Sadhguruమూడేళ్ల కిందట, ధ్యానలింగప్రతిష్ఠ అనంతరం ఇదిలా జరుగుతుందని మేమెన్నడూ ఊహించలేదు. ఎందరో వ్యక్తుల ప్రేమ, ఇచ్ఛ మమ్మల్ని ఇంత దూరం తెచ్చింది. ఎందుకో మేము జీవితం కొనసాగించాలని వాళ్లు కోరుకున్నారు, అయితే జీవితాన్ని నేనెన్నడూ ఆ విధంగా చూడలేదు. నాకు ఇది ఎన్నో సంవత్సరాల కిందట జరిగిందని అనిపించట్లేదు. నేను నిన్నకాక మొన్న పుట్టినట్లు అనిపిస్తుంది. అది అంత త్వరగా, మామూలుగా గడిచిపోయింది. బహుశా నేను ఏదీ ఎన్నడూ సీరియస్‌గా చేసి ఉండను, జీవితాన్ని కేవలం ఓ ఆట లాగా గడిపేసాను.

ఒప్పందాలు చేసే వారే వాటిని ఉల్లంఘిస్తారు

ఆధ్యాత్మిక సంభావ్యత అన్నది అందరికీ అందుబాటులో ఉంటుంది కాని, దురదృష్టవశాత్తు కొద్దిమంది మాత్రమే దాన్ని సంభావ్యం చేసుకుంటారు. మానవ చరిత్రలో ఇంతవరకు జరుగుతున్నదిదే. ప్రతి తరంలోనూ చాలా కొద్ది పుష్పాలు మాత్రమే వికసిస్తాయి. 21 వ శతాబ్దిలో అత్యధిక సంఖ్యలో పువ్వులు వికసించాలని నేను కోరుకుంటున్నాను. చాలామంది  తమ జీవితాల్లో ఇది జరగకుండా నిరోధించడానికి కారణం, వాళ్లెప్పుడూ జీవితం విషయంలో ఏదో గొప్ప బేరం కుదుర్చుకుందామనుకోవడమే.

ఒకరోజు శంకరన్ పిళ్లే తన పడవలో చేపలు పట్టడానికి వెళ్లాడు. కొంతసేపు ఎదురు చూసిన తర్వాత అతని గాలానికి ఒక చేప చిక్కుకుంది. పైకి లాగాడు. బంగారు, వెండి రంగుల మొప్పలు ఉన్న చేప అది. చాలా అందంగా ఉంది. అతనా బంగారు చేపను పడవలో వేశాడు. అది ప్రాణభయంతో కొట్టుకుంటూ ఉంది. తర్వాత అతనికి ఆశ్చర్యం కలిగేలా అది మాట్లాడడం మొదలుపెట్టింది, “నన్ను నదిలోకి పోనివ్వు, మళ్లీ నన్ను నీటిలో వెయ్యి. నీకు మూడు వరాలిస్తాను. నీవు ఏమైనా కోరుకో, నన్ను మాత్రం నీళ్లలో వేయి” అంది. శంకరన్ పిళ్లే కాసేపు ఆలోచించాడు. చేప కొట్టుకు లాడుతూ ఉంది, మరీ మరీ బలహీనపడుతూ ఉంది. అతనన్నాడు,  “ఐదు వరాలివ్వు, వదిలి పెడతాను.” “లేదు. మూడే” అంది చేప. దాని గొంతు అప్పటికే నీరసపడింది. శంకరన్ పిళ్లే మరికాసేపు ఆలోచించాడు, “సరే నాలుగున్నర”. చేప మరీ బలహీనమయింది, “లేదు, నేను మూడు కంటే ఇవ్వలేను” అంది. శంకరన్ పిళ్లే మళ్లీ ఆలోచించి అన్నాడు, “సరే, నాలుగు వరాలివ్వు. చాలు”. చేప ఏమీ అనలేదు, అది చచ్చిపోయింది.

21 వ శతాబ్దిలో అత్యధిక సంఖ్యలో పువ్వులు వికసించాలని నేను కోరుకుంటున్నాను

జీవితం క్షణ భంగురం. ఆ కాస్త సమయంలో మీరు ఒప్పందాలు చేసుకొనే ప్రయత్నాలు చేస్తారు, ఏం జరుగుతూ ఉందో తెలిసే లోపలే అంతా అయిపోతుంది. పుట్టిన రోజులు జీవితం అయిపోతున్నదని తెలిపే సంకేతాలు. అది రంధ్రం పడ్డ సంచి లాంటిది. ఏం జరుగుతున్నదో మీరు తెలుసుకునే లోపలే, సంచి ఖాళీ అయిపోతుంది. జీవితం ఎల్లప్పుడూ జారిపోతూ ఉంటుంది. మనిషి మేలుకోకపోతే, తన ధ్యానమంతా తన అంతర్గత సంక్షేమం పట్ల ఉంచకపోతే మరుణ క్షణంలో విచారించవలసి వస్తుంది. మీకు మీరెన్ని పుట్టినరోజులు చూడగలరో తెలియదు కదా, అవునా?

నేనింకా ఎన్ని చూడాలో నిర్ణయించుకోలేదు. కాని నాకు ఒక అవకాశం మాత్రం ఉంది – నేనెన్ని చూడగలనో అన్నది. కానీ మీకింకా ఆ అవకాశం లేదు. మీ మీద ఎన్నో శక్తులు పనిచేస్తున్నాయి. అది ఏ క్షణంలోనైనా జరగవచ్చు. అందువల్ల అది నా పుట్టిన రోజు అయినా, మీ పుట్టిన రోజు అయినా, ఎవరి పుట్టిన రోజు అయినా – మన సంచి ఎంత కారుతూ ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించుకుందాం. ఒకరోజు అది శూన్యమవుతుంది. దానికి ముందే ఏదైనా జరగాలి.

ఆధ్యాత్మిక ప్రక్రియ @ 24x7          

100% మీరు మీ ఆధ్యాత్మికత మీద దృష్టి కేంద్రీకరించడం అంటే మీరిక ఏ పనులూ చేయకూడదని అర్థంకాదు. మీరు బయట చేయవలసినది, అప్పటి అవసరాన్ని బట్టి. కాని మీరు బయట ఏమి చేస్తున్నా సరే – మీరు నడుస్తున్నా, మాట్లాడుతున్నా, వంట చేస్తున్నా, తింటున్నా, పనిచేస్తున్నా – మీ అంతరంగంలోని ప్రక్రియ నడుస్తూనే ఉండవచ్చు. పొద్దున్న కాసేపు, సాయంత్రం కాసేపు యోగా చేసి , తక్కిన సమయమంతా మనం మూర్ఖమైన జీవితం గడుపుతూ ఉంటే – అది మనకి ఏమి మేలు చెయ్యదు. అది నిరంతరం ప్రతిక్షణం మీలో సజీవంగా ఉండకపోతే, చెప్పుకోదగిందేమీ జరగదు.

ఒకసారి ఆధ్యాత్మిక ఆకాంక్ష కలిగినప్పుడు, దాన్ని సంపూర్ణంగా తీవ్రం చేసుకోవాలి.

ఒకసారి ఆధ్యాత్మిక ఆకాంక్ష కలిగినప్పుడు, దాన్ని సంపూర్ణంగా తీవ్రం చేసుకోవాలి. అలా జరిగినప్పుడే  వికసించడం తటస్తిస్తుంది. మీరేం చేస్తున్నారన్నది ముఖ్యంకాదు, మీరు దాన్ని ఎంత గాఢంగా చేస్తున్నారన్నది ముఖ్యం. ఒకసారి జీవితంలో ఒక అంశం గురించి ఎవరో ఏసుక్రీస్తును అడిగినదానికి సమాధానంగా , ఆయన ఇలా చెప్పాడు, “ఇక్కడ ఉన్న లిల్లీ పుష్పాల వైపు చూడండి. అవి దారం వడకవు, నేత నేయవు, శ్రమపడవు, కాని చూడండి అవి ఎంత సుందరంగా వికసించాయో.” జీవనగాఢత వాటినంత సుందరంగా చేసింది. మీరు చేసిన పని వల్ల మీలో సొందర్యం కలగదు. మీరు చేసేది ఏదైనా సరే, దాన్ని ఎంత గాఢంగా చేశారన్నదాన్ని బట్టి మీలో ఈ  సౌందర్యం ఏర్పడుతుంది. అది ఏ పనైనా కావచ్చు  – అది కూర్చోవడం కావచ్చు, నిలుచోవడం కావచ్చు, తినడం కావచ్చు, సేవ చేయడం కావచ్చు, ఊడవడం కావచ్చు, ప్రాణాయామం కావచ్చు, ధ్యానం కావచ్చు – ఏదైనా పరవాలేదు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు