Sadhguruనిఘంటువు ప్రకారం సూత్రం అంటే దారం. నియమం అన్న అర్థంలోనూ వాడుతున్నాం, యోగసూత్రాలు, శివసూత్తాలు అన్నవిధంగా. ఇందులోని శాస్త్రీయత గురించి పరిశీలిద్దాం. నేను నా చేతిలో ఒక రాగి పళ్లాన్ని నిమిషం సేపు పట్టుకున్నాననుకోండి, తర్వాత మీరు దాన్ని తాకితే, మీరు కొంచెం స్పందించగల వారయితే, ఆ పాత్ర పూర్తిగా భిన్నపద్ధతిలో ప్రకంపించడం గమనిస్తారు. కాని పళ్లానికి ఈ శక్తిని నిలుపుకొనే సామర్థ్యం లేదు. కాని అదే రాగి మరో ఆకారంలో ఉంటే ఈ ప్రకంపన మరికొంత సేపు ఉంటుంది. ఒక వస్తువుకి శక్తిని నిలుపుకొనే సామర్థ్యం అది తయారు చేయబడ్డ పదార్థానికీ, అది ఉన్న ఆకారాన్ని బట్టి  ఉంటుంది. కొన్ని రూపాలు శక్తిని తక్కిన వాటికంటే ఎక్కువ సమయం నిలుపుకోగలుగుతాయి. ఈ సందర్భంలో దీర్ఘవృత్తజం(ellipsoid) మెరుగైన రూపం. ఒక సమగ్ర దీర్ఘవృత్తజం(లింగాకారం) శక్తిని ఐదునుండి పదివేల సంవత్సరాల వరకు నిలుపుకోగలుగుతుంది. లోకంలో ఉన్న వస్తువుల మౌలిక స్వరూపాన్ని ఆధునిక శాస్త్రవిజ్ఞానం గుర్తించడం ప్రారంభించింది. ఉదాహరణకు, ప్రవహించే నీటిరూపాల నమూనాలకు, ఎడారిలో ఇసుకలో కలిగే నమూనాలకు పోలిక ఉంది. అట్లాగే ఒక నది ప్రవహించే పద్ధతికి, మానవ వ్యవస్థ వ్యక్తమయ్యే పద్ధతికి ఒక ప్రత్యక్ష సంబంధం ఉంది. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకూ మౌలిక నమూనా ఒక్కటే. అవి వాటి సంక్లిష్టతలోనూ, అధునాతనతలో మాత్రమే భిన్నంగా ఉంటాయి.

శక్తిని నిలువచేసే పదార్థాలు

భిన్న రకాల పదార్థాలను మనం శక్తిమంతం చేయవచ్చు. ఉదాహరణగా పట్టును తీసికుందాం. లింగభైరవిలో ఉండి శక్తిమంతం చేయబడిన చీరను కట్టుకున్నారనుకోండి, కేవలం ఆ చీర లింగభైరవి వద్ద కొంతసమయం ఉండడం వల్ల, అది మిమ్మల్ని పారవశ్యంలో ముంచెత్తగలదు. పట్టు, నూలు, రాగి శక్తిని గ్రహించడంలో చాలా మంచి సామర్థ్యం కలిగిన పదార్థాలు. పాదరసం అన్నిటికంటే మేలైనది. కాని మీకు తగినంత సాధన ఉన్నప్పుడే  పాదరసాన్ని ఉపయోగించాలి. శక్తిని గ్రహించే సాధనంగా నూలుదారాన్ని వాడతారు. ఎందుకంటే అది సర్వత్రా దొరుకుతుంది, ఖర్చు లేనిది, కొంతకాలంపాటు చక్కగా పనిచేస్తుంది. దానికి శక్తిని ఇముడ్చుకొనే సామర్థ్యాన్ని పెంచడం కోసం పసుపు వంటి ఇతర పదార్థాలను వాడతాం.

మన లోపలా, బయటి నుండి రోగనిరోధకత

పసుపు అద్భుత లక్షణాల గురించీ, దాని పూర్తి విలువను గురించి ఆధునిక సమాజాలు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవలసి ఉంది. పసుపు మన జీర్ణ వ్యవస్థలోని చిన్నచిన్న ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. పసుపు, నేయి కలిపి శరీరానికి రాసుకుంటే చర్మానికి కాంతి వస్తుంది. ఇది కేవలం అలంకార స్వభావం కలిగింది మాత్రమే కాదు, అది తెజోమండలాన్ని స్వచ్ఛ పరుస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ కేవలం లోపలి నుండి మాత్రమే పనిచేయదు. మీ చుట్టూ మీరు సృష్టించుకున్న శక్తి పొర మీద మీ రోగ నిరోధకశక్తి ఆధారపడి ఉంటుంది. పసుపు మీ చుట్టూ ఒక నిర్దిష్ట ప్రతిస్పందనను సృష్టిస్తుంది, అది మీ తెజోమండల స్వభావాన్ని మారుస్తుంది, కాంతినిస్తుంది, మీ రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. పసుపుకు ఉన్న మరో విశిష్ట లక్షణం ఏమిటంటే అది చాలా తేలికగా శక్తి ప్రసారం చేయగలుగుతుంది. సూత్రానికి శక్తిని ఇముడ్చుకునే సామర్ధ్యాన్ని పసుపు పెంపొందిస్తుంది. ఒక దారాన్ని సూత్రంగా మార్చేది పసుపే.

భిన్నలక్ష్యం, భిన్న సన్నద్ధత

మనం లక్ష్యానుగుణంగా వివిధ రకాల సూత్రాలను సృష్టించవచ్చు – మామూలు పద్ధతిలో, సంక్లిష్ట పద్ధతిలో, మరింత మేలైన పద్ధతిలో. మన ఉద్దేశానికి అనుగుణంగా అది పనిచేయాలంటే మనం దాన్నొక ప్రత్యేక పద్ధతిలో తయారుచేయవలసి ఉంటుంది. ఉదాహరణకు మంగళసూత్రం చూడండి. అది ఇద్దరు మనుషులను కలపడం కోసం ఉద్దేశించినది. నెలకొకసారి తమ మంగళసూత్రానికి పసుపు రాస్తారు. సంవత్సరానికొకసారి దారం మారుస్తారు. సూత్రాన్ని ఒక విశిష్టమైన దారంతో తయారుచేస్తారు. అది చేయడం వచ్చిన వారు తయారుచేస్తారు. ఇప్పుడు మంగళసుత్రాలకి వాడేందుకు పవిత్రమైన దారానికి బదులు ఓ మొద్దు బంగారుగొలుసును ఉపయోగిస్తూన్నారు. ఒకప్పుడు ఇది ఒక శాస్త్రం, నేడు ఇది కేవలం ఒక సంకేతంగా మారిపోయింది. ఇప్పుడొక సంకేతమైనది కొంతకాలం తర్వాత అర్థరహితమైన చెత్తగా తయారవుతుంది. అట్లాగే ఇతర ప్రయోజనాలకోసం మన ఉద్దేశానుసారం పనిచేయడానికి వివేకాత్మకమైన సూత్రం అవసరమవుతుంది. కొన్ని ఉదాహరణలు  చూద్దాం – ఆదియోగి ఆలయంలో ఆదియోగి లింగం చుట్టూ ఒక సూత్రం ఉంది. 

లింగభైరవి విషయంలో మేము సూత్రం తొలగించాం. కాని ధ్యానలింగం వద్ద వనశ్రీకి ఎప్పుడూ సూత్రం ఉంటుంది. దాన్ని నిర్దిష్టకాల వ్యవధిలో మారుస్తూ ఉంటాం. వాటన్నిటి సృజన విధానం భిన్నమైనది. సూత్రం తయారుచేసే ప్రక్రియకు ఒక నిర్దిష్ట సమయం పడుతుంది – ఒక్కొక్కసారి అది ముప్ఫైనుండి నలభైరోజులు పట్టవచ్చు. దాన్ని అప్పటికప్పుడు తయారుచేయాలంటే దానికి కొంత ప్రాణ శక్తి అవసరం. కొన్నాళ్లకిందట ఇలా జరిగింది. నేను ప్రయాణిస్తూ ఉన్నాను. క్రమపద్ధతి పాటించకుండా అప్పటికప్పుడు సూత్రాలు తయారుచేయవలసి వచ్చింది. ఆ తర్వాత ఈ ప్రక్రియ వల్ల నాకు హాని  కలగకుండా కొన్ని చర్యలు తీసికోవలసి ఉంది. కాని నేను తీసుకోలేదు. మరుసటి రోజు నేనసలు నడవలేకపోయాను. నా జీవితంలో ఇటువంటిదెన్నడూ జరగలేదు. నన్నొక జెయింట్ వీల్ లోనో, రోలర్ కోస్టర్‌లోనో పెట్టి తిప్పినా తల దిమ్ము వచ్చే మనిషిని కాను. కాని ఆ రోజు నేను తూలిపోతున్నాను. అందుకు కారణం అలా  తక్షణమే సూత్రాలు తయారుచేయవలసి రావడమే.

ప్రేమాశీస్సులతో,
సద్గురు