Celebrate Guru Purnima with Sadhguru

 

విషయ పట్టిక
1. అనుగ్రహం యొక్క అసలైన అర్థం
2. మీరు అనుగ్రహాన్ని వెదజల్లుతున్నారా?
3. గురువు అనుగ్రహం మీపై ఉన్నదని మీకు ఎలా తెలుస్తుంది?
4. అనుగ్రహం పనిచేస్తూ ఉంది!
5. అనుగ్రహానికి అందుబాటులోకి రావడానికి 7 విధానాలు
   5.1 శాంభవి మహాముద్ర క్రియ – దివ్యత్వానికి ఆహ్వానం
   5.2 వ్యక్తిత్వం నుండి సాన్నిధ్యం వైపుకి వెళ్ళండి
   5.3 కర్మయోగ
   5.4 ఎడతెరిపిలేకుండా నిమగ్నమవ్వడం
   5.5 గొప్పవారిగా నటించటం ఆపండి
   5.6 అన్నీ ఒకటిగానే చూడండి
   5.7 అన్నింటికీ ప్రణమిల్లడం
6. పద్యం - అనుగ్రహ అలలు
7. మహాభారతంలో అనుగ్రహం గురించి సద్గురు వివరణ

సద్గురు: ఈ విశ్వంలో శక్తి రకరకాలుగా అభివ్యక్తం అవుతుంది. సూర్యరశ్మిగా, చిరుగాలిగా, గురుత్వాకర్షణగా పనిచేస్తుంది, అనుగ్రహంగా కూడా అలాగే పనిచేస్తుంది. గురుత్వాకర్షణ మిమ్మల్ని కిందికి లాగేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది; గాలి మిమ్మల్ని నెట్టేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది; సూర్యుడు మిమ్మల్ని మాడ్చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాడు, అనుగ్రహం మిమ్మల్ని ఈ గ్రహం నుండి పైకి లాగేయాలని చూస్తూ ఉంటుంది. ఇది ప్రతికూలంగా మాట్లాడినప్పుడు. మీరు ఇదే విషయాన్ని అనుకూల భాషలో చెప్పాలి అనుకుంటే, భూమి మిమ్మల్ని హత్తుకోవాలని చూస్తుంది, చిరుగాలి మిమ్మల్ని చల్లపరచాలని చూస్తుంది, సూర్యుడు మీకు వెచ్చదనాన్ని ఇవ్వాలని చూస్తున్నాడు, అనుగ్రహం మీరు ఎదగాలని చూస్తుంది. మనం ప్రతికూల భాషలో వెళదాము, ఎందుకంటే అప్పుడు మీరు దానికి అతుక్కుపోరు. అనుగ్రహం అనేది ప్రస్తుతం మీరు చిక్కుకుపోయి ఉన్న మీ పరిమితుల నుండి మిమ్మల్ని పెకలించి వేయాలని చూస్తోంది.

అనుగ్రహం యొక్క అసలైన అర్థం

బలంతో, మేధస్సుతో ఇంకా విజ్ఞానంతో మనం చేయగలిగినది చాలా పరిమితం. మీరు అనుగ్రహం అనే తలుపులు తెరిస్తే అప్పుడు మీరు సాధ్యమని ఊహించను కూడా ఊహించని విధంగా జీవితం ఉంటుంది. “మరి నేను అది సాధించడం ఎలా?” ఎప్పుడూ ఎదురయ్యే ప్రశ్న ఇది. అది మీరు చేయగలిగినదో, చేయలేనిదో కాదు. మీ ఆలోచనలు, మీ భావోద్వేగాలు, మీ ఉద్దేశాలు, మీ తత్వాలు, మీ భావజాలాలు, ఇంకా మీ పక్షపాతాలూ చొరబడని ఒక చోటుని మీలో కల్పిస్తే, అప్పుడు అనుగ్రహం మీ జీవితంలో ఒక బలమైన శక్తి అవుతుంది. పనికిరాని సొంత విషయాలతో మీరు నిండిపోయి ఉంటే, అప్పుడు అనుగ్రహం కేవలం మీ చుట్టూ భ్రమిస్తూ ఉంటుంది. చాలామంది జీవితాలలోని విషాదం ఇదే, ఒక అపారమైన సంభావ్యత ఎప్పుడూ వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, కానీ వారు ఎప్పటికీ దాన్ని అనుమతించరు. ఆధ్యాత్మిక మార్గం ఉద్దేశమూ, ధ్యేయమూ ఇంకా దాని విధానాలూ అన్నీ కూడా మీ వ్యక్తిత్వాన్ని భగ్నం చేసి మీలో ఒక శూన్యాన్ని ఏర్పరచడం కోసమే, అప్పుడు అది అనుగ్రహానికి ఇంకా అసలు మీరు సాధ్యమని ఊహించను కూడా ఊహించని సంభావ్యతలకు ఒక ద్వారం కాగలదు.

మీరు అనుగ్రహాన్ని వెదజల్లుతున్నారా?

మీరు అనుగ్రహంలో ఉన్నారా, లేదా అన్నది అసలు ప్రశ్న కాదు. మీరు (అనుగ్రహంలోనే) ఉన్నారు, లేదంటే మీరు అసలు ఉనికిలోనే ఉండలేరు. ఇక్కడ ప్రశ్న కేవలం – ‘‘మీరు అనుగ్రహాన్ని వెదజల్లుతున్నరా, లేదా మీరు అసహ్యంగా మారి అందరి మీదకీ విరుచుకుపడుతున్నారా?’’ అనే

అంధుడైన ఒక ముని అడవిలో ఉండేవాడు. అటు చాలా అరుదుగా మనుషులు వెళ్లేవాళ్ళు. ఎవరైనా అటుగా వెళ్ళినప్పుడు, వారు అతనికి ఇచ్చినదానితోనే, అతను జీవనాన్ని కొనసాగించేవాడు. ఒక రోజు, ఓ రాజూ, అతని సైనికులూ, ఇంకా మంత్రులు అందరూ కలిసి వేటకు వెళ్తారు. ఆ వేటలో, ఒక జింకను వేటాడుతూ, వాళ్ళు దారి తప్పుతారు. రాజు వారి బృందం నుండి వేరైపోతాడు. రాజుకి అందరికంటే వేగవంతమైన గుర్రం ఉంటుంది కాబట్టి అతను అందరికంటే ముందు వెళ్ళిపోయి, దారి తప్పుతాడు. అతన్ని వెతుకుతూ వాళ్లందరూ కూడా దారి తప్పుతారు. వాళ్ళలో ఒక సైనికుడు వచ్చి, ఆ మునిని, “రాజు గారిని చూసావా?” అని అడుగుతాడు. అతను ‘లేదు’ అంటాడు. ఆ తర్వాత ఒక సేనాధిపతి వచ్చి, “రాజు గారిని చూసావా?” అని అడుగుతాడు. అతను లేదు అంటాడు. ఆ తర్వాత మంత్రి వచ్చి, ‘‘రాజుగారిని చూసావా? అని అడుగుతాడు. అతను లేదు అంటాడు.

ఆ తర్వాత ఆ రాజే అక్కడికి వస్తాడు. ఈ అంధుడైన ముని, వెంటనే అతనే రాజు అని పసిగట్టి, “ఓఁ, మీ ప్రజలు మీ కోసం వెతుకుతున్నారు. మొదట మీ సైనికుడు వచ్చాడు, తర్వాత మీ సేనాధిపతి వచ్చాడు, ఆ తర్వాత మీ మంత్రి వచ్చాడు’’ అంటాడు. ఆ రాజు ఇతను అంధుడని గమనించి, ‘‘ఓఁ, దివ్య మూర్తీ, మొదట వచ్చింది సైనికుడని, తర్వాత వచ్చింది సేనాధిపతని, ఆపై వచ్చింది మంత్రని మీకు ఎలా తెలుసు?” అని అడుగుతాడు. ఆ ముని, ‘‘అదా? మొదటి అతను వచ్చి, ఓ గుడ్డాయినా, మా రాజుగారు ఇటుగా రావడం చూసావా? అన్నాడు, కాబట్టి అతను ఖచ్చితంగా సైనికుడై ఉంటాడు అని నాకు తెలుసింది. రెండో అతను అధికారం చలాయిస్తూ, మర్యాద లేకుండా మాట్లాడాడు, కాబట్టి అతను మీ అధికారులలో ఒకడై ఉంటాడు అని నాకు తెలుసు. మూడో అతను చాలా మర్యాదగా మాట్లాడాడు కాబట్టి అతను మీ మంత్రి అయి ఉంటాడు అని నేను అనుకున్నాను. ఇప్పుడు మీరు వచ్చి నా పాదాలు పట్టుకుని నన్ను ఒక దివ్యమూర్తీ అని సంబోధించారు, కాబట్టి మీరు ఖచ్చితంగా రాజు అయి ఉండాలి” అన్నాడు

మీరు ఆహారం తీసుకున్నా, గాలి పీల్చినా, నీళ్లు తాగినా, అదంతా అనుగ్రహమే. రెండు భాగాల హైడ్రోజన్ ఇంకా ఒక భాగం ఆక్సిజను కలిసి జీవాన్నిచ్చే నీరుగా మారుతోంది - ఇది అనుగ్రహమే. మీరు దానికి ఓ విశ్లేషణ ఇవ్వవచ్చు, కానీ అది ఆ విధంగానే ఎందుకు జరగుతోందో మీకు తెలుసా? జరుగుతున్నదంతా కూడా అనుగ్రహమే. ఇప్పుడు మీరు దీన్ని తాగినప్పుడు లేదా తిన్నప్పుడు లేదా శ్వాస తీసుకున్నప్పుడు, మీరు అదే అనుగ్రహాన్ని వెదజల్లాలి. కాదా? కాని దురదృష్టవశాత్తూ, ప్రజలు అద్భుతమైన వాటిని లోనికి తీసుకొని, వాటిని పనికిరాని చెత్తగా మార్చి బయటకు వదులుతారు. ఒక చెట్టును చూడండి, మీరు దానికి మలాన్ని ఇస్తే, అది తిరిగి పరిమళాన్ని వెదజల్లుతుంది. చెట్టు ఏం చేస్తున్నదో నేర్చుకుంటే, మీరు అనుగ్రహాన్ని వెదజల్లుతారు. ఒకసారి మీరు అనుగ్రహాన్ని వెదజల్లుతుంటే, అందరూ దాన్ని పెంచి, మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇంకా అందులో భాగం కావాలని కోరుకుంటారు.

మీ పై గురువు అనుగ్రహం ఉన్నదని ఎలా తెలుసుకోగలరు?

true-meaning-grace-gurus-grace-pic

ప్రశ్న: మాపై గురువు అనుగ్రహం ఉందని మాకు ఎలా తెలుస్తుంది?

సద్గురు: మీరు ఇది గమనించారా? మీరు ఒక హోటల్ లాబీలో ఉన్నప్పుడు నేపధ్యంలో ఏదో సంగీతం(back ground music) నడుస్తూ ఉంటుంది. కానీ కాసేపటికి అసలు అది ఉందని కూడా మీకు తెలీదు. మీరు ఏదో మాట్లాడాలనుకున్నప్పుడే అది అవరోధంగా మీరు గమనిస్తారు. లేదంటే నిరంతరం ఆ సంగీతం నడుస్తూనే ఉంటుంది. కానీ మీరు దాన్ని గమనించరు. లేదా మీ ఇంట్లో ఏదో మెషిన్ ఎప్పుడూ ధ్వని చేస్తూనే ఉంటుంది, కానీ మీరు దాన్ని ఇంటిలోకి ప్రవేశించి నప్పుడు మాత్రమే గమనిస్తారు. మీ శ్వాస కొనసాగుతూ ఉందని కూడా మీకు తెలీదు; అది ఒక నిమిషం పాటు ఆగిపోయినప్పుడు మాత్రమే మీకది తెలుస్తుంది. కేవలం ఈ కారణంగానే దైవానుగ్రహం మీ మీద నిరంతరం ఉంది అన్నది మీకు తెలీదు.

సరే ఏదైనా నిరంతరం కొనసాగుతూనే ఉందన్న విషయాన్ని తెలుసుకోకపోవడంలో వచ్చిన సమస్య ఏమిటి? తెలుసుకోకపోయినా జీవితం కొనసాగుతుంది. కానీ అనుగ్రహంలో ఉండటంలోని ఆనందాన్ని పూర్తిగా కోల్పోతారు. అనుగ్రహం అనేది వచ్చిపోతూ ఉండేది కాదు. అది ప్రతి వారాంతంలో మీరు ప్రశ్నించేది కాదు. అది నిరంతరం ఉంటుంది. మీరు దాని గురించిన ఎరుకను తెచ్చుకోవాలి, అప్పుడు మీరు అనుగ్రహంలో ఉండడంలోని ఆనందాన్ని తెలుసుకోగలుగుతారు.

ఈ విషయం మీకు అనేకమార్లు చెప్పాను, కాని మీలో చాలామంది దానిని పట్టించుకోలేదు. మీరు నాతో ఒక క్షణం పాటైనా కూర్చుంటే, ఇక మీ జీవితంలో గోప్యం అంటూ ఏమీ ఉండదు. మీరు నాముందు కూర్చున్న తక్షణం, ముఖ్యంగా నేను మీకేమైనా ఉపదేశం ఇచ్చినప్పుడు, ఇక అనుగ్రహం ఉన్నదా లేదా అన్న ప్రశ్నకూడా లేదు, అది ఎల్లప్పుడూ ఉంటుంది.

అనుగ్రహం అంటే, ఇక మీరు బాహ్యంగా కాంతి మూలాన్ని వెతకడం లేదు అని; మీరే ఒక కాంతి మూలంగా అయ్యారు అని. మీరు దాన్ని నిరంతరం అనుభూతి చెందుతూ ఉండకపోవచ్చు, కానీ కనీసం ఒక్క క్షణం పాటయినా మీరు కాంతితో నిండి ఉన్నారు అన్నది మీరు చూశారూ అంటే, ఇక అనుగ్రహం మిమ్మల్ని తాకినట్టే. అది మిమ్మల్ని కేవలం ఒక్కసారి మాత్రమె తాకినా, ఇక మళ్లీ ఎప్పటికీ వెనక్కి రాకపోయినా, మీ జీవితం ఇక ఎప్పటికీ అదే విధంగా ఉండదు. మీరు ఆ ఒక్క క్షణాన్ని పట్టుకుని, మీ చుట్టూ ఉండే ప్రతి ఒక్కరికంటే కూడా చాలా భిన్నమైన జీవితాన్ని గడపవచ్చు. అది నిరంతరం మీతో ఉన్నట్లయితే, ఇక అది వర్ణనాతీతం

కాకపోతే, అసలు విషయం ఏంటంటే, అనుగ్రహమే మీ ప్రణాళికలను నెరవేర్చాలని మీరు కోరుకుంటున్నారు. ఇది గుడికో లేదా చర్చికో వెళ్లి, దేవుడు ఏం చేయాలో దేవుడికి చెప్పడం అనే పాత అలవాటు. అతను కనుక అది చేయకపోతే మీరు మీ దేవుడునే మార్చేస్తారు.

అనుగ్రహం అనేది మీ అల్పమైన ప్రణాళికలను నెరవేర్చడం కోసం కాదు. ఎలాగూ మీ ప్రణాళికలు మారుతూ ఉంటాయి. మీ జీవితంలోని వేర్వేరు దశల్లో మీరు, “ఇదే అసలైనది” అనుకున్నారు, ఆ తర్వాతి క్షణంలో మీ నిర్ణయాన్ని మార్చుకున్నారు. మీరు ఒక విహారయాత్రకి వెళ్లాలని అనుకున్నారు. కాబట్టి మీరు, “సద్గురు, మీరు ఎందుకు నాకు సాయం చేయడం లేదు?” అని అడుగుతారు. “నాపై అనుగ్రహం ఉందా? నాపై అనుగ్రహం లేదా?” అంటూ దాన్ని రోజు ప్రశ్నిస్తూ ఉండకండి. ఒక గురువు అనుగ్రహం మీ ప్రణాళికలను నెరవేర్చడం కోసం రూపొందించబడినది కాదు. ఒక గురువు అనుగ్రహం అసలు జీవానికి ఉన్న ప్రణాళికను నెరవేర్చడం కోసం రూపొందించబడినది. మిమ్మల్ని ఒక జీవంగా చేసి మీ పరిపూర్ణతకు చేర్చడం కోసం రూపొందించబడింది.

అనుగ్రహం పని చేస్తూ ఉంది!

ప్రశ్న: నేను ఒక డాక్టర్ ని. కొన్నిసార్లు నా క్లినిక్ లో నేను రోగులను చూస్తున్నప్పుడు, రోగులను స్వస్థపరచడంలో, నా నియంత్రణకు అతీతంగా ఒక విధమైన అనుగ్రహం పనిచేస్తుందని నాకు అనిపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా వివరిస్తారు?

సద్గురు: మరొకరి జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం అనేది మంచి విషయం కాదు. ఎందుకంటే ఒక విధంగా అది ఒక విధంగా మీ మీద ప్రభావం చూపుతుంది. మీ సొంత జీవితం విషయంలో మీరు దాన్ని కొద్దిగా అటూ ఇటూ చేసుకోవచ్చు. కానీ మరొకరి జీవితం మీ చేతుల్లో ఉంచబడినప్పుడు, మీరు దాన్ని అటూ ఇటూ చేయలేరు. మీరు ఒక డాక్టర్ అయినా సరే, లేదా ఒక డ్రైవర్ అయినా సరే, మీరు మరొకరి జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటున్నారు. మీరు గనక ఒక గురువు అయితే అన్నింటికన్నా ఘోరం! మరీ ఎక్కువ మంది జీవితాలను మీ చేతుల్లోకి తీసుకోవడం అనేది తలకు మించిన బరువు. మరీ ముఖ్యంగా వాళ్లు గనుక మీ ముందు ఒక విధంగా కూర్చున్నట్లయితే. లేదా, వాళ్ళు పూర్తి నిస్సహాయులై సర్జరీ టేబుల్ మీద ఉన్నప్పటిలా.

మీరు ఏ వైద్య వ్యవస్థనైనా తగినంతగా పరిశోధించి ఉంటే - అది ఆయుర్వేదం అయినా, సిద్ధ వైద్యం అయినా, అల్లోపతీ అయినా, లేదా మరొకటి అయినా - మీ పాత్ర కనీసం 50 శాతం కూడా కాదు అని మీకు తెలుస్తుంది. మీరు కేవలం పుస్తకాలు మాత్రమే చదివి ఉంటే, అప్పుడు మీరు అదంతా మీ చేతుల్లోనే ఉందనుకునే అవకాశం ఉంది, లేదంటే, అటువంటి పరిస్థితులను నిర్వహిస్తున్న ఏ విచక్షణ గల వ్యక్తి అయినా, స్పష్టంగా తన పాత్ర కనీసం 50 శాతం కూడా కాదని గ్రహిస్తాడు. ఎప్పుడూ కూడా, ప్రజలకు ఎంతో చేసిన ప్రపంచంలోని గొప్ప గొప్ప డాక్టర్ల అనుభవం కూడా ఇదే. ఈ రకంగా మాట్లాడటం అనేది వారికి చాలా సహజం.

మీరు దేవునిపై నమ్మకం ఉన్నవారు అయితే, అది చాలా సులభం. మీరు పైకి చూసి “శివా, రామా” అంటారు. ఒకవేళ రోగి చనిపోయినా సరే, ఆ వ్యక్తి భగవంతుడి ఒడిలోకి వెళ్తున్నాడు, కాబట్టి అది పరవాలేదు. నమ్మకాలతొ ఉన్నవారు సాధారణంగా అనుగ్రహాన్ని అనుభూతి చెందరు. వాళ్లు నమ్ముతారు అంతే. అది సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ మీరు ఇటువంటి నమ్మక వ్యవస్థలకు మొగ్గు చూపకుండా ఉండి, అదే సమయంలో జరుగుతున్న దాంట్లో మీ పాత్ర చాలా చిన్నదని గ్రహిస్తే, సరిగ్గా అప్పుడే మీరు అనుగ్రహం ఉన్నదనే విషయాన్ని తెలుసుకుంటారు.ఒకరికి దాన్ని నమ్మాలో నమ్మకూడదో తెలియనప్పుడే - రెండింటి గురించి అతని బుద్ధి సతమతమవుతున్నప్పుడే – అతని బుద్ధి సందిగ్ధంలో ఉంటుంది. కొంతకాలం నమ్మకం ఉన్నవానిగా ఇంకొంత కాలం నమ్మకంలేని వాడిగా ఉండే వ్యక్తికి, తన సొంత తర్కం, సామర్ధ్యాల పరిమితులతో సతమతమవుతున్న వ్యక్తికి, మన గ్రాహ్యతకు స్పష్టంగా అందని ఇతర పార్శ్వాల గురించి సతమతమవుతున్న వ్యక్తికి, తన జీవితంలో అనుగ్రహం ఉందన్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అతను నిజంగా అర్థం చేసుకుంటాడు, తను చాలా సన్నగా ఉన్న ఒక వంతెన దాటాలి అనుకున్నప్పుడు, ఇతర పార్శ్వాల మద్దతు లేకుంటే, ఇంకేది సాయపడదని తెలుసుకుంటాడు. ప్రశ్న ఏంటంటే ఈ సాన్నిధ్యాన్ని ఆహ్వానించడం ఎలా? అది కేవలం అదృష్టాన్ని బట్టి కలుగుతుందా లేదా అందుకు ఏదైనా మార్గం ఉందా?

అనుగ్రహానికి అందుబాటులోకి రావడానికి 7 విధానాలు

how-to-become-available-to-grace

#1 శాంభవి మహాముద్ర క్రియ - దైవానికి ఒక ఆహ్వానం

మేము, “దివ్యత్వానికి ఒక ఆహ్వానము” (“An Invitation to the Divine”)అని ఒక టీ షర్ట్ తయారు చేసే వాళ్లము. సాధన చేస్తున్నాము అన్నప్పుడు, దానర్థం మనం ఒక పాత్రగా అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాము అని, ఇంకా దివ్యత్వానికి ఒక ఆహ్వానంలా అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాము అని. ఉదాహరణకి, శాంభవి మహాముద్ర క్రియ పెద్దగా ఏమీ చేయదు. విషయం ఏంటంటే, ఈ ప్రక్రియ అంతా కూడా ఏ విధంగా రూపొందించబడిందంటే, తద్వారా మీరు దివ్యత్వానికి ఒక ఆహ్వానంలా అవుతారు. మీకు అతీతమైనది పనిచేయటం మొదలు పెడుతుంది. మీరు చేయగలిగింది ఏమిటో చేయడం, అలాగే మీరు ఏదైతే చేయలేరో అక్కడ ప్రేక్షకపాత్ర వహిస్తూ కూడా అక్కడే ఉండగలగటం అనేదే యోగా లోని మొత్తం సారం. ఆ విధంగానే మీరు ఒక పాత్రగా లేదా అనుగ్రహానికి ఒక ద్వారంగా అవుతారు.

#2 వ్యక్తిత్వం నుండి సాన్నిధ్యం(Presence) వైపుకి వెళ్ళండి

కేవలం మీరు అప్రమత్తంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, గురుత్వాకర్షణ నిరంతరం మీపైన పనిచేస్తూనే ఉంటుంది. కానీ అనుగ్రహం అనేది సూక్ష్మమైనది. మీరు అప్రమత్తంగా ఉంటే తప్ప, అది రాదు. అనుగ్రహం అనేది మీ ఉపస్థితి విషయంలో చాలా సున్నితత్వం కలిగినది. మీ ఉపస్థితి అక్కడ లేకపోతే, దాని (అనుగ్రహం) ఉపస్థితి కూడా అక్కడ ఉండదు. ఇదే దైవం యొక్క స్వభావం. ఇందువల్లే అత్యధికులు దాన్ని చేజార్చుకుంటారు, ఎందుకంటే చాలా వరకు వారు అక్కడ ఉండరు. మీ ఆలోచనలు, భావోద్వేగాలు, లేదా మీరు చేసే పని మిమ్మల్ని శాసిస్తున్నాయి. మీ ఉపస్థితి(ఉనికి) మిమ్మల్ని శాసించడం లేదు. మీరు ఆధ్యాత్మిక సాధనతో తీసుకురావాలని చూస్తున్న పరిణితి ఇదే. తద్వారా మీ శరీరం, మనసు, ఇంకా భావోద్వేగం, మిమ్మల్ని అనుసరించవచ్చు, కానీ ముఖ్యంగా మీరు మీ ఉపస్థితి బలమైన అంశంగా ఉండాలని అనుకుంటున్నారు. మీరు ఉన్నారు కాబట్టి మీ శరీరం ఉంది, మీకు ఆలోచన ఉంది, ఇంకా భావోద్వేగం ఉంది. కానీ ప్రస్తుతం, మీరు మీ ఆలోచనని, భావోద్వేగాల్ని, ఇంకా శరీరాన్ని మీకంటే చాలా ముఖ్యమైనవిగా చేశారు. ఈ పరిస్థితిలో, మీరు అనుగ్రహాన్ని అనుభూతి చెందలేరు.

మీలోని ఈ పరిస్థితిని మీరు తారుమారు చేస్తే, ఉన్నట్టుండి సామాన్యమైనది అసామాన్యమైనదిగా అవుతుంది. జీవితంలోని ప్రతి అంశమూ కూడా ఒక పూర్తి భిన్నమైన జీవితానుభూతిలోకి తీసుకు వెళ్ళ బడతాయి. ఇది మీరు ఏదో నమ్ముతున్నారు అన్న కారణంగా జరగదు. నమ్మక వ్యవస్థలతో మీరు ఊహించుకోవచ్చు; నమ్మేవారితో వచ్చిన సమస్య ఇదే. మీరు మీ తర్కంలో బలంగా నాటుకుని ఉండకపోతే, మీరు భ్రమలకు లోనై అదే అనుగ్రహం అని అనుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వ్యక్తి చేయవలసినది ఏమిటంటే, చాలా బలమైన తార్కిక పునాది ఉండి కూడా, అనుగ్రహానికి సుముఖులుగా ఉండాలి.

మార్మికత, తర్కం - ఈ రెండు స్థాయిలు కూడా సమానంగానే ముఖ్యమైనవి. మీ తార్కికత బలంగా స్థాపించబడి ఉంటే, జీవితంలోని మౌలికమైన అంశాలను చక్కగా నిర్వహించుకోవచ్చు. మీ జీవితంలోని మార్మిక అంశం మీకు సుముఖంగా ఉంటే, మీ జీవిత అనుభూతి అత్యద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా మీరు కేవలం తార్కికమైన దాన్ని మాత్రమె నిర్వహిస్తే, పరిస్థితులు బాగుంటాయి కానీ మీ అనుభూతి అంత మంచిగా ఉండదు. మీరు తార్కికమైన దాన్ని విస్మరిస్తే, మీ అనుభూతి అద్భుతంగా ఉండవచ్చు, కానీ మీ పరిస్థితులు ఘోరంగా ఉంటాయి. తార్కికంలో బలంగా స్థాపించబడి ఉంటూనే, మార్మికమైన దానికి సుముఖంగా ఉండగలగడం అనే ప్రక్రియ విషయంలో, ప్రపంచ సమాజాలు సరిగ్గా వ్యవహరించలేదు. అయితే దీన్ని లేదంటే దాన్ని కోల్పోతున్నారు. రెండూ లేనిదే, మీ జీవితం అందంగా ఉండదు.

మీ జీవితంలో మౌళిక విషయాలను మీరు చాలా చక్కగా నిర్వహిస్తే, ఇక అప్పుడు మార్మికానికి సుముఖంగా ఉండేందుకు అది సమయం. ఇక్కడ మీ తర్కం పనిచేయదు. అది కేవలం మిమ్మల్ని పరిమితం చేస్తుంది. “మరి నా తర్కంతో నేను పోరాడడం ఎలా?” మీరు కేవలం దాని ప్రభావానికి దూరంగా ఉండాలి, అంతే గానీ తర్కానికి కాదు. మీరు ఒక పది జన్మల పాటు ప్రయత్నించినా సరే మీరు మనసుని చంపలేరు. కానీ మీరు అది తయారు చేస్తున్నదాన్ని విస్మరించవచ్చు. అది ఆలోచనల్ని చేస్తుంది, మీరు వాటిని విస్మరించండి. అది అభిప్రాయాలకు వస్తుంది, మీరు వాటిని విస్మరించండి. అది ఒక పూర్తి భావజాలాన్నే సృష్టిస్తుంది, మీరు దాన్ని విస్మరించండి. మీరు అలా చేసినట్లయితే మీరు సహజంగానే భక్తి అనే స్థితిలో ఉంటారు. భక్తి అంటే ఎవరినో స్తుతించడం అని కాదు. భక్తి అంటే, మీరు లేకపోవడం. మీరు ప్రస్తుతం దేన్నైతే “నేను” అని పిలుస్తున్నారో, అది కేవలం ఆలోచనల, భావోద్వేగాల, అభిప్రాయాల మూట మాత్రమే. ఈ మూడింటినీ పక్కన పెడితే అప్పుడు మీ వ్యక్తిత్వం అనేది ఉండదు. అప్పుడు మీలో ఉన్న జీవం ఇక్కడ ఉంటుంది. ఇది ఉన్నప్పుడు, ఇక మీరు అనుగ్రహాన్ని కోల్పోలేరు.

#3 కర్మయోగ

మీలో, ‘మీరు’ అనేది తక్కువగా ఉండడం, గ్రాహ్యత గలవారిగా ఉండేందుకు అది ఉత్తమమైన విధానం. సాధన అనేది ఏ విధంగా రూపొందించబడుతుందంటే, అది మీరు చేసే పనిలో మీరు ఎంతగా నిమగ్నమై పోయేలా చేస్తుందంటే, ఇక ఆ రోజువారీ జీవన విధానంలో, ‘మీరు ఏమిటి’ అనేది మీరు మరచిపోతారు. మీ జీవితం దేని గురించి అన్నది మీరు మరచిపోతారు. మీరు కేవలం జరుగుతున్న విషయంలో తలమునకలై పోతారు.

మానవ చైతన్యాన్ని అభివృద్ధి చేయడం గురించి, జెన్ వ్యవస్థలో ఒక అందమైన కథ ఉంది. ఒక శిష్యుడు ఒక జెన్ గురువు వద్దకు వెళ్లి ఇలా అడుగుతాడు::

“నా ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం నేను ఏమి చేయాలి?”

“నేల ఊడువు, కట్టెలు కొట్టు, అన్నం వండు. చేయాల్సిందే అంతే.”

“అది చేయడానికి నేను ఇక్కడికి రావాల్సిన పనేముంది? నేను అది ఇంటి వద్ద కూడా చేయగలను!

“కానీ మీరు ఇంటి వద్ద నేల ఊడుస్తుంటే, అది మీ సొంత నేల. ఒకవేళ మీ పక్కింటి వారి నేల మురికిగా ఉంటే, మీరు దాన్ని ఊడవరు. కట్టెలు కొట్టడం, అన్నం వండడం అనేవి మీ సొంత ప్రయోజనం కోసం, ఇంకా మీవారు అనుకునే వారి ప్రయోజనం కోసం అవుతుంది. ప్రతి పనినీ కూడా మిమ్మల్ని మీరు కరిగించుకోవడానికి బదులు, మీరు చేసే ప్రతి పనిని కూడా, ‘మీరు అనేది’ ఏదో, దానిని మెరుగుపరుచుకోవడం కోసం అవుతుంది.“

మనం చేసే పనిని లేదా మన కర్మని ఒక బంధనంగా మార్చుకుంటున్నామా? లేదా ముక్తికి ఒక ప్రక్రియగా మార్చుకుంటున్నామా? అన్నదానిలోని తేడా అంతా ఇదే. చేసేది మిమ్మల్ని మెరుగుపరచుకోవడానికి అయినా చేస్తారు, లేదా మిమ్మల్ని కరిగించుకోవడానికి అయినా చేస్తారు. మీరు కర్మని పోగు చేసుకుంటూ అయినా ఉంటారు, లేదా మీ కర్మను యోగాలా మార్చుకుంటూ అయినా ఉంటారు. ఉన్నదల్లా అదే.

కేవలం నేల ఊడవండి, అన్నం వండండి లేదా ఒక చెట్టు నాటండి – మీరు కూడా బెట్టుకున్న దాని మీద కాదు, మీకోసం ఇంకా మీ పిల్లలు దాని నీడలో కూర్చోవడం కోసం కాదు - ఊరికే నాటండి, ఎవరైనా సరే, మీ శత్రువైనా సరే, వారు దాని నీడలో కూర్చుని ఆస్వాదించడం కోసం నాటండి. ఇప్పుడు ఈ పని కరిగిపోయే ప్రక్రియగా అవుతుంది. “నేను, ఇంకా నాది’’ అని అనుకునే దాని గురించి మీరు ఎంత తక్కువ చేస్తే, మీరు అనుగ్రహానికి అంతగా అందుబాటులోకి వస్తారు.

#4 ఎడతెగని పూర్తి నిమగ్నత

చాలా మంది, వారు, “ఇది నా విధి” అని భావించే దాన్నే చేస్తారు. మీకు దేని పట్లయినా సరే ఒక లోతైన ప్రేమ లేదా భక్తిభావన ఉన్నప్పుడే మీరు చేయగలిగినదంతా చేస్తారు.

జీవితంలోని ప్రతీ క్షణం, మీరు చేయగలిగినదంతా మీరు చేస్తూ ఉండకపోయినట్లయితే, మిమ్మల్ని మీరు అసలు దేనికోసం దాచి పెట్టుకుంటున్నారు? మీ జీవితంలోని ప్రతి క్షణం మీరు చేయగలిగినదంతా మీరు చేస్తూ ఉండటం ముఖ్యం కాదా? ఈ రకమైన గాఢ నిమగ్నతనే భక్తి అంటారు. భక్తి అనేది ఒక ఒప్పందం కాదు. ‘‘సద్గురు నాకు మీరంటే ఎంతో భక్తి. మీరు నా కోసం ఏమీ చేయలేదు.’’ అసలు మీ కోసం నేను ఏదో చేయాలని ఎక్కడా లేదు. ఒప్పందాలు చేసుకునే వారు వేరు. భక్తులు వేరు. “నాకు అసలు ఏదో జరగాల్సిన అవసరం లేదు, నన్ను నేను సమర్పించుకుంటాను.” ఇది భక్తి అంటే.

మీరు గనుక, “నాకు వచ్చే లాభం ఏమిటి? ‘‘అన్న ఈ ఒక్క విషయం నుండి విముక్తులైతే, మీ జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. భక్తి అంటే సరిగ్గా ఇదే, మీరు అపేక్ష (ఆశించడం) నుండి విముక్తి అయ్యారు అని. ఒకసారి మీరు ఏ విధమైన ఆపేక్షలూ లేనివారుగా అయితే, మీరు మీ అత్యుత్తమమైనది చేస్తారు, ఇంకా ఏ మనిషి అయినా చేయగలిగింది అది మాత్రమే. మీరు ఇక్కడ ఉన్న ప్రతి దానిలో ఒక భాగం అన్న నిమగ్నతని మీరు చూపించగలిగితే, మీరు అనుగ్రహానికి అందుబాటులోకి వస్తారు. భక్తి అంటే ప్రశ్నలు లేని ఎడతెగని, దేన్నీ వెనక్కి దాచుకొని నిమగ్నత. మీకు ఆ విధమైన నిమగ్నత ఉంటే, అనుగ్రహం కుండపోతగా కురుస్తుంది, బొట్లు బొట్లుగా కాదు. ఒకసారి మీకు ఈ విధమైన అనుగ్రహం కలిగితే, మీ జీవితం సార్థకమవుతుంది. శరీరము, మనస్సు ఇంకా శక్తులు మీకు ఓ అడ్డంకి కాకుండా ఉంటే, అలాగే మీరు అనుగ్రహానికి అందుబాటులో ఉంటే, నా జీవితం ఏమవుతుందో అన్న బెంగ ఇక మీకు అక్కర్లేదు. ఏం జరిగినా సరే, అత్యద్భుతమైనదే జరుగుతుంది.

#5 గొప్పవారిగా నటించటం ఆపండి

చుట్టూ చూడండి, మీరు ఎంత అల్పమైన వారో గ్రహించండి – చిన్నది అంటే అసలు పనికిరానిది అని కాదు. సరిపోయేంతగా అని. మీరు, అల్పులు అని నటించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాస్తవానికి మీరు చాలా సూక్ష్మమైన పదార్ధం. మీరు గొప్పవారిగా నటిస్తున్నారు అంతే. మీరు ఆ నటనను ఆపితే, మీరు అనుగ్రహానికి అందుబాటులో ఉంటారు.

#6 అంతా ఒకటి గానే చూడండి

ఏసు, “మీ దృష్టి అంతా ఒకటి అయితే, శరీరం వెలిగిపోతుంది” అన్నాడు. ఈ రెండు భౌతికమైన కళ్ళు విచక్షణ కలిగినవి. అవి మీకు ఏది ఎత్తు, ఏది లోతు, ఎవరు పురుషుడు, ఎవరు స్త్రీ, ఏది ఇది, ఏది అది, అనేదాన్ని చెబుతాయి. ఈ రెండు కళ్ళు మనుగడ కోసం ఉపకరణాలు. “మీ కళ్ళు ఒకటి అయితే’’ అన్నప్పుడు దానర్థం ఒక కన్ను మూయమని కాదు. దాని అర్థం ఇక మీరు విచక్షణ చూపించడం లేదు అని. మీరు ప్రతిదాన్ని ఒకటిగానే చూస్తున్నారు అని. మీరు ఈ విధంగా అయితే, మీ శరీరం కాంతివంతమౌతుంది. అదే అనుగ్రహం.

#7 ప్రతి దానికీ తల వంచడం (ప్రణమిల్లడం)

ఒక చిన్న చెట్టు ఎలా పనిచేస్తుందో మీకు తెలీదు. ఈ గడ్డిపరక ఏ విధంగా పనిచేస్తుందో మీకు తెలీదు. మిగతా విషయాలు ఎలా పనిచేస్తాయో మీకు తెలీదు. ప్రతిదీ కూడా మీకంటే ఇంకొంచెం మేధస్సు కలిగినదే అనిపిస్తుంది.

మీరు అంత మూఢులు అయినప్పుడు, తల వంచడం మంచిది. మీరు ఒక చెట్టును చూస్తే, నమస్కరించండి. ఒక పర్వతాన్ని చూస్తే, నమస్కరించండి. ఒక గడ్డిపరకను చూస్తే, నమస్కరించండి. ఆఖరికి ఒక చిన్న ఇసుక రేణువుకు కూడా జీవం గురించి మీకంటే ఎక్కువ తెలుసు. మీరు ఇక్కడ చాలా చిన్నవారు. అవన్నీ కూడా మీకంటే చాలా ముందటి నుండి ఇక్కడ ఉన్నాయి, అలాగే జీవం గురించి మీకంటే వాటికి చాలా ఎక్కువ తెలుసు. మీరు అన్నింటి పట్లా ఒక విధమైన ఆశ్చర్య భావనతో ఇంకా భక్తిభావంతో నడుచుకోవాలి. ఇలా వచ్చే 24 గంటలు ప్రయత్నించి చూడండి. జీవం ద్వారాలను తెరవడానికి అవసరమైనది అంతా ఇదే, మీ గురించి మీరు మరీ అతిగా ఆలోచించకుండా ఉండటం, ‘మీరు కాని దానిని’ మీరుగా కల్పన చేయకుండా ఉండటం. మీ గురించి మీరు ఆలోచించుకునేది ఏదైనా సరే, అవాస్తవమే, ఎందుకంటే ప్రాథమిక జీవం విషయానికి వచ్చినప్పుడు. ఆఖరికి ఈ మట్టికి తెలిసినది కూడా మీకు తెలీదు. ఈ మట్టి ఏదైతే చేస్తుందో, అది మీ మెదడు చేయలేదు. కాబట్టి మీ చుట్టూ అంత గొప్పవి ఉన్నప్పుడు, మీరు సౌమ్యంగా నడుచుకోండి. మీరు భక్తిభావంతో నడుచుకుంటే, మెల్లగా మీరు అనుగ్రహ ఒడిలోకి జారుకుంటారు.

పద్యం - అనుగ్రహపు అల్లికలు

“అనుగ్రహపు అల్లికలు” అనేది అనుగ్రహాన్ని మీ జీవితంలోకి రానిచ్చేందుకు మీకు స్ఫూర్తినిచ్చే, సద్గురు రచించిన ఒక అందమైన పద్యం.

అనుగ్రహపు అల్లికలు

ప్రతి ఒక్క దారమూ కీలకమేనంటూ
ఒకదానిపై ఒకటి నేర్పుగా పెట్టి
వొట్టి దారాలను
సొగసైన బట్టగా తీర్చిదిద్దేందుకు
నేత పనివారు పడే శ్రమ లాగా

జీవితమూ అంతే నా ప్రియతమా
ప్రతి నూలుపోగూ ముఖ్యమైనదే...
ముందు అల్లిన పోగు లాగా, మరిక వెనక వచ్చేదారం లాగా.
జీవితపు నిగూఢపు దారాల అమరికలు, రంగులను
నేసుకోవాలి నువ్వు
ఒక రమణీయ లావణ్య వస్త్రంగా
ఆద్యంతాలు లేని ఆ దైవానికి అమరేట్టుగా

వస్త్రం ఉన్నది కేవలము
వ్యక్తిగత దేహ భాగాలను కప్పుకోడానికి కాదు
అది - సృష్టి సహజమైన అందాలను తాకేందుకు
అవకాశమిచ్చేది కావాలి
అంతరంగాన నిలచిన దివ్యత్వానికి సహవాసి అయ్యేందుకు
ఏకాంత మిచ్చే దారి కావాలి
ప్రేమ, వివేకపు దారాలు,
ఆటల మరి పని పాటల పోగులు,
సాన్నిహిత్యం, ఉదాసీనత్వపు దారాలు
అనుభూతుల ఎరుకలో, ఆనందపు మత్తులో
తడిసిపోయిన దారాలు

రకరకాల అల్లికలు, రంగులు కలబోసిన దారాలు
- అన్నిటినీ కలిపి ఒక అందమైన వస్త్రంగా నేయాలంటే
భక్తి ఒక్కటే మార్గము నా ప్రియతమా
భక్తి కరుణించని వేళ
అది చిక్కు ముడుల మయమవును(తెలుసుకో)
జీవితాన్ని అనుగ్రహపు అల్లికగా మలుచుకో

ప్రేమ& అనుగ్రహంతో సద్గురు

Love & Grace

Sadhguru’s Insights on Grace from Mahabharat

Krishna’s Grace on Draupadi

The True Essence of Grace

Of Grace, Luck and Intelligence

Editor's Note: Enjoyed this article? Take the next step: Soak in Sadhguru’s grace on Guru Purnima by joining the live stream with Sadhguru