ప్రశ్న: సద్గురు, నేను నా జీవితంలో ఈ మధ్య గాఢమైన వెలితిని అనుభూతి చెందుతున్నాను. నడి వయసు సంక్షోభం అంటే ఇదేనా?

 

సద్గురు: మీ జీవితంలో సంక్షోభం లేనిది ఎప్పుడు? బాల్యం ఒక సంక్షోభం, కౌమారం ఒక సంక్షోభం, ముసలితనం ఒక సంక్షోభం, చావు ఇంకో సంక్షోభం అవుతుంది. కనీసం ఈ నడి వయసు జీవితమైనా సమతుల్యంగా ఉండి తీరాలి. అవునా! ఇప్పుడు, యవ్వనంలో ఉండే సమస్యలు తొలగిపోయాయి. ముసలితనంలోని సమస్యలు ఇంకా రాలేదు. నడి వయసు అనేది మీ జీవితంలో ఉత్తమమైన భాగం కావాలి. కానీ మీరు దాన్ని కూడా ఒక సంక్షోభం అంటున్నారు. నడి వయసు కాదు సంక్షోభం - మీరే సంక్షోభం.

నలభై ఏళ్లు వచ్చినా , ఎనభై ఏళ్లు వచ్చినా, చావే వచ్చినా అవి సంక్షోభాలు కావు. అది సహజమైన జీవిత ప్రక్రియ.

యవ్వనంలో ఉన్నప్పటి శక్తిని కోల్పోవడమే, నడివయస్సులో సంక్షోభం అనుకోడానికి కొంతవరకు కారణం. మీరు యుక్త వయసులో ఉన్నప్పుడు, అడ్డూ ఆపూ లేకుండా జీవించి ఉండవచ్చు. ఇప్పుడు ఆ శక్తి తరిగిపోతోంది, ఇకపై మీరు తెల్లవారుజాము నాలుగు గంటలవరకు మజా చేసుకోలేరు. అందుకే ఇప్పుడు సంక్షోభం అనుకుంటున్నారు.

మీరు సంక్షోభం అనుకునేది కేవలం ఒక మార్పు. ఆ మార్పుకు అనుగుణంగా వ్యవహరించడం మీకు తెలీదు కాబట్టే మీరు దాన్ని ఒక సంక్షోభం అంటున్నారు. మీరు మార్పును వద్దనుకున్నట్లయితే, మీరు కాటికి అయినా వెళ్ళాలి, లేదా మీకు జ్ఞానోదయం అయినా కావాలి. లేకపోతే, మీరు సృష్టి యొక్క భౌతిక ప్రక్రియలో భాగంగా ఉన్నంత కాలమూ, మారనిది అంటూ ఏదీ ఉండదు. ఈ క్షణం మీరు శ్వాస పీల్చుకుంటున్నారు, మరుక్షణమే మీరు శ్వాస వదులుతున్నారు – ఇది మార్పు. మీరు మార్పును అడ్డుకున్నప్పుడు, మీరు జీవితపు ప్రాథమిక ప్రక్రియను అడ్డుకున్నట్లే. ఇంకా ఎల్లకాలం మీరు అన్నిరకాల దుఃఖాలను ఆహ్వానిస్తారు.

జీవితాన్ని రెంటికీ చెడ్డ రేవడిని చేసుకోవద్దు

జీవితం అనేది కేవలం పరిస్థితులే. కొన్ని పరిస్థితులలో ఎలా వ్యవహరించాలో మనకు తెలుసు. కొన్ని పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో మనకు తెలీదు. మీకు జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితినీ ఎలా ఎదుర్కోవాలో మీకు ముందుగానే తెలిస్తే, మీకు చచ్చేంత విసుగేస్తుంది. మీకు తరువాత రాబోయే పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియకపోతే, అప్పుడు మీరు మరింత ఉత్సాహంగా ఉండాలి. కానీ మీరు దాన్ని సంక్షోభంగా భావిస్తున్నారు. కాబట్టి మీకు రెండే ఎంపికలు ఉంటాయి – విసుగు లేదా సంక్షోభం!

మీరు జీవితంతో పూర్తిగా నిమగ్నమైతే, మీరు ఎప్పటికీ దాన్ని ఒక సంక్షోభంలా భావించరు.

జీవితాన్ని రెంటికీ చెడ్డ రేవడిని చేసుకోవద్దు. ఎటూ కాకుండా పోతారు. ఎలా ఎదుర్కోవాలో తెలియని ఒక పరిస్థితి మీకు ఎదురైనప్పుడే, మీ శరీరం, మనస్సు, భావోద్వేగాలు మరియు శక్తులను మీరు సాధ్యమైనంత మెరుగ్గా నిర్వహించుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఒక మార్గం చూడగలరు. కానీ,’ మీరు ఎవరు’ అనే దానికి సంబంధించిన ప్రాథమికమైన అంశాలను మీరు నిర్వహించు కోవాలనుకోవట్లేదు, ఎందుకంటే మీరు ఒక కాంక్రీటు దిమ్మె మాదిరి జడ పదార్ధంలా తయారయ్యారు. ఈ జడ పదార్ధం జీవితపు ప్రతి దశలోనూ అదే మూసలో వెళ్ళాలనుకుంటుంది, మరి అది జరగని పని.

మీకు నలభై ఏళ్లు వచ్చినా, ఇంకా మీరు మీ జీవితాన్ని మీకు పద్దెనిమిదేళ్ళ వయసులో మాదిరిగా సాగించాలనుకుంటే, అప్పుడు మీకు సంక్షోభంలా అనిపిస్తుంది. నలభై ఏళ్లు వచ్చినా, ఎనభై ఏళ్లు వచ్చినా, చావే వచ్చినా అవి సంక్షోభాలు కావు. అది సహజ జీవిత ప్రక్రియ. మిమ్మల్ని మీరు జీవితపు ఒక దశతోనే గుర్తించుకున్నారు కాబట్టి, తరువాతి దశ ఒక సంక్షోభంలా అనిపిస్తుంది. మీజీవితంలో పరిస్థితులు ఉన్నాయి. జీవితం ఎలాగూ మారుతుంది. ఆ మార్పు మీరనుకున్న విధంగా ఉందా లేక అస్తవ్యస్తంగా జరుగుతోందా? ఉన్న ప్రశ్నల్లా అదే.

అది ఎలా మారినా, స్తబ్ధత కన్నా మెరుగే, ఎందుకంటే మానవ జీవితం స్తబ్ధతను భరించలేదు.”నడి వయస్సు సంక్షోభం” అంటే “నా జీవితం స్తబ్ధంగా ఉంది. అంతా ఒకేలా ఉంది – అదే ఇల్లు, అదే పాత్రలు కడుక్కోవడం, అదే భాగస్వామి – అంతా ఎప్పుడూ అలాగే ఉంటుంది.” ఈ “అంతా ఒకేలా ఉంది.” అనేది మీ మనసులో మీరు కల్పించుకున్న అభిప్రాయం. లేదంటే, సృష్టిలో ప్రతీరోజూ, ప్రతీక్షణమూ మార్పు సంభవిస్తూ ఉంది. మీ శరీరంలో మార్పు జరుగుతుంది. మీ మనసులో మార్పు జరుగుతుంది. అన్నింటిలోనూ మార్పు జరుగుతోంది. కానీ మీ జీవితంలో మీరు దాన్ని చూడలేకపోతున్నారు. మీ మనసు వేరే విషయాలతో నిండిపోయి ఉంది. మీ మనసు పదే పదే దాన్నే తోడుతోంది. మళ్ళీ మళ్ళీ అదే విషయాలలో తిరుగుతుండడం వల్ల మీకు స్తబ్ధత లేదా సంక్షోభంలా అనిపిస్తుంది.

అది సంక్షోభం అయితే మంచిదే. ఎందుకంటే, అలా కాకపొతే, మీరు ఈ మిథ్య నుండి బయటపడే మార్గం కోసం అన్వేషించరు.

మీరు గమనిస్తే, మీ చుట్టూ ఉన్న ప్రతి ఆకు, మీ చుట్టూ ఉన్న అంతటినీ మీరు పరిశీలిస్తే, జీవితాన్ని మీరు ఒక నిరంతర పరివర్తన ప్రక్రియగా చూస్తారు. ఏదీ ఎప్పటికీ స్తబ్ధంగా ఉండదు. లోపలా బయటా, ప్రతిదీ నిరంతరం మార్పుకు లోనయ్యే ప్రక్రియే. మీరు గనుక జీవితంతో పూర్తిగా నిమగ్నమైతే, మీరు ఎప్పటికీ దాన్ని ఒక సంక్షోభంలా భావించరు. మీరు కేవలం మీ ఆలోచన మరియు భావోద్వేగంతో లీనమయ్యారు కాబట్టే, మీకు అది సంక్షోభం అయ్యింది. అది సంక్షోభం అయితే మంచిదే. ఎందుకంటే, అలా కాకపొతే, మీరు ఈ మిథ్య నుండి బయటపడే మార్గం కోసం అన్వేషించరు. ఎప్పటికీ మిథ్యలోనే ఉండిపోతారు.

సంక్షోభం, విపత్తు కంటే నయమైనది. మీరు చేస్తున్నది ఏంటో తెలుసుకోకుండా, జీవితాంతం మీరు మీ ఆలోచన, మనోభావాలతో వినోదం పొందుతుంటే, అది విషాదం అవుతుంది. సంక్షోభం విసత్తు కంటే నయమైనది- సంక్షోభం మిమ్మల్ని మేల్కొలుపుతుంది, విపత్తు మిమ్మల్ని అంతం చేస్తుంది. ఇప్పుడు, సంక్షోభం అనేది పూర్తి 100% మీ మనసు ఇంకా మీ భావోద్వేగాల కల్పన అని మీరు అర్థం చేసుకోవాలి - అది ప్రకృతి సిద్ధంగానో, ఉనికి పరంగానో సృష్టి మూలంగానో వచ్చింది కాదు- అది కేవలం మీరు కల్పించుకున్నది. మీరు అది తెలుసుకోకపోతే, మీరు సంక్షోభాలను ఒకదాని తరువాత ఒకటి సృష్టించుకుంటూ పోతారు. అది మీ కల్పన అని మీరు తెలుసుకుంటే, మీరు దాన్ని ఆపనవసరం లేదు – ఎలాగో అదే అదృశ్యమై పోతుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు