సద్గురు: మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో అన్నదాన్ని బట్టి జీవనగమ్యంలో మీరు ఏ ఉన్నత స్థితికీ చేరుకోలేరు. మీకు దృఢ సంకల్పం ఉండడం వల్లే లక్ష్యసిద్ధి పొందగలరు. మీరు ప్రజల జీవితాలను గమనిస్తే, వారు పొందే సంతోషం, శాంతి, ఆనందం, శ్రేయస్సు ఇంకా జ్ఞానోదయం యొక్క స్థాయిని గమనిస్తే, కొంతమంది వరం పొందినట్లు, కొంతమంది శాపగ్రస్తులయినట్లు అనిపిస్తుంది. ఇలా ఎందుకంటే, తీసుకున్న నిర్ణయాల(సంకల్పం)ను ఎప్పుడూ మారుస్తూ ఉండేవారి జీవితం, ఏదో యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటుంది. వారి జీవితంలో ఏదైనా సరిగ్గా జరిగిందీ అంటే, అది ఒకరి ఆశీర్వాదం వల్లో లేదా వారితో ఉన్నవారు చాలా అద్భుతమైనవారు కావడం వల్లో కావచ్చు. మీరు నిర్ణయాలనును మార్చిన ప్రతిసారీ, మీ విధి కూడా మారుతూ ఉంటుంది. అలాంటి వారు ఒక నిశ్చితమైన జీవితం జీవించడానికి లేదా వారు నిజంగా ఆశించినదాన్ని సాధించడానికి ఏ మార్గమూ లేదు.

అసలు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు?

నేను ఏమంటానంటే, మీరు కొన్ని వారాలు సెలవు తీసుకొని, స్పష్టంగా, లోతుగా, మీ శరీరం, మనస్సు యొక్క అన్ని నిర్బంధతలను దాటి, మీరు అసలు జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నారో ఆలోచించండి. మీరు ఎంతో స్పష్టతతో ఉన్నప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి, ఇక దానిపై నిలబడండి. భూమి, ఆకాశం ఏకమైనా సరే, చేసిన నిర్ణయాలను ఎప్పుడూ మార్చకుండా ఉండే వారి జీవితాలు ఎంతో భిన్నమైన రీతిలో సాగుతాయి. మన జీవితాల్లో మనం చేసుకున్న నిర్ణయాలకు మనం ఎంత అంకితభావంతో ఉంటామో, మన జీవితం కూడా అలానే అనుకున్నట్లుగా సాగుతుంది.

శంకరచార్యులు చెప్పిన "నిశ్చలతత్వే జీవన్ముక్తి:" అనే మాటకు అర్థం ఇదే. దృఢ సంకల్పం ఉన్న వ్యక్తికి విముక్తి తప్పక లభిస్తుంది. ఆ నిశ్చలతత్వమే గనక లేకపోతే, ముక్తి లభించే మార్గం లేదు; గందరగోళం మాత్రమే ఉంటుంది. రోజుకు పదిసార్లు తమ జీవిత లక్ష్యాన్ని మార్చుకునే వ్యక్తి ఎక్కడికైనా వెళ్లాలనుకున్నా వెళ్లగలడా! మీరు ప్రతిరోజూ ప్రయాణ గమనాన్ని మారుస్తూ ఉంటే, మీరు కేవలం గుండ్రంగా తిరుగుతూ ఉంటారు - పునరపి జననం, పునరపి మరణం..

రాముడు, కుక్క అందించిన న్యాయం

రామాయణంలో ఒక అందమైన కథ ఉంది. రాముడు దయా ధర్మాలు కల రాజుగా ప్రసిద్ధి చెందాడు. ప్రతిరోజూ కొలువులో ప్రజల సమస్యలను తీర్చడానికి ఆయన ప్రయత్నించేవాడు. ఒక రోజు సాయంత్రం, కొలువులో తన సమావేశాలు ముగించుకున్న తర్వాత, ఆయన తమ్ముడైన లక్ష్మణుడిని ఒకసారి బయటకు వెళ్లి ఇంకా ఎవరైనా ఎదురు చూస్తున్నారేమో చూడమన్నాడు. లక్ష్మణుడికి రాముడి పట్ల ఎంతో అంకితభావం. బయటకు వెళ్లి చూసి, "ఎవరూ లేరు. ఇవాళ్టికి కొలువు చాలించవచ్చు" అన్నాడు. రాముడు, "మళ్ళీ ఒకసారి వెళ్లి చూడు. ఎవరైనా ఉండవచ్చు" అన్నాడు. ఇది కొంచెం అసాధారణనమైన విషయమే, ఎందుకంటే తను అప్పుడే వెళ్లి చూసి వచ్చాడు, మళ్ళీ వెళ్లి చూడమన్నాడు. లక్ష్మణుడు మళ్లీ వెళ్లి చూశాడు - అక్కడ ఎవరూ లేరు.

