భూమి మూలకం అంటే ఏమిటి?

Sadhguru: సద్గురు: యోగ పరిభాషలో, మనం “భూమి” అన్నప్పుడు, మనం ఒక గ్రహాన్ని గురించే కాక, మన భౌతిక దేహాల్ని నిర్మించడంలో, ఆ మాటకొస్తే అంతటినీ నిర్మించడంలో అత్యంత ప్రాధమికమైన మూలకాన్ని ప్రస్తావిస్తున్నాము. మన భౌతిక శరీరాలు ప్రాధమికంగా భూమి, నీరు, గాలి, అగ్ని మరియు ఆకాశాల ఒక సమ్మేళనం. ఈ ఐదు మూలకాల (పంచభూతాల)లో భూమి అత్యంత ప్రాథమికమైనది మరియు స్థిరమైనది. శక్తి వ్యవస్థ మరియు చక్రాల విషయానికి వస్తే, భూమి మూలకం, మూలాధార చక్రానికి సంబంధించినది. ఇతర అన్నీ మూలకాలు దాని ఆధారంగానే నిర్మితమయ్యాయి. భూమి మూలకం మన చుట్టూ ఉన్న భౌతిక పదార్ధంలో కూడా భాగమైనప్పటికీ, మన జీవితపు మూలం నుండి దానిని గ్రహించడం మరియు అర్థం చేసుకోవడం అనేది ఉత్తమం. ఎందుకంటే చాలామంది వారి స్వంత శరీరం ఇంకా మనసులను మాత్రమే నిజంగా అనుభూతి చెందుతారు. మన ఆంతరిక మూలం నుండి భూమి మూలకాన్ని తెలుసుకోవడం మరియు అనుభూతి చెందడం అనేది యోగ ప్రక్రియలో భాగం.

మీరు ఆహరం తీసుకున్నప్పుడల్లా, మీరు భూమిలో ఓ కొంత భాగాన్ని భుజిస్తున్నారు. ప్రాథమికంగా, మన శరీరాన్ని పోషించుకోవడానికి భూమి నుండి కొంత భాగాన్ని లోనికి తీసుకుంటున్నాము.

మీరు ఆహరం తీసుకున్నప్పుడల్లా, మీరు భూమిలో ఒక భాగాన్ని భుజిస్తున్నారు. ప్రాథమికంగా, మన శరీరాన్ని పోషించుకోవడానికి భూమి నుండి కొంత భాగాన్ని లోనికి తీసుకుంటున్నాము. అదే క్రమంలో, మనం మన భూగ్రహం పట్ల ఎలా వ్యవహరిస్తున్నామో, మన శరీరం పట్ల కూడా అలాగే వ్యవహరిస్తాము. మన భౌతిక, మానసిక, భావోద్వేగ పరమైన మరియు ఆధాత్మిక పరమైన శ్రేయస్సులో భూమి మూలకం ఎలాంటి పాత్ర పోషిస్తుందనేది తెలుసుకోవడం మరింత ముఖ్యం. భూమి మీతో సహకరించకపోతే గనుక, మీరు ఎక్కడికీ చేరుకోలేరు. మీ శరీరం సహకరించకపోతే, మీకు ఉండే లక్ష్యాలు ఏవైనా కావచ్చు, మీరు ఎక్కువ దూరాన్ని చేరుకోలేరు. మీరు భౌతికత నుంచి పూర్తిగా విడివడనంత వరకూ, అది మీ జీవితంలోని ప్రతీ అంశాన్ని శాసిస్తుంది.

మీ భౌతిక సారం మీరు లోపలికి తీసుకున్న భూమి ద్వారా ఏర్పరచబడింది. ‘మీరు’ అనే దాని భౌతికతకు మూలం భూమి, కానీ అది మీ దారికి అడ్డుపడుతుంది. మీరు నీటిని, గాలిని సులభంగా రూపాంతరం చెందించవచ్చు. అగ్నికి కొంత కృషి అవసరమౌతుంది కానీ, నిజానికి అది మీ మార్గానికి అడ్డురాదు. కేవలం కొంత భూమి మీకు అవరోధం కాకుండా చూసుకోవడం అనేది సంక్లిష్టంగా మారింది, ఎందుకంటే మీరు దానితో గుర్తించబడ్డారు. మీరు దానిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదైతే సోపానమో, అదే ఇప్పుడు అవరోధంగా మారింది ఎందుకంటే మీరు దానితో గుర్తించబడ్డారు.

భూమి మూలకం – అసలైన అమ్మ

భారతీయ సంస్కృతిలోని ఒక ప్రగాఢమైన అవగాహన భూమిని అమ్మగా చూడడం. మన పుట్టుకకి మూలం భూమి. మనకు పేగు పంచిన అమ్మ, అందుకు ఒక ప్రతినిథి మాత్రమే. ఆమె పుట్టుకకి కూడా ఆ భూమే మూలం. ఏ మట్టినైతే మనం శరీరాలుగా మోస్తున్నామో, ఆ భూమే అసలైన అమ్మ. ప్రస్తుతం మీరు మోస్తున్న శరీరం, గతంలో- కీటకం, పాము, ఆవు, కోతి మరియు మనిషిగా ఇలా లక్షలాది శరీరాలుగా ఉంది. నేను పరిణామక్రమం గురించి మాట్లాడడం లేదు. కానీ భూమి ప్రతీ జీవ స్వరూపాన్నీ ధరిస్తూ ఉంది. మట్టి ఒక వస్తువు కాదు. అది మీకంటే పురాతనమైనది, వివేకవంతమైనది, ఎంతో మేధస్సు కలిగినది మరియు సామర్థ్యం కలిగినది. ఒక వ్యక్తిగా మీకంటే, అది ఎన్నో రెట్లు పెద్ద ప్రక్రియ.

మట్టి ఒక వస్తువు కాదు. అది మీకంటే పురాతనమైనది, వివేకవంతమైనది, ఎంతో మేధస్సు కలిగినది మరియు సామర్థ్యం కలిగినది. ఒక వ్యక్తిగా మీకంటే, అది ఎన్నో రెట్లు పెద్ద ప్రక్రియ.

కానీ ఈ రోజుల్లో, మనం మట్టిని ‘మలినం’గా చూడడం మొదలుపెట్టాం. పిల్లలు గనుక వాళ్ళ చేతుల్ని మట్టిలో ఉంచితే, ఈరోజుల్లో తల్లులు, “మీ చేతులు మురికిగా ఉన్నాయి.” అంటారు. అవి మురికిగా లేవు – మీరు మీ జీవానికి మూలమైన దానిని స్పృశిస్తున్నారు. జీవాధారమైన దానిని, మలినంగా పొరబడితే, మీరు మీ మూలాల్లోకి వెళ్లి, మీ పూర్తి సామర్థ్యాన్నీ, సంభావ్యతనీ చేరుకుని, కుసుమించి, ఫలాన్ని పొందే అవకాశం చాలా తక్కువ అవుతాయి.

“నా వేళ్ళు మురికిగా అవుతున్నాయి అని ఒక చెట్టు అనుకున్నట్లయితే గనుక పువ్వూ ఉండదు, కాయా ఉండదు. ఒక చెట్టు భూమిలోకి తన వేర్లని పాతుకున్నప్పుడు, అది దాని జీవాధారం అని ఆ చెట్టు గ్రహిస్తుంది. కానీ, మనం, భూమి మీద అత్యంత తెలివైన జాతిగా కనిపించే మనం – దీనిని గ్రహించలేక పోతున్నాము. ప్రస్తుతం మానవులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మూలం ఇదే. జ్ఞానోదయం, జీవం యొక్క ఇతర పార్శ్వాలను చూడడం గురించి మరచిపోండి, మానవుడు ఆరోగ్యంతో కూడా ఉండలేకపోతున్నాడు. ఇతర అన్నీ ప్రాణులు చాలా సునాయాసంగా దానిని పొందగలుగుతున్నాయి. దీనికి కారణం, వారు (మానవులు) తమ వేర్లని భూమిలో ఉంచరు. వారి మస్తిష్కాల్లో ఎక్కడో, భూమి మలినంగా మారింది.

మన్నుని గురించి సద్గురు రాసిన ఒక పద్యం.

మన్ను

నీవు పాదం మోపి తిరిగే ఆ మన్ను

నువ్వు మకిలిగా చూసే ఆ మన్ను

ఆకుగా, కుసుమంగా, పండుగా

మారే గారడీలు చేసే సామాను!

జీవం అని నీకు తెలిసిందల్లా ఒకప్పుడు

ప్రవిత్ర భూమాత, శాశ్వత గర్భాన దాచినదే!

ఆమె కొందరికి తల్లి, ఇంకొందరికి మకిలి,

ఆమెది జీవం పొదిగిన శరీరం, కానీ మట్టిది.

రైతు నాగటి చాలు కిందా అదే,

కుమ్మరి కుండ చక్రం కిందా అదే,

అన్నిటికీ మించిన ఆ దైవానుజ్ఞగా

అయ్యింది గారడీల కర్మాగారంగా

Love & Grace
 

భూమి (పృథ్వీ) మూలకంపై ఆధిపత్యం సాధించడం 

భూతశుద్ధి అనేది, మీ శరీరాన్ని మీకు కావలసిన విధంగా మలచుకుని, దానిపై ఆధిపత్యం పొందేందుకు గల ఒక విధానం. తద్వారా మీ శరీరం మీరు కోరకున్న విధంగా పనిచేస్తుంది. కానీ అదే సమయంలో, శరీరం అద్భుతమైన సామర్థ్యాన్ని సంతరించుకోవడం కూడా కొంతమందికి సమస్య కాగలదు. అది ఎంతో చక్కగా పనిచేయడం వల్ల వారు తమని ఆ శరీరంతోనే ఎక్కువగా గుర్తించుకుంటారు. కాబట్టి భూతశుద్ధి అనేది సమతుల్యత, ప్రావీణ్యత మరియు నిరాపేక్షలతో కూడి ఉంటుంది. అన్ని సాధనలూ శరీరాన్ని దృఢంగా, సమర్థంగా ఉంచుతూనే, దేహంతో మనకు గల గుర్తింపు నుండి కొంత దూరంగా ఉండడం కోసం ఏర్పరచబడ్డాయి. భూమి మూలకంపై చేసే సాధనలు ప్రత్యేకించి, ఎలా రూపొందించబడ్డాయి అంటే, వాటిని సరైన ఉపదేశం లేకుండా ఎన్నడూ బోధించలేదు. ఎందుకంటే దక్షత కంటే నిరాపేక్ష అనేది మొదటి సోపానం అవ్వాలి. లేనట్లయితే, ప్రజలు దానిలో మరింత చిక్కుకుపోతారు. ప్రత్యేకించి భూమి సంబంధమైన సాధనలు ఇలా ఎంతో కట్టుదిట్టమైన పర్యవేక్షణతో కూడి ఉంటాయి, ఎందుకంటే శరీరం అద్భుతమైన సామర్థ్యాన్ని పొందితే, పొందిన ప్రావీణ్యాన్ని దూరంలో నిలుపకపోతే (పొందిన ప్రావీణ్యంతో తగిన అంతరం గనుక లేకపోతే), మీరు ఇప్పుడు ఉన్న దానికన్నా మరింత అజ్ఞానులుగా అవుతారు.

మీరు ఆ మకిలిని మీ దారి నుంచి తొలగించాలి, కానీ అదే సమయంలో అది లేకుండా మీ మనుగడ లేదు, కాబట్టి మీరు దానిని మరింత దక్షతతో, స్పృహతో చేయాల్సి ఉంటుంది. అదే మన్నుని అనేక రకాల వస్తువులుగా మలచవచ్చు. మీరు దానిని ముద్దగా చేసి ఎవరిమీదైనా విసరవచ్చు లేదా మీరు దాని నుండి ఒక కుండని చేయవచ్చు. మీరు కేవలం నీళ్ళని నింపుకునేందుకు ఒక కుండని చేయవచ్చు లేదా దాని నుండి చక్కటి పింగాణి పాత్రని చేయవచ్చు. మీరు ఎన్ని ప్రక్రియలను ఆ మట్టిపై ప్రయోగించేందుకు సుముఖంగా ఉన్నారనే దాన్ని బట్టి, మీరు అనేక వస్తువులు తయారు చేయడం అనేది ఆధారపడి ఉంటుంది. మీరు కూడా అదే పదార్థంతో తయారు చేయబడ్డారు. మీరు ఎన్ని ప్రక్రియల గుండా వెళ్తారనే దాన్ని బట్టి, తదనుగుణంగా శరీరపు నాణ్యత అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. సరైన అంతరం గనుక లేకుండా దీని నాణ్యత గనుక వృద్ధి చెందితే, అది ఒక సమస్యలా మారుతుంది. భూమి మూలకానికి సంబంధించిన సాధనలు, ఒక నిర్దిష్టమైన పద్దతిలో బోధించబడుతాయి, కాబట్టి ఈ సామర్థ్యము(దక్షత ) మరియు దానితో ఉండవలసిన అంతరాల యొక్క సమతుల్యత ఏర్పడుతుంది. ఈ రెండూ కలిసి జరగాల్సిందే.

Editor's Note:  Thaai Mann is a consecrated earth mixture prepared under Sadhguru's guidance. Applying Thaai Mann strengthens one's connection with the earth, bringing stability to the system and enhancing one’s capacity for rejuvenation. 

Order Online from Isha Life