మన సమయాన్ని, శక్తిని మనకు విలువైన, ఇష్టమైన విషయానికై వెచ్చించడం ఎప్పుడూ మంచిదే. ఈ ప్రక్రియ మన అభివృద్ధికి కూడా తోడ్పడేది అయినప్పుడు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకునికి అంతకంటే కావలసినది ఏముంది? సద్గురు రూపొందించిన ఈ సేవా కార్యక్రమం సరిగా అటువంటి అవకాశమే.

ఎంతో ప్రణాళికతో రూపొందించబడిన ఈ కార్యక్రమం, సేవాకాంక్ష గల వారందరికీ, ఆశ్రమంలో అందుబాటులో ఉన్న అన్నిరకాల సేవలలో పాల్గొనటానికి చక్కటి అవకాశాన్నిస్తుంది. సాధనపదలో పాల్గొనే వారందరికి, ఒక రకమైన సేవ నుండి మరొక రకమైన సేవలోకి మారటం ఒక చిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. కొత్త ప్రదేశాల్లో, కొత్త సందర్భాల్లో, అందుకు అనుగుణంగా తమను తాము మలచుకోవటంలో అది సహాయపడి, పాల్గొనే వారికి తమలో పొరలు పొరలుగా ఉన్న ప్రతిబంధాలను పోగొట్టుకోవటాన్ని వారు గమనించగలరు

అన్నసేవ

“అన్న” అనే పదానికి సంస్కృతంలో అర్థం ‘ఆహారం’ అని. ఈశా యోగ కేంద్రంలో రోజుకు కొన్నివేల భోజనాలు వడ్డిస్తారు. భిక్షహాలు అని సద్గురు చక్కని పేరు పెట్టిన హాలులో రోజుకు రెండుసార్లు అన్నదానం జరుగుతుంది. ఉదయం పది గంటలకు, రాత్రి ఏడు గంటలకు భోజనం వడ్డిస్తారు.

భోజనం చేయడం అనే పని ఏదో మొక్కుబడిగా ముందు అనిపించినా, దాన్ని సిద్ధం చేయటంలో ఎంత విషయముందో అన్నసేవలో అనుభవంలోకి వస్తుంది. ఒక పధ్ధతి ప్రకారం భోజనాన్ని వడ్డిస్తారు. సలాడ్ కంటే ముందుగా అన్నాన్ని వడ్డిస్తే మెత్తని చివాట్లు తింటారు.

ఆకలితో ఉన్న సాధకులకు అన్నం వడ్డించటం మనలను మనం సమర్పించుకోవటానికి, ఇతరులతో మమేకం కావటానికి సరైన మార్గం. చిన్న చిన్న కార్యకలాపాల ద్వారా అవగాహనను పొందటం, అన్నింటికంటే ముఖ్యమైనది. సేవలో పాల్గొనే వారిలో ఇటువంటి అవగాహన కలిగించటమే ఈ సాదనా పద కార్యక్రమంలో అన్నసేవను చేర్చటంలోని ముఖ్యోద్దేశం.

భౌతికంగా ఏదో ఒక పని చేస్తున్నపుడు ధ్యాన మార్గంలో ఉండటం తేలిక.

“అన్నసేవ” లో ఎంతో గొప్ప సేవానుభవం. ఆ సేవ చేసేటప్పుడు నేను శారీరకంగా చాలా చురుకుగా ఉంటాను (ఎందుకంటే నా సేవ సాధారణంగా ఓ ఆఫీస్ లో) అలాంటి మానసికమైన పనిలో కంటే, శారీరకంగా పనిలో(అన్నసేవ) ఉన్నప్పుడు ధ్యానస్థితిలో ఉండటం మరింత తేలిక అని గ్రహించాను -జేనేవివే,౩౦, కెనడా

నాలో పొరలు పొరలుగా పేరుకున్న అసమ్మతిని తొలగించింది.