అతను లోపలికి రాబోతుంటే, ఒక కుక్కని గమనించాడు. అది విచారంగా కూర్చొని ఉంది. పైగా దానికి, తలమీద గాయం ఉంది. కుక్కను చూసి, "నువ్వు దేనికోసమైనా ఎదురు చూస్తున్నావా?" అని అడిగాడు. కుక్క, "అవును. నాకు రాముడి న్యాయం చేయాలి" అని సమాధానమిచ్చింది. సరే, లోపలికి రమ్మని లక్ష్మణుడు దానిని లోపలికి తీసుకు వెళ్ళాడు.

రాముడు ఆ కుక్కను, "నువ్వు ఏమంటావు? నువ్వు ఏమైనా సలహా ఇస్తావా?" అన్నాడు. ఆ కుక్క "అవును, అతనికి సరైన శిక్ష ఏమిటో నాకు తెలుసు"అంది. అదేంటో చెప్పామన్నాడు రాముడు. "కలింజర్ మఠానికి ఇతనిని మఠాధిపతిని చేయండి" అంది.

కుక్క లోపలికి వచ్చి, రాముడికి ప్రణామం చేసి, "ఓఁ రామా! నాకు న్యాయం చేయాలి. ఏ కారణం లేకుండా, నేను హింసకు గురయ్యాను. నేను ఊరికినే నా పాటికి నేను కూర్చొని ఉన్నాను. అసలు ఏ కారణం లేకుండానే సర్వార్థసిద్ధుడు అనే ఒక మనిషి వచ్చి నా తలమీద ఒక కర్రతో కొట్టాడు. నాకు న్యాయం కావాలి" అంది.

వెంటనే రాముడు సర్వార్థసిద్ధుడిని, అతడు ఒక బిచ్చగాడు, తీసుకు రమ్మని పంపాడు. అతన్ని తీసుకు వచ్చారు. రాముడు "ఈ కుక్క ఏ కారణం లేకుండానే నువ్వు కొట్టావని చెప్తోంది, నీవేమంటావు?" అన్నాడు. సర్వార్థసిద్ధుడు "అవును, ఆ కుక్క చెప్పిన నేరం నేను చేశాను. నేను ఆకలి బాధ ఓర్చుకోలేక , కోపంతో, చికాకుతో ఉన్నాను. ఈ కుక్క నా దోవలో కూర్చొని ఉంది. అకారణంగానే ఈ కోపంతో, చికాకుతో ఈ కుక్కను తలమీద కొట్టాను. మీరు నాకు ఏ శిక్ష వేయ్యాలనుకుంటే అది వెయ్యండి" అన్నాడు.

అప్పుడు రాముడు ఈ విషయం తన మంత్రులతో, సభలోని వారితో చర్చించాడు. "ఈ బిచ్చగాడికి ఏ శిక్ష వేయాలంటారు?" అన్నాడు. వారందరూ ఆలోచించారు, "కొంచెం ఆగండి. ఇది ఎంతో క్లిష్టమైన సమస్య. మెదట ఇది ఒక మనిషికీ, ఒక కుక్కకీ మధ్య సమస్య. మనకు తెలిసిన ధర్మాలన్నీ ఇక్కడ వర్తించవు. మీరు రాజు కాబట్టి, మీరే తీర్పు చెప్పవచ్చు" అన్నారు.

రాముడు ఆ కుక్కను, "నువ్వు ఏమంటావు? నువ్వు ఏదైనా సలహా ఇస్తావా?" అన్నాడు. ఆ కుక్క "అవును, అతనికి వేయడానికి సరైన శిక్ష ఏదో నాకు తెలుసు"అంది. అదేమిటో చెప్పామన్నాడు రాముడు. "కలింజర్ మఠానికి ఇతనిని మఠాధిపతిని చేయండి" అంది. రాముడు సరేనన్నాడు. ఆ బిచ్చగాడిని కలింజర్ మఠానికి మఠాధిపతిని చేశారు. ఇది ఎంతో ప్రఖ్యాతి గాంచిన మఠం. రాముడు ఒక ఏనుగును తెప్పించాడు. శిక్షకు సంబరపడిపోతూ ఆ బిచ్చగాడు ఏనుగును ఎక్కి సంతోషంగా మఠానికి వెళ్లాడు.

భలోనివారు "ఇదేం తీర్పు! అసలు ఇది శిక్షేనా? అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు" అన్నారు. అప్పుడు రాముడు ఆ కుక్కను వివరించి చెప్పమన్నాడు. ఆ కుక్క, "పూర్వ జన్మలో, నేను కలింజర్ మఠానికి అధిపతిని. నేను అక్కడికి ఆధ్యాత్మిక ఉన్నతి పొందాలని వెళ్ళాను. ఈ మఠం ఇంకా ఎంతో మందికి ఆధ్యాత్మిక ఉన్నతి కల్పించడంలో తోడ్పడింది. నాకు, నాతో పాటు ఇంకా అందరికి ఇదే కలగాలన్న అంకితభావంతోనే మొదట వెళ్ళాను. నేను ఎంతో కృషి చేసాను. చేయగలిగింది అంతా చేశాను. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వేరే ప్రభావాలకు అప్పుడప్పుడు లొంగిపోయాను. చాలా వరకు నేను ఎంతో స్థిరంగానే నిలబడ్డాను. కానీ అప్పుడప్పుడు నేను లొంగిపోయాను. మఠాధిపతిని కావడం వల్ల నాకు వచ్చిన పేరు ప్రఖ్యాతలు ఎక్కడో నన్ను ప్రభావితం చేశాయి. చాలా సార్లు, నా అహంకారం పనిచేసింది, నేను కాదు. ఎన్నోసార్లు ప్రజలు నా స్ధాయికి ఇస్తున్న గుర్తింపుకు ఆనందపడేవాడ్ని.

ప్రజలు నన్ను ఒక సాధువుగా చూడటం మొదలుపెట్టారు. నా అంతరంగంలో నాకు తెలుసు నేను అలా లేనని. కానీ నేను ఓ సాధువులా ప్రవర్తించడం మొదలుపెట్టాను. ఒక సాధువుకి చెందవలసినవి నాకు చెందాలని హక్కుగా అడిగాను. నా పరిణామానికి నేను పూర్తిగా అంకితమవలేకపోయాను, కానీ అలా నటించడం మొదలుపెట్టాను. ఎలాగూ ప్రజలు అందుకు సహకరించారు. ఇలాంటివి ఎన్నో జరిగాయి. మెల్లగా, నా ఆధ్యాత్మిక ఉన్నతి మీద, నా చుట్టూరా ఉన్నవారి ఆధ్యాత్మిక ఉన్నతి మీద అంకిత భావం సడలింది. ఎన్నో సార్లు తిరిగి ఆ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేశాను, కానీ నా చుట్టూ ఉన్న పేరు ప్రఖ్యాతల వల్ల నేను దారితప్పాను.

ఈ సర్వార్థసిద్ధుడికి, ఈ బిచ్చగాడికి కోపం ఉంది, అహంకారం ఉంది. ఊరికే చిరాకు పడతాడు, అందుకని తనను తానే శిక్షించుకుంటాడని నాకు తెలుసు. నేను చేసినట్లుగానే. అందుకే అతనికి ఇది సరైన శిక్ష. అతన్ని కలింజర్ మఠానికి మఠాధిపతిని చెయ్యడం" అంది.

ఎంపికల నుండి ఎంపికలే లేని జీవితంలోకి

ప్రజలు తమను తామే కఠినంగా శిక్షించుకుంటారు. బాధ, విచారాన్ని కొని తెచ్చుకుంటారు. వాళ్ళు ఏదో దుష్కార్యం చేయవలసిన పని లేదు. వారి జీవితం ఆధ్యాత్మిక ఉన్నతికి అంకితమై ఉండొచ్చు, కానీ ప్రతిరోజూ వాళ్లు ఎంచుకున్నది మారుస్తూ ఉంటారు. వారు విధిని ఒక దిశగా రూపుదిద్దుకోనివ్వరు. వారిని వారే అస్థిరం చేసుకుంటూ ఉంటారు. పడుతూ లేస్తూ, పడుతూ లేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల, వాళ్ళు జీవాన్ని రూపుదిద్దుకోనివ్వరు.

ప్రతి మలుపులోనూ ఎంచుకోవటం, తిరస్కరించటం మధ్య ఊగిసలాడే కోతిలాంటి మనస్సు "సరైనది ఇదా, అదా?" అని ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉంటుంది. అటువంటి మనస్సు తాను కోరుకుంటున్న భవితవ్యాన్ని ఎన్నటికీ రూపొందించు కోలేదు. దాని భవితవ్యం ఎప్పుడూ అస్తవ్యస్తంగానే ఉంటుంది. స్థిరచిత్తం కలిగిన మనస్సు, ఏ మనసు అయితే తన సంకల్పానికి, తాను ఎంచుకున్న విషయానికి స్థిరంగా కట్టుబడి ఉంటుందో- ఒక విషయాన్ని ఎన్నుకుంటే ఇంక అప్పటినుండి మిమ్మల్ని మీరు ఎంపికల చట్రానికి అతీతంగా మార్చుకుంటుందో - అటువంటి మనస్సు మాత్రమే మీ జీవన గతి మీరు ఎన్నుకున్న దిశ వైపుగా సాగేందుకు సహకరిస్తుంది.