1994 హోల్నెస్ ప్రోగ్రాం నుండి సంగ్రహించిన ఈ భాగంలో, సద్గురు, మనం మనసు ద్వారా వ్యవహరించినప్పుడు మాత్రమే ‘పాతది’ అనేది ఉంటుందనీ, లేదంటే ఈ ఉనికిలో ప్రతిదీ ఎప్పుడూ కొత్తగా, తాజాగా ఉంటుందనీ వివరిస్తున్నారు.

సద్గురు: ఈ ఉనికి మొత్తం ఎప్పుడూ సరికొత్తదే. ప్రతిక్షణం మీరు చూసే ప్రతిదీ కూడా కొన్ని లక్షల సార్లు ఏమీ కానిదిగా అయ్యి మళ్ళీ ఏదో ఒకటిగా అవుతూ ఉంటుంది. అందుకే గౌతమ బుద్ధుడు అనిత్యం గురించి, ఆది శంకరులు మాయ గురించి మాట్లాడారు. ఎప్పుడూ కూడా ఏదీ అక్కడ ఉండదు. ప్రతి క్షణం ప్రతిదీ కూడా, కొన్ని లక్షల సార్లు విడిపోతుంది, మళ్ళీ కలిసి ఒకటిగా వస్తుంది, విడిపోతుంది, మళ్ళీ కలిసి ఒకటిగా వస్తుంది. ఉనికి నిత్యనూతనమైనది. అది ఈ క్షణంలో మాత్రమే ఉంటుంది. అది సృష్టించబడుతుంది, పోతుంది, మళ్లీ సృష్టించబడుతుంది. ఈ సృష్టి మొత్తం ఈ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. ఈ సృష్టిలో పాత దాన్ని మోసుకు వచ్చేది కేవలం మీ మనసు ఒక్కటే. మీరు మీ మనసు ద్వారా వ్యవహరించినప్పుడు ప్రతీది - విషయాలు ఇంకా జనాలు కూడా పాతవారవుతారు. మీరు కనుక ప్రతి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూస్తే, ప్రతిదీ కూడా ఎప్పుడూ తాజాగానే ఉంటుంది.

మనసు ఇంకా జ్ఞాపకం


 

కార్యక్రమానికి అభ్యర్థులు వచ్చిన మొదటి రోజున, కుండపోత వర్షం పడింది. కొందరు తిరిగి వెళ్ళి పోతామన్నారు. బహుశా వాళ్ళు ఎప్పుడూ అటువంటి వర్షంలో ఉండి ఉండరు. చాలా మంది ప్రజలు వర్షం పడుతున్నప్పుడు కనీసం ఇంటి నుంచి బయటకు కూడా రారు. దాంతో పాటు, మీరు వర్షాన్ని పట్టణంలో ఏ విధంగా అనుభూతి చెందుతారు ఇంకా గ్రామంలో ఏ విధంగా అనుభూతి చెందుతారు అనేది భిన్నంగా ఉంటుంది. బయట ఉన్నప్పుడు, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉరిమినా కూడా, ప్రతిదీ కూడా మీకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. నిజమైన జడివాన పడినప్పుడు బయటకు వెళ్లి అక్కడ కాసేపు ఉండండి. దానికి ఎంతో ఓర్పు ఇంకా ఇంగితజ్ఞానం అవసరం. చాలామంది భయబ్రాంతులకు లోనవుతారు. ఉరిమినప్పుడు వాళ్ళు దుప్పటి కప్పుకుంటారు, అక్కడికేదో దుప్పటి వాళ్లని పిడుగు నుండి కాపాడుతుంది అన్నట్టుగా. మీ మీద పిడుగు పడాలీ అంటే, అది పడి తీరుతుంది. దాన్ని ఒక దుప్పటి ఆపలేదు. మీ ఇంట్లో మీరు ఒక బంకరు కట్టుకోవాలి.

