32 దేశాల నుంచి వచ్చిన 800 మంది సాధకులు ఒక్కచోట చేరి తమ అంతర్గత వికాసం కోసం, పునీతమైన ఈశా యోగ కేంద్రంలో సాధన కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

అగ్ని ఉన్న చోట కాంతి ఉండి తీరుతుంది. ఆధ్యాత్మిక సాధన తీవ్రతరమైన కొద్దీ, ఒక అంతర్జ్యోతి ప్రకాశించి, పాత బూజులన్నిటినీ తొలగించి, సాధకుడి అంతరంగంలో ఒక స్పష్టతనూ, సమన్వయాన్నీ కలిగించటం ప్రారంభిస్తుంది.

సాధన పాద కార్యక్రమంలో పాల్గొంటున్న సాధకులు హఠ యోగాభ్యాసాలు, శక్తి చలన క్రియా, శాంభవీ మహాముద్రా, భక్తి సాధనా, ఆదియోగి ప్రదక్షిణం లాంటి రకరకాల సాధనలను ఆచరిస్తున్నారు. ఈ సాధన పాద కార్యక్రమంలో పాల్గొంటున్న వారి కోసమే, వాళ్ళ సాధన అనుభవాన్ని తీవ్రతరం చేసే ఒక భావ స్పందన కార్యక్రమం కూడా నిర్వహించబడింది.

ఈ విడత సాధనపాద కార్యక్రమం దాదాపు సగం పూర్తయింది. ఒక పునీతమైన స్థలంలో, అంకిత భావంతో ప్రత్యేక సాధనలు సాగించటం వల్ల తమకు కలిగే ప్రయోజనాలను సాధకులు గుర్తించ గలుగుతున్నారు.

లోచూపు (Looking within)

సాధనమార్గంలో ప్రగతి సాధిస్తున్న వారు అప్పుడప్పుడూ కలిసి అప్పటివరకూ జరిగింది సమీక్షించుకోవటం, తమలో ఎలాంటి మార్పులు వచ్చాయో పరిశీలించుకోవటం అవసరం. గత కొద్ది మాసాలుగా చేస్తున్న తీవ్ర సాధనల వల్ల, తమ జీవిత అనుభూతి ఎలా వికాసం పొందిందో, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు సాధకులు మనతో పంచుకొంటున్నారు.

‘అంతఃస్సంఘర్షణ ఉపశమించింది...’

‘నాలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే, ఇప్పుడు జీవితంలో ఏదయినా అనుకోని విధంగా జరిగినట్లయితే, చుట్టూ అందరి వైపూ వేలు పెట్టి చూపే ప్రయత్నం చేయకుండా, ముందు నా దృష్టిని నా లోపలికే ప్రసరించుకొని, పరిశీలించుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ముందుగా నన్నూ, నా మాటలనూ, నా చర్యలనూ సమీక్షించుకొనే శక్తి నాకు బాగా పెరిగింది. దీని వలన నాకు నాలో అంతర్గతంగా గానీ, బాహ్య పరిసరాలతో కానీ ఏర్పడే సంఘర్షణ గణనీయంగా తగ్గిపోతున్నది.’ – వైష్ణవి, 26, ఆంధ్రప్రదేశ్.

‘ఇప్పుడు రోజంతా నాకు ఉండే శక్తి స్థాయి (energy) లో చెప్పుకోదగ్గంత పెరుగుదల కనిపిస్తున్నది. నేను మరింత చురుకుగా, హుషారుగా, ఉత్సాహంగా ఉండగలుగుతున్నాను. నాకు పనిలో శ్రద్ధా, ఏకాగ్రతా పెరిగాయి. పని తీరు మెరుగైంది. నిస్సందేహంగా, ఈ సాధనపాద కార్యక్రమం ఆరంభమైన తరవాత, నేను మరింత సంయమనంతో, స్పష్టతతో ఉండగలుగుతున్నాను. అన్నిటికంటే అద్భుతమైన మార్పు మాత్రం శక్తి స్థాయిలలో (energy) లో వచ్చిన తీవ్రతా, సాంద్రతా(intensity). ఇదొక నమ్మ శక్యం కాని మాయాజాలంలాగా అనిపిస్తున్నది. ఇది అనుభవ వేద్యం. సాధనపాద నా జీవితంలోనే ఒక పెద్ద ప్రగతి సోపానం.’ - కపిల్, 18, మహారాష్ట్ర.

ఆది యోగి ప్రదక్షిణం + ఏకాదశి = విస్ఫోటకమైన పరిణామం!

సాధన పాదలో ఒక ముఖ్యమైన అంగం ఆదియోగి ప్రదక్షిణం. ధ్యాన లింగానికీ, 112 అడుగుల ఎత్తున్న ఆదియోగి విగ్రహానికి ప్రదక్షిణం చేస్తూ నడిచే రెండు కిలోమీటర్ల నడక. ఒక మంత్రం జపించుకొంటూ, ఒక నిర్దిష్ట ముద్ర ధరించి చేసే ఈ ప్రదక్షిణం వల్ల ఈశా యోగ కేంద్రంలో ఉన్న వివిధ పవిత్రీకృత ప్రదేశాలలో నిండిన చైతన్య శక్తిని మనం అందిపుచ్చుకోవచ్చు. మాసంలో రెండుసార్లు వచ్చే ఏకాదశి పుణ్యతిథి నాడు ఈ ఆదియోగి ప్రదక్షిణం చేస్తే, అదొక సాంద్రమైన ఆధ్యాత్మిక అనుభవం.

‘ఈ అనుభవం నన్ను ఒళ్ళు తెలియని పారవశ్యంలో ముంచింది!.....’

‘నాకు ఏకాదశి తిథి వస్తుందంటే ఎప్పుడూ ఉత్సాహమే. ఏకాదశి తిథి నాలో ఉన్న చైతన్య శక్తిని మరింతగా వెలికి తెస్తుంది. ఆత్మజ్ఞాన సాధనకు చాలా అనుకూలంగా ఉంటుంది. మేం ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. అందుకు నేను మానసికంగా సిద్ధమయ్యే ఉన్నాను. కనక నాకు ఆకలి కూడా వేయలేదు. నేను ప్రదక్షిణం చేస్తూ వెళ్ళాను. చేసినకొద్దీ, నాకేదో మత్తు లాంటి పారవశ్యం కలగసాగింది. కానీ స్పృహలోనే ఉన్నాను. నియంత్రణ కోల్పోలేదు. నేను మంత్రాలు భక్తితో జపిస్తూ నడిచి వెళ్ళిన కొద్దీ, నాకు నా లోపల ఉన్నదేదో పైకి తేలి వస్తున్న భావన తీవ్రంగా కలిగింది. అకస్మాత్తుగా నేను నా బరువంతా కోల్పోయినట్టు అనిపించింది. అసలు నాకో శరీరం ఉన్నదన్న ధ్యాసే పోయింది. ఒకానొక దశలో కొన్ని క్షణాలపాటు నాకు, నా శరీరం నుంచి నేను వేరయిపోయినట్టు అనిపించింది! అంటే అక్కడ నడుస్తున్న వ్యక్తీ, ఈ అనుభూతులు పొందుతున్న వ్యక్తీ వేరు వేరు వ్యక్తులయినట్టు భావన అన్నమాట! ఆ రోజు ఆ అనుభవం నన్ను నేలమీద నిలవనివ్వలేదు. ఎన్ని ప్రదక్షిణాలు చేసినా నాకేమీ అలసట అనిపించలేదు సరి కదా, అందుకు విరుద్ధంగా, నడిచిన కొద్దీ మరి కాస్త శక్తీ, బలమూ పుంజుకొన్నట్టు అనిపించింది! ప్రతి ఏకాదశి తిథీ నాకు కొన్ని కొత్త అనుభవాలను చవి చూపుతున్నది. అసలు ఎప్పుడు ఏకాదశి ప్రదక్షిణం చేసినా, ఇప్పుడది నాకొక అద్భుతమైన అనుభవంగా అనిపిస్తున్నది. ఇలాంటి సాధనలో పాలు పంచుకొనే అవకాశం కలిగినందుకు నేనెంతో కృతజ్ఞురాలిని.’ - మూర్ఛన, 24, అస్సామ్.

భక్తి సాధన

మనసంతా భక్తితో నిండి ఉంటే, ఎలాంటి కష్టమైనా మనకు అవరోధం కాజాలదు. ఈ భావనను దృఢ పరచేందుకు సద్గురు ‘భక్తి సాధన’ అనే ప్రక్రియకు రూపునిచ్చారు.

‘నేను మునుపటి కంటే ఎక్కువ చైతన్యస్ఫూర్తి అనుభవిస్తున్నాను!....’

‘భక్తిసాధన ఎంతో విలువైంది, శక్తిమంతమైంది. ఇప్పుడు నేను రకరకాల విషయాలకు స్పందించే విధానం, అవి నాకు కనిపించే పద్ధతి, వాటి పట్ల నా దృక్పథమూ అన్నీ పూర్తిగా మారిపోయాయి. మొదట్లో నేను విషయాలన్నిటినీ, శ్రద్ధాదరాలతో పట్టించుకోవలసినవీ, అలాటి అవసరం లేని తేలికపాటివీ అని రెండు తరగతులుగా చూసే దాన్ని. ‘ఇవే ముఖ్యమైనవి, ఇవి ముఖ్యం కాదు’ అని రెండుగా విభజించుకొనే దానిని. భక్తి సాధన ఆచరించిన కొద్దీ, ఇప్పుడు, ‘నాకు తెలిసిన, తటస్థించిన ప్రతి విషయానికీ దాని ప్రాధాన్యత దానికి ఉన్నది, ప్రతిదీ శ్రద్ధకూ గౌరవానికీ పాత్రమైన విషయమే!’ అని గుర్తించే స్థితికి వస్తున్నాను. భక్తి సాధన నా అహంకారాన్ని పక్కన పెట్టేస్తున్నది. నేను జీవితాన్ని ఇదివరకటికంటే ఎక్కువ వినమ్రతతో చూడగలుగుతున్నాను.’ – మృదుల, 24, మహారాష్ట్ర.

ఒక ముఖ్యమైన ఆత్మపరీక్షావకాశం (check point)

ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బృంద సభ్యులందరూ నెలకొకసారి ఒక రోజు కలుస్తారు. సద్గురు ఉపన్యాసాల వీడియోలను కలిసి చూస్తారు. వాళ్ళ సాధనలలో అవసరమైన సర్దుబాట్లు, దిద్దుబాట్ల గురించి నేర్చుకొంటారు. ప్రతి వాళ్ళూ వాళ్ళ వాళ్ళ అనుభవాలను ఇతరులతో పంచుకొంటారు. గడిచి పోయిన నెల ఎలా గడిచిందో అందరూ కలిసి కూర్చొని సమీక్షించుకొంటారు. అందుచేత, బృందంలో అందరూ తమ తమ లక్ష్యాలను పునర్నిర్దేశించుకోవటానికీ, రాబోయే మాసానికి కావలసిన ప్రణాళికలను రూపొందించుకోవటానికీ ఈ సమావేశం ఒక మంచి అవకాశం.

‘నేను చేరగోరే గమ్యానికి మార్గ దర్శనం చేస్తుంది....’

‘బృందంలో అందరం ఒక చోట చేరటం వల్ల అందరి మధ్యా ఒక మైత్రీ భావం ఏర్పడుతుంది. మేం మా అందరి అనుభవాలనూ కలబోసుకొంటుంటే, మేం ఈ కార్యక్రమానికి ఏ ప్రయోజనం ఆశించి వచ్చాం అన్న విషయం మరోసారి మనసుకు హత్తుకొంటుంది. ఈ ప్రస్థానంలో ఈ సమీక్షా సమావేశం ఒక మైలు రాయిగా నిలుస్తుంది. నెల క్రితం నేనెక్కడ ఉన్నాను, ఇప్పుడెక్కడ ఉన్నాను అని పోల్చి చూసుకొనేందుకు గానీ, అవసరమైన సర్దుబాట్లూ దిద్దుబాట్లూ చేసుకొనేందుకు గానీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రాబోయే మాసాలలో నేను చేరగోరే గమ్యానికి ఎలా చేరాలి అనే విషయంలో దిశా నిర్దేశం అందిస్తుంది.

‘అరటిపండు – నాణేనికి రెండు వైపులు....’

యోగ కేంద్రంలో మనకు మన పరిమితులూ, లోపాల గురించి బాగా తెలిసివస్తుంది. మన ఇష్టాయిష్టాల ఆధారంగా, ఇతరుల గురించి మనం ఆశలూ అంచనాలూ ఎలా ఏర్పరచుకొంటున్నామో అర్థమౌతుంది. ‘… మరీ బాగా ముగ్గిపోయింది!...’ బారన్, 35, ఆస్ట్రేలియా

“భిక్షా హాలులో ప్రార్థనల తరవాత నేను కళ్ళు తెరవగానే, బంగారు కాంతులు చిమ్ముతున్న ఒక పరిపక్వమైన అరటిపండు తనను స్వీకరించమని ఆహ్వానిస్తున్నట్టుగా నా కళ్ళముందు మెదిలింది. నేను ధన్యుడినయ్యాననిపించింది. వాడిపోయి నలుపుకు తిరిగిన ఆ అరటిపండు కన్నీళ్లు కారుస్తున్నది. ఆ పండు తెగ ముగ్గిపోయిన పండు మాత్రమేనా? మరేదయినా విశేషం ఉన్న పండా? చూడాలి.

నేను ఆ అరటిపండును ఒలిచి చూశాను. బాగా పండి లోపల పచ్చగా ఉన్నది. అక్కడక్కడా తెలుపూ, గోధుమ రంగూ తొంగి చూస్తున్నాయి. పచ్చగా ఉన్న భాగం కొరికి రుచి చూశాను. కాస్త పుల్లగా అనిపించింది.

ఇంతలో నాకు అక్కడ భిక్ష వడ్డన చేస్తున్న వాలంటీరుతో చిన్న సంభాషణ జరిగింది.

నేను: నాకిచ్చిన ఈ అరటిపండు కుళ్ళిపోయినట్టుంది. మరో పండిస్తారా?

వాలంటీరు: మీకిచ్చిన పండు బాగానే ఉందిగా!

నేను: బాగా పండిన పళ్ళు నాకు ఇష్టమే, కానీ ఇది మరీ ముగ్గి కుళ్లిపోయింది.

వాలంటీరు: (ఆ పండు పరిశీలనగా చూసి) ఇలాంటి పళ్ళు తినటానికి బాగానే ఉంటాయి. నేనయితే ఇలాంటివే తింటాను.

నేను: అయితే ఇంకేం, ఇదిగూడా మీరే తినేయండి....

నా కంచం లోకి చూశాను. పాపం ఆ పచ్చటి అరటిపండు తన జీవితమే నాకు సమర్పణ చేసుకొంటే, నేను తిరస్కరించి పరాభవించానని ఎంతో బాధ పడుతున్నట్టు కనిపించింది. నేను పెద్ద తప్పు చేశాను అనిపించింది. 'అయితే ఇంకేం, ఇది కూడా మీరే తినేయండి!...' 'అయితే ఇంకేం, ఇది కూడా మీరే తినేయండి!...' 'అయితే ఇంకేం, ఇది కూడా మీరే తినేయండి!...' అని నేనన్న చీదరింపు మాటలు నా మనసులో మారుమోగాయి. ‘ఈ అరటిపండు నేనే తింటాను. ఆ వాలంటీరు మళ్ళీ కనిపించినప్పుడు, అతగాడికి క్షమాపణలు చెప్తాను’ అని నిర్ణయించుకొన్నాను.

శ్రద్ధగా పరీక్షించుకొంటూ ఆ పండును జాగ్రత్తగా తిన్నాను. పచ్చ, తెల్ల, గోధుమ రంగు ముక్కలను జాగ్రత్తగా చూసుకొంటూ కొరికాను. దాదాపు చావు తప్పదు అన్న స్థితిలో కొండకొన అంచున నడవటం లాగా అనిపించింది. ఆ పండు కాస్త పులిసిపోయి ఉంది. ‘అయినా తినచ్చు, ఫరవాలేదు! అసలు సమస్య ‘ఇలాంటి అరటిపండే నాకు ఇష్టం, అలాంటిది ఇష్టం లేదు’ అన్నఇష్టాయిష్టాల భావనలు నా చేత చేయించే ‘అరటిపండు బానిసత్వం’ (banana bondage)’ అనుకొన్నాను.

కొన్ని గంటల తరవాత ఆ రోజే ఆ వాలంటీరు నాకు మళ్ళీ తటస్థపడ్డాడు. మా రెండో సంభాషణ ఇలా సాగింది:

వాలంటీరు: నేను తప్పు చేశాను. మీరునన్ను క్షమించాలి.

నేను: అబ్బే, ఆ తరవాత నేను ఆ అరటి పండంతా తినేశాను. శుభ్రంగా, బాగానే ఉంది. మీరు చెప్పిన మాటే నిజం!

వాలంటీరు: కాదు, కాదు, మీరు నన్ను క్షమించాలి.

నేను: మిమ్మల్ని క్షమించేందుకేమీ లేదు. నిజానికి మీతో అలా మాట్లాడానని నేనే బాధ పడుతున్నాను.

వాలంటీరు: కాదు, కాదు! మీకిచ్చిన పండులాంటి మరొక అరటిపండు నేను తిని చూశాను కదా! కడుపంతా తిప్పుతున్నది. మీకిచ్చిన పండు కుళ్ళిపోయిన పండే. అది మీరు తినాల్సింది కాదు.

నేను : ......... మేమిద్దరం ఒకరొకరికి తలలు వంచాం. ఎంతో హాయిగా గలగల నవ్వుకొన్నాం! అదొక అందమైన అనుభవం. దానివల్ల నేను ఒక విషయం నేర్చుకొన్నాను. నేనింకా పూర్తి సచేతనత్వ స్థితికి చేరలేదు కానీ, ఆ దిశగా రోజూ కొంత ప్రయత్నం చేసుకొంటూ వెళ్లగలనని.”

దానికి ఇంకా పూర్తి పరిపక్వత రాలేదు!

‘…ఫరవాలేదు, అంతేమీ ముగ్గిపోలేదు,...’ -ఎద్గార్డో, 22, పోర్టో రీకో

‘భిక్షా హాలులో భోజనం చేసే ముందు, ఇతరులకు వడ్డన చేయటం నాకు చాలా ఇష్టం. ఆ క్రమంలోనే నేను ఒక మిత్రుడికి ఒక అరటి పండు అందించాను. ఆయన ‘ఇది బాగా ముగ్గిపోయి, కుళ్లిపోయింది కదా!’ అన్నాడు. నేనూ ఆ అరటిపండును పరీక్షగా చూశాను. నాకు కాస్త పండిన అరటి పళ్ళే ఇష్టం. కాబట్టి, ‘పండుకేం, బాగానే ఉంది’ అన్నాను. ‘అయితే, దాన్ని మీరే తినండి!’ అన్నాడాయన. ఆయన ఆ మాట అన్న తరవాత నాకర్థం అయింది, నేను ఆయన మాటలకు కేవలం సందర్భానికి తగ్గట్టుగా యధాలాపంగా స్పందించానని.

‘తరవాత నేను మధ్యాహ్నం భోజనానికి వెళ్లినప్పుడు, అక్కడున్న అరటి పళ్లలో బాగా ముగ్గి నల్లపడిపోయిన పండు కోసం వెతికాను. నా ఆలోచన ఏమిటంటే, ‘అలాంటి పండు నేను మరొకళ్ళకు ఇవ్వగలిగినప్పుడు, నేను కూడా అలాంటి పండే తినటానికి ఇష్ట పడాలిగదా!’ అని. అందుకే అక్కడున్న వాటిలో బాగా ముగ్గిపోయి ఉన్న అరటిపండు తీసుకొన్నాను. దాని తోలు ఒలుస్తుంటేనే ఓ రకమైన వాసన వచ్చింది. అయినా కూడా, అలాంటి పండు మంచిదేనని నేను ముందు అనుకొన్నాను కనక, దాన్ని తినాలనే నిర్ణయించుకొన్నాను. కానీ దాన్ని నోట్లో పెట్టుకోగానే, కడుపులో తిప్పుతున్నట్టు అనిపించ సాగింది. అయినా సరే, నేను ఆ పండంతా తినేశాను.

‘తరవాత, మళ్ళీ సేవకు వచ్చినప్పుడు నేను చేసిన మొట్టమొదటి పని బారన్ ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని ఆయనకు క్షమాపణలు చెప్పటం. వాస్తవాన్ని పొరపాటుగా అర్థం చేసుకొని, తప్పుగా, అనాలోచితంగా ప్రతిస్పందించినందుకు మన్నించమని కోరాను. అతనూ నాతో మంచి మనసుతో దాపరికం లేకుండా మాట్లాడాడు. అతగాడు ఆ సందర్భాన్ని పూర్తిగా భిన్నంగా, మరో విధంగా అర్థం చేసుకొన్నాడు. చివరికి ఇద్దరం మనసారా నవ్వుకొని, హాయిగా కలిసిపోయి ఆనందంగా కాలం గడిపేశాం. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలలో కూడా నాకు నా సాధన నా మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నదో తెలిసి వస్తున్నది.’ అపరిపక్వ స్థితి (‘Work in progress’)

‘మేమందరం ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంది. కానీ, మేము సరయిన మార్గంలో ఉన్నామని మాత్రం బృంద సభ్యులలో అందరికీ నమ్మకం కుదిరింది.’

నిజమైన స్వేచ్ఛ

‘నేను చెయ్యదల్చుకొన్నవన్నీ చేయగలిగితే, అదే నిజమైన స్వేచ్ఛ’ అని ఇంతకు ముందు నేను అనుకొంటూ ఉండేవాడిని. కానీ, ఇక్కడికి వచ్చిన తరవాతే నేను, ఇప్పుడిప్పుడే, అసలైన స్వేచ్ఛ దిశగా అడుగులు వేస్తున్నాను. ఎంపికల నుంచి స్వేచ్ఛ (Freedom from choices)!! నాకు ఏ స్థితి ఎదురయినా దాంతో మనస్ఫూర్తిగా లగ్నమైపోయి, ఆనందం పొందగలుగుతున్నాను. అసలయిన స్వేచ్ఛ అంటే అర్థమేమిటో నాకు కొంతవరకూ తెలిసివచ్చింది.’ -హిమాన్షు, 24, ఉత్తర ఖండ్

‘ఇదివరకంత గంభీరంగా, ‘సీరియస్’ గా దేన్నీ తీసుకోవటం లేదు....’

‘ఇదివరకు నేను నా చుట్టూ గోడ కట్టుకొన్నట్టు, గిరి గీసుకొని ఉండే దాన్ని. నా ముఖం ఎప్పుడు గంభీరంగా, ‘సీరియస్’గా ఉండేది. ఎంతో ప్రయత్నం చేస్తే తప్ప, ఇతరులు ఈ గోడలు బద్దలు కట్టుకొని నాకు దగ్గర కాగలిగేవారు కాదు. ఇప్పుడు నేను, పసి బిడ్డగా ఉన్నప్పుడు ఎలా ఉండే దాన్నో అలా, అంటే, అందరిపట్లా ప్రేమగా, ఆనందమయంగా ఉండగలుగుతున్నాను. మునుపటికీ ఇప్పటికీ ఇంకొక ముఖ్యమైన భేదం కూడా ఉంది. అవతలి వారు ఎలాంటి వారైనా కావచ్చు, ఎదురైన సందర్భం ఎలాంటిదయినా కావచ్చు. నేను మాత్రం ఇప్పుడు పూర్తిగా వివేచించే స్పందిస్తాను. ఎప్పుడైనా అనాలోచితంగా స్పందిస్తే, ఆ విషయం నాకు ఇప్పుడు తక్షణమే తెలిసివస్తున్నది. ఇంతకు ముందైతే, ఇతరుల చర్యలకు అనాలోచితంగా, యాంత్రికమైన నిర్బంధ స్పందన చూపటమే నా సహజ తత్త్వం, స్వభావం అని నమ్మే దాన్ని. అది పచ్చి అసత్యం అని ఇప్పుడు తెలిసింది. నాలో ఇంతటి మార్పు రావటం అసలు సంభవమని కూడా నేనెప్పుడూ అనుకోలేదు!’ – వినీత, 30, పంజాబ్

‘శరీరానికీ, మనసుకూ ఆవల....’

‘నా శరీరమూ మనసూ ఇప్పుడు కూడా ఇదివరకటిలాగే అప్పుడప్పుడూ సంఘర్షణలను ఎదుర్కొంటూనే ఉన్నాయి. కానీ మునుపటిలా అవి, నేను వాటికి ఎలా స్పందించాలో శాసించి, నియంత్రించే స్థితిలో లేవు ! మునుపు అవే తెర ముందు తిష్ఠ వేసేవి, ఇప్పుడు నేపథ్యం లోకి వెళ్లిపోయాయి! ఆ సంఘర్షణల స్థానంలో ఇప్పుడు ఒక ఆనందమయమైన స్థితి ఏదో తెరమీదికి వచ్చింది.’ - అశ్విని, 27, ఒహయో, అ. సం. రా.

సాధన పాద – జీవితానికి బీమా సదుపాయం!

సద్గురు (సాధన పాదలో పాల్గొంటున్న వారిని ఉద్దేశించి ఉపన్యసిస్తూ): ఆధ్యాత్మిక సాధకులకూ, లౌకిక విషయాల సాధన కోసం తపించే వాళ్లకూ మధ్య ఉండే వ్యత్యాసమల్లా ఒక్కటే! జీవితం ఒక కష్టాల కొరడా పుచ్చుకొని వాళ్ళని తరిమినప్పుడు, లౌకిక మార్గాలలో ఉన్న వాళ్ళు భయపడి పరుగెత్తి పోవటానికి ప్రయత్నిస్తారు.

ఒక ఆర్థిక సమస్య వచ్చినప్పుడో, లేదా కుటుంబంలో ఎవరయినా తీవ్ర అనారోగ్యం పాలయినప్పుడో, లేదా మరో విధమైన ఆపద ఏదయినా కలిగినప్పుడో వాళ్ళు పరుగెత్తి పారిపోతారు. ఆధ్యాత్మిక సాధకులయితే, ఆ కొరడా దెబ్బేదో తినే చూస్తామని సిద్ధమౌతారు. మరొకరు మిమ్మల్ని కొట్టనక్కర్లేదు. మిమ్మల్ని మీరే కొట్టుకోవటానికి కూడా సిద్ధంగానే ఉంటారు. మీకు జరిగేదేదయినా మీవల్లనే జరుగుతుంది! కనక మరొకరెవరో మీకు ఏమీ చేయలేరు. స్వేచ్ఛామార్గం అంటే ఇదే అని మీకు తెలుసుకదా?

ఎందుకంటే, నేను ఎన్నో సంవత్సరాలు నన్ను నేను ఆపాద మస్తకమూ అన్నీ రకాలుగా విమర్శించుకొంటూ కూర్చొని గడిపిన వాడినే! ఇప్పుడు బయటి వాళ్లెవరో వాళ్ళకు తోచిందేదో అన్నారా, అననివ్వండి. ఇది నేను ఇంతకు ముందు అనుకొని ఉన్నదే కదా, దానివల్ల పోయేదేముంది ?

మీ శరీరమూ, మీ మనసూ, మీ చైతన్య శక్తీ ఎట్టి పరిస్థితులలోనూ మీకు అడ్డంకులుగా మారకూడదు. మారకుండా మీరే చూసుకోవాలి. సాధన పాదమంటే అదే.

మీకున్న సమయం కూడా తక్కువ. దాదాపు మరో మూడున్నర నెలలు మాత్రమే.అందుకే మీరు మీ శక్తంతా వినియోగించాలని నా కోరిక. ఈ సమయం మీరు సద్వినియోగం చేసుకొంటే మీ శేష జీవితంలో ఎప్పుడయినా సరే, ఈ సమయాన్ని సింహావలోకనం చేసుకొన్నప్పుడు, ‘నాకు ఈ జీవిత ‘బీమా’ ఉన్నది కదా!’ అనే భావన కలుగుతుంది.

జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదురైనా ఫరవాలేదు. ఈ ఏడు నెలల సమయంలో మీరు తగిన సన్నాహాలు చేసుకొంటే, ఎలాంటి అనుభవమైనా సరే, మిమ్మల్ని విచలితులను చేయలేదు, పడదోయ లేదు. మీకు ఆ భరోసా, విశ్వాసమూ ఉంటే, మీరు ఈ లోకంలో ఎన్నో ఘనకార్యాలు చేయగలరు. అవన్నీ మీరు చేయాలనే మా ఆకాంక్ష!