శరీరాన్ని ఒక యంత్రంగా చూస్తే, అది నిజానికి ఏ లోపాలూ లేనిది. దానితో ఉన్న ఒకే ఒక్క చిక్కేమిటంటే, అది మిమ్మల్నిఎక్కడికి తీసుకువెళ్ళలేదు. అది కేవలం భూమిలోంచి వస్తుంది, తిరిగి భూమిలో కలిసిపోతుంది. అది చాలదూ? శరీరం దృష్టికోణంలో దీన్ని మీరు చూసినప్పుడు, అది సరిపోతుంది. కానీ, చిత్రంగా భౌతిక ప్రమాణానికి అతీతమైన ప్రమాణం మరొకటి ఏదో ఈ అద్భుతమైన యంత్రంలో ఇమడ్చబడింది. ఆ ప్రమాణమే ప్రాణానికి మూలాధారం. ఆ ప్రమాణమే మనల్ని మనం ఇప్పుడున్న స్థితిలో నిలబెడుతోంది. ప్రాణం వేరు.

ప్రాణానికి మూలాధారం వేరు. ప్రతి జీవిలోనూ,  ప్రతి మొక్కలోనూ, ప్రతి విత్తులోనూ, ఈ ప్రాణాధారమైన శక్తే పనిచేస్తుంది. మనిషిలోనైతే, ఈ జీవశక్తి మరింత అద్భుతంగా ప్రస్ఫుటమౌతుంది. ఈ కారణంగానే, కొంత కాలం తర్వాత హఠాత్తుగా, ఈ శరీరం అందించే అద్భుతమైన వరాలన్నీ, చాలా తృణప్రాయంగా, అసంబద్ధంగా తోస్తాయి. దీని కారణంగానే,  ప్రతి మనిషీ భౌతికతకీ, భౌతికతకి అతీతమైన పార్శ్వానికీ మధ్య నిరంతరం కొట్టుమిట్టాడుతున్నట్టు కనిపిస్తాడు. భౌతికమైన నిర్బంధాలు మీపై ఉన్నప్పటికీ , మీరు కేవలం భౌతిక పదార్ధమే కాదన్న ఎరుక కూడా మీకుంది.

స్థిరంగా మారి పరాన్ని చేరండి

మౌలికంగా మీలో రెండు శక్తులున్నాయి, చాలా మందికి ఈ రెండిటి మధ్య సంఘర్షణ ఉన్నట్లు అనిపిస్తుంది. మొదటిది ఆత్మ-పరిరక్షణ, ఇది మిమ్మల్ని మీరు సంరక్షించుకోవడానికి మీ చుట్టూ మీరే గోడలు కట్టుకునేలా ప్రేరేపిస్తుంది. రెండవది నిరంతరం అనంతంగా, హద్దులు లేకుండా విస్తరించాలన్న ఆకాంక్ష. ఈ రెండు కోరికలూ - ఆత్మపరిరక్షణ, విస్తరించాలన్న కోరికా - ఈ రెండూ చూడడానికి వ్యతిరేక శక్తులుగా కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి అవి ఒకదానికొకటి వ్యతిరేకం కావు. అవి మీ జీవితానికి చెందిన రెండు భిన్న పార్శ్వాలకు సంబంధించినవి, అంతే.

ఒకటి మిమ్మల్ని మీరు ఇహలోకంలో స్థిరపరచుకుందుకు తోడ్పడితే రెండవది మిమ్మల్ని పరానికి తీసుకుపోతుంది. ఆత్మ సంరక్షణని ఈ భౌతిక శరీరానికి మాత్రమే పరిమితం చెయ్యవలసిన అవసరం ఉంది. ఈ రెంటినీ వేరుచేసి చూడడానికి అవసరమైన ఎరుక మీకుంటే, అప్పుడు వైరుధ్యమేమీ ఉండదు. కానీ, మీరు కేవలం భౌతిక ప్రమాణంతోనే  గుర్తించబడుతుంటే, మీలో ఈ రెండింటి మధ్య సమన్వయం లోపించి, ఒక సంఘర్షణకి అవి కారణభూతమవుతాయి. ఈ అజ్ఞానం మూలంగానే మనుషులలో "భౌతిక- ఆధ్యాత్మిక" సంఘర్షణలు తలెత్తుతుంటాయి. మీరు "ఆధ్యాత్మికం" అని ఎప్పుడైతే అంటారో, అప్పుడు భౌతిక పరిమితికి అతీతమైన దాని గురించి మాటాడుతున్నారు. ఈ భౌతిక పరిమితులు దాటి విస్తరించాలన్న కోరిక మనిషికి అత్యంత సహజమైనది. పరిమితులకి లోబడిన భౌతిక శరీరం నుండి పరిమితులు లేని సృష్టి మూలానికి చేసే ప్రయాణమే - ఆధ్యాత్మిక ప్రక్రియ.

బంధించే అడ్డు గోడలు

ఈ రోజు ఆత్మ సంరక్షణకు మీరు నిర్మించుకుంటున్న గోడలే, రేపు మిమ్మల్ని బందీలుగా చేస్తాయి. దీనికిక అంతులేదు. కానీ భౌతిక పరిమితులకి అతీతమైన ప్రమాణానికి చేరాలనుకుంటే, మీకు తలుపులు తెరవడానికి సృష్టి విముఖంగా ఏం లేదు. మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు మీ జీవితంలో గీసుకున్న సరిహద్దులే, జీవితంలో రేపు అవరోధాలుగా అనిపిస్తాయి. రాబర్ట్ ఫ్రాస్ట్ తన కవితలో “గోడలను అంగీకరించనిది ఏదో అక్కడ ఉంది" అన్నప్పుడు అతను అన్నది ఈ సునిశిత సత్యాన్నే. ఈ ఆత్మరక్షణ అనే సహజాత లక్షణం,  "మీ చుట్టూ గోడలు లేకపోతే మీకు సంరక్షణ లేదు,"  అని నిరంతరం మీకు చెబుతూ ఉంటుంది. తత్ఫలితంగా తెలియకుండానే మీరు గోడలు నిర్మించుకుంటూ వెళతారు.

తర్వాత, వాటితోనే మీరు అవస్థలు పడుతూ ఉంటారు. మీ పోరాటం మీ చుట్టూ కట్టుకున్న విముఖత అనే అడ్డుగోడలతోనే కాని సృష్టితో కాదు. అందువల్లనే, యోగశాస్త్రం దేవుడు గురించి మాట్లడదు. అది ఆత్మ గురించీ, స్వర్గం గురించీ కూడా మాట్లాడదు. అటువంటి సంభాషణ మనుషుల్ని ఊహాలోకాల్లోకి తీసుకుపోతుంది. యోగశాస్త్రం మీరు నిర్మించుకున్న అడ్డుగోడల గురించి మాట్లాడుతుంది; ఎందుకంటే, మీరు పట్టించుకోవాల్సింది కేవలం ఈ గోడల నుండి వచ్చే ప్రతిరోధాన్ని మాత్రమే గనుక. సృష్టికర్త మీ దృష్టి తనపై పడుతుందని ఎదురుచూడడం లేదు. మిమ్మల్ని కట్టిపడేస్తున్న బంధాలూ, మిమ్మల్ని నిరోధిస్తున్న అడ్డుగోడలూ … అవి నూటికి నూరుపాళ్లూ మీరు కల్పించుకున్నవే. ఈ చిక్కుముడులనే మీరు విప్పాల్సింది, ఈ అడ్డుగోడల్నే మీరు కూలదొయ్యవలసింది. ఈ అస్తిత్వంతో మీకేం పని లేదు. మీపనల్లా మీ అంతట మీరు సృష్టించుకున్న అస్థిత్వంతోనే.

గురుత్వాకర్షణ ఇంకా గురు అనుగ్రహం

దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే, గురుత్వాకర్షణనీ, అనుగ్రహాన్ని పక్కపక్కన ఉంచి చెబుతాను. మనిషిలోని ప్రాధమిక సహజాత లక్షణమైన ఆత్మ సంరక్షణాభిలాషకీ గురుత్వాకర్షణకీ ఒకరకమైన సంబంధం ఉంది. మనందరం ఇప్పుడు భూమిని అంటిపెట్టుకుని ఉన్నామంటే దానికి కారణం గురుత్వాకర్షణశక్తి. మనకి శరీరం ఉందంటే దానికి కారణం గురుత్వాకర్షణశక్తి. గురుత్వాకర్షణ మనల్ని క్రిందకి తొక్కిపెట్టి ఉంచడానికి ప్రయత్నిస్తుంటే,  భగవత్కృప మనల్ని ఉద్ధరించడానికి ప్రయత్నిస్తోంది. అస్థిత్వంలోని ఈ భౌతిక శక్తుల నుంచి మీరు విడివడగలిగితే,  భగవత్కృప మీ జీవితంలో ఒక్కసారిగా ప్రజ్వరిల్లుతుంది.

గురుత్వాకర్షణలాగనే, భగవత్కృప కూడా నిత్యచైతన్యవంతమైనది. మిమ్మల్ని మీరు దానికి అందుబాటులో ఉంచుకోవాలి, అంతే! మీరు భగవత్కృపకి అందుబాటులో ఉన్నప్పుడు, ఒక్కసారిగా మీరు చేయగలిగినవన్నీ చూస్తే, చూసేవారికి ఇంద్రజాలంలా అనిపిస్తుంది. ఉదాహరణకు మీ చుట్టుపక్కల ఉన్నవారందరిలో మీరొక్కరే సైకిలు తొక్కగలరనుకోండి, అప్పుడు మిగిలినవారందరికీ మీరేదో గారడీ చేస్తున్నవారిలా కనిపిస్తారు! భగవత్కృప విషయంలోనూ అంతే. అందరికీ మీరు గారడీలా కనిపించవచ్చు. కానీ, మీ జీవితంలో ఇంతకుముందెరుగని ఒక కొత్త ప్రమాణాన్ని చేరుకుంటున్న స్థితిలో ఉన్నారని మీకు తెలుసు. ఈ అవకాశం నిజానికి అందరికీ అందుబాటులో ఉన్నదే.

ప్రేమాశీస్సులతో,
సద్గురు