ప్రశ్న :  నేను, నా యోగ క్రియలలో దృష్టిని పెట్టడానికి ఎంతో కష్టపడుతున్నాను. అది ఇప్పుడు కొంచం మెరుగయ్యింది. కానీ, శక్తివంతంగా క్రియల మీద దృష్టి పెట్టడం, సమాధి స్థితిని అనుభూతి చెందడం ఎలాగో మీరు చెప్పగలరా..?

సద్గురు :  మీరు, దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయకండి. మీరు దేనితో అయినా సరే, నిమగ్నం అవ్వాలని చూడండి. మీరు దేనితో అయినా సరే, పూర్తిగా నిమగ్నం అయినప్పుడు దానిమీద దృష్టి కలగడం అన్నది సహజంగానే జరుగుతుంది. ఎక్కడైతే మీకు నిమగ్నత ఉండదో, అక్కడ మీరు దృష్టి పెట్టాలని ప్రయత్నించినప్పుడు అది ఒక నరకంగా మారిపోతుంది. అంతే..! దాని మీద మీరు దృష్టి పెట్టలేకపోతారు. ఉదాహరణకు, చాలా మంది పిల్లలకు టెక్స్టు పుస్తకాలంటే ఒక నరకం.  ఇలా ఎందుకు జరుగుతుందంటే, అక్కడ రాసి ఉన్నది వారికి ఆసక్తికరంగా లేదని కాదు. ఎన్నో విషయాలు ఈ చిన్న టెక్స్టు బుక్ లో సంగ్రహించబడి ఉన్నాయి. కాకపోతే, వారికి అవి ఆసక్తి కలిగించే విధంగా రాసి ఉండకపోవచ్చు. మనం దృష్టి పెట్టడం అన్నది, ఆ విషయం మనకి  ఎలా చెప్పబడింది అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీ పిల్లలు గనుక, దేనిలో అయినా పూర్తిగా నిమగ్నమై ఉన్నారనుకోండి, మీరు, “వారు దృష్టి పెట్టారా..? లేదా..? “ అన్న దానిని గురించి బాధ పడక్కరలేదు. వారు నిమగ్నమైన విషయం పట్ల వారి దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది.

మీరు, మీ దృష్టిని దానిమీద పెట్టే ప్రయత్నం చేసేకంటే.. మీ జీవితాన్ని దానితో ఒక ప్రేమ వ్యవహారంగా మార్చేయాలి

మీ విషయంలో కూడా, ఇలానే జరుగుతుంది. మీరు, దేనితో అయినా నిమగ్నమై ఉండకుండా, మీ మానసిక దృష్టిని దానిమీద పెట్టాలి అని అనుకున్నప్పుడు, అది ఒక పెద్ద నరకంలా ఉంటుంది.  అది, మీకు ఎటువంటి శ్రేయస్సునూ కలిగించదు. మీరు ఏదైతే చేస్తున్నారో, మీరు దేనిమీదైతే దృష్టి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో.... మీరు, మీ దృష్టిని దానిమీద పెట్టే ప్రయత్నం చేసేకంటే.. మీ జీవితాన్ని దానితో ఒక ప్రేమ వ్యవహారంగా మార్చేయాలి. ఇది నేను ఎన్నోసార్లు చెప్పాను. కానీ, నేను చెప్పినప్పుడు, మీరు దృష్టి పెట్టి ఉండకపోవచ్చు. ఉదాహరణకు, మీరు మీ పక్కింటి అమ్మాయితో ప్రేమలో పడ్డారనుకోండి..మీరు ఆ అమ్మాయి మీద దృష్టి పెట్టండి అని నేను మీకు చెప్పాలా..? అక్కర్లేదు. ఆమే మీ మనస్సుని నియంత్రిస్తుంది. మీరు చేయవలసిందల్లా కేవలం ఆమెతో ప్రేమలో పడడం.. అంతే..!! మీ హార్మోన్ల ప్రభావం మీమీద ఉన్నప్పుడు.. మీ ప్రేమ వ్యవహారంలో.. మాత్రమే ఇది జరగవచ్చు. కానీ, మీరు మీ మేధస్సును తేజోవంతం చేసినప్పుడు మీరు దేనితో అయినా ప్రేమలో పడగలరు.  మీరు కోరుకున్న దేనితో అయినా ప్రేమలో పడగలరు.  అప్పుడు దానిమీద దృష్టి ఏర్పడడం అన్నది సహజంగానే జరుగుతుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు