రుద్రాక్షల గురించిన వ్యాసానికి లభించిన విశేష ఆదరణ దృష్ట్యా, ‘ఈశా బ్లాగ్’ మీ కోసం ఈనెల ‘ఫారెస్ట్ ఫ్లవర్’ నుంచి మరో రచనను అందిస్తున్నది. ఇందులో, ఇతర వృక్షాల బీజాలతో పోలిస్తే రుద్రాక్షల విశిష్టత ఏమిటో సద్గురు చర్చిస్తున్నారు. ఇతర పదార్థాలలో ఉండే ప్రకంపనల గూర్చి కూడా విశదీకరిస్తున్నారు

ప్రశ్న: సద్గురు, రుద్రాక్షల గురించిన విశేషాలు మాకు తెలియజెప్తారా? ఇతర బీజాలకూ, రుద్రాక్షలకూ ఉన్న తేడా ఏమిటి ?

సద్గురు: ఈ బ్రహ్మాండంలో ప్రతి పదార్థానికీ కొన్ని విశిష్టమైన ప్రకంపనలు (reverberations) ఉంటాయి. ఒక దిశలో ప్రయాణానికి అవి మనకు ఏ విధంగా ఉపకరిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్క రుద్రాక్షలే కాదు. అనేక రకాల మొక్కలూ, పుష్పాలూ, జంతువులూ అన్నింటిలో మనల్ని ఆధ్యాత్మికత దిశగా తీసుకు వెళ్లగలిగినవి ఏవీ, తీసుకు వెళ్లలేనివేవీ అని గుర్తించటం జరిగింది. ఉదాహరణకు ఒక గొర్రె ఉన్నదనుకోండి. అది ఆధ్యాత్మిక సాధనలో పనికి వచ్చేది కాదు. ఆంబోతు గానీ, పాముగానీ, నెమలి గానీ ఆ దిశలో పనికి వస్తాయి. కారణం ఈ ప్రాణులలో ఒక విధమైన సూక్ష్మ గ్రాహ్యత (sensitivity) ఉండటమే.

నాకు పది, పదకొండు సంవత్సరాల వయస్సప్పుడు, నేను చాముండీ కొండల మీదా, ఇతర అడవులలోనూ చాలా సమయం గడిపే వాడిని. నేను ఊరికే ఒకే చోట కూర్చొని, ఒక్క మధ్యాహ్నానికల్లా 5-10 నాగుపాములను పట్టగలిగే వాడిని. దీనికి ఒక కారణం ఆ విషయంలో నేను కాస్త నైపుణ్యం సంపాదించుకొని ఉండటం. నాగుపాములు తిరిగే చోట అవి పెద్దగా వాటి జాడలేవీ వదిలి వెళ్ళవు. ఒక రకమైన వాసనా, పాము కదలికలకు సంబంధించిన కొద్దిపాటి ఛాయలూ మాత్రమే ఉంటాయి. నాగుపాము కొద్ది సమయం కిందే ఒక చోటినుంచి, మరొక చోటికి కదిలి వెళ్లింది అని గ్రహించేందుకు మీకు మంచి పరిశీలన శక్తి ఉండాలి.

ఆ రోజుల్లో నాకు నా నైపుణ్యం గురించి చాలా గర్వంగా ఉండేది. చాలా కాలం తరవాత- నేను ధ్యానం చేయడం మొదలుపెట్టిన తరవాత- నాకు అసలు విషయం తెలిసి వచ్చింది. నిజానికి జరుగుతూ వస్తున్నది, నేను వాటిని పట్టుకోవటం కాదు, అవి వాటంతటవే నా వైపుగా పాకి వస్తున్నాయని. చాలా సందర్భాలలో మధ్యాహ్నం వేళలో , దాదాపు మూడు- అయిదు గంటల మధ్య, నేను అడవికి వెళ్ళి అలా ఊరికే కదలకుండా కూర్చొనే వాడిని. నేను కళ్ళు తెరిచి చూసేసరికి నా చుట్టూ ఏడెనిమిది నాగుపాములుండేవి. మీరు కాస్త ధ్యానపరులు అయితే, వెంటనే అవి మీ దగ్గరకు ఆకర్షితమౌతాయి. ఏ ప్రాణులయినా సరే, అలాంటి ఆధ్యాత్మిక ప్రకంపనల వైపు ఆకర్షితమవుతున్నాయంటే, వాటిలో ఆధ్యాత్మికత ఉన్నట్టే.

పూలలో కూడా అంతే. ప్రత్యేకమైన పవిత్రతగల పూలు అనేక రకాలు ఉన్నాయి. ఫలానా ఈ పుష్పం అంటే శివుడికి చాలా ప్రీతి అనీ, ఆ పుష్పం విష్ణువుకు ప్రియమయిందనీ జనం చెప్పుకోవటం మీరు వింటుంటారు. అంటే, మనం శివుడిగానో, విష్ణువు గానో, మరో పేరు తోనో ప్రస్తావించుకొనే తత్త్వాలకు అత్యంత సన్నిహితమైన ప్రకంపనలు గల పుష్పాలను వాళ్ళు గుర్తించారన్న మాట. వాటిని ముట్టుకొన్నా, చేతిలోకి తీసుకొన్నా, అవి ఒక విధమైన ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే దేవాలయాలలో కొన్ని రకాల పుష్పాలను మాత్రమే దేవుడికి సమర్పిస్తారు. దీన్ని రక రకాల పుష్పాలు తీసుకొచ్చి, మనమే నిరూపించచ్చు. మనం రుద్రాక్షలను పుష్పాల మీద ఉంచినపుడు, రుద్రాక్షలు సవ్యదిశలో తిరిగితే, ఆ పుష్పాలు శివుడికి సమర్పించటానికి యోగ్యమైనవని అర్థం. మీరు ఈ ప్రయోగాన్ని కేతకీ పుష్పం (మొగలి పూవు) తో చేసి చూడండి. రుద్రాక్షలకు ఆ పూలు నచ్చవు ! మొగలిపూవును గురించిన కథ ఉన్నదని మీకు తెలుసు గదా, అది శివుని ముందు తప్పుడు సాక్ష్యం చెప్పటం వల్ల , దాన్ని శివుడికి సమర్పించటం మీద నిషేధం వచ్చిందని? ఇలాంటివన్నీ కథల రూపంగా చెప్పేది, ఇవి భక్తుల మనసులో, మెదడులో గట్టిగా హత్తుకుపోవాలని. కానీ అసలు విషయం ఏమిటంటే, పదార్థాల ప్రకంపనలు పరస్పరానుకూలంగా ఉండాలి, అప్పుడే సంబంధం అనేది ఏర్పడుతుంది.

మొగలి పూవు కథలో లాగే, అన్ని పదార్థాలలోనూ, ఈ ప్రకంపనల సారూప్యతను గుర్తించే వాళ్ళు. రుద్రాక్ష అతి విశిష్టమైన, ప్రత్యేకమైన ప్రకంపనలు గల పదార్థాలలో ఒకటి. రుద్రాక్షను కేవలం చేతులో ఉంచుకొని చూసినా ఈ ప్రత్యేకతను గమనించవచ్చు. ఇంకా, మీరు రుద్రాక్షను 3-6 నెలలపాటు ధరించి ఉంటే, దానికి ఇప్పటికే మీ శరీరంతో ఒక రకమైన సంబంధం ఏర్పడి ఉంటుంది. అందుచేత, ఒక్కొక్క మనిషి ధరించే రుద్రాక్షలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. అందుకే మీరు మీ రుద్రాక్షను ఎప్పుడూ మరొకరికి ఇవ్వకూడదు. మరొకరి రుద్రాక్షను మీరు తీసుకోనూ కూడదు.

 

మీరు ఎలాంటి యోగసాధనలు చేసినా, మరొక సాధన చేసినా, చివరికి మీరు సాధించ గోరేదీ, సాధించగలిగిందీ, దివ్యానుగ్రహ ప్రాప్తి ద్వారానే లభిస్తుంది.

ఎందుకంటే, మీ రుద్రాక్షలో మీకే అనువైన, అనుకూలమైన కొన్ని ప్రకంపనలు ఏర్పడిపోయి ఉంటాయి. మీలో కొంత అంశ వాటిలో ఇమిడిపోయి ఉంటుంది. అలాగే మన ప్రాంతాల్లో, ఉప్పూ, నువ్వులూ, నూనె మరొకరి చేతి నుంచి ఎవ్వరూ తీసుకోరు. అలాగే నిమ్మకాయ కూడా. ఎవరి దగ్గరనుంచి నిమ్మకాయ కూడా తీసుకోరు. దీనికి కారణం ఏమిటంటే, కొన్ని పదార్థాలు స్పర్శ మాత్రం చేత ఇతర పదార్థాల ప్రకంపనలను అతి త్వరగా రాబట్ట గలవు. ముఖ్యంగా చిన్న చిన్న నిమ్మకాయలలో ఈ గుణం కనిపిస్తుంది. అవి అన్ని ప్రకంపనలనూ – మంచీ చెడూ రెంటినీ- ‘స్పాంజ్’ లాగా త్వరగా లాగివేయ గలవు. అందుకే నిమ్మకాయలను అటు దేవాలయాలలోనూ, ఇటు క్షుద్ర పూజల ప్రక్రియల లోనూ వాడతారు. రుద్రాక్షకు కూడా ఈ గుణం ఉంది. ఓ రకంగా, రుద్రాక్ష మీ శరీరంలో భాగమే అయిపోతుంది. దీన్ని మీరు ఒకటి రెండు సంవత్సరాలపాటు, ఇరవయి నాలుగు గంటలూ విడవకుండా ధరించారనుకోండి, ఆ తరవాత ఎప్పుడైనా ఒక రోజు దాన్ని తీసేసి నిద్రపోవటానికి ప్రయత్నించారంటే, మీకు నిద్ర పట్టదు. మీ శరీరంలో ఒక భాగాన్ని కోల్పోయిన భావం కలుగుతుంది. కారణం, రుద్రాక్ష మీ శరీరంలో నిజంగానే ఒక భాగమై పోయి ఉంటుంది. అది పని చేయటం కూడా, మీ శరీరంలో ఒక అదనపు అవయవం లాగానే పని చేస్తుంది. ఈ అదనపు అవయవం వల్ల ముఖ్య ప్రయోజనం, మిమ్మల్ని దివ్యానుగ్రహ ప్రాప్తి (‘Grace’)కి సన్నద్ధం చేయటం.

మీరు ఎలాంటి యోగసాధనలు చేసినా, మరొక సాధన చేసినా, చివరికి మీరు సాధించ గోరేదీ, సాధించగలిగిందీ, దివ్యానుగ్రహ ప్రాప్తి ద్వారానే లభిస్తుంది. అందుకే భక్తుల లక్ష్యం త్వరగా సిద్ధిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అర్పణ బుద్ధితో ఉంటారు గనక. ఆ రకమైన అర్పణ భావం లేకపోతే, యోగ సాధనలు వట్టి సర్కసు విన్యాసాలు గానే ఉండి పోతాయి. రుద్రాక్ష వలన మరో ప్రయోజనం కూడా ఉంది. అది ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. గాడిదలా కలకాలం జీవించాలని ఆశ పడే వారందరికీ, ఇది అన్నిటికంటే అతి ముఖ్యమైన ప్రయోజనం ! ఎలా జీవిస్తున్నామన్న విషయంపై వాళ్ళకు ధ్యాస లేదు. మరిన్ని సంవత్సరాలు బతకగలిగితే చాలు అనుకొంటారు. బతకటం దేని కోసం ? ఉదయం నుంచి, సాయంత్రం దాకా వాళ్ళ ‘ఆనంద స్థాయి మాపకం’ (‘Happiness Meter’) పరీక్షిస్తే, అది , వాళ్ళు గొప్ప ఆనంద శిఖరాలు అందుకొన్న దాఖలాలేమీ చూపదు. అసలు వాళ్ళు దీర్ఘాయువుతో, బహుకాలం బతకాలనుకోవటానికి కారణం, వాళ్ళకు మరణమంటే ఉండే అమితమైన భయం మాత్రమే. ఎలాగైనా సరే ప్రాణాలు నిలుపుకొని ఇలాంటి గొప్ప ఆనందాలు అనుభవించాలి అనిపించేలా, చెప్పుకోదగ్గ గొప్ప అనుభవాలేవీ వాళ్ళ జీవితంలో కలిగాయని కాదు.

అలాంటివేమీ లేవు. ఈ జీవితం ముగిస్తే తరవాత ఏం జరుగుతుందో వాళ్ళకు తెలియదు గనక, వాళ్ళు దీన్నే పట్టుకు వేళ్లాడడానికి ప్రయత్నిస్తున్నారు, అంతే! జీవితంలో ఏవిషయంలో నైనా- ఆధ్యాత్మిక ప్రక్రియ కానివ్వండి, ఆరోగ్యం, ఆస్తి పాస్తుల లాంటి మరే విషయంలోనైనా కానివ్వండి- విజయం సాధించాలంటే, మీరు దివ్యానుగ్రహానికి సన్నద్ధులుగా (available to Grace) లేకపోతే, అది సాధ్యం కాదు. ఆ స్థితిని మీరు ప్రయత్నపూర్వకంగా నైనా పొందచ్చు. లేక అప్రయత్నంగా మరే ఇతర పద్ధతిద్వారా చేరుకొన్నాచేరచ్చు. ఎంతో కొంత దివ్యానుగ్రహం (Grace) లేకుండా, ఏ మనిషికైనా, ఏ ప్రాణికయినా అసలు జీవంతో ఉండటమే అసాధ్యం. అయితే, ప్రయత్నపూర్వకంగా ముందు ఈ దివ్యానుగ్రహాన్ని మీ జీవితంలో భాగంగా మీరు చేసుకోగలిగితే మిగిలినదంతా సులభంగా, సవ్యంగా జరిగిపోతుంది. కందెన నూనె వేసి రాపిడులూ రణగొణలూ తొలగించిన యంత్రంలాగా, జీవితం సుగమంగా సాగుతుంది. రుద్రాక్ష అలా జరిగేందుకు దోహదం చేస్తుంది. మనకు లభ్యమయ్యే ఆలంబనలనూ, ఆధారాలనూ అన్నింటినీ మనం వినియోగించుకోవాలి మరి !

ప్రేమాశీస్సులతో,

సద్గురు