సంతోషాన్ని కనుక్కోవడం ఎలా?
సినిమా హీరో విజయ్ దేవరకొండ సద్గురును ఈ హ్యాపీనెస్ ను కనుక్కోవడం, దాన్ని అలాగే అట్టి పెట్టుకోవడంలోని నిజాన్ని తెలుపమన్నాడు. అది కేవలం ఒక రకమైన ‘కెమిస్ట్రీ’ అని సద్గురు అన్నారు. ఆ రకమైన కెమిస్ట్రీని మనలోనే తయారు చేసుకునే టెక్నాలజీ గురించి సద్గురు వివరించారు.

విజయ్ దేవరకొండ: హాయ్, సద్గురూ! ఈనాడు మన మందరం డబ్బు సంపాదించడానికి కష్టపడి పని చేస్తున్నాము, అదేదో డబ్బు వల్ల హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటున్నాము. ఈ కాలంలో హ్యాపీనెస్ అనేది ఎక్కువగా మార్కెటింగ్ చేయబడుతున్న వస్తువు. మనల్ని హ్యాపీ గా ఉంచుతుందని ఆల్కహాల్ తాగుతాము. ఒక స్త్రీ మనల్ని హ్యాపీగా చేస్తుందని ఆమెతో ఉంటాము. కానీ నిజానికి మనల్ని హ్యాపీగా చేసేది, అలా ఉంచేది, ఏది? అది ఎక్కడుందో మాకు తెలియదు. అది ఎక్కడ దొరుకుతుంది? అది ఏమిటో మాకు తెలీదు? మరి హ్యాపీనెస్ ఏమిటి? హ్యాపీగా ఉండటమంటే ఎలా ఉంటుంది? ‘హ్యాపీ నెస్ కోసం లోపల వెతకండి’ అని నాతో చెప్పవద్దు, ఆ సమాధానం నాకు పనిచేయదు, నాకు నిజాన్ని తెలపండి.
సద్గురు: నమస్కారం విజయ్, సంతోషంగా ఉన్న మనిషి ఎలా ఉంటాడు? అన్నది మీ ప్రశ్న. నేను మీకు ఎలా కనబడుతున్నాను? ఇప్పుడు మనం హ్యాపీనెస్ ని అదేదో వస్తువు అని, అదేదో సాధించవలసింది అని, అనుకుంటున్నాము. అదేమీ కాదు. మీ జీవితం హాయిగా ఉంటే, మీరు హాయిగా ఉంటే, అప్పుడు హ్యాపీనెస్ అనేది సహజంగా వస్తుంది. మరి మీరు ఈ హాయికి రావడం ఎలా? దానికి అనేక మార్గాలున్నాయి. కానీ నేను ‘మీ అంతరంగంలోకి చూసుకోండి’ అనకూడదు, ఎందుకంటే మీరు నాకు ఒక షరతు పెట్టారు.
మానవ అనుభూతికి ఒక రసాయన మూలం ఉందని ఈనాడు వైద్యపరంగా కూడా మనకు తెలుసు. మనం ‘శాంతి’ అనుకునేది, ఒక రకమైన కెమిస్ట్రీ. హ్యాపీనెస్ మరొక రకమైన కెమిస్ట్రీ, అలాగే ఆనందం, విషాదం, బాధ, పరమానందం ఇవన్నీ రకరకాల కెమిస్ట్రీలు.
చెప్పాలంటే మీరు ఒక సంక్లిష్టమైన కెమికల్ సూపు. కానీ ప్రశ్న ఏమిటంటే, మీరు గొప్ప సూపా లేక అధ్వాన్నమైన సూపా? మీరు అద్భుతమైన సూప్ అయితే, అది బాగా రుచిగా ఉంటుంది, ఎవరికో కాదు, మీకే. మీకు మీరే బాగా అనిపిస్తే, ఇక మీరు ఇక్కడ కూర్చుంటే చాలు, మీలో మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే సూపు బాగుంటే అందరూ ‘మీరు హ్యాపీగా ఉన్నారు’ అంటారు. మీరు ఇంకా ఇంకా ఆనందంగా ఉంటే జనం మిమ్మల్ని ‘ఎంతో ఆనందమైన వ్యక్తి’ అని అంటారు. మీరు ఇంకా ఎక్కువ ఆనందంగా ఉంటే ప్రజలు ‘మీరు పరమానందంగా ఉన్నారు’ అంటారు.
అందరికీ అర్థమయ్యేలా తేలిగ్గా చెప్పాలంటే, మీ కెమిస్ట్రీని మార్చుకోవాల్సిన అవసరం మీకు ఉంది. మీకు కావాల్సిన విధంగా అటువంటి కెమిస్ట్రీని మీలో తయారు చేసుకోవటానికి ఒక పూర్తి టెక్నాలజీ ఉంది. అలాంటి పరమానందకరమైన కెమిస్ట్రీని మీలో తయారు చేసుకోవడం ఎలానో మీకు నేను నేర్పితే, మీరు చాలా పరమానందంగా ఉంటారు. మీరు అలా ఉన్నప్పుడు, మీరిక సంతోషం కోసం వెతకరు. సంతోషం కోసం వెతకటమే తప్పు. మీ జీవితమే ఒక రకమైన సంతోషమైనదైతే, అప్పుడు మీ జీవితం ఆ అనుభూతిని వ్యక్తీకరించడం అవుతుంది. అప్పుడు మీ జీవిత స్వభావం, మీరు ఏమి చేస్తున్నారు, ఏమి చేయట్లేదు అనే దాని మీద ఆధారపడి ఉండదు. మీలో మీరు ఎలా ఉన్నారు, అనే దాని మీద ఆధారపడి ఉంటుంది.
నేను మీలోపలే అనే మాట వాడాను, క్షమించండి. కెమిస్ట్రీ అనేది లోపలిది కాదు, అది ఇంకా బైటదే. కానీ మీకు సరైన సూపు తయారు చేసుకోవటం ఎలాగో తెలుసుకుంటే, అప్పుడు సంతోషంగా ఉండడం అనేది సమస్య కాదు. అది ఒక సహజమైన పరిణామం. అదొక టెక్నాలజీ, దానిద్వారా మీకు మీ లోపల సరైన తరహా కెమిస్ట్రీ ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. దానినే మేము ‘ఇన్నర్ ఇంజనీరింగ్’ అంటాము. అంటే మీకు మీరే, సహజంగానే మీరు పరమానందంగా ఉండేట్లు, మీ కెమిస్ట్రీని ఇంజనీర్ చేసుకోండి. ఏదో బయటిదాని వలన ఆనందంగా ఉండడం కాదు. మరొకరి నుంచి, మరొక వస్తువు నుంచి, సంతోషం పిండుకోవాలని మీరు అనుకుంటే, మీరు నిరాశ పడవలసి వస్తుంది. ఎందుకంటే మీ కెమిస్ట్రీ పరమానందంగా ఉంటే తప్ప, మరొకటి మీకు ఏమీ ఇవ్వలేదు.
సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి..UnplugWithSadhguru.org.