సింకుల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలను శుభ్రం చేస్తున్న వారిని చూసినప్పుడు, ‘‘నేను ఆపని చెయ్యలేను” అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత నా అంతట నేనే బలవంతంగా ఆ పని చేశాను. ఎందుకంటే నాకు నేనే ఓ పరిధిని విధించుకున్నానని గ్రహించాను. ఆ పరిమితిని అధిగమించాలని చేసిన ఆ పనిలో నేనెంతో ఆనందాన్ని పొందటం చూసి ఆశర్యపోయాను. ఆ తర్వాత ఎవరో ‘సింకులను ఎవరు శుభ్రం చేస్తున్నారు” అని అడిగినప్పుడు “నేనే” అని జవాబిచ్చాను. అన్నసేవ వల్ల నా జీవితంలో ఎన్నో విధాలుగా లాభపడ్డాను. ఆ సమయంలో, అక్కడి మనుషులతో ఆనందంగా ఉండటమే కాక, నా లోలోపల నేను కూడా చాలా ఆనందంగా ఉన్నాను- బిఎన్న,27,ఆస్ట్రేలియా

భిక్షహాలు కూడా ధ్యాన లింగమంత పవిత్రంగా ఉంది:

భిక్షహాలులో ఆతిథ్యం ఇవ్వటం ఎంతో బాగుంది. మనం ఆహారం వడ్డిస్తున్న ప్రతి వ్యక్తీ, స్వయంగా సద్గురు అన్నంత శ్రద్ధగా వడ్డించటం అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది. ఈసారి నా కుటుంబంలో వారు ఈశాలో ముఖ్యమైన ప్రదేశాలను చూపమని అడిగితే, ధ్యానలింగం, లింగ భైరవి, ఆదియోగితో పాటుగా భిక్ష హాలును కూడా వారికి చూపిస్తాను. ఎందుకంటే లింగభైరవి, ధ్యాన లింగాల వద్ద ఎంతటి పవిత్రత ఉందో అంతటి పవిత్రత భిక్షహాలులో కూడా ఉంది – శ్రీ కాంత్,26, ఆంధ్రప్రదేశ్.

లింగసేవ

ముక్తికి, జ్ఞానానికి మార్గాలు తెరిచే ధ్యానలింగం వేలాది భక్తులను ఆకర్షిస్తుంది. ధ్యానలింగం సమక్షంలో ఉంటే చాలు ధ్యానం దానంతట అదే సాధ్యమవుతుంది. ఆ పవిత్ర ప్రదేశంలో అందరూ సేవ చేసుకోవటానికి, గొప్ప అనుభూతిని పొందటానికి అనువుగా సద్గురు లింగసేవ కార్యక్రమాన్ని రూపొందించారు. సాధన పదంలో పాల్గొనే వారందరూ లింగసేవ కోసం ఎదురు చూస్తారు. ఫైనాన్స్, ఐటి, తోట పని, గ్రాఫిక్ డిజైనింగ్, అనువాదం వంటి ఏ ఇతర కార్యక్రామాల్లో పనిచేస్తున్న వారినైనా, ఏ నిముషంలో నైనా లింగ సేవ కార్యక్రమంలో చేర్చవచ్చు. హఠాత్తుగా మార్చే, ఈ “మ్యూజికల్ చైర్స్” పద్ధతి ధ్యానలింగ సేవలో పాల్గొనే అవకాశాలు పెరగటానికి అసమానమైన అవకాశాన్ని కలిగిస్తుంది.

నాకు ఇంటికి వచ్చినట్లుంది:

ఇంతకుముందు ధ్యానలింగం దగ్గరకు వెళ్ళడం ఏదో వంకన తప్పించుకుంటూ ఉండేవాడిని. నాకు అక్కడకు వెళ్ళటం ఏదో అసౌకర్యంగా ఉండేది. ఎందుకంటే, అక్కడేమి జరుగుతోందో నాకేమి అర్థం అయ్యేది కాదు. కాని లింగసేవ చేసేటప్పుడు మిమ్మల్ని మీరు సంపూర్ణంగా అర్పించుకోగలరు. మీ ఇష్టాయిష్టాలు పక్కన పెట్టి ఆ ప్రదేశాన్నంతా సరైన రీతిలో ఉంచటానికి ఏది అవసరమో దాన్ని చెయ్యవలసి ఉంటుంది. ఇలా సమర్పించుకోవటమనే అనుభూతి, నాకు - ధ్యానలింగానికి మధ్య ఒక బంధాన్ని ఏర్పరచింది. అక్కడ నాకు, ఇంతకంటే నేను వెళ్ళ వలసిన ప్రదేశం వేరే ఏదీ లేదని అనిపించింది. నాకు కావలసినదంతా ఇక్కడే ఉన్నదని. ఆ భావాన్ని మాటల్లో చెప్పటం కష్టం. నాకు ఇది మా ఇల్లులా అనిపిస్తోంది.” – అన్నా బెల్,22, జర్మని.

భక్తి అంటే ఏమిటో నాకు మొదటి సారి అర్థం అయింది.

ఈశాలో ఐటి శాఖలో చేరుతుంటే నా మనసు చాలా గందరగోళ పడింది. ఎందుకంటే ఏడునెలల పాటు నేను తప్పించుకోవాలని చూస్తున్న కంప్యూటర్ల తోనే మళ్లీ మమేకం కావలసి వస్తుందని. కానీ లింగసేవ సరైన సమయంలో వచ్చింది. వివిధ సాంఘిక పరిస్థితుల నుండి వచ్చిన పలు రకాల వ్యక్తులను నేను కలుసుకున్నాను. వారిని ఆహ్వానించే సందర్భంలో నేను వారితో ఎలా మెలగాలో నేర్చుకున్నాను. పది రోజుల పాటు ఉదయాన్నే లేవటం, ఆలస్యంగా నిద్రించటం, నిరంతరం జాగ్రత్తగా ఉండటం ఇవన్నీ నా మనసులోని గందరగోళాన్ని తొలగించాయి. నాకు నిజంగా భక్తి అంటే ఏమిటో తెలియదు. నేను అది ప్రేమ, అంకిత భావం అనుకున్నాను. కాని అది వాటి అన్నింటికంటే ఉన్నతమైనది. ఎందుకంటే ప్రేమ పరిమితమైనది. ఒకసారి భక్తి నన్ను స్పృశించాక, అది నాకు సంబంధించిన అన్నింటిలో ఇంకిపోయింది.” – నథాలి, 34, కెనడా.

కేవలం తొమ్మిది రోజుల్లో, తొమ్మిది నెలల కన్నా ఎక్కువ అభివృద్ధిని సాధించాను.

నా గదిలో నాతో పాటు ఉండే అతను రోజూ ఉదయం మూడు గంటలకు లేవటం, రాత్రి పది దాటాకే తిరిగి పక్కమీదకు చేరతాడని గమనించిన నాకు లింగసేవ అనేది శారీరకంగా చాలా కష్టంతో కూడినది అని అనిపించింది. ముందురోజు నేను ‘మిస్టిక్స్ మ్యూజింగ్స్’ పుస్తకంలో ‘ధ్యానలింగ’ అధ్యాయాన్ని చదివి నన్ను నేను సేవకు తయారు చేసుకున్నాను. నా భౌతికతకు గాని, నా మానసికమైన చెత్తకు కాని అది ఏ మాత్రం సంబంధించనిది కాదని నేను అనుకోలేదు. ఆ తొమ్మిది రోజుల్లో, ఒక మానవుడు తొమ్మిది నెలల్లోనో, అంతకంటే ఎక్కువ కాలంలోనో పొందేటంతటి అభివృద్ధిని నేను సాధించాను.”- గుహన్, 22, తమిళ నాడు.

ఈశా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవ

అసలు సెలవులు అంటే ఏ పని చెయ్యకుండా ఉండటమే! కానీ తమ రోజువారి పని నుండి తప్పుకొని, ఈశా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సేవ చేసేందుకు సాధనపదలో పాల్గొనేవారు ఆతుర పడతారు. కానీ వారాంతం ‘బాలి’లో గడపటం కంటే కూడా, అలా ఈశా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా చేయటానికి ఎందుకు ఇష్టపడతారు?.... చదవండి.

భావస్పందన కార్యక్రమంలో వాలంటీరింగ్ - ఇవ్వటంలోని ఆనందాన్ని నాకు నేర్పింది.

సాధనపదలో పాల్గొనే 350 మందికి భావస్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మేము కేవలం రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రిస్తున్నాము. కాని ఇంత శక్తిమంతంగా నేనెప్పుడూ లేను. చివరికి నేనే పాల్గొన్న భావస్పందన కార్యక్రమంలోనూ, నేను ఇలా లేను. కేవలం వాలంటీరింగు ముగించుకొనే సరికి నేను మారిపోయాను. ఇవ్వటంలో ఉండే ఆనందం ఎంతో ముఖ్యమైనదని నేను గుర్తించాను. ఒకసారి ఆ అనుగ్రహం మనను స్పర్శిస్తే, మనం ఇక అందులోనే మునిగి ఉండాలనుకుంటాం. ఇతరమైనవి ఏవీ, ఏ మాత్రం ముఖ్యమైనవిగా తోచవు. ఇది నా సాధనాపద ప్రారంభంలో జరిగింది.”- ప్రాంశు,27, మహారాష్ట్ర.

ఈశా యోగ కేంద్రంలో ఒకేసారి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆశ్రమంలో నివసించే వారందరికి ఏదో ఒక సేవ చేసుకొనే అవకాశం ఉంటూనే ఉంటుంది. అందరిలో గొప్ప మార్పు తేవాలనే సద్గురు ఆశయానికి ఇది ఊతాన్ని ఇవ్వటమే కాక, ఒక శక్తిమంతమైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వామ్యం వహించే అవకాశాన్ని అందరికీ కలిగిస్తుంది.

డమరు సేవ: సంగీతం ఒక సేవగా అర్పణ చేయడం

ఈశా కార్యాలయాలు కార్పోరేటు వాతావరణంలో ఉంటున్నాయని మీకు అనిపిస్తే, అంగవస్త్రం ధరించి, చిరునవ్వులు చిందించే వాలంటీరు యువకులు డమరు ధ్వనితో ఆశ్రమాన్ని మారు మ్రోగించినప్పుడు ఆ అభిప్రాయం తొలగి పోతుంది. ప్రతి మధ్యాహ్నం, అందరూ చక్కగా మేలుకొని చురుకుగా ఉన్నారని నిశ్చయం చేసుకుంటూ ఆ బృందం ఆశ్రమంలో అన్ని చోట్లకు వెళతారు. ఈ సేవలో పాల్గొనటానికి గొప్ప సంగీతజ్ఞులు కానక్కరలేదు. అలా సంగీతసేవ చేసేందుకు సుముఖంగా ఉండటమే ముఖ్యం.

డమరు సేవలో మొదటి అనుభవం

తెల్లని అంగవస్త్రాలను ధరించి ఒక వలంటీర్ల బృందం డమరుకాలను, తంబురలను మ్రోగిస్తూ ఆశ్రమ వీధుల్లో తిరగటాన్ని చూసినప్పుడు నేను ఎప్పుడైనా ఇలాంటి సేవ చెయ్యగలనా అని అనుకున్నాను. సాధనాపదలో కొన్ని వారాలు గడపగానే డమరు సేవలో పాల్గొంటారా అని మా బృందాన్ని అడిగారు. నాలో కొంత విముఖత కలిగింది. ఎందుకంటే అప్పుడు చాలా ఎండగా ఉంది. ఆ పరిస్థితిలో నేను నా విధిని సక్రమంగా నిర్వర్తించగలనా, లేనా అని సందేహం కలిగింది. ఒకసారి సేవ చెయ్యటం ప్రారంభించాక, ఎండ ఒక లెక్కే కాకండా పోయింది. అది ఒక అందమైన అనుభవం అయింది. మళ్ళీ తరువాతి నెలలో డమరు సేవకు వస్తామని అంగీకరించి వచ్చాము – ఆసిన్ పౌల్, 27, కర్ణాటక.

ధ్యాన లింగంలో ‘నాదారాధన’ చేసేటప్పుడు సృజనాత్మకత వెల్లి విరుస్తుంది.

