కోరికలన్నిటినీ తీర్చే చెట్టు (Wishing tree)

ఈ ప్రపంచంలో మనం సృష్టించుకొన్నవన్నీ ముందు మన మనసుల్లో సృష్టి అయినవే. మనుషులు చేసిన చెప్పుకోదగ్గ పనులన్నీ – ఘనకార్యాలు కానీ, దారుణ కృత్యాలు కానీ - ముందు మనసులో భావనగా ఉదయించి, తరవాత బాహ్య ప్రపంచంలో వాస్తవంగా రూపు దిద్దుకొన్నవే. యోగశాస్త్ర సంప్రదాయంలో స్థిరంగా, సక్రమంగా వ్యవస్థీకృతమైన చిత్తాన్ని(well-established mind) ‘కల్పవృక్షం’ – (కోరుకొన్న కోరికలన్నీ తీర్చగల చెట్టు) అని పేర్కొంటూ ఉంటారు.

మీరు మీ మనసునొక్క దాన్ని ఒక స్థాయి వరకు క్రమ బద్ధం(organize) చేయగలిగితే, ఆ తరవాత అది ఇక మీ శరీరాన్నీ, మీ భావోద్రేకాలనూ, మీ జీవ శక్తినీ, మీదైన వ్యవస్థ(system) అంతటినీ, అదే క్రమమార్గంలో నిలుపుతుంది. అలా జరిగిందంటే, ఇక మీ పాటికి మీరే ఒక కల్ప వృక్షంగా మారిపోతారు. మీరు ఏది కోరినా జరుగుతుంది.

కోరికల విషయంలో జాగ్రత్త అవసరం!

యోగ శాస్త్ర వాఙ్మయంలో ఒక చక్కని కథ కనిపిస్తుంది.

ఒకాయన అలా అలా నడుస్తూ వెళ్ళి యాదృచ్ఛికంగా స్వర్గంలో అడుగుపెట్టాడు. చాలా దూరం నడిచి ఉండటం వల్ల, ఆయనకు అలసట అనిపించించింది. ‘ఎక్కడయినా కొంత సేపు విశ్రాంతి తీసుకొంటే బాగుంటుంది’ అనుకొన్నాడు. తక్షణమే ఆయనకు తన ఎదురుగా మంచి, అందమైన చెట్టొకటి కనిపించింది. దాని కింద మెత్తటి , అద్భుతమైన పచ్చిక పరుపు! ఇకనేం, ఆయన వెళ్ళి హాయిగా ఆ చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. కొన్ని గంటల తరవాత ఆయన మళ్ళీ నిద్ర లేచేసరికి, ఆయన బడలిక అంతా మాయమైపోయింది.

అప్పుడు మరో ఆలోచన వచ్చింది. ‘అబ్బా! నాకు బాగా ఆకలేస్తున్నది. తినటానికి ఏమయినా ఉంటే ఎంత బాగుంటుందో!’ అని. ఫలానా, ఫలానా పళ్లూ పదార్థాలూ దొరికితే బాగుంటుంది అని తనకు తినాలనిపించిన పదార్థాలన్నిటినీ గుర్తు చేసుకొన్నాడు. అనుకోవటం ఆలస్యం, ఆ పదార్థాలన్నీ ఆయన ముందు ప్రత్యక్షమయ్యాయి. కడుపు నిండా వాటిని భోజనం చేసిన తరవాత, ’ఇప్పుడు బాగా దాహం వేస్తున్నది, తాగేందుకేదయినా పానీయం దొరికితే ఎంత బాగుంటుంది!’ అనిపించింది. తనకు ఇష్టమైన రకరకాల పానీయాల గురించి ఆయన తన మనసులో అనుకొన్నదే తడవుగా ఆ పానీయాలన్నీ ఆయన ముందు ప్రత్యక్షమయ్యాయి.

యోగ సంప్రదాయంలో, మనిషి బుద్ధిని ‘మర్కటం’ - అంటే కోతి – అంటూ ఉంటారు. కోతి లాగే మనసు కూడా కుదురు లేకుండా అటూ ఇటూ పరుగెత్తుతూ ఉంటుంది గనక. కోతి అంటేనే అనుకరణలకు మారు పేరు. కోతి పనులు చేయటమంటే, ఎవరినో ఒకరిని అనుకరిస్తూ ప్రవర్తించటం. మీ మనసుకూడా ఎప్పుడూ ఆ పనిమీదే ఉంటుంది. అందుకే స్థిరత్వం, క్రమబద్ధత లేని మనసును ‘మర్కటం’ అనటం సబబే.

స్వర్గానికెళ్ళినా, ఆ పెద్ద మనిషి మనసులో మర్కటం రెచ్చిపోయేసరికి, ఆయనకు, ‘అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది? నేను ఆహారం కావాలనుకోగానే అది దొరికింది. పానీయాలు కావాలంటే, అవి వచ్చేశాయి. ఇక్కడ దెయ్యాలూ, భూతాలూ ఏవయినా ఉన్నాయేమో!’ అనిపించింది. అటూ ఇటూ చూడగానే, దెయ్యాలు కనిపించాయి. వాటిని చూసి ఆయన చాలా భయపడిపోయాడు. ‘బాబోయ్, ఇక్కడ నిజంగానే దెయ్యాలున్నాయి. ఇప్పుడిక ఇవి నన్ను రకరకాలుగా యాతనలు పెడతాయి, తప్పదు!’ అనుకొన్నాడు. దెయ్యాలు వెంటనే ఆయన మీదపడి హింసించటం ప్రారంభించాయి. ఆ బాధ భరించలేక ఆయన పెద్దగా కేకలు వేయసాగాడు. ‘ఇవి నన్ను అనేక విధాలుగా హింసిస్తున్నాయి. ఇక ఇవి నన్ను చంపేయటం కూడా ఖాయం’ అన్నాడు. వెంటనే, ప్రాణం కోల్పోయాడు! దీని కంతటికీ కారణం ఆయన ‘కల్పవృక్షం’ (కోరికలు తీర్చే చెట్టు) కింద కూర్చొని ఉండటం. అక్కడ కూర్చొని ఆయన ఏది కోరుకొంటే అది ఆయన ముందు ప్రత్యక్షమయింది. మీరు మీ మనసును మీ పాలిటి ‘కల్పవృక్ష’మయ్యేటట్టు వికసింప జేసుకోవాలి గానీ, మీకు వెర్రి ఎత్తించేలా చేసుకో కూడదు. చక్కగా నియంత్రితమై, వ్యవస్థీకృతమైన మానవ చిత్తం ‘కల్పవృక్షం’ లాంటిదే అంటారు. అలాంటి చిత్తంతో మీరు ఏది కోరుకొంటే అది మీకు ప్రత్యక్షం అవుతుంది. సారథి స్థానంలో ఎవరున్నారు?

మీరు కారు నడుపుతున్నారనుకోండి. ఆకస్మికంగా, ‘స్టీరింగ్’ చక్రం ఊడి వచ్చిందనుకోండి. మిగతాదంతా బాగానే ఉంది. “క్రూజ్ కంట్రోల్’ (cruise control) విధానంలో కారు యంత్రాల ద్వారా దానంతటది నడుస్తూనే ఉన్నది. ఒకే వేగంతో నడుస్తున్నది. కానీ స్టీరింగ్ చక్రం మాత్రం ఊడి వచ్చేసింది. మీరు ఆ కారులో ప్రశాంతంగా కూర్చో గలరా? గాభరా పడిపోతారు! బుర్ర పని చేయదు! ఈ ప్రపంచంలో చాలా మంది మనుషుల పరిస్థితి సరిగ్గా అదే. వాళ్ళ జీవితపు స్టీరింగ్ చక్రం వాళ్ళ చేతిలో లేదు. మీ శరీరమూ, బుద్ధీ, జీవ శక్తులూ మీ చెప్పు చేతలలో లేకపోతే, వాటికుండే కొన్ని నిర్బంధ ధర్మాల ప్రకారం అవి ప్రవర్తిస్తూ, వాటి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాయి. వాటికి తోచిన మార్గంలో అవి నడుస్తూ ఉంటే, ఇక ‘కల్ప వృక్షం’ మాట మీరు మరచిపోవచ్చు!

అన్నిటికంటే మొట్టమొదటి విషయమేమిటంటే, మీరు నిజంగా కోరుకొంటున్నదేమిటి అనే విషయంలో మీకు స్పష్టత ఉండాలి. మీరు కోరుకొనే కామ్యం ఏమిటో మీకు తెలియకనే పోతే, ఇక దాన్ని సిద్ధింపజేసుకొనే ప్రశ్నే ఉండదు. మీరు నిజంగా కోరుకొనేదేమిటో మీరే పరిశీలించండి. ఏ మనిషయినా కోరుకొనేది ఆనందం గానూ, ప్రశాంతం గానూ జీవించాలని. తనవారితో సంబంధాలు ప్రేమ పూర్వకంగా, ఆప్యాయంగా సాగాలని. మరో విధంగా చెప్పాలంటే, ఏ మనిషయినా కోరుకొనేదల్లా ఒక్కటే : తన మనసు ఆహ్లాదంగా ఉండాలని, తన చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచం ఆహ్లాద కరంగా ఉండాలని.

అన్నిటికంటే మొట్టమొదటి విషయమేమిటంటే, మీరు నిజంగా కోరుకొంటున్నదేమిటి అనే విషయంలో మీకు స్పష్టత ఉండాలి. మీరు కోరుకొనే కామ్యం ఏమిటో మీకు తెలియకనే పోతే, కామ్య సిద్ధి కలిగే ప్రశ్నే ఉండదు.

ఈ ఆహ్లాదం శరీరానికి సంబంధించిందైతే, దాన్ని ఆరోగ్యం, ఇంద్రియ సుఖం (pleasure) అంటాం. ఈ ఆహ్లాదం బుద్ధికి సంబంధించిందయితే దాన్ని ఆనందం, ప్రశాంతత అంటాం. భావోద్రేకాలకు సంబంధించినదైతే, అది ప్రేమా, జీవ కారుణ్యం. జీవ శక్తి స్థాయిలో కలిగే ఆహ్లాద భావాన్ని పరమానందం ( Bliss), బ్రహ్మానందం (Ecstasy) అంటాం. మనిషి కోరుకొనేది అంతవరకే. ఉద్యోగం చేసుకొనేందుకు ఆఫీసుకు వెళుతున్నా, ధనార్జన కోసం పాటు పడుతున్నా, వృత్తిపరంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నా, కుటుంబాన్ని ఏర్పరచుకొంటున్నా, మధుశాలలో కూర్చోన్నా, మందిరానికి వెళ్తున్నా, మనిషి వెతికేది ఒక్క విషయం కోసమే - తన లోపలా, తనకు బయటా ఒక ఆహ్లాదభరితమైన ప్రపంచం ఉండాలని!

మీరు చేయాల్సింది, నా కోసం నేనే అలాంటి ప్రపంచాన్ని స్వయంగా సృష్టించుకొంటానన్న దృఢ మైన నిబద్ధతతో ఉండటం. మీ మనసులో ఈ అతి సామాన్యమైన ఆలోచనతో మీరు ప్రతి దినాన్నీఆరంభించండి : ‘ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళినా సరే, అక్కడ ఒక ప్రశాంతమైన, ప్రేమమయమైన, ఆనందకరమైన ప్రపంచాన్ని సృష్టించుకొంటాను!’ అని. ఆ ప్రయత్నంలో మీరు ఒక్క రోజులో నూరు సార్లు విఫలం అయితే మాత్రం, నష్టమేమిటి? సంకల్పించిన దాని మీద నిబద్ధత కల వాడికి, అసలు వైఫల్యం అనేది ఉండదు. నూరు సార్లు కింద పడిపోవటమంటే, నూరు పాఠాలు నేర్చుకోవటమే. ఈ విధంగా కనక మీరు, మీకు నిజంగా విలువైనది అని భావించే దాన్ని స్వయంగానే సృష్టించుకొంటానన్న నిబద్ధతతో నిలబడితే, మీ బుద్ధి క్రమబద్ధమౌతుంది.

అవగాహన అనేది ఓ మామూలు ఉపకరణం కాదు(Perception is not just another gadget)

మీరు మానసికంగా ఒక అయోమయ స్వరూపంగా మిగిలిపోకుండా, మిమ్మల్ని మీరు ఒక ‘కల్పవృక్షం’గా మార్చేసుకోవాలంటే, మీరు మీదయిన వ్యవస్థ (system) ను క్రమబద్ధంగా ఎలా నియంత్రించుకోవచ్చో తెలిపే సాధనాలూ, సాధనలూ, సాంకేతిక పరిజ్ఞానాలూ(technologies) ఉన్నాయి. సృష్టికి మూలమైనదేదో, అది అనుక్షణం మీలో అంతర్గతంగా స్పందిస్తూనే ఉన్నది. మీలో ఉన్న ఆ మూల శక్తితో మీరు సంపర్కం ఏర్పరచుకో గలిగారా, లేదా అన్నదే ప్రశ్న. జీవితం తాలూకూ నాలుగు మూల శక్తులను (Four basic elements) క్రమబద్ధం చేసి వ్యవస్థీకరించుకో గలిగితే మీకు ఆ సంపర్కం ఏర్పడుతుంది. మనం యోగ శాస్త్రమని పేరు పెట్టుకొన్న శాస్త్రమూ, సాంకేతిక పరిజ్ఞానమూ అంతా దీనికి సంబంధించిందే. సృష్టిలో ఒక చిన్న భాగంగా ఉన్న స్థితి నుంచి, మీరే ఒక సృష్టికర్తగా పరిణమించే స్థితికి మిమ్మల్ని తీసుకు వెళ్ళటం గురించి.

ఒక ఉదాహరణ చెప్తాను. వంద సంవత్సరాల క్రితం నేను ఒక మొబైల్ ఫోన్ చేతపట్టుకొని, భూగోళం అవతలి పక్కన ఎక్కడో ఉన్న వారెవరితోనయినా మాట్లాడగలిగితే, మీరు అదొక లోకాతీతమైన అద్భుతం (miracle) అనుకొనే వాళ్ళు. నేను దేవదూతనో, దేవుని కుమారుడినో, లేక సాక్షాత్తూ దేవుడినేనేమో అనుకొనే వాళ్ళు. కానీ ఈ రోజు ? ఆ మొబైల్ ఫోన్ అందరి దగ్గరా ఉండే అతి సాధారణమైన ఉపకరణం. అందరూ దాన్ని వాడతారు. ఇప్పుడైనా, నేను భూగోళం అవతలి పక్కన ఉన్న వాడెవరితోనయినా ఈ ఫోన్ సహాయం లేకుండా మాట్లాడ గలిగితే, అది మీకు అద్భుతం గానే కనిపిస్తుంది! ఒకానొక మనిషి మెదడు ఈ ఉపకరణాన్ని సృష్టి చేయాలి అని సంకల్పించటం వల్ల ఈ పరికరం సృష్టి అయింది. నూరేళ్ళ క్రితం ఇలాంటి పరికరాన్ని సృష్టించటం సాధ్యమని ఎవరూ అనుకోలేదు. కానీ ఈ రోజు ఇది అతి సాధారణమైన ఉపకరణం . ఇలాగే మనకు ప్రస్తుతం ఉన్న జ్ఞానం పరిధిలో, అవగాహన పరిధిలో లేని చాలా, చాలా విషయాలు భవిష్యత్తులో మన అవగాహన పరిధి లోకి వచ్చేస్తే ఆశ్చర్యం లేదు. వాటి ద్వారా మనకు మన సృజన శక్తి మరెంతగానో వృద్ధి చెందచ్చు.

మీరే సృష్టికర్త!

మీ మనసు చక్కగా వ్యవస్థీకృతం అయిపోతే, మీ మనోభావనల ధోరణి అంతా మీ యథార్థమైన అనుభూతుల మీద మాత్రమే ఆధారితమై ఉంటుంది. అలా మీ మనసు క్రమబద్ధం అయితే మీ భావోద్రేకాలు కూడా క్రమబద్ధమై వ్యవస్థీకృతమౌతాయి. మీ ఆలోచనలూ, భావోద్రేకాలూ వ్యవస్థీకృతం(organized) అయితే మీ జీవ శక్తులు కూడా అదే మార్గంలో వ్యవస్థీకృతం అవుతాయి. మీ భావనలూ, భావోద్రేకాలూ, జీవశక్తులూ మూడూ సక్రమంగా వ్యవస్థీకృతం అయితే, అప్పుడు మీ భౌతిక శరీరం కూడా దానికి అనుగుణంగా వ్యవస్థీకృతమౌతుంది. ఈ నాలుగూ ఒకే దిశగా వ్యవస్థీకృతమై ఉంటే, మీలో ఉన్న సృజన శక్తీ, మీ కోరికలను సిద్ధింప జేసుకోగల శక్తీ అత్యద్భుతస్థాయికి చేరుకొంటాయి.

అసలు ఇప్పటి మీ జీవితంలోనే ఈ సృజన శక్తి స్వరూపం ఎలా ఉందో మీరొక సారి సరిగా పరీక్షించి చూడండి. మీరు ఒక అరటిపండు తిన్నారంటే, కేవలం నాలుగు గంటల సమయంలో ఆ అరటిపండు మనిషిగా మారిపోతున్నది ! ఈ శక్తి మీలో అంతర్గతంగా ఉన్నది. ఇది జీవితాన్ని సృష్టి చేసే ప్రక్రియ. ఇదే మీ శరీర నిర్మాణానికి కారణమౌతున్నది. ఈ శరీరాన్ని నిర్మించే నిర్మాత మీలోపలే ఉన్నాడు. ఆయనకు మీరొక అరటిపండు అందిస్తే, ఆయన దానిని మనిషి రూపంలోకి మార్చేస్తున్నాడు. అరటిపండును మనిషిగా మార్చటమంటే మామూలు విషయం కాదు. అదొక అద్భుతం! అయితే ఆ అద్భుతమేదో మీలో మీకు తెలియకుండానే అప్రయత్నంగా జరిగిపోతున్నది. మీరు గనక ప్రయత్న పూర్వకంగా అరటిపండులో నుంచి మనిషిని పుట్టించగల సిద్ధి చూపగలిగితే, మీరు స్వయంగా సృష్టి కర్త అయిపోతారు. సృష్టికర్త కంటే ఒక్క పిసరు కూడా తక్కువ కాదు.

జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం , కోతి మనిషిగా పరిణామం చెందటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. మరి మీరు ఒక్క రోజులో, ఒక్క మధ్యాహ్న కాలంలో, ఒక అరటిపండునో, ఒక రొట్టెముక్కనో, మరే ఇతరపదార్థాన్నో తినేసి, దాన్ని మనిషిగా మార్చేస్తున్నారు. కనక సృష్టి క్రియకు మూలమైన కీలకమేదో అది మీ లోపల పని చేస్తున్నది.

మీరు గనక బుద్ధి, భావోద్రేకం, శరీరం, జీవ శక్తీ, అనే ఈ నాలుగు అంశాలనూ వ్యవస్థీకృతం(organize) చేస్తే, సృష్టి క్రియ తాలూకు కీలకం అంతా మీ వశమైనట్టే! మీరు అలా వ్యవస్థీకృతులైనప్పుడు మీరిక ‘అయోమయం’లో ఉండిపోరు. ‘కల్పవృక్షం’లా మారిపోతారు. మీరు కోరింది సృష్టించుకోగల శక్తి మీకు కలుగుతుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు