సద్గురు: ఈ ప్రపంచంలో ఎన్నో సంప్రదాయాలున్నాయి. కానీ వాటిలో దేనినయినా సరే, మీరు మూలాల దాకా వెళ్ళి చూస్తే, సంప్రదాయం అనేది ఒక వ్యక్తికో, వ్యక్తుల సముదాయాలకో కలిగిన అంతర్గతమైన అనుభూతికి అభివ్యక్తి అనీ, బాహ్య రూపమనీ గ్రహించగలరు. ఆ అనుభూతిని ఆ వ్యక్తులు క్రమబద్ధం చేసి ఇతరులకు అందించగలిగితే, అది ఒక 'పద్ధతి' అవుతుంది. తరవాత అదే సంప్రదాయం అవుతుంది. ఆ సంప్రదాయం ఒక్కొక్క సారి మతంగా రూపుదిద్దుకోవచ్చు. కొన్నిసార్లు అనేక ఇతర రూపాలు కూడా పొందచ్చు.

ఇవన్నీ ఒక ఆంతరంగ అనుభూతి నుంచి మొదలవుతాయి. దాని నుంచే ఒక అనియంత్రితమైన ప్రవాహమో, సునియంత్రితమైన కట్టుబాటో ఏర్పడుతుంది. అది అనియంత్రితంగా ప్రవహిస్తే, సాధారణంగా దాన్ని సంప్రదాయం అంటాం. దానికి పటిష్ఠమైన వ్యవస్థ ఏదీ లేదు కనక. అదే మరింత క్రమబద్ధంగా వ్యక్తమైతే, సువ్యవస్థితమైన 'మతం' అవుతుంది. కానీ మూలాలదాకా వెళితే, ముఖ్య రూపంలో ఇవన్నీ వ్యక్తుల, లేదా వ్యక్తి సముదాయాల, అంతర్గతమైన అనుభూతుల నుంచి పుట్టినవే అని తెలుసుకోవచ్చు.

కాలం సంప్రదాయాలను ఎలా మార్చేస్తుంది?

వందేళ్ల క్రితమో, వెయ్యేళ్ల క్రితమో, పదివేల ఏళ్ల క్రితమో ఎవరికో ఏదో అనుభూతి కలిగింది. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళకు మనం తల వంచి వాళ్ళను వాళ్ళుగా గౌరవమిస్తాం. కానీ, ఎంత గౌరవించినా ఇతరుల అనుభవం మీకు స్ఫూర్తినిచ్చే ఒక కథ మాత్రమే. అది మీరూ అనుభూతి చెందితే గాని మీకు యథార్థానుభవం కాదు. ఆ వ్యక్తి అనుభూతీ, ఆ వ్యక్తి జీవిత చరిత్రా మరొకరికి ప్రేరణ మాత్రమే, మార్గం కాదు. తనంతట తానుగా ఆ అనుభూతిని పొందటమే మనిషికి మార్గం. ఇతరులు మీకు మీరు వెళ్లవల్సిన దిక్కును సూచించగలరేమో, అంతే! అయితే వాళ్ళ ఆ సూచనలు కూడా, మీకు అందే లోగా చాలా కాలం గడిచిపోయింది గనక, వాటిలో మార్పులు చోటు చేసుకొని ఉండచ్చు.

ఈ సంప్రదాయంలో ఆంతరికమైన అనుభూతులకు లిఖిత రూపం ఇవ్వ గూడదు. వాటిని మౌఖికంగానే తెలియజేయాలి. దానిలో ఒక్క అక్షరం మార్చేందుకు కూడా ఎవ్వరికీ ఏ హక్కూ లేదు.

ఒక ఉదాహరణ చూడండి. ఈ రోజు మీరు ఒక విషయం చూస్తారు. వెళ్ళి మరెవరికో దాన్ని గురించి చెప్తారు. ఇరవై నాలుగు గంటల లోగా అది ఇరవయ్యయిదు మందికి నోళ్ళల్లో నానుతుంది. తిరిగి మర్నాడు మళ్ళీ మీకే చేరుతుంది. అప్పటికి ఆ కథ మీరు గుర్తు పట్టలేనంతగా మారిపోయి ఉంటుంది. ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమించే విషయాలన్నిటిలోనూ, మానవ మస్తిష్కాలు విపరీతంగా మార్పు చేస్తూపోతాయి. అది మనిషి మస్తిష్క స్వభావం. దీనికి కారణం చాలా మంది మనుషులు తమ మస్తిష్కాల గురించిన శ్రద్ధ పెట్టక పోవటమే.

చాలా మందికి, స్మృతులతో నిమిత్తం లేకుండా మెదడు పని చేయటమనేది జరగదు. నీ మెదడులోకి ఏది వచ్చినా, అది ఆ మెదడులో అప్పటికే ఉన్న స్మృతులతో కలుషితం అవుతుంది. అందుకే, ఈ దేశంలో మనం వీలయినంత వరకూ, బోధనలను తరవాతి తరాలకు యథాతథంగా అందించేందుకు ఒక శాస్త్రీయమైన పద్ధతి ఏర్పరచుకొన్నాం. దీన్ని గురు-శిష్య పరంపర అంటారు.

గురు ముఖత: తెలుసుకునే సంప్రదాయం

ఈ సంప్రదాయంలో ఆంతరికమైన అనుభూతులకు లిఖిత రూపం ఇవ్వ గూడదు. వాటిని మౌఖికంగానే తెలియజేయాలి. దానిలో ఒక్క అక్షరం మార్చేందుకు కూడా ఎవ్వరికీ ఏ హక్కూ లేదు. వాటిని యథాతథంగా, ఏ విపులీకరణలూ లేకుండా అందజేయాలి. వాటికెవరూ వ్యాఖ్యానాలు రాయకూడదు. వేలాది సంవత్సరాలు మనం దీన్ని పాటించాం.

ఒకరికి ఒక అనుభూతి కలిగితే, ఆయన దాన్ని మరొకరికి తెలియజేస్తారు. ఆ మరొకరు దాన్ని తన జీవితంలో భాగంగానే కాదు, ప్రాణం కంటే మిన్నగా భావించి స్వీకరిస్తాడు. ఆయనకది ఒక వృత్తో, కాలక్షేపపు వ్యాసంగమో కాదు. తన జీవితం కంటే ముఖ్యమైంది. ఆయన దాన్ని తన తరవాతి తరానికి అందజేస్తాడు. ఆ అనుభూతిని తాను స్వయంగా పొంది ఉండకపోయినా, తనకు అందిన విషయం అందినట్టు తరవాతి తరానికి చేరవేస్తాడు. ఇదొక మహాద్భుతమైన పద్ధతి. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. దురదృష్ట వశాత్తూ, ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చేశాయి.

సంప్రదాయం కేవలం సంప్రదాయం కోసం కాదు

సంప్రదాయం ప్రాముఖ్యత కేవలం అది సంప్రదాయం అని కాదు. ఆ సంప్రదాయానికి మూలమైన అద్భుతమైన అనుభూతిని, నేటి తరాల వారు కూడా అనుభవించేందుకు ఏర్పరచిన విలువైన సాధనం సంప్రదాయం. దురదృష్టవశాత్తూ మనం వెయ్యేళ్ళ కిందట జరిగింది ఏదయినా అదంతా వర్తమానం కంటే గొప్ప అని భావించే స్థితికి చేరాం. అది సరి కాదు. వెయ్యేళ్ళ కిందట కూడా మీలాంటి, నాలాంటి మనుషులుండేవాళ్ళు. సంఘర్షణలూ, సమస్యలూ, మూర్ఖత్వాలూ అన్నీ ఉండేవి. కానీ లోకులకు బాగాగుర్తు ఉండిపోయేవి మాత్రం కొద్దిమంది మహనీయుల మహోజ్జ్వలమైన జీవితాలే. దాన్ని బట్టి ఆ కాలంలో అందరూ అలాగే ఉండేవారు అనుకొంటారు. కాదు! ఆ కాలంలోనూ కొద్దిమంది వ్యక్తులే అలా ఉండేవారు. ఇప్పుడు కూడా అలాంటి వారు కొద్దిమంది ఉన్నారు.

సంప్రదాయం అన్నది వ్యక్తిగతమైన అనుభూతిలో సజీవ అనుభవంగా చూసుకొనేందుకు సాధ్యమైనది అయి ఉండాలి. అలాంటి సంప్రదాయమే సజీవ సంప్రదాయంగా నిలుస్తుంది. అలా కాని సంప్రదాయం తల మీద మోపిన భారం అవుతుంది. తరవాతి తరమో, దాని తరవాతి తరమో, దాన్ని వదిలేస్తుంది.

సంప్రదాయాలను పరిరక్షించటం అవసరమా?

Namaskaram or Namaste, the Indian Tradition of greeting with folded hands

 

ప్రయోజనం లేని సంప్రదాయమంతా నాశనమైపోతుంది. మీరు మీ తరవాతి తరం మీద వాళ్ళకు ఉపయోగపడని దాన్ని నిర్బంధంగా రుద్దలేరు. మీరు అది ఎంత పవిత్రమైనదని భావించినా, ఏమీ లాభం లేదు. కనక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, వెనక్కు వెళ్ళి, సంప్రదాయం మూలాలు కనుక్కొని, ఆ మౌలికమైన అనుభూతిని ఇక్కడ కూర్చున్న వాళ్ళకు అందుబాటులోకి తీసుకురాగలగాలి. అప్పుడిక, 'దయచేసి సంప్రదాయాన్ని పరిరక్షించండి!' అని వాళ్ళకు చెప్పనక్కరలేదు. దాన్ని వాళ్ళూ ఎలాగూ సజీవంగా ఉంచుకొంటారు.