సద్గురు: పర్యావరణ సంరక్షణ, నీటికొరత వంటి సమస్యలతో ప్రజలు ఎదుర్కొనే కష్టాల గురించి, ఎంతోమంది ఉపన్యాసాలు చేసే అనేక సమావేశాలలో నేను పాల్గొన్నాను. నన్ను కలవర పరచేది ఏమిటంటే, ప్రభుత్వము కూడా ఈ ప్రాథమిక సమస్య అయిన జనాభా గురించి ఆలోచించడం లేదు. 20వ శతాబ్దం మొదట ప్రపంచ జనాభా 160 కోట్లు. ఈ రోజు ఒక శతాబ్దం తరువాత మనం 720 కోట్ల జనాభా. 2050 నాటికి 960 కోట్ల జనాభా అవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. ఇది కేవలం భాద్యత రహితమైన పునరుత్పత్తి. భారతదేశంలో 1947 సంవత్సరంలో మన జనాభా 33 కోట్లు. ఇవ్వాళ 120 కోట్లు, ఎన్ని చెట్లు పెంచినా, ఎన్ని చట్టాలు చేసినా, ఎటువంటి సాంకేతికతను తెచ్చినా జనాభా నియంత్రణ లేనిదే పరిష్కారం లేదు.

మనం ఎరుకతో జనాభాను నియంత్రించాలి లేదంటే ప్రకృతే ఆ పని చేస్తుంది, పాశవికంగా. మనకున్న ఛాయిస్ ఇదే. మనదేశంలో ప్రస్తుతం 60% జనాభా భూమిని సేద్యం చేస్తున్నారు, కేవలం 12 కోట్ల మందికి తిండి పెట్టేందుకు. మన రైతులు అరకొర మౌలిక వసతులతో వంద కోట్లకు పైగా జనాభాకు ఆహారాన్ని పండిస్తున్నారు. ఇది ఒక అభినందనీయమైనదే, కానీ ఎవరైతే మనందరి కోసం ఆహారం, మనం తినే వరి, గోధుమలు పండిస్తున్నారో, వారి పిల్లలు కడుపు నిండా తినలేక పోతున్నారు. ఇది ఎందువల్లనంటే "ఇంత భూమితో మనం ఎంత జనాభాను పోషించగలం" అని నిర్ణయించే భాద్యత ఎవరూ తీసుకోలేదు. ఈ విధానం అదుపులేని జనాభాను ఖచ్చితంగా పోషించలేదు.

భూమి కేవలం మానవుల కోసం మాత్రమే సృష్టించబడలేదు.

"ఈ భూమి మన కోసమే సృష్టించబడింది" అనేది స్వార్థ పూరితమైన ఆలోచన. "మీరు భగవంతుని అంశతో సృష్టించబడ్డారు" అనే ఆలోచన మనుషుల బుర్రలలో ఎక్కించారు. ఒక పురుగు కూడా దేవుడు తమలా, ఒక పెద్ద పురుగులా ఉంటాడని అనుకుంటుంది. కేవలం పర్యావరణం కోసం కాదు, ‘ఈ భూమిపై ప్రతి ప్రాణికి దాని పూర్తి జీవితం ఉంది’ అని మనం అర్థం చేసుకోవాలి. ఒక కీటకానికి కూడా తనదైన జీవన విధానం ఉంటుంది. కేవలం ఒక ప్రాణి చిన్నగా మీకన్నా వేరుగా ఉన్నందున దానికి ఇక్కడ బ్రతికే హక్కు లేదు, మీకు మాత్రమే ఉందనుకోవడం దారుణం.

మానవత్వం లేని మానవాళి, ఇది నేటి మానవాళి పరిస్థితి. మానవత్వ విలువలు మనం ముందుకు తీసుకు రాకపోతే, ఎరుకతో మనం జనాభా నియంత్రణ చేయగలమని నాకు అనిపించడంలేదు. ప్రభుత్వాలు చట్టాలు చేయాలి, కానీ ఇలాంటివి బలవంతంగా చేయడం ప్రజాస్వామ్యంలో కుదరదు. ఇది కేవలం ప్రచారం వల్ల మరియు ప్రజలలో అవగాహన తీసుకురావడం వల్లనే జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నవారు తప్పనిసరిగా ఈ ఆలోచన ముందుకు తేవాలి. ప్రయివేటు ఏజన్సీలు మరియు ఎన్జీవోలు కొంతవరకు చేయగలరు. కానీ ప్రభుత్వ చర్యలు అవసరం.

జనాభా నియంత్రణ చేయకుండా, పర్యావరణ, భూమి లేదా నీరు పరిరక్షణ గురించి మాట్లాడడం వల్ల ఏమీ జరగదు. ప్రస్తుత సైన్స్ సాంకేతికత ప్రతి మనిషినీ అతిగా క్రియాశీలకంగా మార్చింది. మానవుని యొక్క క్రియాశీలతను ఆపలేము, అలా చేస్తే మానవాళి ఆకాంక్షలకు అడ్డుకట్ట వేసినట్లు అవుతుంది. మనము కేవలం జనాభా నియంత్రించడం మాత్రమే చేయగలం.

జననాల భాద్యత తీసుకోవడం

1947 లో భారతీయుల సగటు ఆయుర్దాయం 32 సం, ప్రస్తుతం అది 65 సం. కు దాటింది. అంటే ఈ రోజు మనం మరణాన్ని కొంతవరకు నియంత్రించ గలిగాము, కానీ అలాగే జననంపై భాద్యత వహించాలి. ఇవ్వాళ మనకు బస్సులు కానీ, నేల కానీ, మరుగు దొడ్లు, కనీసం సరిపడా ఆకాశం కానీ, 120 కోట్ల జనానికి సరిపడా లేవు. మనము చేయగలిగిందేంటంటే మన జనాభాను మనకున్న వనరులకు తగ్గట్లు సరిపుచ్చగలమా? అవసరమైన చదువు, అవగాహన ప్రతి మనిషి లో వచ్చినట్లైతే, ఇది ప్రతి మనిషి చేయగలడు. దీనికి కావలసిన పెట్టుబడి పెట్ట గలిగితే మనం చెట్లు నాటక్కర్లేదు. ప్రస్తుతం భూగోళం ప్రమాదంలో లేదు, మానవాళి ప్రమాదంలో ఉంది. ఇది మనుషులందరు అర్థం చేసుకోవాలి. మనం ఈ విషయం తెలుసుకొని అవసరమైనది చేస్తామని ఆశిస్తున్నాను.

పర్యావరణ పరిరక్షణ, హరిత సాంకేతికత ఇవన్నీ ఖచ్చితంగా అవసరమే, కానీ అత్యంత ప్రాధమిక విషయాన్ని అర్థం చేసుకోవడం ఇంకా అవసరం. మనము నాలుగు రెట్లు పెరిగాము, మరి ఇంకా పెరిగి పోతున్నాము, కానీ దాని గురించి ఏమీ చేయలేదు. ఇదే పెద్ద సమస్య.

ప్రేమాశీస్సులతో,

సద్గురు