సద్గురు: ప్లాన్ అన్నది మీ మనస్సులో ఉంటుంది. కాని మీరు మీ చేతిలో ఉన్నదానితోనే పనిచేయగలరు. మీరు ప్రణాళికలు వేయడంలో ఎంత సమయం తీసుకుంటారు, వాటిని ఆచరణలో పెట్టడానికి ఎంత సమయం తీసుకుంటారు, అన్నది మీ జీవిత స్వభావంపై ఆధారపడి మీరు నిర్ణయించుకోవాలి. మీరు ప్రణాళికా సంఘంలో సభ్యులైతే మీరు కేవలం ప్రణాళికలే రచిస్తారు, అదే మీ పని. వాటిని అమలుచేయడం ఇతరుల పని. మీ పని స్వభావం ఏదైనప్పటికీ, మీ జీవిత స్వభావం మాత్రం మీరు ఇప్పుడు మాత్రమే తినగలరు, ఇప్పుడు మాత్రమే శ్వాసించగలరు, ఇప్పుడు మాత్రమే జీవించగలరు. ప్రణాళిక రచించడం కూడా ఇప్పుడు మాత్రమే. రేపటి గురించి మీరు ప్లాన్ వేయవచ్చు, కాని రేపటిని ప్లాన్ చేయలేరు.

జీవితం ఒక ప్లాన్  ప్రకారమే నడవాలా?

ప్లాన్ అన్నది  ఒక ఆలోచన మాత్రమే. మన ప్లాన్ లన్నీ మనకు తెలిసిన విషయాల నుండే వస్తాయి. మన ప్రణాళికలని ‘గతానికి సొబగులు’ అందించిన రూపం అనవచ్చు. గతం నుండి ఒక ముక్కను తీసికొని దానికి పై పూతలు పూసి అలంకరించినవే ప్లాన్ లు. ఇది చాలా తక్కువ స్థాయిలో జీవించే పద్ధతి. అవును, నిజమే మనకో ప్రణాళిక కావాలి. కాని మీ జీవితం మీ ప్రణాళిక ప్రకారం నడిచిందంటే అది చాలా తక్కువ స్థాయి జీవితం. మీ జీవితం మీరు ఊహించలేని పద్ధతిలో నడవాలి. జీవిత సంభావ్యత ఎంత విస్తృతమైనదంటే ఎవరూ దాన్ని ఆ స్థాయిలో ప్లాన్ చేయలేరు. ప్రత్యామ్నాయంగా ఒక ప్రణాళిక ఉంచుకోండి కాని, జీవితాన్ని నడవనీయండి. జీవిత సంభావ్యతలను ఉన్నవున్నట్లుగా అన్వేషించండి. ఏది తెరచుకుంటుందో మీకు తెలియదు. ఇంతవరకూ ఏ మనిషికీ జరగనిదేదో మీకు జరగవచ్చు. కాని మీ జీవితం మీ ప్రణాళిక ప్రకారమే నడిచినట్లయితే ఈ లోకంలో ఇప్పటిదాకా మీకు జరుగుతున్న చత్తే మళ్లీ మీకు జరుగుతుంది. కొత్తదేమీ జరగదు. ఎందుకంటే మీ ప్రణాళిక ఇప్పటివరకూ మీకు తెలిసినదాని నుంచే వస్తుంది, మీ గత అనుభవాలూ, సమాచారం నుంచే వస్తుంది కాబట్టి.

రేపు పొద్దున ఏం చేయాలో మీరు ప్రణాళిక వేసుకోవాలి తప్పదు, కాని మీ జీవితం దాని ప్రకారమే నడుస్తుందని ఎన్నడూ అనుకోవద్దు.
ఎంతవరకూ ప్లాన్ చేసుకోవాలో మీకు తెలియాలి. మీకసలు ఏ ప్లాను లేకపోతే రేపు ఏంచేయాలో మీకు తెలియదు. ఏం ప్రణాళిక చేయాలి, స్వేచ్ఛగా ఎలా జీవించాలి అన్నదానికి జీవితం గురించి ఒక సమతుల్యత, ఒక వివేకం కోసం ప్రణాళిక. చాలామంది విషయంలో వారి ప్రణాళికలు ఒక గొప్ప అంతర్దృష్టి నుండి వచ్చేవి కావు. వాళ్ల ప్లాన్ లన్ని ముఖ్యంగా వారు ఉహించలేని సంఘటనలను ఎదుర్కొలేకపోవడమనే భయం నుండి వచ్చినవే. ప్రజల బాధ అంతా తమ జీవితం తమ ప్లాన్ ప్రకారం నడవకపోవడమే. ఉదయం మీకు కాఫీ కావాలి. కాని కాఫీ రాలేదనుకోండి దానికి మీకు పట్టలేని నిరాశ కలుగుతుంది. కాని అదే సమయంలో అద్భుతమైన సూర్యోదయ దృశ్యం దర్శనమిస్తుంది. దాన్ని మీరు చూడడమే లేదు. మీ పనికిమాలిన ప్రణాళిక ఒకటి జరగలేదు, కాని అంతకంటే ఎంతో గొప్పదేదో జరుగుతూ ఉంది. ఈ అనంత విశ్వంలో జరుగుతున్న జీవన నాట్యం ముందు మీ ప్రణాళిక చాలా అల్పమైంది. మీ ప్రణాళికకు అంత ప్రాధాన్యం ఇవ్వకండి. రేపు పొద్దున ఏం చేయాలో మీరు ప్రణాళిక వేసుకోవాలి తప్పదు, కాని మీ జీవితం దాని ప్రకారమే నడుస్తుందని ఎన్నడూ అనుకోవద్దు. అన్నిటినీ మంచి మీ జీవితం మీ ప్రణాళికను, మీ ఊహను, మీ సంభావనలను దాటి సంభవించాలని కోరుకోవాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

Unsplash