Name
Email
 

 

క్యాన్సర్ ఎందుకు వస్తుంది?

సద్గురు: క్యాన్సర్ గురించి రాసిన వాటిని మీరు చదివితే, దాని గురించిన అభిప్రాయాలు ఇంకా ఆలోచనలు తరచూమారుతూ ఉండడాన్ని, కొన్నిసార్లు నాటకీయంగా మారిపోవడాన్ని కూడా మీరు గమనించే ఉంటారు. మీ ప్రాథమిక శరీరతత్వం, మీ రసాయనికత, ఇంకా మీ ఉనికికి ఆధారమైనది ఏదీ మారలేదు. మరి ఈ ఉద్దేశాలు మాత్రం ఎందుకు మారుతూ వస్తున్నాయి? ఉద్దేశాలకీ ఎఱుకకీ మధ్య చాలా దూరం ఉంది. ఉద్దేశాలు ఉన్న చోట, ఎఱుక ఉండే అవకాశం ఉండదు. కాబట్టి, ప్రతిదీ బయటి నుండి చదివి, ఏది నిజము ఏది తప్పు అంటూ గందరగోళంలో పడే కన్నా, మీరు మీ శరీరాన్ని గమనించడం ప్రారంభించి, మీ సొంత వ్యవస్థపై లోతైన అవగాహనని ఇంకా అంతర్దృష్టిని పొందితే, మీరు దానితో మరింత సమర్థవంతంగా వ్యహరించగలుగుతారు.

ప్రతి ఒక్కరి శరీరంలో క్యాన్సర్ కణాలు ఉంటాయి, కానీ అస్తవ్యస్తంగా ఉన్న కొన్ని క్యాన్సర్ కణాలను కలిగి ఉండటం అనేది మీ జీవితం పైనా లేదా ఆరోగ్యం పైనా ఏ విధంగానూ ప్రభావం చూపదు.

ఇప్పుడు మనం దానిని అనుభవపూర్వక కోణం నుండి చూస్తున్నాము, ఎందుకంటే మీరు అనేదే సమస్తం. మీరు అంతర్ముఖులు అవ్వడానికి సుముఖంగా ఉంటే, తెలుసుకోదగిన దాన్ని ఒక్క క్షణంలో తెలుసుకోవచ్చు. మీరు ఒక న్యూక్లియర్ రియాక్టర్‌ను ఎలా నిర్మించాలో కనిపెట్ట లేకపోవచ్చు, కానీ మీ శరీరంలోని అణువులు ఎలా ప్రవర్తిస్తున్నాయో మీకు తెలుస్తుంది. మీరు అంతర్ముఖులైతే, అంతా అక్కడే ఉంది - మీకు మీరే ఒక విశ్వం.

ప్రస్తుతం వివిధ స్థాయి క్యాన్సర్లతో పోరాడుతున్న వారు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇవి వివిధ కారణాల వల్ల సంభవిస్తాయి, మనమందరం కుడా వాటిలో ఒక భాగమే. ఇది వచ్చేది కేవలం బాహ్య పరిస్థితుల వల్ల మాత్రమే కాదు, మీరు మీ వ్యవస్థని ఎలా నిర్వహిస్తున్నారు అన్న దాన్ని వల్ల కూడా ఉంటుంది. మీపై పని చేస్తున్నది కేవలం బాహ్య రసాయన ప్రభావాలు మాత్రమే కాదు. మీ శరీరమే ఒక పెద్ద రసాయన కర్మాగారం. మీరు ఈ కర్మాగారాన్ని సరిగ్గా నిర్వహించకపోతే, అది హానికరమైన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది, ఆపైన ఏదో ఒక విధంగా మీపై ఆ ప్రభావాన్ని చూపిస్తుంది.

క్యాన్సర్ పై యోగిక దృక్పథం

యోగాలో, మేము క్యాన్సర్‌ను వివిధ రకాలుగా చూడము. ఒక వ్యక్తిలో ఇది ‘ఎక్కడ, ఎలా వ్యక్తమవుతుంది,’ అనేది, వారి శరీరతత్వం, జన్యువులు, జీవనశైలి, ఆహారం మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది, కాని మేము ఎప్పుడూ కూడా, దీనికి మూలకారణం, ప్రాణమయ కోశం లేదా శక్తి శరీరంలో ఏర్పడిన అసమతుల్యత అనే పరిగణిస్తాము.

ప్రాథమికంగా యోగా, ఒక వ్యక్తి భౌతికతను ఐదు వేర్వేరు పొరలుగా చూస్తుంది. మనం మొదటి మూడింటిని చూద్దాం; మిగతా రెండూ ఆరోగ్యానికి సంబంధించినవి కావు. మొదటి పొరను అన్నమయ కోశం లేదా ఆహార శరీరం అంటారు. మీరు తినే ఆహారమే ఈ శరీరంగా మారింది, అవునా? మీరు ఏమీ తినకపోతే, ఈ శరీరం క్షీణించిపోతుంది. కాబట్టి, భౌతిక శరీరాన్ని ఆహార శరీరం అని పిలుస్తారు.

యోగ దృక్పథం ప్రకారం, క్యాన్సర్, ఇంకా వ్యవస్థ లోపల నుండి ఉత్పత్తి అయ్యే అస్వస్థత, లేదా వ్యాధులు అనేవి, శక్తి శరీరంలో అసమతుల్యత వల్ల సంభవిస్తాయి.

ఇటీవల వరకూ కుడా, వైద్య శాస్త్రం ఆహార శరీరం లేదా అన్నమయ కోశం గురించి మాత్రమె పట్టించుకుంది. వారు మరిదేని పైనా దృష్టి పెట్టలేదు. ప్రపంచంలోని అన్ని అంటువ్యాధులకూ చికిత్స చేయగలమని వారు భావించారు. కానీ ఆ తర్వాత వారు, రక్తపోటు ఇంకా మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల గురించి ఏమీ చేయలేకపోతున్నామని గ్రహించారు. దీనికి కారణం, వారు కేవలం ఆహార శరీరాన్ని మాత్రమే చూస్తున్నారు, అది కేవలం బాహ్య అభివ్యక్తీకరణ మాత్రమే.

దీని లోపల మనోమయ కోశం అంటే మానసిక శరీరం ఉంది. ఈ రోజు వైద్య శాస్త్రం, మనిషిని ఒక సైకో-సోమా అని గుర్తించింది - మనస్సులో ఏదైతే జరుగుతుందో, సహజంగానే అది శరీరంలో కుడా జరుగుతుంది. ఉదాహరణకు, మీరు మనసులో కంగారుని సృష్టిస్తే, మీ రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి, సరిగ్గా చూసుకోవలసిన ఒక మానసిక శరీరం ఉంది. ఈ మానసిక శరీరం ఇంకా భౌతిక శరీరం అనేవి, శక్తి శరీరం ఉన్నందు వల్లే పనిచేయగలుగుతున్నాయి. యోగా యొక్క పని, ప్రాథమికంగా శక్తి శరీరం లేదా ప్రాణమయ కోశ స్థాయిలో ఉంటుంది. యోగ దృక్పథం ప్రకారం, క్యాన్సర్, ఇంకా లోపలి వ్యవస్థ నుండి ఉత్పత్తి అయ్యే ఇతర అస్వస్థత లేదా వ్యాధులు, శక్తి శరీరంలోని అసమతుల్యత వల్ల సంభవిస్తాయి.

ప్రతి ఒక్కరి శరీరంలో క్యాన్సర్ కణాలు ఉంటాయి, కానీ అస్తవ్యస్తంగా కొన్ని క్యాన్సర్ కణాలు ఉండటం మీ జీవితం పైనా లేక ఆరోగ్యం పైనా ఏ విధంగానూ ప్రభావం చూపదు. అయితే, మీరు శక్తి శరీరంలో కొన్ని రకాల పరిస్థితులను సృష్టిస్తే, అవి తమకు తామే వ్యవస్థీకరించుకుంటాయి- అవి చిన్న చిన్న నేరాల నుండి ఒక వ్యవస్థీకృత నేరాల స్థాయికి వెళతాయి!

క్యాన్సర్ కణాలు: శరీరంలోని నేరస్థులు

క్యాన్సర్ కణాలను వివరించడానికి మనము ఒక సారూప్యతను ఉపయోగించినట్లైతే, మనం అవి సమాజంలోని నేరస్థుల వంటివని చెప్పొచ్చు. అక్కడక్కడా చిన్నచిన్న నేరాలు చేసే వ్యక్తులు ఉంటే, అది మొత్తంగా సమాజంపై అంతగా ప్రభావం చూపదు. ప్రతి పట్టణంలో అడపాదడపా జేబులు కత్తిరించే చిన్న చిన్న నేరస్థులు ఉంటారు - అది సమస్యకాదు. కానీ అలాంటి వారు ఒక యాభై మంది వ్యవస్థీకృతమైతే, పట్టణంలోని మొత్తం వాతావరణం అకస్మాత్తుగా మారిపోతుంది. ఈ యాభై మంది నేరస్థులు కలిసి వచ్చినప్పుడు, మీరు వీధిలో అడుగు పెట్టడం అనేది ప్రమాదకరంగా మారుతుంది. శరీరంలో జరిగేదంతా కూడా ఇదే. క్యాన్సర్ కణాలు దేని కవి అటూ ఇటూ తిరుగుతూ ఉంటే, అప్పుడు అవి సమస్య కాదు. కానీ ఒక్కసారి అవన్నీ గుమిగూడి ఒకే చోట దాడి చేస్తే, అది సమస్యగా మారుతుంది.

శరీరంలోని ఏదైనా ప్రాంతాలలో శక్తి ప్రవాహం సరిగా లేకపోతే, సాధారణంగా క్యాన్సర్ కణాలు తాము ఎదగడానికి ఇంకా తమ సంఖ్యను పెంచుకోవడానికీ, ఆ ప్రదేశాలను ఎంచుకుంటాయి.

ప్రారంభంలో, ఒక నేరస్థుడు ఒకరి జేబును కత్తరించడంతో సంతృప్తి పడతాడు. ఆ తరువాత, అలాంటి ఇద్దరు కలిసి ఒక ఇంటిని కొల్లగొట్టాలని అనుకుంటారు. అలాంటి ఐదుగురు కలిసి ఒక బ్యాంకును దోచేయాలని అనుకుంటారు. నేర నియంత్రణ వ్యవస్థ మెలకువతో, చురుగ్గా పని చేస్తే, అది నేరస్థులు అధిక సంఖ్యలో గుమిగూడి, పెద్ద సమస్యగా తయారవకుండా, చూసుకుంటుంది. శరీరానికి కూడా అదే వర్తిస్తుంది. ఈ కణాలు ముఠాగా మారకముందే మీరు వాటిని కరిగించేయాలి.

ప్రాణమయ కోశంలో చోటుచేసుకునే కొన్ని“ఖాళీల” వల్ల శక్తి శరీరం ప్రభావితమవుతుంది - అవి వైఖరి వల్ల రావొచ్చు, లేదా జీవనశైలి, ఆహారం, అనేక ఇతర కారణాల వల్ల రావొచ్చు. శరీరంలోని ఏదైనా ప్రాంతాలలో శక్తి ప్రవాహం సరిగా లేకపోతే, సాధారణంగా క్యాన్సర్ కణాలు తాము ఎదగడానికీ, తమ సంఖ్యను పెంచుకోవడానికీ, ఆ ప్రదేశాలను ఎంచుకుంటాయి. దీర్ఘకాలిక వ్యాధుల విషయానికి వస్తే, మూల కారణం ఎల్లప్పుడూ కుడా శక్తి శరీరంలోనే ఉంటుంది. ఒక సారి శక్తి శరీరంలో అడ్డంకులు వస్తే, అది సహజంగానే భౌతిక ఇంకా మానసిక స్థాయిలలో వ్యక్తమౌతుంది.

ఉదాహరణకు, ప్రతి నిత్యం ధూమపానం చేసేవారి శ్వాస, ధూమపానం చేయని వారి శ్వాస నుండి చాలా భిన్నంగా ఉండడాన్ని మనం గమనిస్తాము. ఇలా పరిమితం చేయబడిన విధంగా శ్వాస తీసుకోవడం వల్ల, సహజంగానే ఆ ప్రాంతంలోని శక్తి స్థాయి తగ్గిపోయి, అది క్యాన్సర్ ను ఆకర్షించే ప్రదేశంగా మారుతుంది.

మీ శక్తి శరీరం లో శక్తి ప్రవాహం పూర్తి స్తాయిలో ఉండి, సరైన సమతుల్యతని కలిగి ఉంటే, మీ భౌతిక శరీరంలో లేదా మీ మానసిక శరీరంలో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదు.

మరొక ఉదాహరణ - రొమ్ము క్యాన్సర్, ఇది ఈ రోజుల్లో చాలా ప్రబలంగా ఉంది, ముఖ్యంగా పాశ్చాత్య సమాజాలలో. దీనికి కారణం, అక్కడ చాలా మంది మహిళలు, పిల్లల్ని కనే వయస్సులో ఉన్నప్పుడు గర్భం ధరించరు. ప్రధానంగా సంతానాన్ని పోషించడానికి తయారు చేయబడిన రొమ్ము నిర్మాణ వ్యవస్థ అసలు ఉపయోగించబడదు లేదా ఒక నిర్దిష్ట వ్యవధిలో మాత్రమే ఉపయోగించబడుతుంది. గతంలో, మామూలుగా ఒక స్త్రీ గర్భధారణ విధానాన్ని చూసినట్లయితే, సుమారు 16 లేదా 18 సంవత్సరాల వయస్సు నుండి 45 వరకూ, ఆమె ప్రతి కొంత కాలానికీ గర్భం ధరిస్తూ ఉండేది. ఇది ఆమె మొత్తం శరీర వ్యవస్థనీ, గర్భాశయాన్నీ, ఇంకా రొమ్మునూ చురుకుగా ఉంచేది. ఇది శక్తిని కూడా ప్రవహించేలా చేసేది.

ఈ రోజుల్లో కొంతమంది మహిళలు అస్సలు గర్భం ధరించడం లేదు, లేదా చాలా మంది మహిళలకు పిల్లల్ని కనడం 30 ఏళ్ళకు ముందే ముగుస్తుంది. ఆ తరువాత వారి జీవితంలో మరో 15 నుండి 20 సంవత్సరాల వరకూ, గర్భధారణకు అవసరమైన హార్మోన్లు ఇంకా ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి, కానీ అవి వినియోగించబడవు. శారీరకంగా అవి వినియోగింపబడి ఉండాల్సిన తీరులో వినియోగింప బడడం లేదు కాబట్టి, శరీరంలోని ఆ భాగాలలో శక్తి స్థాయి తగ్గటం వల్ల, అవి క్యాన్సర్ కణాలు అక్కడ పోగవ్వడానికి ఆస్కార మవుతాయి.

దీని అర్థం మనం ఎక్కువ మంది పిల్లలను కనాలి అనా? దయచేసి అలా చేయకండి. ఇది ఇప్పటికే అధిక జనాభాతో నిండి ఉన్న ప్రపంచం. దీనికి ఇతర పరిష్కారాలు ఉన్నాయి. మీరున్న పరిస్థితులను బట్టి ఇది ఇంతే అని వదిలేసే బదులు, మీ వ్యవస్థను సమతుల్యం చేయడం, దాన్నిమరింత నియంత్రిత ప్రక్రియగా మార్చడం ద్వారా దీన్ని సరిదిద్దవచ్చు. శరీరంలోని హార్మోన్ల స్థాయిని నియంత్రించడానికి కొన్ని రకాల యోగాభ్యాసాలు, ఆంతరిక ప్రక్రియలు ఉన్నాయి, తద్వారా దీన్ని నిర్వహించవచ్చు.

శక్తి శరీరానికీ - ఆరోగ్యానికి ఉన్న సంబంధం

మీ శక్తి శరీరంలో శక్తి ప్రవాహం పూర్తి స్థాయిలో ఉండి, సరైన సమతుల్యతని కలిగి ఉంటే, మీ భౌతిక శరీరంలో లేదా మీ మానసిక శరీరంలో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదు. ప్రజలు ఉబ్బసంతో మా వద్దకు వస్తారు, మేము వారికి ఒక నిర్దిష్ట అభ్యాసం ఇస్తాము, అది వారికి ఆ పరిస్థితి నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. మరొకరు ఎవరో మధుమేహం గురించి వస్తారు, మేము ఆ వ్యక్తికి కూడా అదే అభ్యాసాన్ని ఇస్తాము, అది వారికి కూడా పని చేస్తుంది. ఎందుకంటే, మేము ఫలానా వ్యాధికి చికిత్స చేయడం లేదు. వ్యాధి అనేది కేవలం శక్తి శరీరంలోని అలజడి యొక్క వ్యక్తీకరణ మాత్రమే.

ప్రాథమికంగా, యోగా అంటే ఒక రకమైన చికిత్స కాదు. ఇది మీ అంతర్గత శక్తులను సమతుల్యం చేసుకునేందుకు ఒక మార్గం. ఆ విధంగా చూస్తే, వాస్తవానికి, మేము ఎప్పుడూ కూడా, భౌతిక లేదా మానసిక శరీరానికి చికిత్స చేయడం లేదు. వ్యాధి ఏమిటి అన్న దానితో సంబంధం లేకుండా, కేవలం శక్తి శరీరంలో సమతుల్యాన్ని తీసుకురావడం, సచేతనం చేయడం మాత్రమే లక్ష్యంగా పని చేస్తాం.

ప్రేమాశీస్సులతో,

సద్గురు

Editor's Note: For more of Sadhguru’s insights on cancer and healthy living, download the ebook, Cancer – A Yogic Perspective.