మనం "ష్ " అన్నప్పుడు మౌనంగా ఉండాలి అనో, కామ్ గా ఉండాలి అనో ఎలా సంకేతమిస్తాము ..? ష్ - అన్న పదాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ సాంప్రదాయాల్లో ఎలా వాడతారు..? ఇది మనల్ని మౌనానికి ఎలా తీసుకువస్తుంది..? ఈ ప్రశ్నలకు సమాధానాలను మనకు సద్గురు ఈ ఆర్టికల్ లో వివరిస్తున్నారు.

ప్రశ్న : "ష్ " అన్న శబ్దం ధ్యానంలో ప్రాముఖ్యతను సంతరించుకుందని నేను గమనించాను. ష్ - అనే పదాన్ని భారతదేశంలో మనం మౌనంగా ఉండడానికి వాడుతూ ఉంటాము. దీనికేమైనా ప్రాముఖ్యత ఉందా.. అని ఒకొక్కసారి నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఒక తల్లిగా, ఎన్నో నిద్ర లేని రాత్రులలో, నేను ఒక పసి పిల్లవాడిని ఎత్తుకుని ష్ అని పదే-పదే అనడం ద్వారా, వారిని ఊరుకోబెట్టి, ఒక స్తబ్దతకు తీసుకు రాగలిగాను. ఈ మాట (ష్ ), మనం అన్న వెనువెంటనే పని చేస్తుంది. ఇప్పుడు, పిల్లలు కొద్దిగా పెద్దవారైనప్పటికీ, నన్ను నేను సాంత్వన పరచుకోడానికో లేదా వారు కొంత బాధలో ఉన్నప్పుడో, మనస్తాపంలో ఉన్నప్పుడో, వారు మరీ దురుసుగా ప్రవర్తిస్తున్నప్పుడో, చాలా పెద్దగా శబ్దాలు చేస్తున్నప్పుడో - ఇది వాడుతూ ఉంటాను. ప్రపంచవ్యాప్తంగా ఈ శబ్దాన్ని మనం మౌనానికీ, నిశ్చలత్వానికీ ఎరుకతో వాడడంలో ఏదైనా ప్రాముఖ్యత ఉందా..?

సద్గురు :  ప్రపంచంలో ఎక్కడైనా సరే, మీరు ఎవరినైనా ఊరుకోబెట్టాలన్నప్పుడు, మీరు ష్ అని అంటారు. మీరు ఇది గమనించే ఉండి ఉండాలి. మీకోసం నేను కూడా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు, ఇదే రకమైన శబ్దాన్ని ఉచ్చరిస్తాను. ఒక్కోసారి నేను ‘శంభో’ అనో ‘శివా‘ అనో అంటూ ఉంటాను. కానీ దానికి మూలం 'ష్'. ష్ అంటే మౌనం.  అది నిశ్చలత్వాన్ని సూచిస్తుంది. ష్ అనేది పరమోన్నతమైనది. ఎందుకంటే, ఎదైతే నిశ్చలంగా ఉందో, అదే ఈ సృష్టిలో పరమోన్నతమైనది. నిశ్చలత్వం పరమోన్నత స్వభావం. ఏదైతే శబ్దమో, అది ప్రకంపిస్తూ ఉంటుంది. ఒక ప్రకంపనకు  మొదలు, తుది - అనేవి ఉంటాయి. మీరుగనక ఒక ట్యూనింగ్ ఫోర్క్ ను తట్టి చూశారంటే, లేదా మీరు ఏదైనా ఒక తీగను మీటి చూశారంటే, ఆ ప్రకంపనలకి ఆద్యంతాలు ఉంటాయి. యోగశాస్త్రంలో ష్ అన్న శబ్దం మౌలికమైనది.  ఎందుకంటే నిశ్చలత్వం నుంచి మొట్టమొదట అభివ్యక్తమైనది ఇదే. మనం యోగాని ఒక శాస్త్రం అంటాం. ఎందుకంటే శాస్త్రం అన్నది మనం తయారు చేసింది కాదు, అంతకు ముందే ఉన్నదాన్ని కనుగొనడం...! మనం ఆవిష్కరించింది ఏదైనా సరే, అక్కడ అంతకు ముందే ఉంది, దానిని మనం చూడగలిగామంతే. దీనినుంచి, మనం ఒక శాస్త్రాన్ని తయారు చేసి, దాన్ని ఒక పద్ధతిగా అందించడమే..!

ఏదైతే గోలగా ఉందో, దానిని ప్రశాంతతకు తీసుకురావడానికి మీరు ష్ - ని ఉపయోగిస్తున్నారు. ఏదైతే ప్రశాంతంగా ఉందో, అది మరికొంచెం ముందుకి కొనసాగితే, అక్కడ నిశ్చలత్వం ఉంది, ధ్యానం ఉంటుంది. వీటన్నిటికీ  మూలమైన శబ్దం - ష్. ష్ - కి మూలమైన శబ్దం - 'మ్'. ఇది, మీరు నోటిని మూసుకొని, మీ శ్వాసను కనుక బయటికి వదిలేస్తే, అది - మ్ అవుతుంది. మీరు, నోటిని కొద్దిగా తెరిస్తే అది - ష్. మరి కొంచెం తెరిస్తే - ఉ అవుతుంది. ఇంకా పూర్తిగా తెరిస్తే అది - అ అవుతుంది. ప్రతీ సంస్కృతిలోనూ ఎన్నో విభిన్నమైన విధానాలు ఉపయోగించి ఈ ప్రాధమికమైన శబ్దాలను సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తారు.

నాట్యానికి శబ్దాలు, నిశ్చలత్వానికి శబ్దాలు..

మేము చిన్న పి‌ల్లలుగా ఉన్నప్పుడు నాకూ, మా అన్నయ్యకూ ‘ రాక్-ఎన్-రోల్ ‘ అంటే చాలా ఇష్టం. ఈ శబ్దాలు యువతని ఎంతో ఆకట్టుకుంటాయి. ఎందుకంటే ఇవి ఎంతో భౌతికమైనవి. మా అమ్మకు, మా రాక్-ఎన్-రోల్ మ్యూజిక్ వల్ల ఎప్పుడూ కూడా ఇబ్బంది ఏమి లేదు. కానీ, మా నాన్నగారు మాత్రం, ఆయనకి ఆ సంగీతమంటే అస్సలు ఇష్టం లేదని చెప్పేవారు. ఆయనకి భారతీయ శాస్త్రీయ సంగీతం అయితే వినాలని ఉండేది. కానీ, అప్పట్లో, మేము, శాస్త్రీయ సంగీతాన్ని వినలేకపోయేవాళ్ళం. మీరు రాక్-ఎన్-రోల్ వినేటప్పుడు-మొదట తక్కువ స్థాయి ధ్వనితో మొదలు పెడతారు, మెల్లిగా ఆ ధ్వనిని ఎంతగానో పెంచేస్తారు. ఒక్కోసారి ఆయన ఏదో పనిలో ఉండటమో, పేపర్ చదవడమో, పుస్తకం చూడడమో చేస్తున్నప్పుడు, మేమీ మ్యూజిక్ మొదట తక్కువ స్థాయిలో మొదలు పెట్టి దానిని ఎక్కువ స్థాయికి పెంచేసేవాళ్లం. ఆయనకి తెలియకుండానే, అప్పుడప్పుడూ ఆయన, తన పాదాన్ని తట్టడం మొదలు పెట్టేవారు.

అప్పుడు మేము ఆయనను పట్టుకొని, “చూశారా..?.. మీకు మా సంగీతమంటే ఇష్టమే. మీరు దానికి మీ కాలు ఆడిస్తున్నారు” అనేవాళ్లం. మన జానపద సంగీతానికి  రాక్-ఎన్-రోల్ అన్నది ఒక ఆధునికమైన ప్రత్యామ్నాయం అని, కొద్దిగా విని చూస్తే మీరు గుర్తించగలరు. ఇవి మీ శరీరాన్ని కదిలేలాగా చేస్తాయి. సహజంగానే మీ శరీరం వీటికి ఊగుతుంది. అందుకే దాని పేరు కూడా “రాక్-ఎన్-రోల్ “అని వచ్చింది. నిజంగా అది మిమ్మల్ని దొర్లేలాగా చేస్తుందో లేదో తెలియదు గానీ, కనీసం మీరు మీ శరీరాన్ని అటూ-ఇటూ ఆడించేలాగా చేస్తుంది.

నిశ్చలత్వం అంటే మరణం కాదు. నిశ్చలత్వం అంటే ఎంతో ఉత్తేజభరితమైన నిశ్చలత్వం. ఇది ఎంతో ఉన్నత స్థాయి ప్రకంపన. చాలా మంది ప్రజలు దీనిని అవగాహన చేసుకోలేరు.

మన భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఉన్న కొన్ని రాగాలు వింటే, ప్రజలు నిశ్చలంగా మారిపోవడం మీరు గమనిస్తారు. ప్రజలు అక్కడ కదలకుండా కూర్చుంటారు. మన భారతీయ సంగీతకారులు మొట్టమొదటిగా నేర్చుకోవలసినది ఏమిటంటే, వారు కాళ్ళు మడిచి కూర్చోగలగడం. వారు నించొని, ఊగుతూ ప్రదర్శనలు ఇవ్వలేరు. వారు, మొదట స్థిరంగా కూర్చోవాలి. ఇదే వారి సంగీతానికి మూలం. మొదటి విషయం ఏమిటంటే -నిశ్చలత్వం. మిగతా విషయాలు ఆ తరువాత వస్తాయి. నిశ్చలత్వం, స్థిరం అన్నవి అతి సున్నితమైన, అతి నిశితమైన ప్రకంపనలు. అది నిశ్చలమైన స్థితే, కానీ అందులో కూడా ఒక రకమైన ప్రకంపన ఉంది. నిశ్చలత్వం అంటే మరణం కాదు. నిశ్చలత్వం అంటే ఎంతో ఉత్తేజభరితమైన నిశ్చలత్వం. ఇది ఎంతో ఉన్నత స్థాయి ప్రకంపన. చాలా మంది ప్రజలు దీనిని అవగాహన చేసుకోలేరు. మనం ఈ సృష్టిలో ఉన్న అన్నీ ప్రకంపనలనూ తీసుకుంటే -  నిశ్చలత్వంతో మొదలుకొని భౌతికమైన వాటి వరకూ - అందులో భౌతికమన్నది అన్నిటికంటే మొరటైన రూపం.

మాటలకందని భావం... 

మీ లక్ష్యం ఏదైనా సరే, దానికనుగుణంగా సంగీతం దానిని వ్యక్త పరచగలదు. మనుగడే ముఖ్యమైన కొన్ని సంస్కృతుల్లో, వారికి ఒక విధమైన సంగీతం ఉంటుంది. సుఖం, ఉత్సాహం మొదలైన వాటికి ఒక విధమైన సంగీతం, దండయాత్రలు చెయ్యడం, ఏదైనా సాహసాన్ని చెయ్యడం లాంటివి ఉన్న సంస్కృతుల్లో మరొక విధమైన సంగీతం ఉంటుంది. లేదా ఒకే సంస్కృతిలో వివిధ ప్రజలు, ఏ రకమైన పనులలో నిమగ్నమై ఉన్నారో, సహజంగా ఆ రకమైన సంగీతం పట్ల ఆకర్షితులు ఆవుతారు. మీకు ధ్యానం లేదా ముక్తి అన్నది మీ అంతిమ లక్ష్యం అయినప్పుడు దానికీ ఒక విధమైన సంగీతం ఉంది. ప్రేమ అన్నది మీరు జీవించే విధానమైనప్పుడు, మీరు మరో విధమైన సంగీతాన్ని వింటారు.

ష్ - అన్నటువంటి శబ్దాలు ఏ సంస్కృతి మీదా ఆధారపడి ఉన్నవి కావు.

ఈ రోజుల్లో, ఎవరైనా ప్రేమ అన్నారంటే ప్రజలు వాటిగురించి ఏవో రసవత్తరమైన పాటలు వినాలనుకుంటారు. ఎందుకంటే, ఈ రోజుల్లో ఉన్న సంగీతకారులు అటువంటి భావోద్వేగాన్ని కేవలం ధ్వనితో సృష్టించలేకపోతున్నారు. అందుకని వారు పదాల ఆసరా తీసుకోవలసివస్తోంది. కానీ, మన శాస్త్రీయ సంగీతంలో మీరు ఏమి చూడగలుగుతారంటే, వారు భావాలను  కేవలం శబ్దాల ద్వారా, ఎటువంటి పదాలను ఉచ్చరించకుండానే సృష్టించగలుగుతారు.

ష్ - అన్నటువంటి శబ్దాలు ఏ సంస్కృతి మీదా ఆధారపడి ఉన్నవి కావు. ఒక తల్లిగా మీరు మీ పసి పిల్లవాడితో సంభాషించాలనుకుంటారు. మీ పిల్లవాడికి పదాలు అర్థం కావు. నేను విద్యకు వ్యతిరేకం కాదు. కానీ ఈ రోజుల్లో విద్య కేవలం పదాలతో కూడుకున్నది. ఈ సందర్భంలో ఒక తల్లి మరీ అంతగా విద్యాభ్యాసం చేయకపోతే - అంటే, పదాలతో మరీ ప్రభావితం అయ్యి ఉండకపోతే, ఆమె పసిపిల్లవాడితో సంభాషించాలనుకున్నప్పుడు, ఆమె సహజంగానే,  శబ్దాలద్వారా తన భావాన్ని తెలియజెయ్యాలనుకుంటుంది. ఇందుకు ఎంతో అద్భుతమైన ఉందాహరణే ష్ అనే శబ్దం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు