మూడు అధోచక్రాలు మూడు ఊర్ధ్వ చక్రాలు కలిసేటి అనాహత చక్రంపై సద్గురు దృష్టి సారించారు. ఆ అనాహత మండలంలో ప్రవేశిస్తే కలిగే లాభ నష్టాలు గురించి ఆయన చర్చిస్తున్నారు.

సద్గురు: అనాహత చక్రం సాధారణంగా రెండు త్రిభుజాల కలయికగా ఆరు-బిందువుల నక్షత్రం గుర్తులా, కేంద్రంలో ఒక చుక్కతో ఉంటుంది. ఇది క్రింది మూడు చక్రాలు, పైన మూడుచక్రాలు ఒక విధంగా  విలీనమవ్వడానికి ప్రతీక. అంటే అనాహత ఒకదానిలోనే ఆరు లక్షణాలు ఉన్నట్లు అర్ధం. అనేక సంస్కృతులు వివిధ గుణాలను నిర్ధేశిస్తూ ఈ గుర్తుని ఉపయోగిస్తాయి, కానీ అది ముఖ్యంగా ఊర్ధ్వగమన త్రిభుజం  అధోముఖమైన త్రిభుజం కలయికతో వచ్చింది. ప్రతీజీవిలో ఎదుగుదల గురించి అవగాహన ఎలాగున్నా, మౌలికంగా ఏదోవిధంగా ఎదగాలని ప్రయత్నించడాన్ని, ఊర్ధ్వగమన త్రిభుజం సూచిస్తుంది. 

ఎదుగుదలకై సహజ ప్రేరణ

ఒక చిన్న క్రిమి చెట్టును ఎక్కాలని కోరుకోవచ్చు. ఒక పక్షి ఆకాశంలో ఎగరాలని కోరుకోవచ్చు. ఒక మనిషి ధనవంతుడుగా, కీర్తివంతుడుగా ఇంకా బలవంతుడుగా లేదా జ్ఞానిగా కావాలని కోరుకోవచ్చు. ఈ ప్రయత్నాలన్నీ ఎదగడానికే. ఇదంతా సృష్టి యొక్క సహజ లక్షణం – ప్రతీ జీవి తన పూర్తి సామర్ధ్యానికి చేరాలని ప్రయత్నించడం సహజం. కొందరు ఎరుకతో చేస్తారు, చాలామంది ఎరుక లేకుండానే చేస్తారు, ఏదేమైనా ప్రతివారు ఎదుగుదలకు ప్రయత్నం చేస్తారు.

ధనార్జనకై ఒకరు పెట్టే పరుగులు మంచిది కాదని మీరు అనుకోవచ్చు. కానీ అదికాదు, అతను కూడా తనకు దొరికిన సోపాన మార్గం ఆసరాతో ఎదగాలని ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతానికి అతని సోపాన మార్గం ధనమే. మీ సోపాన మార్గం మీ శక్తిఅనో, అనుభవమనో, మరొకటనో మీరు అనుకోవచ్చు. మరొకరికి ఎదుగుదల అంటే వారి భావోద్వేగాలనుకోవచ్చు. ఒక్కొకరు ఒక్కో విధంగా భావించవచ్చు లేదా అనుసరించవచ్చు, కానీ ప్రతీజీవిలోను - అది మనిషిలోనైనా మరొకదానిలోనైనా ఎదుగుదలకై ప్రయత్నం ఉంటుంది. జీవ స్వభావం ఇంకా  సృష్టి స్వభావం ఇదే.

ఇలా ఎదగాలనే కాంక్షకు కారణం మీరు భూతలంపై ఒకచోట ఉండడం, అంటే ఒకే ప్రదేశంలో అతుక్కుపోయి ఉన్నట్లు కలిగే భావన. మీరు ఇక్కడ ఉంటే, అక్కడ ఉండలేరు. మీరు భూతలంపైనే ఒక చోట స్థిరపడ్డారు కనుక, ఇక్కడ ఉన్నదిశల్లో వెళ్ళడంకంటే పైకి వెళ్ళడం మెరుగు అనుకుంటారు. 

మూలం అంతటా వ్యాపించి ఉంది

మేము ప్రస్తావిస్తున్న, సర్వం లభించే మూలం, ఒకే ప్రదేశానికి పరిమితం కాదు. అది అన్నిచోట్లకూ చలిస్తూ అన్నిటిలోకి ప్రవహిస్తుంది. దానికి ఒక దిశ అని, ఒక ప్రాంతం అని ఉండదు. మీరు ఒకేచోట అతుక్కుని ఉంటే, మీకు వెళ్ళేందుకు ఒక దిశ ఉంటుంది. మీరు భూతలంపై ఒకచోటే అతుక్కుని లేకపోతే మీరు ప్రతీచోటా ఉన్నట్లే. ఎటువైపు వెళ్ళేది ఉండదు, అంటే అక్కడ (అంతటా) ఉన్నవాటినన్నిటిని గ్రహించగలరు.

ఈ సందర్భంలో యోగపదజాలం ఈ రెండు త్రిభుజాలని వాడింది. జీవి, పైదిశగా చలించడానికి ప్రయత్నిస్తోంది. మూలం క్రిందివైపుకి రావడం గాని పైవైపుకి పోవడం గాని చేయటంలేదు – అది అన్నిటిలోకి స్రవిస్తోంది. అంటే గాలిలాగ అన్నమాట. గాలి కేవలం ముక్కు రంధ్రాలలోకే కాదు చెవులలోకి, చర్మ రంధ్రాలలోకి, తెరిచి ఉంటే నోట్లోకి కూడా ప్రవేశిస్తుంది. ఆ విషయంలో దానికి ఎంపిక ఉండదు – ఎక్కడ చోటు ఉంటే అక్కడ ప్రవేశిస్తుంది.

అలాంటిదే - ఇది కేవలం ఒక పోలిక – ఏదైతై అన్నిటికీ మూలంగా మనం భావిస్తున్నామో అది సర్వత్రా వ్యాపించి ఉంటోంది. కానీ మీ దృష్టికోణం నుంచి చూస్తే, ప్రస్తుతం ఇక్కడ మీరు కూర్చుండగా, మంచిగాలి వాయు మార్గం ద్వారా క్రిందికి చేరుతోంటే, చెడుగాలి పైకిచేరి అదే మార్గంనుండి బయటకు వస్తోంది. “మనకి ఏది మంచిదో” అదే మంచిది అన్నది, మంచికి మనమిచ్చే నిర్వచనం. మన గ్రహవాసులే అయినా ఇతర జీవులు దానిని మంచి అని సమ్మతించక పోవచ్చు. ఇది సందర్భానుసారం అర్ధం చేసుకోవాలి. యదార్ధానికి గాలి మీ చర్మరంధ్రాల ద్వారా కూడా పోతుంటుంది, కానీ దాని వాయు మార్గమే ప్రధాన మూలం. మీరు శ్వాసను నిరాకరిస్తే, మీరు మరణిస్తారు, కనుక శ్వాస తప్పనిసరి అనేది మీకు తెలుసు.

అవకాశాలు - అపాయాలు

ఈ సందర్భంలో ఒక జీవి అంటే మీరు పైకి జేరే ప్రయత్నం చేస్తున్నారు – ఇదే ఊర్ధ్వ- గమన త్రిభుజం. అలాగే సృష్టికి మూలం లేదా దివ్యత్వమే అది అధో-ముఖ త్రిభుజం. అనాహతం అంటే రెండు త్రిభుజాలు ఒకే కేంద్ర బిందువుతో ఆరు కోణములు ఏర్పడేలా సరైన వరుసలో కలిసే ప్రదేశం. అంటే ఒకే ప్రదేశంలో అనేక అవకాశాలు ఉన్నట్లు. ఒకవేళ ఒకే ప్రదేశంలో అత్యధికమైన అవకాశాలు ఉన్నట్లయితే, అనేకమంది అన్నిటినీ చేజార్చుకుంటారు. అక్కడే ఎన్నో విషయాలు జరుగడంవలన మనుషులు వాటన్నింటిపై ధ్యాసతో ఏ ఒక్కదాని గురించి యదార్ధం గ్రహించలేరు, కానీ అది వారికి ఎంతో వినోదాన్ని అందిస్తుంది.