‘‘ధ్యానలింగంలో ‘నాదారాధన’ చేసేటప్పుడు నాలో ఎన్నో పరివర్తన పొందాయి. ధ్యానలింగం ఉన్న గుమ్మటంలాంటి ఆ గుడిలో ధ్వనికి సంబంధించినంత వరకు, నిర్మాణం అద్భుతంగా, అసమానంగా, స్ఫూర్తిదాయకంగా ఉంది. అక్కడ ప్రతి స్వరమూ ఒక గాఢతను, సౌందర్యాన్ని పొందుతుంది. దాంతో సులభంగా, అప్రయత్నంగా అద్భుత సంగీతం వెలువడుతుంది. నా మటుకు నాకు అక్కడ సంగీతాన్ని సృజించటం గొప్ప అనుభూతి, గొప్ప వరం. నేను సంగీత వాయిద్యాన్ని మీటే తీరు, సంగీతాన్ని పాడే తీరు చాలా మారిపోయింది. ధ్యానలింగంలో ‘నాదారాధన’ చేసేటప్పుడు అక్కడ ఆ క్షణంలో సృజనాత్మకత వెల్లివిరుస్తుందని అనిపిస్తుంది. అక్కడ ఆ ప్రదేశంలో ఉన్న శక్తులు నా సమతల్యతను కోల్పోకుండానే నిర్భయంగా ప్రయోగం చేసేందుకు దోహదం చేస్తాయి. అదే సమయంలో అర్పణ భావం కూడా ఉంటుంది. నేను కేవలం కళ్ళు మూస్తే చాలు సంగీతంతో మమేకమై పోతాను. అది ఒక అందమైన ప్రపంచంలోకి జారిపోవటం, అక్కడ ఉన్నది ఇక ఎంత మాత్రం ఈ నేను కాదు – గేబ్రియల్, 39, బ్రెజిల్.

గోశాల వద్ద

ఈశాలో ‘మాతు మనె’ అనే గోశాల ఉంది. అది ఆవులకు, ఎద్దులకు మంచి ఆశ్రయాన్ని ఇస్తోంది. ఆవులను, ఎద్దులను సంరక్షించటంలో శక్తితో పాటు మృదుత్వం కూడా అవసరమే! పశువులు చక్కగా పెరగటానికి అవి రెండూ అవసరమే!

నా పరిమితులన్నీ తొలగిపోయినట్లుగా అనిపించింది

సేవలో భాగంగా, పశు వైద్యునిగా నన్ను మాతు మనే శాఖలో నియమించారు. నా వైద్య వృత్తిని మళ్ళీ చేపట్టవచ్చునని మొదట నేను సంతోష పడ్డాను. కానీ కాలం గడచిన కొద్దీ పశువులకు వైద్యం అందించటమే కాక వాటికి మేత వెయ్యటం, నీళ్ళు పెట్టటం, పేడ తీసి శుభ్రం చెయ్యటం, ఆ పేడను ఎరువుగా మార్చటం – ఇవన్నీ కూడా నా సేవలో భాగం అని తెలుసుకున్నాను. ఈ పనులన్నీ చేసేటప్పుడు, వీటన్నింటి పట్ల నాలో పొరలు పొరలుగా ఎంత ప్రతికూలత ఉన్నదో అర్థమైంది. ఇలాంటి పనులు అంతక్రితం నేనెప్పుడూ చేసి ఉండలేదు. ఇప్పుడు ఎంతో ఎరుకతో చేసి, నా చుట్టూ ఉన్న ప్రకృతి మహత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నాను. నాకున్న పరిమితులన్నీ తొలగిపోవటాన్ని నేను గుర్తించాను. నేను ఇక్కడ పనిచెయ్యటం మొదలు పెట్టి మూడు నెలలు అయింది. ఒకసారి వెనక్కు తిరిగి చూస్తే ‘ఆ నేను’ – ‘ఈ నేను’ ఒకటి కాదు అనిపిస్తుంది. నా సేవలో నా చుట్టూ ఉన్నవారికి, నా కో- ఆర్డినేటర్ కు, నాలో ఇంతటి మార్పు తీసుకువచ్చినందుకు కృతజ్ఞతలు – సోనిక, 24, కర్ణాటక.

పృథ్వీ ప్రేమ సేవ

యోగాలో ప్రధానమైన ‘పంచభూతాలతో అనుసంధానమై ఉండటం’ అనే దృక్పథం ఆధారంగా సద్గురు పృథ్వీ ప్రేమ సేవను తీర్చిదిద్దారు. మట్టితో ఎండలో పనిచేసే అద్భుత అవకాశం ఈ సేవలో కలుగుతుంది.

ఒక ఇంజనీరు, ఒక గాయకుడు, ఒక సాఫ్ట్వేర్ డెవలపరు, సాధనపదలో చేరి, గంటల తరబడి శారీరక శ్రమ చెయ్యవలసి రావటాన్ని ఊహించండి. అద్భుతమైన వెల్లంగిరి పర్వత పాదాల వద్ద, ప్రకృతికి అంత దగ్గరగా పనిచెయ్యటం గొప్ప వరం. దాన్ని వాళ్ళు ఎంతో ఉత్సాహంతో చేపడతారు. చెట్లను నాటడం, కలుపు తియ్యటం, పూలను సేకరించటం, జామపండ్లను, సీతా ఫలాలను, నిమ్మకాయలను కొయ్యటానికి దగ్గరలో ఉన్న పళ్ళ తోటలకు వెళ్ళటం, పృథ్వి ప్రేమసేవలో భాగం. (పళ్ళను కోసేటప్పుడు తినటానికి వీలు లేదు.)

నా ఆలోచనలు, ఉద్వేగాల కంటే జీవితం మరెంతో విశాలమైనది

ప్రకృతి అంటే నాకెంతో ప్రేమ, అందువల్ల నాకు పృథ్వీ సేవలో అవకాశం రాగానే ఎంతో సంతోషించాను. ఒక నెలపాటు అది ఎంతో కష్టం అనిపించింది. రోజంతా ఎండలో ఎండుతూ, వర్షంలో తడుస్తూ, మట్టిలో పనిచేస్తూ ఉండవలసి ఉంది. ఒకసారి నా శరీరం దానికి అలవాటు పడ్డాక, దాన్ని ఆనందించటం ప్రారంభించాను. సద్గురు అన్నట్లుగా చుట్టుపక్కల అంతా జీవంతో తొణికిసలాడుతోంది. కానీ నేనే నా మానసిక నాటకంలో లీనమై, నా చుట్టూ జరుగుతున్న దాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ పురుగులను, కీటకాలను, అందమైన సీతాకోక చిలుకలను, చివరకు మొలకెత్తుతున్న చిన్న మొలకను చూస్తూ ఉంటే నాకెంతో ఆనందం కలుగుతోంది. వాటిని నేను ఇప్పుడు ఎంతో ఆనందంతో గౌరవంతో గమనిస్తున్నాను. అది నా వ్యక్తిత్వాన్ని కరగించి వేస్తోంది” – గౌరీ,28, మహారాష్ట్ర.

అది నా సంస్కృతిని దిగంతాల దాకా విస్తరించింది.

ప్రతిరోజూ పొలానికి వెళ్ళటం, అన్ని రకాల మనుషులను కలవటం, నన్ను సాంస్కృతికంగా ఎంతో సుసంపన్నం చేసింది. “మనలో ఎన్నో భేదాలు ఉండవచ్చు, కాని మనమందరం మనుషులం” అనిపించింది. మన సాంస్కృతిక స్థితులు విభిన్నంగా ఉన్నాయి. అలాంటి భేదాలను గమనించటం, భారతదేశంలోని అన్ని ప్రాంతాలనుండి, ప్రపంచంలో ఇతర దేశాలనుండి వచ్చిన వారిని స్నేహితులను చేసుకోవటం ఎంతో సరదాగా ఉంది”- మికస్, 32, లటీవియా

వచ్చే సంచికలో.... ఎంతో జాగ్రత్తగా రూపొందించబడిన సాధనాపద షెడ్యూల్ లో నెగ్గుకు రావడం ఒక ఘనకార్యమే. వచ్చే సంచికలో సాధనాపాదలో నెగ్గుకు రావడానికి ‘సాధనాపద సర్వైవింగ్ గైడ్’ లో కొన్ని కిటుకులు అందిస్తాము.