ప్రశ్న: ప్రభుత్వ ప్రైవేట్ రంగాల భాగస్వామ్యం మోడల్ చాలా సమస్యలకు పరిష్కార మార్గంగా భావిస్తున్నారు. ఈ మోడల్ కు అంత శక్తి ఉందంటారా?

సద్గురు: కొన్ని రంగాలలో ఆ మార్గం అవలంబించటం వివేకవంతమైన పని అని నిశ్చయంగా చెప్పచ్చు. ప్రభుత్వం ఏర్పరచిన మౌలిక వసతులు ముందునుంచే ఉన్న రంగాలలో, వాటికి సమానాంతరంగా మళ్ళీ అలాంటి వసతులు కొత్తగా సమకూర్చటం వ్యర్థ ప్రయాస. ఉదాహరణకు, మేం 'ఈశ విద్య' అనే గ్రామీణ విద్యా వ్యాప్తి పథకం ద్వారా, ఆదర్శ విద్యాలయాలుగా నిలిచే స్కూళ్లను తమిళ నాడు రాష్ట్రంలో, జిల్లాకొకటి చొప్పున నెలకొల్పుతున్నాం.  అయితే వాటికి కావలసిన మౌలిక వసతులన్నిటి నిర్మాణమే ఒక బృహత్తరమైన కార్యక్రమం అయిపోతుంది, కనక మా పథకాన్ని సర్వసమగ్రమయిన పథకంగా మేమే అమలు చేయటం అసాధ్యం.

అందుకే మేము ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా పని చేస్తున్నాం. ఇప్పటి వరకూ, మేము ఆంధ్ర ప్రదేశ్, తమిళ నాడు ప్రభుత్వాల నుండి 516 ప్రభుత్వ పాఠ శాలలను దత్తత తీసుకొన్నాం. ప్రభుత్వ పాఠశాలలకు స్థలమూ, భవనాలూ, ఉపాధ్యాయ వర్గమూ ముందే ఏర్పడి ఉంటాయి . ఉపాధ్యాయులలో చాలా మంది మంచి అంకిత భావంతో పని చేసే వారై ఉండటం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. మా పథకం క్రింద మేము అదనంగా కొందరు ఉపాధ్యాయులను నియమించాం. పిల్లలకు పాఠ్యేతర కార్యక్రమాల సదుపాయాలు కొన్ని అందించాం. పరిశుభ్రతకు లోటు లేకుండా చూసేందుకూ, అవసరమైన చోట్ల బోధన ప్రక్రియ  మెరుగు పరిచేందుకూ వ్యవస్థలు ఏర్పాటు చేశాం. భవనాలు ముందే ఉన్నాయి కనక మేం భవన నిర్మాణాల జంజాటంలో కూరుకుపోవలసిన అవసరం రాలేదు. ప్రభుత్వ- ప్రైవేట్ భాగ స్వామ్యం ఇలాంటి పథకాల అమలులో అద్భుతంగా పని చేస్తుంది.

(ఇలాగే,) కంపెనీలు కూడా ఉన్నత విద్య విషయంలో చొరవ చూపచ్చు. ఈనాటి పరిస్థితులలో, భారత దేశంలో ఉన్నత విద్య అంటే అంకెల గారడీ. మనం అయిదు లక్షలమంది ఇంజనీర్లను తయారు చేస్తాం. కానీ, వారిలో ఉద్యోగ నియామకానికి యోగ్యత ఉన్న వాళ్ళు 50000 మంది కూడా ఉండరు. వాళ్ళకు వచ్చే డిగ్రీ, ఒక్క పెళ్లిళ్ల మార్కెట్ లో తప్ప,  మరెక్కడా పనికివచ్చేది కాదు.  

నేను ఆ మధ్య ప్రపంచంలో అతి పెద్దదైన ఒక ట్రక్కుల కంపెనీ వాళ్ళ భారతీయ కార్యాలయంలో ప్రసంగించాను. ఏదయినా ఇంజనీరింగ్ కాలేజీతో సంబంధం ఏర్పరచుకొని, ఆ కాలేజీ విద్యార్థులకు రెండో సంవత్సరంనుంచి శిక్షణ ఇవ్వటం ఆరంభించమని వాళ్ళకు సలహా ఇచ్చాను. అలా చేస్తే, ఈ కంపెనీ వారి సాంకేతిక విజ్ఞానాన్నీ, పని తీరునూ, నాణ్యతా ప్రమాణాలనూ కాలేజీ దశ నుంచే విద్యార్థులకు అలవాటు చేయవచ్చు. అలా చేశారంటే మరో మూడు సంవత్సరాల తరవాత, వాళ్ళను మీరు ఉద్యోగాలలో నియమించుకొన్నప్పుడు,  వాళ్ళను కంపెనీ అవసరాలకు అనుగుణంగా మలచుకొనేందుకు కష్టపడక్కర్లేదు. పైగా మీ దగ్గరే శిక్షణ పొంది ఉంటారు కనక వాళ్ళకు మీ పట్ల తప్పకుండా కొంత కృతజ్ఞతా భావం ఉంటుంది. ఇప్పటి వరకూ పారిశ్రామిక సంస్థలన్నీ, అత్యుత్తమమైన కళాశాలలనుంచి మాత్రమే ఉద్యోగులను ఎంపిక చేసుకోవాలనుకొంటున్నాయి. కానీ ఇతర కళాశాలలో కూడా ఎంతో మేధా శక్తీ, ప్రతిభా ఉన్నాయి. కాకపోతే వాళ్ళకు ప్రపంచానుభవం కొంచెం తక్కువ. అంతే !

ఈనాడు మన గ్రామాలలో అరవయి శాతం జనాభాకు వాళ్ళ అస్తి పంజరాలు కూడా పూర్తిస్థాయిలో ఎదగటం లేదు.

ప్రభుత్వ- ప్రైవేట్ రంగాల భాగస్వామ్యం  అద్భుతంగా పని చేసే మరో సందర్భం,  పిల్లలకు పౌష్టికాహారం అందజేసే కార్యక్రమాలు. నాలుగు సంవత్సరాల వయసు లోపు పిల్లలు చాలా మందికి అతి తక్కువ పోషక విలువలు గల ఆహారం మాత్రమే అందుతూ ఉండటం  భారత దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలలో ఒకటి. జీవితంలో తొలి నాలుగు సంవత్సరాలలో సరైన పౌష్టికాహారం లభించని పిల్లలకు ఆ తరవాత ఏం చేసినాసరే, శరీరమూ మెదడూ రెండింటిలోనూ ఉండవలసినంత ఎదుగుదల ఉండదని వైద్య శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తున్నది. ఆ మొదటి నాలుగు సంవత్సరాలూ కీలకమైనవి. ఈ సమస్యను ఎదుర్కొనే పథకంలో భాగంగా మేం ఒక అమెరికన్ కంపెనీతో చిన్న చిన్న విటమిన్ గొట్టాల తయారీ గురించి చర్చలు జరిపాం. ఈ గొట్టాలు తీయగా ఉంటాయి. పిల్లలు వీటిని చప్పరించేస్తే చాలు, వాళ్ళ పోషణకు అవసరమయిన సూక్ష్మ పోషకాలన్నీ వాళ్ళకు దక్కుతాయి. ఆ చిన్న విటమిన్ గొట్టం వల్ల ఎంతో తేడా వచ్చేస్తుంది.  పైగా అదేమీ పెద్ద ఖరీదు కూడా ఉండదు. కొన్ని సంవత్సరాల కిందట మేం లెక్క వేసినప్పుడు , దాని ఖరీదు, ఒక్కొక్క శిశువుకు  రోజుకు 27 పైసలు పడింది.  ఈ గొట్టం రోజూ ఇచ్చే అవకాశం లేకపోతే, కనీసం వారానికి మూడు సార్లు ఇచ్చినా పిల్లలు ఆరోగ్యవంతులుగా ఎదుగుతారు.

ఈనాడు మన గ్రామాలలో అరవయి శాతం జనాభాకు వాళ్ళ అస్తి పంజరాలు కూడా పూర్తిస్థాయిలో ఎదగటం లేదు. గ్రామీణులంటే పుష్టిగా ఉంటారని మనం మామూలుగా అనుకొంటూ ఉంటాం. కానీ ఈనాటి గ్రామాలలో 18-20 సంవత్సరాల యువకులను చూస్తే, వాళ్ళు బాగా చిక్కిపోయి కనిపిస్తారు. మీ శరీరంలో ఒక ముఖ్యమైన భాగానికి పూర్తి స్థాయి ఎదుగుదల లేకపోతే, మీ మెదడు కూడా పూర్తిగా ఎదగదు. పూర్తి శారీరక, మానసిక వికాసం లేని జనాభా సంఖ్య భారీగా పెరిగిపోతున్నది.  ఇది ఒక  సునామీ లాగానో, లేక భూకంపం లాగానో కోలాహలం సృష్టించక పోవచ్చు. కానీ ఒక నిశ్శబ్ద విపత్తుగా అతి వేగంగా వ్యాపించేస్తున్నది. మనుషుల ఆరోగ్యం, విద్య కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టక పోతే, మనం ఈ విపత్తును ఇలా కొనసాగనిస్తూనే ఉంటాం. మనం ఈ అతి ముఖ్యమైన రంగాల మీద దృష్టి కేంద్రీకరించకపోతే, మనదేశ  ఆర్థిక పరమైన ఆకాంక్షలూ, మనం ఇటీవల సాధిస్తున్న అద్భుతమైన ఆర్థికాభి వృద్ధీ, అన్నిటి విలువా సున్నా కింద లెక్కే. ఆరోగ్యం, ఆహారం, విద్యా అనే మూడు విషయాలూ  మనుషులు  సవ్యంగా జీవించటానికి  కీలకాలు. ప్రైవేట్ సంస్థలు ఈ రంగాలలో పెట్టుబడులు పెట్టవలసిన సమయం వచ్చింది.  ఇదేదో దానం, ధర్మం కాదు.  ఇది భవిష్యత్తు కోసం పెట్టుబడి.  

దాన ధర్మాలు శాశ్వతమైన ప్రతిపదికలో కొనసాగగలవి కావు. మన సాటి మనుషుల శక్తినీ సామర్థ్యాన్నీ వృద్ధి చేసేందుకు మన వంతు ప్రయత్నం మనం చేయగలిగితే, అది ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. భవిష్యత్తులో మనకు ఎదురవబోతున్న సవాళ్లలో అన్నిటికంటే పెద్దది ఉద్యోగ నియామకాలకు యోగ్యత గల మానవ వనరుల కొరత. విద్యా ఆరోగ్య రంగాలలో పెట్టిన పెట్టుబడులు వ్యాపార సంస్థలన్నిటికీ సంతృప్తి కలిగించే పరిస్థితులను సృష్టిస్తాయి. ఒక కొబ్బరి మొక్క నాటితే, దానినుంచి లాభం పొందేందుకు రైతు పది సంవత్సరాలు నిరీక్షిస్తాడు. భవిష్యత్తు కోసం పెట్టే ఈ పెట్టుబడి కూడా అలాంటిదే. ఈ పెట్టుబడి పెట్టి తీరాలి.