మీరు ఉనికిని నిజంగా ఒక్కసారి చూస్తే, అది సరిపోతుంది. అందులో సరిపడా ఉంటుంది. మీరు చూసినది సరిపోయినప్పుడే మీరు నిజంగా ధ్యానపరులు అవుతారు.

బహుశా పిడుగుల వర్షం వల్లనే వాళ్ళు నిరుత్సాహానికి లోనయ్యారేమో. ఏదేమైనా ఆ తర్వాత రోజు వాళ్ళు తలలు దించుకుని నడవ సాగారు. కొద్దిమంది మాత్రమే పర్వతాల వైపు చూశారు. ఆ రెండు మూడు రోజుల తర్వాత వారిలో వాళ్ళు తేరుకున్నారు. ఉదయాన్నే వారు పర్వతాలను చూస్తూ అవి ఎంత బాగున్నాయో అభినందించారు. ఒక పది రోజుల తర్వాత ఇక వాళ్ళు వాటివైపు చూడరు. పర్వతాలు ఎప్పుడూ అక్కడే ఉంటాయి కాబట్టి వారి దృష్టిలో అవి పాతవైపోయాయి.

అసలు ఎప్పుడూ పర్వతాల వైపు చూడని వారు, లేదా ఊరికే అలా చూసేవారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. “పర్వతాలా.. అవి ఎప్పుడూ అక్కడే ఉంటాయి.. చూడడానికి ఏముంది?” అని వారిలో వారనుకుంటారు. అవి పాతవైపోలేదు, ఇప్పటికీ అవి సరి కొత్తగానే ఉన్నాయి. మీరు ప్రతి దాన్ని మీ మనస్సు అనే జల్లెడ ద్వారా చూస్తున్నారు కాబట్టే, మీ జ్ఞాపకం అనేది ప్రతి దాన్ని పాత దానిగా మారుస్తుంది. అదే జీవితంలోని శాపం. ఆదాము, ఈవ్ తిన్న జ్ఞాన ఫలం అదే. అప్పటివరకూ వారికి ప్రతీదీ కూడా తాజాగా ఇంకా అద్భుతంగా ఉంటుంది. కానీ ఒకసారి వాళ్ళు ఈ యాపిల్ పండు తిన్నాక ప్రపంచం పాతదిగా అయిపోయింది. విషయాలు మీకు పాతవిగా కనిపించినంత వరకూ మీ కోరికలు మిమ్మల్ని అంతం లేకుండా పరిగెత్తిస్తూనే ఉంటాయి. ఒక పిచ్చివాడిలా మీరు కొత్త కొత్త వాటిని కోరుకుంటూనే ఉంటారు.

నదికి ఒక వైపున నివసించే జెన్ ప్రజల గురించి కొన్ని కథలు ఉన్నాయి. నదికి అవతల వైపున ఒక గ్రామం ఉండేది. వాళ్లకి వెలుగు కనిపించేది, పొగ కనిపించేది, మాటలు ఇంకా అరుపులు వినిపించేవి, కానీ వాళ్ళకి ప్రజలు కనిపించేవారు కాదు. వాళ్లకి అక్కడ జీవం ఉన్నట్టు తెలిసేది, కానీ వాళ్లకు నిజంగా అక్కడ ఏముందో తెలిసేది కాదు. అయినా సరే వీళ్ళు నదికి అవతలి వైపున కొన్ని దశాబ్దాల పాటూ జీవించారు, ఎప్పుడూ కూడా అవతల వైపుకి వెళ్లి అక్కడ నివసిస్తున్న వారు ఎవరు? అక్కడ జరుగుతున్నది ఏమిటి? అనేది తెలుసుకోవాలనుకోలేదు. ఇలా ఎందుకంటే, ప్రతి రోజు ఉదయాన్నే లేచినప్పుడు, ఇక్కడ ప్రతిదీ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. మరొకచోటికీ ఎక్కడికో వెళ్లి, పరిశీలించడానికి సమయం ఎక్కడ ఉంటుంది? కానీ మానవులు చంద్రుడి మీదకి కూడా వెళ్లారు - వాళ్ళు అంగారకుడి మీదకు కూడా వెళ్లాలి అనుకుంటున్నారు. వాళ్లలో సంతృప్తి లేదు ఎందుకంటే వారి మనసులో ప్రతిదీ పాతదే.

కళ్ళు తెరవండి!


 

ఫ్రెంచ్ రచయిత ఆల్బర్ట్ కేమస్ తన పుస్తకాలలో ఒకదానిలో చెప్పినట్టుగా ఒక్క చూపు చాలు. మేధోపరంగా అతను ఆత్మజ్ఞానానికి ఎంతో దగ్గరగా వచ్చాడు, ఎంత దగ్గరగా అంటే, అతను పిచ్చి అంచుల్లో ఉన్నాడు. తన గురించి తాను తెలుసుకోవడానికి అతను ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎవరన్నా అతనికి ధ్యానం నేర్పించి ఉంటే, అతను ఒక అద్భుతమైన ఆత్మ జ్ఞానం పొందిన వ్యక్తి అయ్యేవాడు. కానీ అతనికి దీక్ష ఇవ్వడానికి ఎవరూ లేరు. “ది మిత్ ఆఫ్ సిసిఫస్” అనే పుస్తకంలో అతను చెప్పినది దాదాపు ఉపనిషత్తులకి దగ్గరగా ఉంటుంది, భగవద్గీతలా ఉంటుంది. కాకపోతే దానిలో అనుభవాత్మక కోణం లేదంతే. బుద్ధి పరమైన స్థాయిలో అతను అంతా చూసాడు - కానీ అతనికి దాని అనుభూతి లేదు అంతే. అతను ఆత్మజ్ఞానానికి ఎంతో దగ్గరగా ఉన్నా- దాన్ని చేరుకోలేక పోయాడు - ఎందుకంటే అతని బుద్ధి పరమైన ఆలోచన వల్ల, ఇంకా సరైన వాతావరణం లేకపోవడం వల్ల.

ఈ పుస్తకంలో ఆయన, “మీరు మీ కళ్ళు తెరిచి నిజంగా జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఓ కొద్ది నిమిషాల పాటు చూస్తే, ఇక ఆ తర్వాత జీవితాంతం మిమ్మల్ని కారాగారంలో బంధించినా సరే, లేదా ఆపై ఇక ఎప్పటికీ మీరు మీ కళ్ళు తెరవకపోయినా సరే, మరేం పర్వాలేదు” అని అన్నాడు. ఇది అతని సొంత అనుభూతి, అతనికి ఈ విధంగా అనిపించింది. అలాగే ఇది వాస్తవం కూడా. మీరు ఉనికిని నిజంగా ఒక్కసారి చూస్తే, అది సరిపోతుంది. అందులో సరిపడా ఉంది. మీరు చూసినది సరిపోయినప్పుడే మీరు నిజంగా ధ్యానపరులు అవుతారు. కేవలం ఆకాశం వైపు ఒకసారి చూస్తే చాలు. ఆ తర్వాత మీ కళ్ళు పోయినా, ఆకాశం వైపు మీరు చూసిన ఆ ఒక్క చూపు, మీరు గనక నిజంగా గ్రహణ శీలతతో ఉంటే, అది మీ జీవితాంతం సరిపోతుంది. లేదంటే ప్రతిదీ పాతది అయిపోతుంది ఎందుకంటే మీరు మీ ఎరుక ద్వారా కాకుండా, మీ జ్ఞాపకాల ద్వారా జీవిస్తున్నారు.

The ebook, Encounter the Enlightened, includes more from the Wholeness Program. Available at Isha Downloads.

Encounter the Enlightened

Editor’s Note: This article is based on an excerpt from the February 2015 issue of Forest Flower. Pay what you want and download. (set ‘0’ for free). Print subscriptions are also available.