వేటిని తినాలి? తగిన ఆహారాన్ని ఎంచుకోవటం ఎలా
ఆరోగ్యాన్నీ, ఉత్తేజాన్నీ అందించే ఆహారం యొక్క వివిధ కోణాలని సద్గురు వివరిస్తున్నారు.
సరైన ఇంధనాన్ని ఎంచుకోవాలంటే మీరు ఎటువంటి యంత్రమో మీరు తెలుసుకోవాలి. ఆరోగ్యాన్నీ, ఉత్తేజాన్నీ అందించే ఆహారం యొక్క వివిధ కోణాలని వివరిస్తూ, తినే ఆహారం విషయంలో కాస్త విచక్షణ పాటించాలేగానీ, దానిని ఒక మతంగా మార్చుకోవద్దని సద్గురు సూచిస్తున్నారు.
సద్గురు: ఎటువంటి ఆహారం తినాలి అన్న విషయంపై ప్రతీ కొన్ని సంవత్సరాలకొకసారి, ఒక కొత్త సిద్ధాంతం పుట్టుకొస్తుంది. ఇంకా దానినే వేదంగా పాటించేవారు చాలామందే ఉన్నారు. “Veganism” అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది! మనం ఆహారాన్ని మతంగా మార్చకూడదు. ఇది మీరో లేక ఇంకొకరో ఏం నమ్ముతున్నారనే దాని గురించినది కాదు, ఇది విచక్షణతో తినడం గురించినది మాత్రమే.
మొట్టమొదటిగా గుర్తు ఉంచుకోవలసినది, ఆహారం ఇంధనం అన్న విషయం. మీరు మీ కారులో ఇంధనం నింపాలంటే పెట్రోల్ బంకుకి తీసుకువెళ్ళి దానికి తగిన ఇంధనాన్ని ఎంచుకుని దానిలో నింపుతారు. తద్వారా ఆ కారు, దాని అత్యుత్తమ సామర్థ్యంతో నడుస్తుంది. మీరు కారులో కిరోసిన్ పోసినా అది నడుస్తుంది. కానీ పొగలు చిమ్ముతూ, దగ్గుతూ, వెళ్ళవలసినంత వేగంగా వెళ్ళదు. ఎంతోమంది తమ ఆహార విషయంలో తీసుకునే నిర్ణయాలు ఇలాగే ఉంటాయి. తగిన ఇంధనం వాడాలంటే ముందు మీరు ఎటువంటి యంత్రమో తెలుసుకోవాలి.
సరైన ఆహారం తినడం అనేది ఆరోగ్యపరంగా ఒక ముఖ్యమైన అంశం. మీకు గనుక మీ సంక్షేమం ఇంకా మీ పిల్లల సంక్షేమం పట్ల ఆసక్తి ఉంటే, మీరు తినే ఆహారం తాజాగా ఉందని నిర్ధారించుకోవాలి. సగటు అమెరికన్, మూడు నుండి ఆరు నెలల ముందు ప్రాసెస్ చేయబడిన ఆహారాన్ని తింటూ ఉంటాడు. యోగ సంస్కృతిలో, వండిన ఆహారాన్ని పొయ్యిమీద నుండి దించిన గంటన్నరలోపు తినడం జరుగుతుంది. దానికన్నా ఎక్కువ సమయం ఉంచితే అందులో జడత్వం నిండుకుంటుంది. శరీర వ్యవస్థలో జడత్వాన్ని కలుగజేసే ఆహారాన్ని తీసుకోవడం వల్ల, మీరు మీలోని చురుకుదనాన్ని కోల్పోతారు. అదేవిధంగా మీరు తినే ఆహారానికి, మీకు అవసరమయ్యే నిద్రకీ సంబంధం ఉంది. సాధారణంగా డాక్టర్లు, ప్రతి ఒక్కరూ కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవాలని సలహా ఇస్తూ ఉంటారు. మీరు ప్రతిరోజూ ఎనిమిది గంటలు నిద్రపోతే, మీ జీవితంలో మూడవ వంతు నిద్రలో గడిపేస్తున్నారని దాని అర్థం.
జడత్వాన్ని ఆహ్వానించడం
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎనిమిది గంటలపాటు ఎలా నిద్రించాలి అనేదానిపై కొందరు ఏకంగా పుస్తకాలే రాస్తున్నారు. అన్ని గంటలు పడుకోకపోతే కలిగే నష్టాలను కూడా వివరిస్తున్నారు. ఈ మధ్య నేను కాస్త బద్దకంగా మారడంవల్ల, నాలుగు గంటల పాటు నిద్రిస్తున్నాను. కానీ కొంతకాలం క్రితం వరకు, దాదాపు ఇరవై అయిదు సంవత్సరాల పాటు, నేను మూడుగంటల కన్నా తక్కువ నిద్రపొయేవాడిని. మరి నేను ఆరొగ్యంగానే ఉన్నాను. శరీరానికి విశ్రాంతి అవసరం, నిద్రకాదు. ఎంత నిద్రకావాలి అన్నది మీరు ఇంజనులో వేసిన ఇంధనం మీద ఆధారపడి ఉంటుంది. మీరు కారులో సరైన ఇంధనం వెయ్యకపోతే దానికి ఎక్కువ సర్వీసింగు అవసరమవుతుంది. అలాగే మీరు మీ శరీరమనే ఇంజనులో సరైన ఇంధనం వెయ్యకపోతే మీకు ఎక్కువ నిద్ర అవసరమవుతుంది.
ఈ సందర్భంలో, పరిగణలోకి తీసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి. ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, బహుశా మీరు అధిక స్థాయిలో జడత్వం నిండి ఉన్న ఆహారాన్ని తీసుకుంటూ ఉండవచ్చు. మేము ఆహారాన్ని రాజసికము, తామసికము ఇంకా సాత్వికములుగా వర్గీకరిస్తాము. తామసికము అంటే జడత్వం. మీరు తిన్న ఆహారంలో ఎక్కువ భాగం జడత్వం నిండి ఉంటే మీరు చురుకుగా ఎలా ఉండగలుగుతారు? మీరు తిన్న ఆహారంలో జడత్వం ఉంటే అది మిమ్మల్ని నిస్తేజంగా మారుస్తుంది.
జీవ పరిణామక్రమాన్ని దృష్టిలో పెట్టుకోండి
మీరు తిన్న ఆహారమే, జీర్ణమై, వ్యవస్థలోకి గ్రహించబడిన తరువాత, అది మీ శరీరంగా సమీకరించబడుతుంది. మీ శరీరంలో ఒక నిర్ధిష్టమైన జ్ఞానము, స్మృతులు, ఇంకా జన్యుపరమైన స్మృతి ఇమిడి ఉన్నాయి. ఇవి మీరు తిన్న ఆహారాన్ని ఏ విధంగా మార్చాలో నిర్ణయిస్తాయి. ఉదాహరణకి, ఒక ఆపిల్ పండు, తిన్నవారిని బట్టి అది, స్త్రీగానో, పురుషుడిగానో లేదా ఆవుగానో మారుతుంది.
జీవి పరిణామం చెందే కొద్దీ, జీవిలోని సమాచారం, స్మృతులు మరింత క్లిష్టతరంగా మారుతాయి. యోగ సంప్రదాయంలో ఎల్లప్పుడూ జన్యుపరంగా మానవుడికి అత్యంత దూరంగా ఉన్నవి తినమని చెప్తూ ఉంటాము. ఆ విధంగా చూస్తే, మొక్కలు మనకి అత్యంత దూరంగా ఉన్నాయి. మీరు మాంసాహారం తినడం తప్పనిసరి అయితే, మేము చేపని తినమని సలహా ఇచ్చాము, ఎందుకంటే, జీవ పరిణామ క్రమం దృష్ట్యా, జంతు సమూహంలో అన్నిటికన్నా, చేపలు మనకి ఎక్కువ దూరంగా ఉన్నాయి. ఈ భూమి మీద మొదటి జంతుప్రాణి నీటిలో ఉద్భవించిందని భావిస్తున్నందున, దశావతారాలలో మొదటి అవతారము మత్స్య అవతారము లేదా చేప.
తినేందుకు ఉత్తమమైన ఆహారం మాంసాహారం అని ఒక శతాబ్దంగా చెప్తూ వచ్చిన తరువాత, పాశ్చాత్య దేశాలలోని డాక్టర్లు ఇప్పుడు మెల్లగా వేరే అభిప్రాయానికి మారుతున్నారు. గత కొద్ది కాలం నుండీ అమెరికాలోని గుండె జబ్బులకి ప్రధాన కారణం అక్కడ తింటున్న బీఫ్ అని అంటున్నారు. ఇంకా గడచిన కొద్ది సంవత్సరాలుగా, కాన్సర్ కి ఒకానొక కారణం, మాంసాహరం తినడమని కూడా అంటున్నారు. యోగ సంప్రదాయంలో మేము పదివేల సంవత్సరాల నుండీ చెప్తున్నదేంటంటే, మీరు క్లిష్టమైన జన్యుస్మృతి కలిగిన ఆహారాన్ని తీసుకుంటే మీ వ్యవస్థ ఏదోక విధంగా దెబ్బ తింటుంది అని. ఈ ఎరుక మాకు, లక్షల డాలర్ల ఖర్చుపెట్టి చేసిన పరిశోధనతో రాలేదు, మనము తీసుకున్న ఆహారం వల్ల మన శరీరంలో జరిగే మార్పులను పరిశీలించడం వల్లనే తెలిసింది. మీరు తగిన శ్రద్ధ చూపిస్తే, మీకు తెలుస్తుంది. ప్రతీ ఒక్క ప్రాణికీ తెలుస్తుంది. కుక్కకి ఏమి తినాలో ఏమి తినకూడదో తెలుస్తుంది. మానవులకి మాత్రం తెలియదు ఎందుకంటే వారు, జీవితం పట్ల ఎరుకతో కాకుండా, ఎవరో అందించే సమాచారంపై ఆధారపడతారు.
అందువల్ల ఆహారాన్ని మతంగా మార్చకండి. బ్రతికి ఉండడం మాత్రమే అవసరం అయితే ఏది దొరికితే అది తినండి. కానీ బ్రతికి ఉండడం సమస్య కానప్పుడు, మనకు ఎంపిక ఉంది. మనకి ఎంపిక ఉన్నప్పుడు మనము విచక్షణతో, మన వ్యవస్థకు మేలును చేకూర్చేది తినాలి. మన శరీరాన్ని మెలకువతో, తేలికగా ఉంచి, చురుకుదనంతో నింపే ఆహారమే మనకు సరైన ఆహారం. మీరు ప్రయోగం చేయవచ్చు. ఒక రోజు పళ్ళు మాత్రమే తినండి. ఇంకొక రోజు పచ్చి కూరలు మాత్రమే తినండి, మరొక రోజు వండిన కూరలు, ఆ తరువాత చేపలు, తరువాత మాంసం, ఇలా ప్రతిదీ ప్రయత్నించి చూడండి. ఎటువంటి ఆహారంతోనైతే మీరు అత్యధిక శక్తి స్థాయిలను, చురుకుదనాన్ని అనుభూతిచెందుతున్నారో, దయచేసి దానినే తినండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు.
ఎప్పుడు తినకూడదు
ప్రత్యేకంగా, మీరు ఎక్కువ తిన్నప్పుడు, అప్పుడప్పుడు ఉపవాసం ఉండటం మంచిది. కానీ మీరు బలవంతంగా ఆకలితో ఉంటే అది మీకు హాని కలిగించవచ్చు. మీరు ఉపవాసం చేయదలిస్తే మీరు మానసికంగానూ, శారీరకంగానూ సిద్ధం కావాలి. అప్పుడు మీరు సునాయాసంగా ఉపవాసం చేయగలరు. చంద్రమానం ప్రకారంగా నెలలో కొన్ని రోజులని గుర్తించారు, ఈ రోజులలో జీర్ణక్రియ పూర్తి స్థాయిలో పనిచేయదు. ఈ రెండు రోజులు ఏకాదశి, అంటే పౌర్ణమి, అమావాస్యల తరువాత పదకొండవ రోజు. ఈ రెండు రోజులు అల్పాహారం తీసుకోవడం లేదా పూర్తిగా ఉపవాసం చేయడం మంచిది.
ఏకాదశి మీ వ్యవస్థలో ఇమిడి ఉంది. మీరు భోజనం చేయకుండా ఉండగలిగితే దయచేసి ఉండండి. అది మీకు సాధ్యం కాకపోతే మీరు ఫలాహారం తీసుకోండి. తమిళ భాషలో “పల” అంటే “ఎన్నో” అని అర్ధం, అందుకని తమిళులు ఏకాదశి నాడు ఎన్నో రకాల వంటలు తినాలని అనుకుంటారు. అందుకని వివిధ రకాల పిండివంటలు తింటారు. ఇది మామూలు భోజనం చేయడంకన్నా ఎక్కువ హాని కలిగిస్తుంది. “ఫలాహార్” అంటే పండ్ల ఆహారం అని. మీరు పూర్తిగా ఉపవాసం చేయలేకపోతే తేలికగా అరిగేది తినమని దీని అర్థం
వివిధ ఆహారాలు, అరిగే సమయాలు
మీరు పండు తింటే, ఒకటిన్నర నుండీ, మూడు గంటలలో అది పూర్తిగా అరుగుతుంది. మీరు ఉడికిన కూరగాయలు తింటే, అవి పూర్తిగా అరగడానికి పన్నెండు నుండీ పదిహేను గంటలు పడుతుంది. మీరు ఉడికిన ధాన్యాలు, ఇతర ఆహారం తిన్నట్లయితే, వాటికి ఇరవై నాలుగు నుండీ ముప్పై గంటలు పడుతుంది. మీరు ఉడికిన మాంసం తింటే, అరగటానికి నలభై ఎనిమిది నుండీ యాభై రెండు గంటలు పడుతుంది. మీరు పచ్చి మాంసం తింటే అరగడానికి డెబ్భై రెండు గంటలు పడుతుంది. ఆహారం మీ శరీరంలో ఇన్నేసి గంటలపాటు ఉంటే అది మురిగి, అనవసరమైన బాక్టీరియా పెరుగుతుంది. ఇటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీరు మీ వ్యవస్థను అనారోగ్యానికి గురిచేస్తున్నారు. ఆ తరువాత మీరు ఆరోగ్యంగా జీవించడానికి బదులు, మీకు మందులు అవసరమని నమ్ముతారు. మీలో మీరు విషం పుట్టిస్తున్నారు కనుక మీకు మందులు అవసరమని నమ్ముతారు.
మీరు మీ వ్యవస్థలో ఏమి తీసుకుంటున్నారో అది గొప్ప వ్యత్యాసం చూపించగలదు. ఉదాహరణకి – నేను అమెరికాలో వాహనం నడిపేటప్పుడు, నేను ఎన్నడూ, ఇథనాల్ గాసోలీన్ ఉన్న గ్యాస్ స్టేషనుకి వెళ్ళను. వాళ్ళు దాదాపు పన్నెండు సంవత్సరాల క్రితం మొదటిసారిగా ఇథనాల్ గాసోలీను వాడటం మొదలు పెట్టినప్పుడు, నేను “నా కారులో ఇథనాల్ వెయ్యను. ఎందుకంటే ఇంజను తుప్పు పడుతుంది" అన్నాను. మీరు గొప్ప శాస్త్రవేత్త కానవసరం లేదు ఇది తెలియడానికి. ఇది ఇంగిత జ్ఞానం. ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు వాడిన తరువాత అది ఇంజన్ ను తుప్పు పట్టిస్తుందని వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు ఏది ఎలా పనిచేస్తుందో అన్న విషయంపై ధ్యాస ఉంచాలి. చాలామంది దేనిపైనా ధ్యాస ఉంచరు. వారికి ప్రతిదానికి ఒక ప్రిస్క్రిప్షన్ కావాలి..
మీరు ఎంతో కాలంగా తినకూడని ఆహారాన్ని తింటూ ఉన్నట్లయితే, మీ శరీరం ఎంత మందకొడిగా, జడంగా మారుతుందంటే, మీరు దేనినీ గ్రహించలేరు. ఆ సందర్భంలో, ఉపవాసం మీకు సహకరిస్తుంది. మనం, అందరికీ, తమ వ్యవస్థలో ఏం జరుగుతుందనే దానిపై ఎలా దృష్టి పెట్టాలో నేర్పాల్సిన సమయం వచ్చింది. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి – ఇప్పుడు ఇది పనిచేస్తూ ఉందా లేదా అని? తెలుసుకోవడానికి ఇది సులభమైన పద్ధతి
ప్రేమాశీస్సులతో,
సద్గురు
Editor’s Note: Find more of Sadhguru’s insights for your gastronomics in Isha’s new cookbook “A Taste of Well-Being” – now available from Isha Downloads, in major book stores as well as at online stores such as Amazon and Flipkart.
A version of this article was originally published in Forest Flower, December 2016. Download as PDF on a “name your price, no minimum” basis or subscribe to the print version.