సద్గురు : నాయకత్వాన్ని మనం అనేక విధాలుగా చూడవచ్చు. కానీ ముఖ్యంగా రెండు రకాలైన నాయకులు ఉన్నారు. ఒకరు, వ్యవస్థీకృతులైన నాయకులు, రెండవరకం, ప్రజాకర్షణ కల్గిన నాయకులు. వ్యవస్థీకృతులైన నాయకులు అనేవారు, వారి నుంచి ఆశించినది అందించాలి. ఆశించిన దాని కంటే భిన్నంగా వ్యవహరిస్తే, దానిని మెచ్చుకోరు. ఈ తరహా నాయకులకు పని సులభంగా ఉంటుంది ఎందుకంటే ఆశించినది మాత్రమే అందించాలి. అతను వ్యవస్థ నుండి వృద్ధి చెందుతాడు, వ్యవస్థను అర్థం చేసుకోగలడు. ఆయన నాయకుడే, కానీ ఉన్న వ్యవస్థలో అయన ఒక విధమైన కార్య నిర్వాహకుడే.

ప్రజాకర్షణ ఉన్న నాయకుడు, ప్రజలు ఊహించనిది కూడా అందించాలి. ఇది పూర్తిగా భిన్నమైన ఆట, ఇతను ఇప్పటిదాక లేనిది ఏదో చేయాలి. అలా చేయడానికి, మీలో మీరు ఎంత సంఘటిత పరచుర్చుకున్నారనేదే ప్రశ్న, ఇంకా మీ మేధా శక్తి. మీ జనాకర్షణ అనేది, పరిస్థితులను ఒక స్థాయి దాకానే తీసుకువెళ్తుంది. ఆ తర్వాత విషయాలు ముందుకు వెళ్లాలంటే ఒక వ్యవస్థ అవసరం. ఈ వ్యవస్థ ఒక గండశిల లాంటిది. అది మీ అభిరుచులకు తావివ్వదు. మీకు ఎక్కువ అభిరుచులుండి, ప్రణాళిక లేనట్లయితే, మీ అభిరుచులు గాలిలో కలిసిపోతాయి. అతిగా ఉండే మేధస్సును ఒక పిచ్చిగా తోసిపుచ్చుతారు. కాబట్టి మీరు వ్యవస్థ గురించి కూడా కృషి చేయాలి.

మేధస్సులేని మానవుడు అంటూ ఉండడు. మేధస్సు రగలడానికి అనుకూలమైన వాతావరణం కావాలి.

ఈ రెంటి మధ్య ఎక్కడో అక్కడ కాస్త సమతుల్యత ఉండాలి, మీరు వాటిని ఒక పొందికకు తేవాలి. ప్రజలు అర్థం చేసుకొని, అన్వయించుకుని, అది తమకు ఎలా ఉపయోగిస్తుందో తెలుసుకోవాలంటే, మీలోని మేధస్సుకు, ప్రణాళికకు పొందిక ఏర్పడాలి; లేనట్లయితే ఏదీ చివరిదాకా నిలువదు.

మేధస్సు- పధ్ధతి

ఏదయినా కార్యం విజయవంతమవ్వాలంటే, ఒక ప్రణాళిక, పధ్ధతి ఉంటాయి, కానీ దానికి మేధస్సు కూడా కావాలి. బహూశా నాయకులు తమ మేధస్సును వ్యక్త పరుచుకోలేరు; వారు కేవలం తాము అవలంబించిన పద్ధతులను వ్యక్తపరుచుకోగలరు. ఎందుకంటే, మేధస్సు అనేది ఒకరు మాట్లాడగలిగేది కాదు; వారి జీవితాలే దాన్ని గురించి అనేక విధాలుగా తెలియబరుస్తాయి.

మేధస్సు, పద్ధతులలో ఏది ఉత్తమం అనే ప్రశ్న ప్రజలను వేధిస్తూనే ఉంది. మీకు సంపూర్ణమైన పద్ధతులు ఉండవచ్చు, కానీ మేధస్సు లేకుండా మీరు జీవితంలో సగటు మనిషిగానే ఉండిపోవచ్చు.

ఇది హెన్రీఫోర్డ్ జీవితంలో జరిగిన ఒక సంఘటన జ్ఞప్తికి తెస్తోంది. యంత్రాలంటే నాకెంతో ఆసక్తి, కాబట్టి సహజంగా నేను ఎన్నో పెద్ద యంత్ర కర్మాగారాలకు వెళ్ళాను, ముఖ్యంగా ఆటోమొబైల్ కర్మాగారాలు. అలాంటి ఒక పర్యటనలో నేను డెట్రాయిట్ లోని ఫోర్డ్ మోటార్ కంపెనీ పరిశోధక విభాగానికి వెళ్ళాను. వివిధ కార్లలో అమర్చే వివిధ భాగాల సృష్టికర్త, 52 పేటెంట్లు గల, 35 సంవత్సరాలుగా పని చేస్తున్న ఉన్నత శాస్త్రవేత్తతో నేను అక్కడ మాట్లాడాను. ఆయన నాకు ఒక కథ చెప్పారు.

మీరు ఎంత విజయాన్ని సాధించారనేది, మీ దేహాన్ని, మనస్సును ఎంత ఉపయోగించుకున్నారన్న దానిపైనే ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది./

ఒకసారి ఇలా జరిగింది. ఫోర్డ్ కంపెనీలో జరిగే చాలా పనులు సమర్ధంగా లేవని, అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని హెన్రీ ఫోర్డ్ కనుక్కున్నారు. అది సరిచేయడానికి, ఒక నిపుణున్ని నియమించాలని ఆయన అనుకున్నారు. ఆ నిపుణుడు, ప్రతి కార్యాలయానికి వెళ్లి, అందరితో మాట్లాడి, ఎందరో ముఖ్యమైన వ్యక్తులను సరిదిద్దారు. ఒక రోజు ఆయన హెన్రీ ఫోర్డ్ వద్దకు వచ్చి ఇలా ఫిర్యాదు చేసాడు. "చూడండి, నేను ఇక్కడ దాదాపు అందరినీ సరిచేశాను, ఒక వ్యక్తి మాత్రం నా మాట అసలు వినడం లేదు. చాల సార్లు నేను ఆయన ఆఫీస్ కు వెళ్ళినప్పుడు ఆయన రెండు కాళ్ళూ బల్లపైన పెట్టుకుని సిగార్ కాలుస్తూ ఉంటాడు. ఆయన ఏమి పని చేయరు. పైగా అత్యధిక వేతనం పొందే వారిలో ఒకరు. నేను అతనిని పరీక్షించాను. నిఘా వేశాను. ఆతను ఏపనీ చేయరు. నా వద్ద నుండి సూచనలు తీసుకోడానికి ఇష్ట పడటం లేదు. మీరు ఈయనను తొలగించాలి" అన్నాడు.

హెన్రీ "ఆతను ఎవరు?" అని అడిగారు. ఆ నిపుణుడి పేరు చెప్పగానే. హెన్రీ "అతన్ని కదిలించవద్దు. కిందటిసారి ఆయన బల్లమీద కాళ్ళు పెట్టి సిగార్ కాలుస్తున్నప్పుడు, ఒక బిలియన్ డాలర్ల ఆలోచన ఇచ్చారు. ఆయన్ని పొరపాటున కూడా కదిలించద్దు" అన్నాడు.

కాబట్టి, మనం పద్ధతులకు అతీతంగా ఉన్న మెరుపులను గుర్తించే పరిస్థితులను కల్పించకపొతే, జీవితంలో సగటు తనమే మిగులుతుంది. మేధస్సు అనేది ప్రతి రోజు, ప్రతి క్షణం మెరవదు కాబట్టి, కాని పద్దతి అనేది మనకు కష్టకాలాల్లో అక్కరకు వచ్చే బీమా లాంటిది.

మేధస్సు లేని మానవుడు ఉండడు. అది రగలడానికి అనుకూలమైన వాతావరణం కావాలి.

ఈ మేధస్సు రగిలే అంతర్గత వాతావరణాన్ని సృష్టించడానికి, ఒక ముఖ్యమైన విషయం, జీవన యాత్రను నడిపే దేహం, మనస్సు అనే అసలు విషయాలపై కొంత దృష్టి పెట్టాలి. మీరు ఎంత విజయాన్ని సాధించారనేది, మీ దేహాన్ని, మనస్సును ఎంత ఉపయోగించుకున్నారన్న దానిపై ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు