ఈశా యోగా సెంటర్‌లో 21 రోజుల హఠ యోగా కార్యక్రమంలో భాగంగా, సద్గురుతో జరిగిన సమావేశం సారాంశం. ఎవరైనా సరే, తీర్మానాలు, ఊహాగానాలు చేయడానికి బదులుగా వారు ఒక అన్వేషకునిగా మారడానికి ధైర్యం, నిబద్ధత ఉండాలి అని సద్గురు అంటున్నారు.

ప్రశ్న: చిన్నప్పటి నుండీ ‘దేవుడు ఉన్నాడు’ అని నమ్మకం కలిగించడం వల్ల, నేను భక్తుడిని అయ్యాను. కానీ, ఇక్కడ హఠ యోగా కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి, ఇక్కడ అంతా కర్మ - సిద్ధాంతం అని గమనించాను. అంటే దీని అర్థం, దేవుడి ప్రమేయం లేదనా? ఇరవై ఒక్క సంవత్సరాలుగా నేను దేవుణ్ణి నమ్ముతున్నాను. ఇప్పుడు అది కాదు అనుకోవడం అంత సులభం కాదు. దయచేసి, ఇదంతా అర్థం చేసుకోవడానికి, నాకు సహాయం చెయ్యండి.

సద్గురు: శంకరన్ పిళ్ళై వైవాహిక జీవితం బెడిసి కొట్టేట్టుగా ఉంది. అతను ఒక కౌన్సెలర్ దగ్గరకు వెళ్లి, “నేను ఏమి చేయాలి? నేను ఏది ప్రయత్నించినా అంతా తారుమారు అవుతోంది” అని మొర పెట్టుకున్నాడు. దానికి ఆ కౌన్సెలర్ "ఆమె నిజంగా ఏమి కోరుకుంటోందో మీరు తెలుసుకోవాలి" అన్నాడు. అంతేకాక అది తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు ఇచ్చాడు. శంకరన్ పిళ్ళై ఇంటికి వచ్చేటప్పటికి అతని భార్య అతని వంకైనా చూడకుండా ఒక మహిళా పత్రిక చదువుతోంది. ఎలా మాట్లాడాలా అని అతను ఒక క్షణం ఆలోచించాడు. ఆ తరువాత అతను, "ప్రియా, నీకు తెలివైన మనిషి కావాలా? లేక అందమైన మనిషి కావాలా?" అని అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడలేదు. అప్పుడు అతను దగ్గరికి వెళ్లి, పక్కన కూర్చుని, “హనీ... డార్లింగ్.. నువ్వు తెలివైన వ్యక్తిని కోరుకుంటున్నావా లేక అందమైన వ్యక్తినా?” అని అడిగాడు. పత్రిక నుండి చూపు మరల్చకుండా, "ఇద్దరినీ కాదు - నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను" అన్నది.

ప్రేమ, దోమ అంటూ కూర్చోవడం కన్నా, వివాహ సంబంధం కొనసాగించడం ముఖ్యం అన్న తెలివి ఆమెకు ఉంది. ఇప్పుడు, మీ భక్తి ఎలాంటిదో చూద్దాం! ఇంతకు ముందు మీరు దేవుడు ఉన్నాడని నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ కార్యక్రమానికి వచ్చి ఈశా కర్మ పరమైనది అని తేల్చారు! ఈ ప్రోగ్రామ్ నుంచి బయటకు వెళ్ళాక మీరు ఏ నిర్ధారణకు వస్తారో ఎవరికి తెలుసు? తీర్మానాలు చేయడం మానేయండి. యోగా అంటే అన్వేషించడం. అన్వేషణ అంటే ‘నాకు తెలియదు’ అని మీరు గ్రహించారు అన్నమాట. సౌకర్యంగా ఉంది కదా అని, ఏదో ఒక నిర్ధారణ చేసుకోవడం ఇష్టపడని స్థాయికి మీరు వచ్చారు అని.

ఒక నిర్ధారణ నుండి మరొకదానికి

మీ చుట్టూ ఉన్న సమాజంలో, మీ కుటుంబంలో, దేవుడిని విశ్వసించడం సౌకర్యంగా ఉంటుంది, లేదా, దేవుడిని అందరూ నమ్ముతారు కాబట్టి మీరూ నమ్మారు. ఆ తర్వాత మీరు ఇక్కడకు వచ్చారు. ఇక్కడ మీరు “రామ్, రామ్”, “శివ, శివ” లేదా ఇంకేమైనా అంటుంటే, ఇక్కడి వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వవచ్చు. కాబట్టి ఇక్కడ, ఇప్పుడు మీరు “కర్మ- సిద్ధాంతం’’ అంటూ మొదలు పెట్టారు! మీరు ఇలా మారిపోవడానికి ఎంత సమయం పట్టింది? మీకు మీరే ఇలా చేసుకోకండి. మీరు అంత తేలికగా మారిపోవడానికి కారణం, అన్వేషకుడిగా మారే ధైర్యం, నిబద్ధత లేకుండా, మీరు ఒక నిర్ధారణ నుండి మరొకదానికి వెళుతున్నారు. అన్వేషకుడిగా ఉండటం అంటే ‘నాకు తెలియదు’ అని అంగీకరించడం. ఈ ప్రపంచాన్ని భగవంతుడు శాసిస్తున్నాడా లేదా కర్మ ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నదా అనేది మీకు తెలియదు - అది వాస్తవం.

మొదట్లో మీకు భయంగా ఉంటుంది. కాని, మీరు దేని గురించి భయపడినా కొంతకాలం తర్వాత మీరు దానికి అలవాటు పడవచ్చు. మిమ్మల్ని నిప్పులు కక్కే డ్రాగన్ ఉన్న గదిలో బంధించారని అనుకుందాం. మీరు కాలిపోకుండా ఉంటే, మూడు రోజుల తరువాత నెమ్మదిగా మీరు ఆ మృగంతో కూడా సంభాషించడం ప్రారంభిస్తారు. కాబట్టి నిర్ధారణలు చేయడం లేదా ఒకదాని నుంచి మరొక నిర్ధారణకు మారడం చేయవద్దు. అసలు విషయం మీకు తెలియదు. దానివల్ల, అది మిమ్మల్ని ఉదయం లేచి మీ యోగా చేసుకునేలాగా చేస్తుంది. స్వర్గం - నరకం, దేవుడు - దెయ్యం అనేవి అసలు ఉన్నాయో లేవో ఎవరికి తెలుసు? మీకు తెలిసినవి - మీ శరీరం, మీ మనస్సు, మీ శక్తి, మీ మనోభావం - వీటిని బాగా ఉంచుకోండి.

ఉదాహరణకి మీరు స్వర్గానికి వెళతారని అనుకుందాం - అది ఆస్వాదించడానికి మీరు మంచి స్థితిలో ఉండాలి కదా. ఒకవేళ మీరు నరకానికి వెళితే - అప్పుడు దానిని తట్టుకుని జీవించడానికి మీరు మంచి స్థితిలో ఉండాలిగా! ఎలాగైనా, మీరు మంచి స్థితిలో ఉండాలి. ఈ భూమి మీద బాగా జీవించడానికి కూడా మీరు మంచి స్థితిలో ఉండాలి. కాబట్టి మీరు దేవుణ్ణి విశ్వసించినా, విశ్వసించక పోయినా - శారీరకంగా, మానసికంగా, భావపరంగా, శక్తి పరంగా - మీరు చక్కటి స్థితిలో ఉండాలి.

Editor’s Note: Offering the rare possibility to go beyond all limitations, Sadhguru takes the seeker on a mystical journey towards ultimate liberation. In “A Guru Always Takes You For a Ride”, Sadhguru delivers rare insights into the Guru-shishya relationship. Download now.

A version of this article was originally published in Isha Forest Flower in November 2016. Download as PDF on a “name your price, no minimum” basis or subscribe to the print version.