సద్గురు పరమానంద స్వభావాన్ని వర్ణిస్తున్నారు, అట్లాగే అది లోపలి నుంచి ఊరుతున్న బావి వంటిదని వివరిస్తున్నారు.

ప్రశ్న : ఒక వ్యక్తి  పరమానందభరితుడైనప్పుడు మరింత అనుకూలశీలుడు, మరింత స్వతంత్రుడు గానూ ఉంటాడనీ, వ్యక్తిగత భారం తగ్గుతుందనీ మీరంటారు. ఈ పరమానందం ఏమిటి? మీరు దీన్ని వివరిస్తారా సద్గురూ?

నేను మీకెలా చెప్పగలను? నిజానికి , పరమానంద స్వభావాన్ని అపార్థం చేసుకున్నందువల్లే ఇటువంటి ప్రశ్న తలెత్తి ఉంటుంది.  ఇవ్వాళ చివరికి సైకెడెలిన్ మందులక్కూడా ‘బ్లిస్’ అని పేరు పెడుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో మీరు ‘బ్లిస్’ అనగానే మీరు ఏదో మందు బిళ్ల గురించో, మందుగురించో మాట్లాడుతున్నారనుకుంటారు.

‘సత్యమైన పరమానందం’, ‘అసత్యమైన పరమానందం’ అని ఉండవు. మీరు సత్యంలో ఉంటే పరమానందంలో ఉంటారు. మీరు నిజంగా సత్యంతో కూడి ఉన్నప్పుడు సహజంగానే మీరు పరమానందంలో ఉంటారు. మీరు సత్యంలో ఉన్నారా, లేదా అనడానికి పరీక్ష మీరు పరమానందంగా ఉన్నారా, లేదా అన్నదే. ఒక విధమైన ఆలోచనా ధోరణి నుండి ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది: ‘నేను సూర్యాస్తమయం చూస్తూంటే, పరమానందభరితుణ్ణయ్యాను అనుకోండి, అది నిజంగా పరమానందమేనా? నా ప్రార్థనలు చేసుకొనేటప్పుడు పరమానందభరితుణ్ణయితే అది నిజంగా పరమానందమేనా? నేను ధ్యానం చేస్తూ పరమానందభరితుణ్ణయితే అది నిజంగా పరమానందమేనా?”

‘సత్యమైన పరమానందం’, ‘అసత్యమైన పరమానందం’ అని ఉండవు. మీరు సత్యంలో ఉంటే పరమానందంలో ఉంటారు.

చాలామంది సుఖాన్ని/హాయిని పరమానందంగా పొరబడతూ ఉంటారు. సుఖం ఎల్లప్పుడూ ఉండేది  కాదు. కాని పరమానందస్థితి దేని మీదా ఆధారపడదు. సుఖం అనేది ఎప్పుడూ దేనిమీదో, ఎవరిమీదో ఆధారపడి ఉంటుంది. పరమానందం దేనిమీదా ఆధారపడదు. అది మీ స్వీయ స్వభావం; మీరు దానితో సంబంధంలో ఉంటే, మీరు అందులో మునిగిఉంటారు, అంతే.

పరమానందస్థితిని మీరు బయటినుండి సంపాదించుకోలేరు; అది మీలో మీరే లోతుగా తవ్వుకొని వెతుక్కోవలసి ఉంది. ఇది ఒక బావి తవ్వినట్లు. వర్షం పడుతూ ఉంటే తల ఎత్తి నోరు తెరిస్తే కొన్ని వాన చుక్కలు మీ నోట్లో పడవచ్చు. కాని అవి మీ దాహం తీర్చగలిగినన్ని కావు కదా. అందుకని నోరు తెరిచి వర్షబిందువులతో దప్పిక తీర్చుకునే ప్రయత్నం చేస్తే, అది విఫలప్రయత్నమే అవుతుంది. పైగా వాన ఎంత సేపుంటుంది? గంట లేదా రెండు గంటలు, తర్వాత ఆగిపోవలసిందే. శాశ్వతంగా ఉండదు కదా!

అందుకే మీ బావి మీరు తవ్వుకోవాలి, ఏడాది పొడుగునా నీళ్లు కావాలంటే అదే మార్గం కదా. మీరు ‘నిజమైన పరమానందం’ అంటున్నది ఇదే: మీరు మీ సొంత బావి తవ్వుకోవాలి. అప్పుడు మీకు అన్నివేళలా నీళ్లు దొరుకుతాయి. వాననీటి చుక్కలకోసం నోరు తెరిచి నిలబడడం కాదు. నీళ్లు ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంటాయి. పరమానందం అంటే అది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు