Sadhguruసాధారణంగా, ప్రజలు వారి మనస్సు ఒక వైపుకులాగుతుంటే వారి బుద్ధి మరో వైపుకు లాగుతోంది అంటుంటారు. మౌలికంగా, యోగాలో ఏమి చెప్తామంటే - మీరు ఒక్క వ్యక్తే, ఒకే జీవి. మనసు, ఆలోచనలు అంటూ వేరు వేరుగా ఏమీ లేవు; మొత్తంగా ఒక్కటే – ‘మీరు’. ముందు మనం, మనసు, బుద్ధి అన్నప్పుడు వేటిని ఉద్దేశించి మాట్లాడుతున్నామో అర్ధం చేసుకుందాం. సాధారణంగా, మన ఆలోచనలను మన బుద్ధికి, భావాలను మనసుకీ  ఉద్దేశించి అంటాము. కాని మీరు నిజాయితీగా పరిశీలించి చూస్తే , మీరు ఆలోచించే విధంగానే మీ భావాలు ఉంటాయి. మీరు భావిస్తున్నట్లుగానే, మీ ఆలోచనలు కూడా ఉంటాయి. అందుకే, యోగ పరంగా ఆలోచనలు, మనో భావాలను రెండూ కూడా మనోమయకోశం లోని భాగాలుగా పరిగణిస్తాం.

మీరు సామాన్యంగా “బుద్ధి” అనుకునేది ఆలోచనా ప్రక్రియ లేదా వివేకం. కాని దీనికి చాలా పార్శ్వాలు ఉన్నాయి, అందులో ఒకటి తర్కపరమైన అంశం. ఇంకోటి లోతైన భావపరమైన కోణం. ఆలోచనా ప్రకియను మనం వివేకం అంటాం. లోతైన భావపరమైన కోణాన్ని, మనసు అంటాం. మనసు భావాలను ఒక తరహాలో మలచే ఙ్ఞాపకాల సమ్మేళనం. అందుకే మీరు ఆలోచించే విధానం, అనుభూతి చెందే విధానం రెండూ బుద్ధి చేసే పనులే. ఉదాహరణకు, నేను మిమల్ని ‘ అద్భుతమైన వ్యక్తి’ అని అనుకుంటే, మీ గురించి నాకు మంచి భావాలు కలుగుతాయి. అదే మీరు దారుణమైన వ్యక్తి   అనుకుంటే, మీ పట్ల నాకు చెడ్డ భావాలు కలుగుతాయి. మీరు ఒకరిని శత్రువుగా చేసుకుని వారిని ప్రేమిద్దామని ప్రయత్నిస్తే అది శ్రమతో కూడుకున్నది. జీవితంలో సరళమైన అంశాలకు శ్రమ లేకుండా చూసుకుందాం.

మీరు ఆలోచించే విధంగానే మీరు భావిస్తారు, కాని మీ అనుభూతిలో మీ ఆలోచన, భావాలు విభిన్నమైనవిగా అనిపిస్తాయి. అలా ఎందుకనిపిస్తుంది? ఎందుకంటే, ఆలోచనకు కొంత స్పష్టత, చురుకుదనం ఉన్నాయి. భావాలు కొంచెం నిదానమైనవి. ఉదాహరణకు, మీరు ఈ రోజు ఇతను అమోఘమైన వ్యక్తి అనుకుంటే అతని గురించి మంచి భావాలు కలుగుతాయి. మీకు నచ్చనిదేదైనా ఆయన చేస్తే మీరు ఆయనను ఘోరమైన మనిషి అనుకుంటారు కాని, మీ  భావాలు వెంటనే మారవు, అవి కొట్టు మిట్టాడుతాయి. మీకు మధురమైన  భావాలు ఉన్నప్పుడు అవి ఉన్నపళంగా, తరువాతి క్షణంలోనే చేదుగా మారవు. అలా మారడానికి కొంత సమయం పడుతుంది. భావాలు మారడానికి కొంత సమయం పడుతుంది. మీ మనోభావల తీవ్రతని బట్టి, దానికి మూడురోజులు పట్టవచ్చు, మూడు నెలలు పట్టవచ్చు, మూడు సంవ్సరాలు పట్టవచ్చు కానీ కొంతకాలం తరువాత అది మారుతుంది.

మీ మనోభావం కూడా గొణుగుతుంటుంది, అటూ, ఇటూ పోతుంటుంది, కాని ఆలోచనంత చురుకుగా కాదు.

బుద్ధి, మనస్సుల మధ్య ఈ విభేదం  సృష్టించాల్సిన అవసరం లేదు., మీ  ఆలోచనల్లోని రసవత్తరమైన భాగమే మీ భావాలు. మీరు దాని మాధుర్యాన్ని ఆస్వాదించవచ్చు, మీరు గుర్తించినా, గుర్తించకపోయినా, ఆలోచనే మనోభావానికి దారి తీస్తుంది. మీ భావాలు పూర్తిగా స్థిరమైనవి కావు. మీ మనోభావం కూడా గొణుగుతుంటుంది, అటూ, ఇటూ పోతుంటుంది, కాని ఆలోచనంత చురుకుగా కాదు. అది మరలడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది కాబట్టి, దాని తీవ్రత ఆలోచన కన్నా ఎంతో ఎక్కువ కాబట్టి, ఆలోచనలూ, మనోభావాలు విభిన్నమైనవిగా కనిపిస్తాయి. వాటి మధ్య ఉన్న తేడా -  చెఱకు, చెఱకు రసానికీ ఉన్న తేడా కంటే పెద్దది కాదు.

చాలామంది అనుభవంలో ఆలోచన మనోభావమంత తీవ్రమైనది కాదు. అయినప్పటికీ, మీరు తగినంత తీవ్రతతో ఉన్న ఆలోచనను సృజిస్తే, అది మిమ్మల్ని విస్మయ పరుస్తుంది. మీకు భావాలతో పని లేనంతగా, తీవ్రతో  కూడిన ఆలోచనను సృజించడం, కేవలం 5-10 శాతం మందికి మాత్రమే  సాధ్యం. 90 శాతం మంది తీవ్రతతో కూడిన మనోభావాన్ని మాత్రమే సృజించగలరు, వీరు మరో దిశలో కావలసినంత పరిశ్రమ చేయకపోవడమే దానికి కారణం. కాని, కొందరికి లోతైన  ఆలోచనలు ఉంటాయి. వీరికి అంతగా భావావేశాలు ఉండవు, కాని వీరు గాఢమైన ఆలోచనాపరులు.

మీలోనే విభిన్న ధృవాలు ఏర్పరచుకోకుండా ఉండడం ఉత్తమం. అలా ఏర్పరుచుకుంటే, అవి మీలో అంతర్యుద్ధాన్ని, మనోవైకల్యాన్ని కలుగజేస్తాయి. ఆలోచనలు, భావాలు రెండూ విభిన్నమైనవి కాదు. ఒకటి పొడివారినదైతే, మరొకటి రసమయమైనది. రెంటినీ ఆస్వాదించండి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు