క్రియాయోగం- ఆధ్యాతిక మార్గంలో నడిచేందుకు శక్తిమంతమైన విధానం.
యోగి, మార్మికుడు, సద్గురు క్రియాయోగం అంటే ఏమిటో వివరిస్తూ, జీవ ప్రక్రియలోని సాంకేతికతలను పరిశోధిస్తున్నారు.
సద్గురు: ప్ర్రాథమికంగా క్రియ అంటే అంతర్గతంగా జరిగే పని. మీరు అంతర్గతంగా పనిచేసేటప్పుడు మీ మనసును, శరీరాన్ని ఉపయోగించరు. ఎందుకంటే ఆ రెండూ మీకు బాహ్యంగా ఉన్నవే! మీకు మీ శక్తిని ఉపయోగించి క్రియచేసే నేర్పు ఉంటే, అప్పుడు అది క్రియ అవుతుంది.
మీరు బాహ్యంగా పని చేస్తుంటే దాన్ని కర్మ అంటాం. మీరు ఆంతరంగికంగా చేసే పని క్రియ. ఒక రకంగా చెప్పాలంటే రెండూ ఒక విధమైన కర్మలు, ఒక విధమైన క్రియలు. సాధారణంగా, సంప్రదాయ పరంగా, బంధనాన్ని కలిగించేది కర్మ అని, ముక్తిని ఇచ్చేది క్రియ, అని మనం అర్థం చేసుకుంటాం. మీరు శరీరంతో ఏ పని చేసినా, అంటే మీ ఆలోచనలు, మీ దృక్పథం అనేవి, ఇవాళ ఒక మార్గంలో వెళ్ళవచ్చు. రేపు ఎవరో వచ్చి మీ ఆలోచనలను ప్రభావితం చెయ్యవచ్చు, అవి మరో మార్గంలో వెళతాయి. అలాగే మీ శరీరంతో చేసే పనులు కూడా! ఇవాళ మీ శరీరం ఆరోగ్యంగా ఉంది. మీరు వేసే ఆసనాలు దానికి నచ్చుతాయి. రేపు మీ శరీరం కొద్దిగా బిగుసుకొని ఉంటే, మీకు ఈ ఆసనాలు కష్టంగా అనిపిస్తాయి.
మీ మనోభావాలనుకూడా నమ్మటానికి వీలులేదు. ఏ క్షణంలోనైనా అవి అటునుండి ఇటు, ఇటు నుండి అటు మారిపోతాయి. కానీ మీ శక్తులు భిన్నమైనవి. ఒకసారి మనం శక్తిని ఒక విధంగా ఉపయోగించి పనిచెయ్యటం ప్రారంభిస్తామో, అప్పుడు దానివల్ల జీవితంలో ఒక గాఢత ఏర్పడుతుంది. మీ శక్తులన్నీఒక ప్రత్యేక విధంగా స్పృశించబడి, క్రియాశీలం చెయ్యడం వల్ల హఠాత్తుగా జీవితానికి సంబంధించిన ప్రతి కోణంలోనూ ఒక కొత్తపరిమాణం చోటు చేసుకుంటుంది.
శక్తి మంతమైన విధానం
ఆధ్యాత్మిక మార్గంలో నడవటానికి పనికి వచ్చే శక్తిమంతమైన విధానం క్రియాయోగం. అయితే అందుకు ఎంతో మూల్యం చెల్లించ వలసి ఉంటుంది. క్రియాయోగి చెల్లించ వలసిన మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాలపు చదువుకున్న వ్యక్తికి క్రియా యోగం అమానుషంగా ఉంటుంది, ఎందుకంటే దానికి క్రమశిక్షణ, జీవితంలోని ప్రతి విషయం పట్ల ఒక ఖచ్చితత్వం కావలసి ఉంటాయి. చాలామందికి క్రియాయోగానికి కావలసిన శారీరక, మానసిక, మనోభావపరమైన నిలకడ ఉండటం లేదు. ఎందుకంటే, అందరూ బాల్యం నుండీ చాలా సుఖంగా జీవించటానికి అలవాటు పడ్డారు. సుఖం అంటే భౌతికమైన సుఖం కాదు. సుఖంగా కుర్చీమీద కూర్చోవడం సాధనకు అడ్డంకికాదు. కానీ మీ జీవం మొత్తం సుఖాన్నే ఆశిస్తూ ఉంటే, సమస్య. మీరు దేనిమీదో హాయిగా కూర్చుంటే, ఆనందించండి. అందులో సమస్య లేదు. కానీ మీరు నిరంతరం అదే ఆనందాన్ని కోరుతూ ఉంటే, ఆ రకమైన మానసికత, మనోభావం, క్రియాయోగానికి సరిపడదు. స్థిరత్వం లేకుండా ఊగిస లాడుతూ, నిరంతరం సుఖం కోసం పరితపించే వారు, అన్ని సందర్భాల్లోనూ ‘‘స్వేచ్ఛ’’ గురించి మాట్లాడేవారు. ‘‘నాకు ఇది చేసే స్వాతంత్ర్యం లేదా? అది చేయటానికి స్వేచ్చ లేదా? నేనిది తినలేనా? నేనక్కడ నిద్రించలేనా?’’ అంటూ మాట్లాడే వారు క్రియాయోగాన్ని చేయలేరు.
క్రియా యోగాన్ని అనుసరించాలని అనుకున్న వారు ఎవరైనా – ఒక వేళ నేను తల క్రిందకు, కాళ్ళు పైకి పెట్టుకొని నిద్రపోమని చెపితే, మీరు మారు మాట్లాడక అలా నిద్ర పోవలసిందే. ఎందుకంటే అందులోని అన్ని విషయాలను వివరించటం ఎన్నటికీ సాధ్యం కాదు. ముందుకు వెళ్ళినకొద్దీ మీకు అర్థం అవుతుందోమో, కాని వివరించటం సాధ్యం కాదు. ఒకవేళ దాన్ని వివరించాలి అంటే క్రియా యోగ సారాన్ని కోల్పోవలసి ఉంటుంది. మూఢంగా తర్కంతో ప్రశ్నిస్తే క్రియాయోగాన్నిబోధించటం సాధ్యం కాదు.
భౌతికమైన అభ్యాసంగా క్రియలను బోధించాలంటే నేను దాన్ని గూర్చి ఒక పుస్తకాన్నే వ్రాయగలను. మీరు దాన్ని చదివి నేర్చుకోగలరు. కానీ మీకు అదొక సచేతన ప్రక్రియగా ఉండాలంటే, క్రియ మీ వ్యవస్థలో ఒక పద్ధతిలో ముద్రింపబడాలంటే అందుకు అంకిత భావం, క్రమశిక్షణ అవసరం. మీరు గురువుపై విశ్వాసంతో, మీ శక్తులన్నింటినీ సుముఖతతో ఆయనకు అప్పగించి, ఏమి జరిగినా సిద్ధం అనే రీతిలో మీరు ఉండాలి. ఆయన మీతో ఏమైనా చెయ్యవచ్చు. మొదట ఈయన మనతో ఏమి చేస్తున్నాడా అనిపిస్తుంది. ఎందుకంటే క్రియాయోగ ప్రారంభంలో మనం జ్ఞానాన్ని పొందుతున్నామో, పిచ్చెక్కి పోతున్నామో అర్థంకాని పరిస్థితి ఉంటుంది. ఆ స్థితిని అధిగమించే వరకు గురువుపై విశ్వాసం ఉంచాలి. లేనప్పుడు క్రియా యోగం కష్టమౌతుంది.
అందువల్ల క్రియాయోగ గురువులు శిష్యులను నిరీక్షంప చేస్తారు. మీరు వచ్చి క్రియ కావాలంటే, గురువు ఇల్లు తుడవ మంటారు. “లేదు నాకు క్రియాయోగం కావాలి” అంటే, ‘అందుకే కదా ఇల్లు తుడవ మన్నాను’ అంటాడాయన. మీరు ఒక సంవత్సరం పాటు ఇల్లు తుడిచి క్రియా యోగాన్ని కోరితే, “అయితే ఒక సంవత్సరం పాటు అంట్లు తోమ” మని అంటారు. అలా అతన్ని నిరీక్షంప చేస్తారు. అతన్ని వాడుకుంటారు, దుర్వినియోగం చేస్తారు, నిందిస్తారు. అయినా అతని విశ్వాసం సడలరాదు. “ఎదో కారణం వుంది’’ అనుకోవాలి. ఆ స్థితికి వచ్చినప్పుడు అతన్ని క్రియా యోగంలో ప్రవేశ పెట్టవచ్చు. లేనట్లయితే, అతని మనోభావాలు, దృక్పథాలు సరియైనవిగా లేనప్పుడు అతని వ్యవస్థ చాలా స్పందనాత్మకంగా ఉన్నప్పుడు మీరు అతనికి ఒకవిధమైన శక్తిని కలుగ జేస్తే అతను తనకు తానే ఎంతో హాని చేసుకుంటాడు.
