ఈ కథ ఈశా యోగా కేంద్రంలో 1994 జరిగిన  హోల్నెస్ కార్యక్రమం నుండి సేకరించబడింది. ఇందులో, సద్గురు ఉపనిషత్తుల నుండి నచికేతుని కథను చెప్పారు. ఇంకా ఆధ్యాత్మికతలోని ప్రాథమిక అంశం అయిన తీవ్రత గురించి వివరించారు.

సద్గురు: ప్రపంచంలోనే నచికేతుడు మొట్టమొదటి ప్రముఖ ఆధ్యాత్మిక అన్వేషకుడు అయ్యుండాలి. ఉపనిషత్తుల్లో ఒకటి అతనితోనే మొదలవుతుంది. నచికేతుడు చాలా చిన్న పిల్లవాడు. అతని తండ్రి ఒక యాగం నిర్వహించడానికి పూనుకున్నాడు, ఆ యాగంలో అతనికి ఉన్న అన్ని భౌతిక సంపదలు - భార్య, పిల్లలు, ఇల్లు, ప్రతిదీ -  ఋషులు, బ్రాహ్మణులు మొదలైన వారికి  దానంగా ఇవ్వాలి. అప్పుడు అతను ఆధ్యాత్మిక ఉన్నతిని   పొందుతాడు. ఇది సంప్రదాయంలో ఏర్పాటు చేసిన ఓ విధానం.

ఆధ్యాత్మిక ఉన్నతికి కొందరు ఇలాంటి వ్రత సంకల్పం చేసేవారు. నచికేతుడి తండ్రి ఈ వ్రతానికి పూనుకుని, పెద్ద ఆర్భాటంగా, అనారోగ్యంతో ఉన్న గోవులను, పనికిరాని ఆస్తిని, ఒక విధంగా భారంగా ఉన్నవి, తనకు వద్దు అనుకున్నవన్నీ ఇచ్చేసాడు. తన ఇద్దరు భార్యలు, పిల్లలతో సహా తనకు అవసరమైనవన్నీ ఉంచుకున్నాడు. నచికేతుడు ఇది చూసి చాలా బాధపడ్డాడు. తన తండ్రికి చిత్తశుద్ధి లేకపోవడాన్ని అతను గమనించాడు. తన తండ్రి సర్వస్వం త్యజించి ఆధ్యాత్మికోన్నతి పొందడానికి వ్రతం చేస్తున్నాడు, కాని అందరిలాగే మాయలు చేస్తున్నాడు. నచికేతుడు తన తండ్రి దగ్గరకి వెళ్ళి దీని గురించి మాట్లాడటం మొదలు పెట్టాడు. కేవలం ఐదేళ్ళ చిన్న పిల్లవాడు, భౌతికంగా ఐదేళ్లే అయినా, అతనికి అద్భుతమైన పరిపక్వత ఉంది.

మీరు నచికేతునిలా ఉంటే, మీకు ఏ మార్గం అవసరం లేదు. అది ఇక్కడే ఉంది.

నచికేతుడు తన తండ్రితో “మీరు చేసింది సరైనది కాదు. మీరు మొత్తం సంపద ఇవ్వకూడదు అనుకుంటే, ఇలా వ్రతం చేసి ఉండకూడదు. ఒకసారి వ్రత సంకల్పం  చేస్తే, మీరు మొత్తం సంపద ఇచ్చేయడం మంచిది. మీరు మొత్తం ఇచ్చేయాలి. నన్ను ఎవరికి ఇచ్చేస్తున్నారు, చెప్పండి?” అని అన్నాడు. అతని తండ్రి కోపంగా, “నేను నిన్ను యముడికి ఇస్తాను” అన్నాడు. యముడంటే, మృత్యువుకి ప్రతీక. ఇది నిజమనుకుని, ఆ బాలుడు యముడి దగ్గరకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. “అలా ఎలా వెళ్ళాడు, శరీరంతోనేనా? శరీరం లేకుండానా?” అని ఆలోచించడం మొదలు పెట్టకండి. విషయం అది కాదు. అతను వెళ్ళాడు.

యముడు అక్కడ లేడు. ఆయన ఎక్కడకో పర్యటనకి వెళ్ళాడు. అయన ఇంటింటికీ  వెళుతుంటాడు. అలా, ఆయన పర్యటించడానికి వెళ్ళాడు. నచికేతుడు మూడు రోజులు ఎదురు చూసాడు. చిన్న పిల్లవాడు, ఆహారం, నీరు లేకుండా, యముడి ఇంటి ముందు ఎదురు చూస్తూ కూర్చున్నాడు. మూడు రోజుల తర్వాత యముడు వచ్చి, ఈ బాలుడిని చూసాడు. ఆకలితో, అలసిపోయి ఉన్నాడు, కానీ పట్టుదలతో ఉన్నాడు. కదలకుండా కుర్చుని ఉన్నాడు. అక్కడా, ఇక్కడా ఆహరం కోసం కూడా వెతుక్కో లేదు. అక్కడే కూర్చొని యముడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎక్కడికీ వెళ్ళకుండా, మూడు రోజుల పాటు అక్కడే ఎదురు చూస్తున్న అతని పట్టుదలను చూసి యముడు చలించిపోయాడు.  “నువ్వు మూడు రోజులుగా ఇలా వేచి ఉండటం చాలా గొప్ప విషయం. నీకు ఏమి కావాలి? నేను నీకు మూడు వరాలు ఇస్తాను. నీకు ఏమి కావాలో కోరుకో?" అన్నాడు.

నచికేతుడు మొదటగా “మా నాన్న ఎంతో దురాశతో ఉన్నాడు. అతనికి ఇప్పుడు ఎంతో సంపద కావాలి. ఆయనకు కావాల్సినవన్నీ మీరు ప్రసాదించండి. ఆయనని రాజుని చెయ్యండి‘‘ అని కోరాడు. “సరే, ప్రసాదిస్తాను‘‘ అన్నాడు యముడు. అతను అడిగిన రెండవ వరం, “నా ముక్తికి, నేను చెయ్యాల్సిన కర్మలు, యాగాలు ఏవో తెలుసుకోవాలనుకుంటున్నాను” అన్నాడు. వేద వాజ్మయం అంతా వేదాలు, యజ్ఞాలు, యాగాల రూపంలోనే మాట్లాడతాయి. యముడు అతనికి కావాల్సినవి బోధించాడు.

తరువాత నచికేతుడు, “మరణం లోని రహస్యం ఏంటి? మరణించిన తరువాత ఏమి జరుగుతుంది?” అని అడిగాడు. యముడు, “ఈ ప్రశ్న నువ్వు వెనక్కి తీసుకో. నీకు ఏమి కావాలన్నా నన్ను అడగవచ్చు, నీకు ఇస్తాను. నీకు రాజ్యం కావాలంటే, ఇస్తాను. సంపద కావాలా, ఇస్తాను” అంటూ ఆయన అలా చెబుతూ పోయాడు, ప్రపంచంలోని సర్వసుఖాలు కావాలా? నేను ఇస్తాను. అవన్నీ నువ్వు తీసుకో, కానీ ఈ ఒక్క ప్రశ్న వెనక్కి తీసుకో” అన్నాడు. అప్పుడు నచికేతుడు, “వాటితో నేను ఏం చేయను? అవేవి శాశ్వతం కావని మీరు నాకు ముందే చెప్పారు. ప్రజలు చేసేవన్నీ అర్థం లేనివని నేను తెలుసుకున్నాను. అదలా ఉంది అంతే.  అది నిజం కాదు. కాబట్టి మీరు నాకు సంపదనిస్తే ఉపయోగం ఏముంది? అది ఒక వల లాంటిది. నాకు ఏమీ వద్దు, నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి” అన్నాడు.

యముడు ఎన్నో రకాలుగా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తప్పించే ప్రయత్నం చేసాడు.  “నీ ప్రశ్నకు సమాధానం దేవతలకు కూడా తెలీదు. నేను నీకు చెప్పలేను” అని ఆయన అన్నాడు. అప్పుడు నచికేతుడు,“అలా అయితే, దేవతలకు కూడా తెలియకపోతే, మీకు మాత్రమే సమాధానం తెలుసు అంటే, మీరు కచ్చితంగా నాకు చెప్పాలి” అంటూ అతను ఆయన్ని వదలలేదు. అతన్ని అక్కడే వదిలిపెట్టి, యముడు మరోసారి కొన్ని నెలల పాటు పర్యటనకు వెళ్ళాడు. ఎలాగైనా ఈ బాలుడిని తప్పించుకోవాలనుకున్నాడు. అతన్ని వదిలించుకోవాలనుకున్నాడు, కానీ ఆ బాలుడు మాత్రం నెలల తరబడి యముడి గుమ్మం ముందే కూర్చున్నాడు. అతనికి పూర్తి జ్ఞానోదయం అయింది. ఈ ఉనికిలో తెలుసుకోవాల్సిన ప్రతిదీ తెలుసుకుని, ముక్తి పొందాడు. అతనే మొదటి అన్వేషకుడు. అతనొక గొప్ప నిదర్శనంగా మిగిలిపోయాడు. చాక్లెట్ లేదా డిస్నీల్యాండ్ సందర్శన లేదా మరేదైనా ఇష్టపడని, అలాంటి దృఢ సంకల్పంతో ఉన్న ఐదు సంవత్సరాల బాలుడు అతను. అతను కోరుకున్నాడు, అంతే.

ఒక వ్యక్తి అలా ఉన్నప్పుడు అతనికి ఓ మార్గం అంటూ ఏమీ అవసరం లేదు ఎందుకంటే, గమ్యం ఇక్కడే ఉంది. వెల్లింగిరి పర్వతాల పైన లేదు. అది ఇక్కడ లేనప్పుడే, వెల్లింగిరి పర్వతాల పైన ఉంటుంది. మనం నెమ్మదిగా ఎక్కాలి. మీరు నచికేతునిలా ఉంటే, మీకు ఏ మార్గం అవసరం లేదు. అది ఇక్కడే ఉంది. మీరు ఎక్కడకీ వెళ్లాల్సిన పని లేదు. ప్రస్తుతం మనం ఇక్కడ చేస్తున్న ప్రతి దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చేసేది తీవ్రతరం చేయడం. ఆ తృష్ణ ఎంత శక్తిమంతంగా, ఎంత బలంగా మారాలంటే, దేవుడు కూడా మిమ్మల్ని తప్పించుకోలేనంతలా మారాలి. దానర్థం దేవుడు మిమ్మల్ని తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నాడు అని కాదు. కానీ, ఈ మనసు, అహం అనేక రకాలుగా  మీకు వాస్తవాన్ని మరుగు పరిచే ప్రయత్నం చేస్తాయి. అనేక విధాలుగా మాయ చేస్తాయి.

తీవ్రత లేనిదే, పరిణితి లేదు

మీరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా, కర్మ, జ్ఞాన, క్రియ, లేదా భక్తి, ఏదైనా, మీ తీవ్రతే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, అంతేగాని కేవలం మార్గం కాదు. తీవ్రత లేనిదే, ఏ క్రియలు, సాధనాలు పనిచెయ్యవు. క్రమంగా, తీవ్రతతో చేసే సాధన, మిమ్మల్ని మరొక కోణానికి దగ్గర చేసే శక్తిని కలిగి ఉంటుంది.

మిమ్మల్ని మార్చేది క్రియ కాదు - మీ తీవ్రత. మీరు ఈ తీవ్రతను కలిగి ఉన్నప్పుడు, క్రియ ఒక అద్భుతమైన ఊతంగా ఉంటుంది, అది దానిని మరింత మెరుగుపరుస్తుంది. సాధన చేయడంలోని ఉద్దేశ్యం అదే. మీరు ఏ మార్గంలో నడచినా,  మీకు తీవ్రత ఉంటే తప్ప, సాధన దానికదే, మీకు ఫలితాన్ని ఇవ్వదు.

మీరు హృదయపూర్వకంగా ప్రేమించకపోతే, అది ప్రేమ కాదు. అది 100% ఉంటుంది లేదా అసలు ఉండదు. మీరు ఎవరినైనా 99% ప్రేమించగలను అనుకుంటే, మీకు ప్రేమంటే ఏంటో తెలీదు అని అర్థం. ఎటువంటి పనికైనా ఇదే వర్తిస్తుంది. మీరు చేసే పనిని 100% చెయ్యకపోతే, అందులో అర్థం లేదు. అది ఎటువంటి ఫలితాలనూ ఇవ్వదు. మహా అయితే, మీకు ఆహారాన్ని సంపాదించి పెడుతుంది. 100% ఉంటే తప్ప, మీలో మార్పు తీసుకురాలేదు. మీరు చేసే క్రియ 100% చేయకపోతే, అది మిమ్మల్ని మార్చలేదు. మీరు 100% ప్రేమించకపోతే, అది మిమ్మల్ని మార్చలేదు. ఇది పరస్పరం ఇచ్చిపుచ్చుకునే పరికరం కావచ్చు, కానీ అస్తిత్వ పరంగా ఏమీ జరగదు.