విషయ సూచిక
1. మనో శక్తి
2. ఏకాగ్రతతో ఉన్న మనసు ఎంతో శక్తిమంతమైనది
3. పలకని తుడిచేయ్యాలి
4. కావలిసింది సాకారం చేసుకోవడం ఎలా?
5. ఈ విశ్వం - నమ్మకం ఇంకా నిబద్దత రెండింటికీ ఫలితాలను ఇస్తుంది
6. సద్గురు “లా అఫ్ అట్రాక్షన్” గురించి అపోహను తొలగించారు

మనో శక్తి

సద్గురు: ప్రజలు తమ జీవితంలో ఏదైనా ఆకాంక్షించినప్పుడు – అది వ్యాపార అభివృద్ధి కావొచ్చు, ఇల్లు కట్టుకోవడం కావొచ్చు, మరేదైనా కావచ్చు: "నాకు ఇది కావాలి" అనే ఆలోచన తలెత్తుతుంది. ఎప్పుడైతే ఈ ఆలోచన తలెత్తుతుందో, చాలా మంది వారి శక్తిని ఆ దిశగా మళ్లించి దాన్ని నెరవేర్చటానికి కృషి మొదలు పెడతారు. వారి చర్యల్లో తగినంత స్పష్టత ఇంకా తీవ్రత ఉంటే, వారి ఆలోచన వాస్తవ రూపం దాల్చుతుంది. ప్రపంచంలో ప్రజలు సాధారణంగా ఈ విధంగా పని చేస్తుంటారు. కానీ వారికి, ఆ ఆలోచనకి కొంత శక్తిని జోడించడం ఎలాగో తెలీదు. ఆలోచన అనేదే ఒక ప్రకంపన.

ఆలోచన అనేది ఒక ప్రకంపన, అలాగే ఒక శక్తి.

మీలో, మీ శక్తికి మీ శరీర పరిధికి అతీతంగా వెళ్ళగలిగే చలనశక్తి ఉంటే; దాన్ని మీరు ఎరుకతో నియంత్రించగలిగితే, మీరు ఒక చోట కూర్చుని మీ శక్తులు వేరే చోటుకు వెళ్ళేలా చేయొచ్చు. అయితే, మీ ప్రాణ శక్తి పై తగినంత పట్టు సాధించకుండా ఇలా చేస్తే, బైటికి పంపిన శక్తిని తిరిగి వెనక్కి తీసుకురాలేకపోవచ్చు. ఈ కారణంగా మీరు మరణించే అవకాశం కూడా ఉంది. మీరే చూస్తారు, ఎవరికైనా ఏదైనా కోరిక ఒక పరిమితిని మించి బలంగా ఉంటే, వారు యుక్త వయస్కులుగానే చనిపోతారు. చాలా మంది కోరికలు చంచలమైనవి. వారు ఈరోజు ఒకటి కోరుకుంటారు, రేపు మరొకటి కోరుకుంటారు- అది ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. కానీ ఎవరైనా ఏదైనా చాలా తీవ్రంగా కోరుకుంటే, వారు కోరుకున్నది జరిగినా జరగకపోయినా, వారు యుక్త వయస్కులుగానే చనిపోతారు. ముఖ్యంగా వారు కోరుకున్నది జరిగితే, వారు యుక్త వయసులోనే మరణిస్తారు ఎందుకంటే వారికి వారి జీవ శక్తిని బైటికి విసరటం తెలుసు కానీ పని జరిపించాక దాన్ని తిరిగి వెనక్కి తీసుకురావడం మీద పట్టు ఉండదు.

ఏకాగ్రతతో ఉన్న మనసు ఎంతో శక్తిమంతమైనది

ఆలోచన అనేది ఒక ప్రకంపన, అలాగే ఒక శక్తి. శక్తి లేకుండా మీరు ఆలోచనను సృష్టించలేరు. కేవలం అది గందరగోళంగా జరగటం వల్లనే, బహుశా దానికి వాస్తవ రూపం దాల్చడానికి అవసరమైనంత శక్తి ఉండడం లేదు కాబోలు. మీరు మీ ఆలోచనలకి ఎంత శక్తిని జోడించచ్చు అంటే, మీ ఆలోచనతో ఒకరిని చంపెయచ్చు కూడా. మీ మనసు ఎప్పుడైతే ఏకాగ్రతతో ఉంటుందో అప్పుడు అది ఒక శక్తివంతమైన పరికరంలా పనిచేస్తుంది. దురద్రుష్టవశాత్తు, చాలామందికి - మంచి ఆలోచనల పైకన్నా చెడు ఆలోచలనల పైనే మనసు ఎక్కువగా కేంద్రీకృతం అవుతుంది. కోపంతో ఇంకా కామంతో ఉన్న మనసు ఎంతో ఏకాగ్రతతో ఉంటాయి. అందువల్లే భారతదేశంలో ఎప్పుడూ పిల్లలికి ఇలా హెచ్చరించేవారు, “కోపంగా ఉన్నప్పుడు, ఎవరి గురించీ ఏమీ చెడుగా అనొద్దు” అని. ఎందుకంటే మీ మనసు కోపంతో నిండి ఏకాగ్రతతో ఉన్నప్పుడు, అది చాలా సులువుగా సాకారం కాగలదు.

ఒక ఆలోచనని తయారుచేసే విధానాన్ని గమనిద్దాం. మీ ఆలోచన ఎరుకతో జరిగేదేనా లేక అది - ఇప్పటికే మీలోకి పోయిన అనేక లక్షల విషయాల సమ్మేళణం మాత్రమేనా? మీ ఆలోచనా ప్రక్రియ ఎరుకతో జరగకుంటే, చాలా సార్లు అది ఒక మానసిక విరోచనంలా ఉంటుంది. దానిపై ఏ అదుపూ ఉండదు. ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది, ఎందుకంటే పాత విషయాలు ఉన్నాయి కాబట్టి. ఇది అచ్చం ఇలానే, మీ కడుపులో ఎంత ఎక్కువ చత్త ఆహారం ఉంటే అంత ఎక్కువ విరోచనాలు అవుతాయి. మానసికంగా ఇలా జరుగుతుంటే, మీరు దానిని ఆలోచన అని అనకూడదు.

ఒకసారి ఒకావిడ తన స్నేహితులని భోజనానికి పిలిచింది. ఆవిడ వడ్డిస్తూ తన ఆరేళ్ళ కూతురితో, “భోజనానికి ముందు ప్రార్ధన ఎందుకు చెయ్యలేదు?” అంది. అందరి ముందు తన కూతురిని కొంచం గొప్పగా చూపించుకోవాలి అనుకుంది. అప్పుడు ఆ కూతురు, “నాకు ప్రార్ధన ఎలా చేయ్యాల్లో తెలీదు” అంది. ఆ తల్లి, “అమ్మ ఏం అంటదో అదే అను’’ అంది. అందుకు కూతురు వినమ్రంగా తలదించి, చేతులు జోడించి, “ఎందుకురా దేవుడా వీళ్ళందరిని భోజనానికి పిలిచాను’’ అంది. మీకు ఇలాంటివి జరగట్లేదా? మీకు ధ్యానం చెయ్యాలి అనిపిస్తుంది కాని మీ మనసు వేరే ఎన్నో విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటుంది.

పలకని తుడిచేయ్యాలి

మీరు పలక మీద రాయాలిసి వస్తే ముందు దాన్ని తుడవాలి. అప్పుడే దానిపై స్పష్టంగా రాయగలరు. దానిపై ఇప్పటికే కొన్ని వందల రాతలు రాసి ఉంటే, మీరు వాటిపై ఇంకేదో రాస్తే, అప్పుడు దాని మీద మీరు ఏం రాశారో ఎవ్వరికి అర్ధం కాదు. కొంత సమయం తరువాత అది మీకు కూడా అర్ధం కాదు. ముందుగా మీరు ఆ చోటుని శుభ్రం చేసి ఆ తరువాత ఎరుకతో ఒక ఆలోచనని రూపొందించాలి.

ఎవరైనా ముందుగా మనసుని శుభ్రం చేసి, అప్పుడు ఆలోచన చేస్తే, ఆ ఆలోచన ఎరుకతో జరిగిన ఆలోచన కాబట్టి చాలా విలువైనది. ఒక్కసారి ఇలా ఆలోచనని సృష్టించి, దాన్ని ఆ స్పష్టతతో అలానే ఉంచగలిగితే, ఆ ఆలోచనకి కొంత శక్తిని జోడించవచ్చు. మీ మనసులో ఎరుకతో ఒక అలోచనని సృష్టిస్తే, అలాగే దాన్ని ఏకాగ్రతతో అలా ఉంచగలిగితే, అది వాస్తవ రూపం దాల్చుతుంది. అది సహజంగానే సాకారం అవుతుంది. మీ శక్తిపై మీకు ఇంకొంచం నియంత్రణ ఉంటే, మీరు దాన్ని మరింత బలపరచవచ్చు.

కావలిసింది సాకారం చేసుకోవడం ఎలా?

మనుషులుగా మనం సృష్టించిన ప్రతీది ముందుగా మనసులోనే సృష్టి చేయబడింది, ఆ తరువాతనే అది ప్రపంచంలో సాకారం చేయబడింది. ఈ గ్రహం పై మనం తయారు చేసిన అద్భుతమైనవి ఇంకా ప్రమాదకరమైనవి అన్ని ముందు మానవ మనసులోనే సృష్టించబడ్డాయి. ఈ ప్రపంచంలో మనం సరైన విషయాలు సృష్టించాలి అనుకుంటే, ముందు మన మనసులో సరైన ఆలోచనలని సృష్టించడం ఎలానో నేర్చుకోవడం చాలా ముఖ్యం. మన మనస్సులను మనం కోరుకున్న విధంగా ఉంచగలిగే శక్తి మనకు లేనప్పుడు, ప్రపంచంలో మనం ఏం సృష్టిస్తాం అనేది కూడా యాదృచ్చికంగానూ హాని కరంగానూ ఉంటుంది.

మీ మనసులో ఎరుకతో ఒక అలోచనని సృష్టిస్తే, అలాగే దాన్ని ఏకాగ్రతతో అలా ఉంచగలిగితే, అది వాస్తవ రూపం దాల్చుతుంది. సహజంగానే అది సాకారం అవుతుంది.

మీరు మీ మనసుని ఒక నిర్దిష్ట స్థాయి వ్యవస్థీకృతకి తీసుకురాగలిగితే, అప్పుడు మీ శరీరం, మీ భావోద్గ్వేగాలు ఇంకా మీ జీవ శక్తులు ఆ దిశగా వ్యవస్థీకృతమౌతాయి. ఎప్పుడైతే మీలోని ఈ నాలుగు పార్శ్వాలూ ఒకే దిశగా వ్యవస్థీకృతమౌతాయో, అప్పుడు మీరు ఏది అనుకుంటే అది - మీ చిటికెన వ్రేలు కూడా ఎత్తాల్సిన అవసరం లేకుండానే జరిగిపోతుంది. చర్య చేయడం ద్వారా అది సాకారం అవ్వడంలో ఇంకొంచం తోడ్పాటు అందించవచ్చు, కానీ మీరు ఈ నాలుగు పార్శ్వాలనూ ఒకే దిశగా కేంద్రీకృతం చేసి, కొంత సమయం వరకు ఆ దిశలోనే ఉంచినట్లయితే, మీరు ఏమీ చేయకుండానే మీరు కోరుకున్నది వాస్తవ రూపం దాల్చుతుంది. 

ఈ విశ్వం - నమ్మకం ఇంకా నిబద్దత రెండింటికీ ఫలితాలను ఇస్తుంది

అన్ని అంచనాలనూ తారుమారు చేస్తూ, కొంతమందికి వారు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరగడం గురించి మీరు వినే ఉంటారు. సాధారణంగా ఇలా నమ్మకం ఉన్నవారికి జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మీరు ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నారు. మీరు “ఓహ్!! దానికి 50 లక్షలు ఖర్చు అవుతుంది కానీ నా జేబులో కేవలం 50 రూపాయిలు మాత్రమే ఉన్నాయి - సాధ్యం కాదు, సాధ్యం కాదు, సాధ్యం కాదు” అని అనుకుంటే; “సాధ్యం కాదు” అనుకున్న క్షణమే, మీరు - “అది నాకు వద్దు” అని అంటున్నట్టు అవుతుంది.” 

ఒక స్థాయిలో, “నాకు అది కావాలి” అని కోరిక సృష్టిస్తున్నారు, మరో స్థాయిలో నాకు వద్దు అంటున్నారు. ఈ సందిగ్ధతలో మీరు అనుకున్నది జరగకపోవచ్చు. నమ్మకం, కేవలం సరళమైన మనస్సు ఉన్నవారికే పనిచేస్తుంది. ఎక్కువగా ఆలోచించేవారికి అది పని చెయ్యదు. చిన్నపిల్లల మనస్తత్వం ఉన్నవారు గుడికి వెళ్లి, “ ఓ శివ ! నాకు ఇల్లు కావాలి. ఎలా జరుగుతుందో నాకు తెలీదు, నాకోసం నువ్వే చెయ్యాలి” అని కోరుకుంటారు. వీరి మనసులో వ్యతిరేక ఆలోచన ఉండదు. అవన్నీ వారికున్న ఆ నమ్మకం వల్ల తొలగిపోతాయి. అతను, శివుడే తనకోసం అది జరిపిస్తాడు అని నమ్ముతాడు, ఇంకా అది నిజంగా జరుగుతుంది కూడా. మరైతే నిజంగా శివుడే వచ్చి ఆయనికి ఇల్లు కట్టిస్తారా? లేదు . మీరు అర్ధం చేస్కోవాలిసిన విషయం ఏంటంటే దేవుడు మీ పని చేయటానికి తన చిటికెన వ్రేలుని కూడా పైకేత్తరు. మీరు దేన్నయితే దైవం అని అంటున్నారో, అది ఈ సృష్టి మూలం. ఒక సృష్టికర్తగా అయన చేయవలసిన పని అద్భుతంగా చేసారు. కాని మీ జీవితం మీరు కోరుకున్నట్లుగా జరగాలి అనుకుంటే - మీరు ఎంత ఏకాగ్రతతో ఆలోచిస్తున్నారు, మీ ఆలోచన ఎంత నిలకడగా ఉంది, ఇంకా మీ ఆలోచన ఎంత బలంగా ఉంది అనే విషయాలు - మీ ఆలోచన నిజ జీవితంలో రూపుదాల్చాలా? లేదా కేవలం ఆలోచనగానే మిగిలిపోవాలా అనే విషయాన్ని నిర్ధారిస్తాయి. ఏది సాధ్యం అవుతుంది ఏది సాధ్యం కాదు అనేది మీ పని కాదు, అది ప్రకృతి పని. ప్రకృతి దాన్ని నిర్ణయిస్తుంది. మీరు చేయాల్సిందల్లా, మీకు నిజంగా ఏం కావాలో చూసి, దాని కోసం కృషి చేయడమే. మీరు గనుక బలమైన ఆలోచనను సృష్టిస్తే, దాని తీక్షణతని తగ్గించే ఎటువంటి ప్రతికూలతా లేకుండా బలమైన ఆలోచనను సృష్టిస్తే, అది ఖచ్చింతంగా నిజం అవుతుంది.

మీ జీవితాన్ని మీ చేతిలోకి తీసుకున్నప్పుడు, సంతోషం కోసం పాకులాడరు; మీకు దేన్ని గురించీ చింత ఉండదు; మీకు ఎదో జరిగిపోతుందేమో అన్నది ఉండదు.

ఈరోజు ఆధునిక శాస్త్రం సృష్టి అంతా ఒక ప్రకంపన అని నిర్దారిస్తోంది. అలాగే మీ ఆలోచన కూడా ఒక ప్రకంపన. మీరు ఒక శక్తిమంతమైన ఆలోచనని సృష్టించి బైటకి వదిలితే అది ఎల్లప్పుడూ వాస్తవ రూపం దాల్చుతుంది. సాధారణంగా అందరూ వ్యతిరేక ఆలోచనలను తొలగించడానికి నమ్మకాన్ని ఉపయోగిస్తారు. కానీ ఎప్పుడైతే మీరు ఎక్కువగా ఆలోచిస్తారో, అప్పుడు మీ నమ్మకం లోతుగా ఉండదు. మీకు ఎంత నమ్మకం ఉందని మీరు అనుకున్నా గాని, ఎక్కడో ఒక చోట సందేహాలు పుడుతూనే ఉంటాయి. మీ మనసు ఇప్పుడు ఎలా ఉందంటే, ఈ క్షణం దేవుడు ప్రత్యక్షమైతే మీరు శరణు పొందరు, వచ్చింది నిజంగా దేవుడా కాదా అని పరిశీలించడానికి చూస్తారు. ఇలాంటి మనసుతో మీరు నమ్మకం మీద సమయాన్ని వృధా చేసుకోకూడదు. దీనికొక ప్రత్యామ్నాయం ఉంది, అదే నిబద్దత. మీకు కావాలిసింది సృష్టించుకోవడం కోసం మీరు నిబద్దులై ఉంటే, అప్పుడు మళ్ళీ మీ ఆలోచన ఎంత ఏకాగ్రతతో ఉంటుందంటే, ఆ పని జరుగుతుందా జరగదా అనే ప్రశ్నే తలెత్తదు. మీ ఆలోచనలో ఏ అంతరాయం ఉండదు. మీకు కావాలిసిన దానివైపు మీ ఆలోచన సజావుగా సాగుతుంది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో, అప్పుడు అది నిజమవ్వటం కూడా సహజంగానే జరుగుతుంది.

మీకు కావలిసింది సృష్టించుకోవాలంటే, మొట్ట మొదటిగా దాన్ని మీ మనసులో సృష్టించాలి. మీకు కావాలిసింది నిజంగా అదేనా? మీరు ఇది పరిశీలించాలి, ఎందుకంటే మీరు చాలా సార్లు అనుకుని ఉంటారు “ఇదే” అని కాని దాన్ని పొందిన తరవాత గ్రహిస్తారు, మీకు నిజంగా కావాల్సింది “ఇది కాదు” – దీని తరవాతది, ఆ తరవాతది అని. కాబట్టి ముందు మీకు ఏం కావాలో పరిశీలించుకోవాలి. ఈ విషయంలో స్పష్టత తెచ్చుకుని, ఆపై దాన్ని సృష్టించడం కోసం నిబద్దులై ఉంటే, మీ ఆలోచన నిరంతరంగా ఒకే దిశలో సాగుతుంది. ఈ విధంగా మీ ఆలోచనను దిశను మార్చకుండా స్థిరంగా ఉంచగలిగినప్పుడు, అది మీ జీవితంలో వాస్తవ రూపం దాలుస్తుంది.

సద్గురు “లా అఫ్ అట్రాక్షన్” గురించి అపోహను తొలగించారు

ప్రశ్న: అసలు లా అఫ్ అట్రాక్షన్ ఎలా పని చేస్తుంది?

సద్గురు: అది పనిచేయదు.

ప్రశ్న: అయితే ఏం పని చేస్తుంది ? మన విధిని మనమే రాసుకోగాలమా?

సద్గురు: మీ తల రాతను మీరే రాసుకోవచ్చు, రాసుకోవాలి కూడా, ఎందుకంటే మానవుడు అంటే అర్ధం అదే. మిగతా అన్ని జీవులకి నిర్దిష్టమైన జీవచక్రం ఉంటుంది. వాటికి విషయంలో అది పర్లేదు ఎందుకంటే వాటి పరిమితి అంతవరకే. మీ జీవితంలోకి చూస్తే మీరు వాటికన్నా వ్యత్యాసంగా పెద్దగా ఏమి చెయ్యట్లేదు. అవి జన్మిస్తాయి – మీరు జన్మిస్తారు, అవి పెరుగుతాయి – మీరు పెద్దవుతారు, అవి పునరుత్పత్తి చేస్తాయి – మీరు చేస్తారు, అవి చనిపోతాయి – మీరు చనిపోతారు. పెద్దగా తేడా ఏమి లేదు, కాని ఇవే పనులు మనం ఎరుకతో చేయచ్చు. మానవునిగా జీవించడంలోని ప్రాముఖ్యత అదే. మీరు మీ చేతిని ఎరుకతో ఉపయోగిస్తే, అది మీరు ఎలా చెప్తే అలా చేస్తుంది. మీ ఆలోచనని ఎరుకతో చేస్తే అది మీరు ఎలా చెప్తే అలా చేస్తుంది. మీ ఆలోచన మీరు చెప్పినట్లు వింటుంటే, అప్పుడు మిమ్మల్ని మీరు ఆనందంగా ఉంచుకుంటారు, విచారంగా కాదు. మీరు ఆనందంగా ఉంటే, మీ జీవితం సంతోషాన్ని వెతకటంలో నిమగ్నమై ఉండదు. సాధారణంగా ప్రజలు గొప్పగా పరిగణించే విషయాలైన - ప్రశాంతత, సంతోషం అనేవి - మీరు ఆనందంగా ఉన్నప్పుడు అసలు పెద్ద విషయాలే కాదు అనిపిస్తుంది. అదే కనుక జరిగితే, మీ జీవితం మొత్తం ఎంతో సజావుగా సాగుతుంది. మీరు ఒక గర్జించే పులిలా ఉన్నారు – ఎప్పుడూ ఏదోటి కావాలి. కానీ ఎదో సాధించాల్సిన అవసరం లేకుండా, మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు - మీ జీవితం సంపూర్ణమైనదిగా ఉంటే– అప్పుడు అది ఎంతో హాయిగా ఉంటుంది. అది ఆ విధంగా హాయిగా ఉన్నప్పుడు, గ్రహణశీలత కలిగి ఉంటుంది. ఇలా ఉన్నపుడు మీకు ఉద్యోగం చేయటం, సంపాదించటం , ప్రేమలో పడటం, కేవలం సంతోషంగా ఉండటం ఇవేమీ మీకు పెద్ద విషయాలు అనిపించవు. ఎందుకంటే కేవలం ఇక్కడ కుర్చున్నంత మాత్రాన, మిలో మీరు అత్యంత ఆనందాన్ని అనుభూతి చెందుతున్నారు కాబట్టి.

ఇలాంటి జీవితంతో మీరు ఏం చేస్తారు ? సహజంగానే, ప్రస్తుతం మీ అవగాహనలో లేని విషయాల గురించి అన్వేషిస్తారు. ఆధ్యాత్మిక పద్ధతులు ఇలానే మొదలవుతాయి; ఈ విధంగానే మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు. మీ జీవితాన్ని మీ చేతిలోకి తీసుకున్నప్పుడు, సంతోషం కోసం పాకులాడరు; మీకు దేన్ని గురించీ చింత ఉండదు; మీకు ఎదో జరిగిపోతుందేమో అన్నది ఉండదు. మీరు ప్రతీది సంపూర్ణంగా చేస్తారు.

ఏం జరిగినా సరే, మీరు బాగుంటారని మీకు తెలుసు. ఇక ఇప్పుడు మీరు సహజంగానే అన్ని పనులు అద్భుతంగా చేస్తారు. ఎందుకంటే ఇక మీకు స్వార్థ ఆసక్తి అనేది ఉండదు. మీరు ఏది అవసరమో అది సునాయాసంగా చేసేస్తారు. ఇతరులకు పెద్ద విషయంగా అనిపించేది, మీరు చాలా సునాయాసంగా, ఉల్లాసంగా చేసేస్తారు.

Editor's Note:

మీకు కావలసిన దాన్ని సాకారం చేసుకునేందుకు గైడెడ్ ధ్యానాలు - సద్గురు అందిస్తున్న చిత్ శక్తి ధ్యానాలు.

జీవితంలో మీకు కావలసిన దాన్ని సాకారం చేసుకోవడంలో, మీ మైండ్ యొక్క శక్తిని ఉపయోగించడాన్ని చిత్ శక్తి అంటారు. సద్గురు యాప్ మీకు - ప్రేమను, ఆరోగ్యాన్ని, ప్రశాంతతను ఇంకా విజయాన్ని పొందడంలో దోహద పడే నాలుగు చిత్ శక్తి ధ్యానాలను అందుబాటులోకి తెస్తుంది.