, మీకు నచ్చిన ఊహలేవేవో ఊహించుకొంటుంటారు. ఈ మనో నిర్మిత ఊహా చిత్రాలన్నీ నిజం కావాలని కోరుకొంటారు. మీరు ఊహించుకొనే మనో కల్పితమైన నాటకం అంతా నిజం కాదు. ఏదో ఒక రోజు ఆ నాటకానికి తెర వేయక తప్పదు. మీ భ్రమలన్నీ ఎంత తొందరగా తొలగిపోతే అంత మంచిది. అప్పుడే మీరు మేలుకొని జాగ్రదవస్థలోకీ, వాస్తవ ప్రపంచంలోకీ రాగలుగుతారు. ఆ భ్రాంతిమయ ప్రపంచంలోనే ఉండిపోతే, కుంగుబాటులో మునిగిపోతారు. ఏ మార్గం మీకు కావాలో, ఆ నిర్ణయం మీదే.

మీ జీవితమే మీ భ్రాంతులను తొలగిస్తుంది

మీ జీవితం మీ భ్రమలన్నిటినీ తొలగించినప్పుడే మీరు లేచి కూర్చొని, జాగృతులవుతారు. అలా జరగకపోతే, దిగులుతో క్రుంగిపోతారు. అన్ని భ్రాంతులూ తొలగిపోయిన స్థితినే ఆత్మ జ్ఞానం అంటారు. ప్రస్తుతం మీరు మీ భ్రమలన్నింటినీ అంటి పెట్టుకొని ఉన్నారు. వాటికెంతో ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. వాటిలోనే మునిగిపోయి, వాటితోనే తాదాత్మ్యత పొంది, వాటిని కాపాడుకొనేందుకు ఎంతటి పోరాటానికయినా సిద్ధంగా ఉన్నారు. ఇదే 'మాయ'! ఇది చాలా కాలం పాటు 'సత్యం' లాగే కనిపిస్తుంది. చివరికి ఒకనాడు కరిగి కనుమరుగవుతుంది.

ఇదంతా ఒక రకంగా మీకు తెలిసిన విషయమే. కొత్తేమీ కాదు. మీరు జన్మించిన క్షణం నుంచి మీ గడియారం టిక్ టిక్ అంటూ కొట్టుకొంటూనే ఉంది. చివరికి ఒక రోజు అది ఆగిపోతుంది. సరే, దాన్ని వీలయినంత ఎక్కువ కాలం పని చేయించటానికి మన ప్రయత్నాలు మనం చేస్తాం. దాని వేగం కాస్త తగ్గితే బాగుండని చూస్తాం. మనకున్న సమయమంతా సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నిస్తాం. దాన్ని గురించి ఎప్పుడూ మనకు చేతయినంత సావధానంగా, లోతుగా ఆలోచిస్తుంటాం. కానీ అసలు కీలకమేమిటంటే, నిజమైన జీవితం అనేది మిమ్మల్ని స్పృశించాలి. మీకు జీవం లోతుగా తెలియాలంటే, మీరు మీ ఊహా ప్రపంచాన్ని పక్కకు పెట్ట గలగాలి.

మీ భ్రాంతులను పక్కకు పెట్టలేకపోతే, జీవితానికి సంబంధించిన లోతులను మీరు స్పృశించ లేరు. పై పై నాటకమే నడుస్తుంటుంది. మీరడుగుతున్న ప్రశ్న మరొకరి మరణానికి సంబంధించిన ప్రశ్న కాదు. ఇది జీవితపు మూల సూత్రాల గురించి మీకున్న అవగాహన లోపాన్ని చూపే ప్రశ్న. మీరు మేలుకోవాలి. మీరు మీకున్న భ్రమలన్నీ ఇప్పటికిప్పుడు ఛిద్రం చేసేసి, మీ భ్రాంతులన్నీ కరిగించేసుకోగలిగితే, మీకు జ్ఞాన ప్రకాశం కలిగినట్టే. కానీ, మీరలా మీ భ్రాంతులన్నీ తొలగించుకోవాలనే ప్రయత్నమే చేయరు కదా! కష్టం మీద ఒక భ్రాంతిని వదిలించుకొన్నా, వెంటనే మరొక భ్రాంతిని తగిలించుకొంటారు.

చెంబెడు మంచి నీళ్ళు

ఇది నారద మహర్షిని గురించిన కథ. ఒక రోజు, శ్రీ కృష్ణుడూ నారదుడూ పక్కపక్కగా నడుస్తూ వెళుతున్నారు. నడుస్తూ నడుస్తూ, ఒక గ్రామాన్ని దాటి వెళ్ళి ఒక అడవిలో ప్రవేశించారు. అడవిలో ఒకచోట శ్రీకృష్ణుడు కూర్చొండిపోయాడు. 'నారదా, నాకు బాగా దాహం వేస్తున్నదయ్యా! ఒక చెంబెడు మంచినీళ్లు తెచ్చిపెట్ట గలవా?' అని అడిగాడు. నారదుడు వెంటనే, ' అదెంత పని! అదుగో, ఆ గ్రామం లోకి వెళ్ళి ఇప్పుడే తెచ్చేస్తాను' అన్నాడు.

చెప్పినట్టే, వెనక్కు వెళ్ళి గ్రామంలో మొట్టమొదట కనిపించిన ఇంటి తలుపు తట్టాడు. తలుపు తెరుచుకొన్నది. అందాల రాశిలా ఉన్న ఒక పడుచు పిల్ల తలుపు తెరిచింది. ఆమె అందం చూసి నారదుడికి మతి పోయింది. తక్షణమే తలమునకలుగా ఆమెతో ప్రేమలో పడ్డాడు. ఆ పిల్ల తండ్రిని కలిసి, ఆ పిల్లను తనకిచ్చి పెళ్లి చెయ్యమని అడిగాడు. పిల్ల తండ్రి ఒప్పుకొన్నాడు. నారదుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడు.

పెళ్ళయిన తరవాత, నారదుడు తనూ, తన భార్యా తల దాచుకొనేందుకు ఒక చిన్న ఇల్లు కట్టుకొన్నాడు. కుటుంబ పోషణ కోసం, పొలం దున్ని వ్యవసాయం కూడా ఆరంభించాడు. సరే..ఇక తరువాత పిల్లల్లు...ఒకరికిద్దరు, ముగ్గురు, నలుగురు, అయిదుగురు పిల్లలు పుట్టుకొచ్చారు. పుట్టిన పిల్లలు పెద్ద వాళ్లయ్యారు. వాళ్లకూ పెళ్లిళ్లు జరిగాయి. పిల్లలు పుట్టారు. మనుమలూ మనుమరాళ్ళ కేరింతల సందడితో కాలం హాయిగా గడిచిపోసాగింది.

అంతలో ఒక సారి సమీపంలో ఉన్న నదిలో వరద వచ్చింది. వరద నీరు, మొత్తం గ్రామాన్నంతా తుడిచి పెట్టేసింది. భార్యతో, పిల్లలతో, మనుమలతో కలిసి నారదుడు ఒక ఎత్తైన చెట్టెక్కి కూర్చొని కాలక్షేపం చేయాల్సి వచ్చింది. వరద బీభత్సం పెరుగుతూ వెళ్లింది. ముద్దులు మూటకట్టే మనుమలూ మనుమరాళ్లూ పాపం వరద నీటిలో కొట్టుకు పోయారు. నారదుడి దుఃఖం కట్టలు తెంచుకొంది. తరవాత, ఒకరి వెంట ఒకరుగా, పిల్లలూ, వాళ్ళ భార్యలూ కూడా వరద ప్రవాహంలో పడిపోయారు. కొంత సమయం పాటు భార్యను మాత్రం కాపాడుకోగలిగాడు. కానీ ఆ తరవాత ఆమె కూడా వరద ఉధృతికి బలైపోయింది.

నారదుడు తనను తను రక్షించుకొనే ప్రయత్నంలో పడ్డాడు. అదీ సాధ్యంగా కనబడక పోవటంతో, తన సర్వస్వాన్నీ కోల్పోయిన ఆవేదనలో, 'హే కృష్ణా!' అని దీనంగా కేక పెట్టాడు.

'ఇక్కడే ఉన్నాను. మంచినీళ్లు తెచ్చావా?' అని బదులిచ్చాడు కృష్ణుడు!

నారదుడు వెంటనే నిద్రలోంచి లేచి, “నాకు ఏమయ్యింది?” అన్నాడు. కృష్ణుడు “ఇదే మాయ” అని బదులిచ్చాడు.

మాయ అంటే మీ మనసులో మీరే రకరకాల భ్రమల పోగులను పోగు వేసుకొని, చిక్కుముళ్ళు పెట్టుకోవటం. ఆ ఊహాజనితమైన చిక్కు ముడులన్నీ, అసలు వాస్తవాలకంటే ఎక్కువ వాస్తవాలలాగా కనిపిస్తాయి. మీ మనసు చేసే కల్పనలూ, మీ భావోద్రేకాలు చేసే గారడీలు, అసలు సత్యాన్ని అద్భుతంగా మరుగుపరచి, అవే సత్యాలయినట్టుగా కనిపిస్తాయి. ఇదొక సినిమా హాలు లాంటి అనుభవం. అక్కడ కనిపించేది శబ్దాలూ, 2డీ ఛాయాచిత్రాల కలగలుపుతో ఆడించే బొమ్మలాట. కానీ ఆ బొమ్మలాటలో కనిపించే నటీ నటులను మీరు, మీతో పాతిక సంవత్సరాలు సహజీవనం చేసిన కుటుంబ సభ్యులకంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ నటీనటులను నిజజీవితంలో మీరెప్పుడూ చూసి కూడా ఉండకపోయినా, మీరు నిజంగా చూసిన వ్యక్తులందరికంటే, వాళ్ళు సన్నిహితంగా, మహోన్నతులుగా కనిపిస్తారు.

మీ మనసులో జరిగే మాయాజాలం గూడా ఇలాంటిదే. అది జీవితాన్ని ఉన్న దానికంటే అతిశయంగా, చిత్రవిచిత్రంగా చూపిస్తుంది. కానీ ఏదో ఒక నాటికి ఆ చీకటి మందిరంలో దీపాలు వెలగాల్సిందే. ఆ చిరు వెలుగులు మీ మనసులో జ్ఞాన ప్రకాశాన్నే నింపుతాయా, లేక జీవితావసానంలో చితి మంటను మాత్రమే వెలిగిస్తాయా అనేది మీ నిర్ణయం.

ప్రేమాశీస్సులతో,

సద్గురు