కాని నేటి పరిస్థితులలో ఒక శిష్యుడిని అలా నిరీక్షంప చెయ్యటం, అటువంటి నమ్మకం వారికి కలిగేలా చేయడం, ఆతరువాత వారికి క్రియా యోగం అందించడం అంతగా సాధ్యం కాదు. కాని, అది అసాధ్యమైతే కాదు. కాకపొతే ఈ ఆధునిక ప్రపంచంలో అది అరుదుగా జరుగుతుంది.
జీవితం నడిచే విధానం :
జ్ఞానాన్ని పొందటం మాత్రమేకాక అంతకు మించి ఏదోసాధించాలి అనుకున్నప్పుడే క్రియా యోగం ప్రధానమవుతుంది. మీరు ఏదో ఒకలాగా ఈ పంజరం నుండి తప్పించుకొని పోవాలనుకుంటే మీకు కావలసినది కేవలం ముక్తి, జ్ఞానం. మీకు క్రియాయోగంతో పనిలేదు. ఎందుకంటే క్రియలు చాలా విస్తృతమైనవి. అందుకు ఎంతో క్రమశిక్షణ అవసరం. మీకు ముక్తి కావాలంటే క్రియలను కొద్ది మాత్రంగా ఉపయోగించు కోవచ్చు. వాటిపై అంతగా దృష్టి నిలపనవసరం లేదు. అందుకు క్రియను మాత్రమే మార్గంగా ఎంచుకోనక్కరలేదు. ఎందుకంటే, దానికి ఎంతోకృషి చేయవలసి ఉంటుంది.
మీరు గురువు లేకుండా క్రియయోగ మార్గాన్నితీవ్రంగా అనుసరించాలి అనుకుంటే, మీరు పరిణతి చెందటానికి కొన్ని జన్మలు పడుతుంది. ఎవరైనా ప్రత్యక్షంగా మీకు తోడుంటే అప్పుడు అది, ఈ జన్మలో జరిగే అవకాశం ఉంది. లేనప్పుడు క్రియాయోగం చుట్టుతిరుగు మార్గం. క్రియా యోగంతో మీరు జ్ఞానాన్నే కాక జీవన సాంకేతికతను కూడా తెలుసుకోవచ్చు. మీరు జీవితాన్ని ఎలానిర్మించాలో తెలుసుకోవాలనుకుంటున్నారు. దానితో మీరు ఏమో చేయాలనుకుంటున్నారు. అందుకే అది చాలా పెద్ద ప్రక్రియ.
క్రియాయోగ మార్గంలో పైకివచ్చిన వారి ఉనికి చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే వారి శక్తులపై వారికి పూర్తి పట్టు ఉంటుంది. వారు జీవితాన్ని విడదీసి, మళ్ళీ కూర్చగలరు. మీరు గనక ఇతర మార్గాల్లో పయనించదలచుకుంటే, ఉదాహరణకు జ్ఞానమార్గంలో ఉన్నారనుకోండి! మీరు పదును పెట్టిన కత్తిలా, మీ బుద్ధితో ఎన్నో చేయగలరు. కాని మీ శక్తితో మీరేమి చెయ్యలేరు. మీరు భక్తి మార్గంలో ఉంటే మీరేమీ చెయ్యలేరు. అసలు పట్టించుకోరు, మీరు లీనం అయిపోవాలనుకుంటారు. మీరు కర్మయోగంలో ఉంటే ప్రపంచంలో మీరు ఎన్నో పనులు చేయగలరు. కానీ మీతో మీరు ఏమీ చేసుకోలేరు. క్రియాయోగులు శక్తితో తమను తాము ఏమైనా చేసుకోగలరు, ఈ ప్రపంచంతోనూ చెయ్యగలరు.
ప్రేమాశీస్సులతో,