సద్గురు: శివునికి గల అత్యంత ప్రధానమైన పార్శ్వాల్లో ఒకటి నటేశ (నటరాజు) – ఇది సకల కళారూపాలకు మూలం. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన భౌతిక శాస్త్ర ప్రయోగశాలల్లో ఒకటి స్విట్జర్లాండ్‌లోని CERN ప్రయోగశాల. ఈ ప్రయోగశాల ప్రవేశం వద్ద ఒక నటరాజు విగ్రహం ఉంటుంది.  దీనికి కారణం, మానవ సంస్కృతిలోని దేనితో కూడా, వారు ఏదైతే ప్రస్తుతం చేస్తున్నారో అది సామీప్యంలో లేదని వారు గుర్తించడమే.

శివుడు, మానవ దేహం ఏమేమి చేయగలదో, వాటిని చేసినప్పుడు ఏమి జరుగుతుందో, ఆ విధి - విధానాలను పరిశోధించాడు. తరువాత, ఆయన ఉన్మత్తతతో వైరాగిగా ఉన్నప్పుడు, తాండవం చేశాడు

ప్రాథమికంగా, మానవ దేహం వేయదగిన 84,000 భంగిమలను శివుడు గుర్తించి, వాటిని 84 యోగాసనాలుగా కుదించాడు. వీటికి ఆయన మరిన్ని బహురూప వ్యక్తీకరణలను అందించాడు. ఎరుకతో శరీరాన్ని ఈ భంగిమలలో ఉంచితే దానిని ఆసనం అంటారు. అదే భంగిమలను కవితాత్మక అభినయంతో చేస్తే దానిని సాంప్రదాయ నృత్య రూపకం అంటారు. శివుడు, మానవ దేహం ఏమేమి చేయగలదో, వాటిని చేసినప్పుడు ఏమి జరుగుతుందో, ఆ విధి-విధానాలను పరిశోధించాడు. తరువాత, ఆయన ఉన్మత్తతతో వైరాగిగా ఉన్నప్పుడు, తాండవం చేశాడు (నర్తించాడు). ఆయనను చూసి, ఇతరులు అందులో కొంత గ్రహించి, దానిని ఒక విధానంగా అభినయించే ప్రయత్నం చేశారు.

ఏది విజ్ఞానం, ఏది సాంకేతికత అనేది మనం అర్థం చేసుకోవాలి. శివుడు, మీ ఉనికి తాలూకు విజ్ఞానానికి వ్యాఖ్యానం చేశాడు. అయితే, దాని సాంకేతికత అనేది అనేక విధాలుగా సంభవించింది. మెరుగ్గా జీవించడం అనే తలంపు ప్రజల్లో మెదిలినప్పుడు,  ప్రపంచం ఎల్లప్పుడూ కూడా  తూర్పు వైపుకే చూసింది. దీనికి కారణం, ప్రజలు ఈ భూభాగాన్ని  ఎల్లప్పుడూ ఒక సంభావ్యతగా  చూశారు. యావత్ సంస్కృతినీ ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా మలచడమనే విషయంలో , ఈ భూభాగం మానవాళి చేసిన అతిగొప్ప ప్రయోగం. మీరు ఏదైనా చేయండి – అది వ్యాపారమైనా, కుటుంబ పోషణ లేదా ఇంకేది అయినా – ప్రాథమికంగా మీ జీవితం ఉన్నది ముక్తి కోసం. అంతిమంగా ముక్తిని పొందడమే ఏకైక లక్ష్యం.

గతంలో, సాంప్రదాయ కళలు వర్ధిల్లిన గడ్డ ఇది. దురదృష్టవశాత్తూ, గత కొద్ది శతాబ్దాలుగా అవి అంతరిస్తున్నా మనం చూస్తూ ఉన్నాం.

భారతీయ కళా రూపాలు ఎంతో అవగాహనతో పరిణామం చెందిన కళలు. అవి మానవ వ్యవస్థ తాలూకు విధి - విధానాలను అవగాహన చేసుకోవడం అలాగే దానిని పరమోన్నత సంభావ్యతగా పరిణామం చేసే విజ్ఞానంపై ఆధారితమైనవి. సంగీతం, అలాగే నృత్యం వినోదం కోసం కాదు. అవి కూడా ఆధ్యాత్మిక ప్రక్రియలే.

మీరు భారతీయ సాంప్రదాయ నృత్యంలోని భంగిమలను, ముద్రలను సరైన విధంగా ఉపయోగిస్తే, అవి ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తాయి. అదే విధంగా, భారతీయ సాంప్రదాయ సంగీతంలో నిపుణుడైన వ్యక్తిని మీరు పరిశీలిస్తే గనుక, ఆయన మనకు ఒక సాధువులా అనిపిస్తాడు, ఎందుకంటే మీరు శబ్దాలను ఒక నిర్దిష్టమైన అమరికలో ఉంచితే, దానికి ఒక విశేషమైన ప్రభావం ఉంటుంది. మీరు శబ్దాల అమరికలను సరిగా ఉపయోగిస్తే, అది మీలోనూ, ఇంకా మీ చుట్టుపక్కల కూడా అద్బుతాలను చేస్తుంది. ఎందుకంటే, భౌతికత ఉనికి, ప్రాథమికంగా శబ్ద ప్రకంపనల సంక్లిష్టమైన సమ్మేళనం. కాబట్టి, మనం సంగీతాన్ని వినోదం కోసం వాడలేదు, సంగీతాన్ని మనం అంతిమంగా లయమయ్యేందుకు ఉపయోగించాము. వినోదం అనేది జీవన వైఖరి కాదు. కూర్చోవడం, నిలబడడం, ఇంకా తినడం – ప్రతిదీ కూడా ఉన్నతమైన చేతన స్థాయిని చేరేందుకు ఒక సాధనం.

గతంలో, సాంప్రదాయ కళలు వర్ధిల్లిన గడ్డ ఇది. దురదృష్టవశాత్తూ, గత కొద్ది శతాబ్దాలుగా అవి అంతరిస్తున్నా మనం చూస్తూ ఉన్నాం. వాటిని తిరిగి పునరుద్ధరించే సమయం వచ్చింది. ఈశా ఫౌండేషన్ ప్రతీ సంవత్సరం, యక్ష - సంగీత వేడుకలను నిర్వహిస్తుంది. ఇది కళాకారులకు ఒక వేదికను ఏర్పాటుచేస్తుంది. కానీ, కేవలం ఒక సంస్థ ద్వారానే కాకుండా, మరింత విస్తృతంగా జరగవలసిన ఆవశ్యకత ఉన్న విషయం ఇది. ఈ అద్భుతమైన కళలను పునరుద్ధరించేందుకు మనం కొంత సమయాన్ని, కృషినీ కేటాయించడం ఎంతో ముఖ్యం.