అది ఈ రోజుల్లో ఎందరో పిల్లలు, తమ స్వేచ్ఛకు తగిన విషయాన్ని ఎంచుకునేందుకు వీలయిన అమెరికా విశ్వవిద్యాలయల్లో జేరినట్లుగా ఉంటుంది. ఏది చేయాలో శ్రద్ధగా స్పష్టంగా అవగాహన ఉండే విద్యార్ధులు, లేదా ఒక పద్ధతిగా సాగాలనే నియమబద్దత కలవారు మాత్రం ప్రత్యేకమైన విషయ అధ్యయనం చేపడతారు. మీరు స్పష్టమైన దృష్టి గలవారైనా అయ్యుండాలి లేదా మీరు ఏది చేయాలో తెలుసుకునే మొండి పట్టుదలైనా ఉండాలి. అలా కాకపోతే వాళ్ళు అండర్ గ్రాడ్యుయేషన్లో చేరి ఒక సబ్జెక్టు గురించి రెండు నెలలు, తరువాత మరో సబ్జెక్టు గురించి మరొక రెండు నెలలు అధ్యయనం చేస్తారు. ఇంకా మరి కొన్నినెలలు మరో సబ్జెక్టు అంటూ నాలుగు సంవత్సరాలు గడిచినా సరే వారు ఏం ఘనకార్యం చేస్తున్నారో తెలియదు. దీనికి కారణం ఎన్నో అవకాశాలు ఉండటమే. స్పష్టమైన అవగాహన లోపించినపుడు మీరు ప్రతీ విషయంలోను వేలు పెట్టినా దేనినీ ఎంచుకోలేరు. అందుకనే ఈ భూమిమీద అనేకమంది అదృష్టంపై ఆదారపడతారు.    

అనాహతచే విపరీతమైన అవకాశాలు కలుగుతాయి. ఎన్నో అవకాశాలు ఇంకా ఎంతో సందిగ్ధత ఉంటుందని, ఎప్పుడూ నేను కొంతమందినే తప్ప చాలా మందిని అనాహత సాధనపై పెట్టలేదు. అనాహత సాధనకు రెండు విషయాలు కావాలి: మధురమైన భావన ఇంకా పరిపూర్ణంగా స్థిరంగా ఉన్న బుద్ధి. బుద్ధి అంటే సూక్ష్మపరిశీలన; అంటే ఏది యదార్ధమైనది, ఏది కానిది, ఏది జ్ఞాపకం ఏది ఊహాత్మకం, ఏది అనుభవం ఏవి మానసికమైన కల్పనలు అనేవాటి మధ్యన సూక్ష్మపరిశీలన అవశ్యకం. ఇటువంటి పరిశీలనా దృష్టిలేకుండా అనాహతను చేరడం సరైనది కాదు. ఎందుకంటే ఇక్కడ వినేవాటిని బట్టి ఇంకా చూసే వాటిని బట్టి సహజంగా స్థిర స్వభావుడైనా వెర్రివాడు అవుతాడు. అదే మార్గంలో వెళ్ళాలనే లక్షణంగల వారైతే మొత్తం అలాగే సాగిపోతారు. 

అనాహతం – మ్రోగించని శబ్దం

అనాహతం అంటే ప్రతిధ్వని లేని ధ్వని. అనాహత నుంచి మొట్టమొదట ఆవిర్భవించినవి శబ్దాలే కనుక దానిని అనాహతం లేదా మ్రోగించని శబ్దం అని అంటారు. భూమిపై సంభవించే అనేక రకాలయిన శబ్దాలన్నీ ఒకదానితో ఒకటి తాకడంతోనే వస్తాయి. ఇది ఒక మ్రోగించని శబ్దం – మీరు ఊరికే మౌనంగా కూర్చుంటే, అన్ని రకాలైన శబ్దాలు వస్తాయి – అటువంటి వివిధ రకాల శబ్దాలు నూట ఎనిమిదిగా గుర్తించడం జరిగింది. ఇదే ఆధారంగా ఈ సంస్కృతిలో వివిధ దేవతలకు సంబంధించి వివిధ శబ్దాలు ఉన్నాయి. ఉదాహరణకు శివుడుకి సంబంధించి ఇది డమరుకం. డమరుకం అంటే రెండు సమబాహు త్రిభుజాల అంచులు కలుస్తున్న రూపంగల చిన్న డోలు.

మీరు అనాహతను చేరినపుడు లేదా మీ శక్తి అనాహతలో ఆధిక్యత సాధించినపుడు, మీరు ఇప్పటి వరకు వినలేని శబ్దాలు వినడం మొదలు అవుతుంది. గంటా నాదం, డోలు, లేదా వేణువు వంటి వాయుసంగీత – శబ్దాల వివినికిడి అనుభూతులు ఆరంభం కావచ్చు. మీరు పక్షుల, జంతువుల, భూమి ఇంకా వాతావరణ భాషలను వినడం లేదా గుర్తించడం ప్రారంభిస్తారు. అనాహతం మూలంగా ఇవన్నీ వినడం వస్తుంది.

వేరేవిధంగా చూస్తే వీటన్నిటినీ వినడం మానసిక అసమతుల్యతలాంటిది, అయినా ఇది అదే. ఒక విధంగా మానసిక సమతుల్యత లేనివారు వేరే విధంగా మంచి గ్రహణశక్తి కలవారు కావచ్చు. ఒక విధమైన వైకల్యం మరొక విధంగా సామర్ధ్యం కలిగిస్తుంది, కానీ మీకు ఈ రకమైన సామర్ధ్యం అంత మంచిది కాదు. ఇది అప్పుడే నడక నేర్చుకుంటున్న పిల్లవాడిని మారథాన్ పరుగు పందెంలో పెట్టినట్లే – అలాగయితే తప్పకుండా తనకు తానే హాని కలిగించుకుంటాడు. అవి ఎంతో మంచి విషయాలే అయినప్పటికీ మీరు అందుకు తగినట్టుగా సిద్ధం కాకపోతే, అప్పుడు చెడు పరిణామాలే కలుగుతాయి.

ఇందువలనే ఏదైనా వినే ముందు, మీ వివేచనా బుద్ధి, స్పటికమంత స్వచ్ఛతతో మధురమైన భావోద్వేగంతో ఉండాలి. మీలో స్థిరమైన మధురమైన భావోద్వేగం లేకపోతే, మీరు ఎన్నిటినో చెయ్యలేరు; మీరు నిజంగా అసమర్ధులవుతారు. మధురమైన భావోద్వేగం మీలో లేకపోవడమంటే, మీరు ఈ విశ్వాన్ని ఇంకా ఈ  గ్రహంమీద ఉన్నవాటన్నిటినీ నిరాకరిస్తున్నారని అర్ధం. మీ భావోద్వేగాన్ని మధురంగా ఉంచగలిగితే మీరు అనేక అన్వేషణలు సాగించి కూడా మీరు లక్షణంగా ఉండగలరు. అలాకాక అనాహతను చేరి మీకు తెలియనివి చూసినా లేక విన్నా, మీరు ఠారెత్తిపోతారు.

అది భయంకరమైన సినిమా చూస్తున్నట్లుగా ఉంటుంది. నేను చిన్న చిన్న సన్నివేశాలను చూసాను, ఈ సినిమాలు భాధాకరంగా ఉంటాయి. అవి నన్ను భయపెట్టవు. ఉదాహరణకు, హఠాత్తుగా కళ్ళనుండి రక్తం బయటకు కారుతుంటుంది. శరీరంలో ఎల్లప్పుడూ రక్తం ప్రవహిస్తూంటుంది. ఒకవేళ కొద్దిగా కారినప్పటికీ దానిగురించి అంతగా భయపడేది ఏముంది? ఎక్కడనుండి కారితే మాత్రం ఏమిటి? ప్రజల్లో ఎంతోమందికి వారి శరీరంలో రక్తం ప్రవహిస్తుందన్న ఎరుక లేకపోవటం వలనే ఇది భయంకరంగా అనిపించడానికి కారణం. అవగాహన లేనివాళ్ళు అనాహతంను స్పృశించడం కూడా ఇటువంటిదే – అక్కడ దానిలో ఏదో హఠాత్తుగా జరిగి రూపాలు బయటపడతాయి – అది పూర్తిగా ఠారెత్తించే అనుభవం అవ్వగలదు.  

అనాహతం -  ఉగ్రదేవతలు

యోగవిజ్ఞాన శాస్త్రంలో, తంత్రయోగం అనబడే ఒక పార్శ్వం ఉంది. తంత్రంలో ఒక ముఖ్యమైన అంశం యోగులు తమ స్వంత దైవాలను సృష్టించుకుంటారు – వారు ఒక విధమైన శక్తిరూపాన్ని సృష్టించి దానిని సజీవిగా చేస్తారు. ఆ రూపం – మగ లేదా ఆడ లేదా ఏదైనా – ఎల్ల వేళలా అది యోగితో పాటు నడుస్తూంటుంది. అందుచేతనే అతనికి సాహచర్యం అవసరం ఉండదు. అతనికి ఉన్న ఈ స్థిరమైన సాహచర్యం వల్లనే వివాహం చేసుకోడు కూడా. సాధారణంగా ఈ యోగులు ఉగ్ర స్వభావంగల స్త్రీ రూపాలను సృష్టించారు. 

మీరు రాకిణి, ఢాకిని, చిన్నమస్త, కాళీ రూపాలను చూసే ఉండవచ్చు, ఇవన్నీ చాలా ఉగ్రంగా ఉంటాయి. అలాగే ఉండాలన్న కోరికే వాళ్ళు ఈ రకమైన రూపాలను సృష్టించడానికి ఒక కారణం. ఈ రూపాల భౌతిక అందచందాలకు లేదా వేరే దేనికైనా కానీ వీళ్ళు ప్రభావితం కాకుండా ఉండాలని కోరుకుంటారు. మరొక కారణం ఏమిటంటే, ఒక వేళ మీకు ఒక మట్టి ముద్దను ఇచ్చి “ఆదియోగి రూపాన్ని చేయండి” అంటే, అది ఎలాగ తయారవుతుందో మీకే తెలుసు – ఉద్ధేశ్య పూరకంగా కాదు; కేవలం మీ చేతులకు చాతుర్యము లేకనే.

ఏదో ఒక కారణంచేత, వాళ్ళు ఈ రకమైన రూపాలను సృష్టించారు. ఆ రూపాలను సృష్టించిన యోగులు ఎప్పుడో గతించారు. ఈ ఉగ్రదేవతలను సృష్టించడానికి తగిన ప్రయోజనం వాళ్ళు పొందిన తరవాత వాటిని వదిలేసారు. వీటిలో చాలా రూపాలు ఇప్పటికీ మన చుట్టూ ఉన్నాయి, కొంతమంది మనుషులు ఇంకా వాటిని ఉపయోగించుకుంటన్నారు. మీరు మీ అనాహతను స్పృశించినపుడు ఈ రూపాలు తమను స్వాగతించే సూచనగా భావించి, అవి మీ వద్దకు చేరవచ్చు. అవి దగ్గరకు వస్తే మీరు వాటిని ఉపయోగించుకోరు – అవి మీమాదిరిగా కనపడవు కనుక మీరు వెంటనే ఠారెత్తి పోతారు.  

ఒకవేళ ఎవరికైనా ముక్కుకు బదులు కేవలం రెండు రంధ్రాలు ఉంటే – వారిని చూసి మీరు బెంబేలెత్తిపోతారు. మీరు ఆ విధమైన స్థితిలో ఉంటే, మీరు అనాహతలోకి వెళ్ళకూడదు, ఎందుచేతనంటే అది వివిధ సూక్ష్మ రూపాలను ఆకర్షిస్తుంది. అనాహతకు సృజనాత్మక శక్తి ఉంటుంది; ఇక్కడే మనుషులు కొత్తవి సృష్టించగలరు. ఒకసారి మీరు ఈ పార్శ్వాన్ని స్పృశిస్తే, మీకు అటువంటి రూపాలు ఆకర్షితమవుతాయి. చిత్రలేఖనం, సంగీతం ఇంకా ఇతర కళల కన్నా ముందే ఈ సూక్ష్మ రూపాలు మీవద్దకు చేరతాయి, ఎందుకంటే అవి ఈ అస్తిత్వంలో ఉన్న అతి తేలికైన రూపాలు – వాటికి చాలా తక్కువ జడత్వం ఉంటుంది. కాళి మీ వద్దకు చేరుతుంది. కొంతమంది కాళిని చూడాలని తమ జీవితమంతా వెళ్ళబుచ్చుతారు, కానీ ఆమె మీ కలలోకొస్తే, రేపు మీ పక్క బట్టలు కడగవలసి వస్తుంది! తాము పూర్తిగా మామూలుగా, తగినంత ధైర్యంతో వివిధ విషయాలను అన్వేషించగలం అనుకునే చాలా మందికి అలా జరిగింది – ఏదో కొంచెం అటు ఇటూ అయితే చాలు, వారి పని ఇక సమాప్తం. 

మీరు అనాహతను వదిలిపెడితే మీరు సహజంగానే విశుద్ధిలోకి వెళతారు. విశుద్ధి గుప్త జ్ఞానానికి కేంద్రం. మీరు ఈ గుప్త జ్ఞానంలో నైపుణ్యం సాధించాలంటే, ముందుగా మీరు మీలాగ కనిపించని, ఇతర జీవులని అంగీకరించగలగాలి. ఎవరైనా మీలాగా కనిపించని వాళ్ళు మీకు ఘోరంగా కనిపించవచ్చు. కాళీ, చిన్నమస్త, డాకినీ, లంకిణీలు మీ అనుభవంలోనికి రావడం ప్రారంభిస్తారు. అవి అద్భుతమైన అవకాశాలు, కానీ మీలో భావోద్వేగంలోని మాధుర్యం, బుద్ధి కుశలత లేకపోతే, ఇది మీకు ఠారెత్తించే అనుభవమే కాకుండా మిమ్మల్ని భంగపరచవచ్చు.

కాలంతో దురవస్థ

యదార్ధంగా కాకపోయినా, కలలోనైనా సరే ప్రతీరోజూ ఘోరమైన దృశ్యాలు కనిపిస్తే, చాలామందికి పిచ్చి ఎక్కినట్టవుతుంది, కారణం తగినంత మనోస్థైర్యం వాళ్ళకి ఎలాగూ లేదు కనుక. ఇది నేను వ్యంగ్యంగా చెప్పడంలేదు. ప్రత్యేకంగా ఆధునిక విద్యా వ్యవస్థ మనస్సుపై కాక జ్ఞాపకశక్తిపైనే పనిచేస్తూ మానవత్వానికి విపరీతమైన హాని చేస్తోంది. ఆధునిక విద్యావ్యవస్థ తమ ఉత్పత్తి ఫలితం ఆర్ధిక యంత్రాంగంలో ఎక్కడోఅక్కడ ఇమడ్చడమనే దానిపైనే కేంద్రీకరిస్తోంది, ఉన్నతమైన మానవ సమాజాన్ని తయారుచేయాలని ప్రయత్నించడంలేదు. సద్గుణవంతులైన మానవులపై నేటి సమాజం సరైన శ్రద్ధ పెట్టడంలేదు, ఎందుకంటే వారు ఆదేశాలను అనుసరించరు. ఎందుకంటే వీరు ఈ సమాజ జీవనశైలికి సరిపోకపోవచ్చు. గొప్ప లక్షణాలను చూపినవారిలో చాలామంది గతంలో మారణకాండకు గురయ్యారు, అందుకు కారణం,  సామాన్యులైతే సమాజానికి ఎటువంటి హానీ లేదు, కానీ గొప్పవ్యక్తులు పరిస్థితులను తల్లకిందులు చేసేయవచ్చు.   

ప్రస్తుతం మధురమైన భావోద్వేగం, బుద్దికుశలత కలిసి ఉపయోగించడానికి తగినట్టు మానవ మేధస్సు అభివృద్ధి చెందడంలేదు. చాలావరకు ఎంతో కొంత తెలివి ఉన్నవారు, వారిలో వారే చేదు భావావేశాలకు గురవుతున్నారు. తెలివి ఇంకా మధురమైన భావోద్వేగం కలవారు మీకు చాలా కొద్దిమందే కనపడతారు. తెలివి గలవారు ప్రతీవాడినీ ఖండించాలి అనుకుంటారు. మధురమైన భావోద్వేగం కలవారు మూర్ఖులుగా భావింపబడుతున్నారు. ఇంచుమించు ప్రపంచ వ్యాప్తంగా ఇదే జరుగుతుంది: మీరు బుద్దికుశలత గలవారైతే, మీరు తీయని భావంతో ఉండలేరు. మీరు మధురమైన భావం కలవారైతే మిమ్మల్ని మూర్ఖుడుగా లెక్కకడతారు. ఈ రకమైన వర్గీకరణ ప్రపంచమంతా జరుగుతోంది, అది ఎంతమాత్రం మంచిది కాదు. అనాహతం అద్భుతమైన ప్రదేశం, కానీ ఈనాటి ప్రపంచంలో మనస్సును పదునుగా పెట్టుకుని, తమ భావాలను మధురంగా  చేసుకోగల వారిని తయారుచేయడమనేది చాలా కష్టం. 

అనాహత సాధనకు సమతుల్యత అవసరం

అనాహతలో ప్రవేశించడం అంటే మీలోనే రెండు పార్శ్వముల కలయికగా కొన్ని సంప్రదాయాలు చూస్తాయి. బాగా తాంత్రిక లక్షణం కలవారు అనాహతలో మనిషి తనలోని దివ్య శక్తితో కలవడంగా చూస్తారు. అనాహతం ఒక బ్రహ్మాండమైన ప్రదేశము, కానీ మీరు దానికి తగ్గట్టు సంసిద్ధం కాకపోతే అదే భయానకంగా తయారవుతుంది. విశ్వానికంతటికి కేంద్రం బ్రహ్మాండమైనది కావచ్చు, కానీ మీరు ఆ ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా ? అక్కడికి చేరడానికి కావలిసిన అంతఃవ్యవస్థను మీరు సిద్ధం చేసుకోవాలి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు