Sadhguruఅప్పుడే పిండరూపాన్ని సంతరించుకొన్న మానవ దేహాన్ని గమనిస్తే, అదో అతిచిన్న మాంసం ముద్దగా ఉంటుంది. ఆ అతిచిన్న మాంసంముద్దే క్రమేపీ ఇప్పటి ఈ రూపాన్ని తనంతట తానే సంతరించుకొంటుంది. ఈవిధంగా రూపుదిద్దుకొనేలా చేయడానికి అందుకో ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఉంది. దాన్నే ప్రాణమయకోశమని అంటారు. అంటే శక్తిమయ శరీరం అన్నమాట. ఈ శక్తి శరీరమే మొట్టమొదటగా స్వయంగా ఆవిర్భావమవుతుంది. తరువాత దానిపైన ఈ భౌతిక శరీరం రూపుదిద్దుకొంటుంది. ఒకవేళ ప్రాణమయ కోశంలో ఏవైనా లోపాలు, హెచ్చుతగ్గులున్నట్టయితే ఆ ప్రభావం భౌతిక శరీరంపై కూడా కనిపిస్తుంది. అందుకే మన సంస్కృతిలో ఓ సంప్రదాయం ఉంది. ఎవరైనా ఓ అమ్మాయి గర్భవతి కాగానే ఆమె నిత్యం గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకోవడంతో పాటు ప్రాణమయకోశాన్ని అంటే శక్తిమయ శరీరాన్ని ప్రభావితం చేయగిలిగిన శక్తిసంపన్నులైన (తపస్సంపన్నత) గల పెద్దలవద్దకు వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడం ఆచారంగా ఉంది. చక్కటి స్పందన గల శక్తిమయ శరీరం ఉన్నట్టయితే ఆమె ఎంతో సమర్థతగల మానవునికి జన్మను ఇవ్వగలుగుతుంది.

మూలాధారము - మౌలికాంశాలు

మూలాధారము ఈ శక్తిమయ శరీరానికి మూలం - పునాది వంటిది. ఇప్పటివారికి మూలాధారమంటే అది అన్నిటికన్నదిగువన గల చక్రమని, పట్టించుకోవలసినంత గొప్పదేమీ కాదనే భావన ఉంది. పునాది అనేది అసలు పట్టించుకోనక్కరలేని విషయమని భావించే వారెవరైనా భ్రమలో జీవిస్తున్నారనే చెప్పాలి. పునాది అనేది చాలా ప్రధానమైనది. అలాగే మూలాధారం అతిముఖ్యమైనది. మనం యోగాభ్యాసం చేసేటప్పుడు అన్నింటికీ మించి మూలాధారం మీదే మన దృష్టినంతటినీ కేంద్రీకరిస్తాము.

ఎందుకంటే, ఇక్కడ స్థిరత్వం సాధించామంటే మిగిలినదాన్నంతా సృష్టించడం చాలాసులభం. ఓ భవనం పునాది చాలా బలహీనంగా ఉంటే, దాన్ని పడకుండా చూడ్డానికి మనం దాన్ని మోయడం మొదలుపెడితే అది పెద్ద సర్కస్ అయిపోతుంది. ఇదే మానవ జీవితంలోనూ జరుగుతోంది. ఓ విధమైన ఆరోగ్యస్థాయిలో తమను ఉంచుకోవడానికి ప్రతిరోజూపడే తాపత్రయం, చాలామంది మానవుల నిత్యజీవనకృత్యమైపోయింది. అలాకాకుండా, మన మూలాధారం సుస్థిరంగా ఉన్నట్టయితే, జీవితమైనా.. మరణమైనా.. ఏమాత్రం చెక్కుచెదరకుండా మనం కూడా ఎటువంటి ఆందోళన లేకుండా స్థిరంగా ఉండగులుగుతాం. ఎందుకంటే మన పునాది, మన మూలస్థానం గట్టిగా ఉండబట్టే. మిగతా అంశాలన్నిటినీ ఆ తరువాత సుస్థిరం చేసుకోవచ్చు. అలాకాకుండా పునాది కనుక అస్థిరంగా ఉన్నట్టయితే, ఆందోళన అనేది అతిసహజం.

అనుభూతలకై వెతకటంలోని కష్టాలు

దైవకృపకు పాత్రులవ్వాలంటే, అందుకు తగిన శరీరం మనకు ఉండాలి. అలా కాకుండా మనకు తగిన శరీరం లేకుండా మనమీద అఖండంగా అనుగ్రహం వర్షించినట్టయితే, మనం తట్టుకోలేం. మన శరీరం విలవిల్లాడిపోతుంది. చాలామంది తమకు పెద్ద పెద్ద (ఆధ్యాత్మిక) అనుభవాలు కావాలనుకొంటారు కాని ఆ అనుభవాలు సాధించడానికి తగినరీతిలో తమ దేహాలను సిద్ధంచేయడానికి మాత్రం సుతరామూ అంగీకరించరు. కేవలం ఆధ్యాత్మిక అనుభవాలు కావాలంటూ వాటికోసం వెంపర్లాడుతూ సాధనలు సాగించడం వల్ల చాలామంది మతులు పోగొట్టుకొన్నారు, దేహాలను ఛిన్నాభిన్నం చేసుకొన్నారు. యోగక్రియలో మనం అనుభవాలకోసం వెంపర్లాడేది ఏదీ ఉండదు, కేవలం సంసిద్ధులమవుతాం, అంతే. ఆదియోగి ప్రథమ శిష్యులైన సప్తఋషుల విషయంలోనూ ఇదే జరిగింది.

వారు కేవలం సంసిద్ధులయ్యారు, అలా సంసిద్ధులవుతూనే వచ్చారు, అంతే. వారు మరి దేన్నీ అర్థించలేదు. అలా వారు ఏకంగా 84 సంవత్సరాలపాటు సంసిద్ధులవుతూనే వచ్చారు. వారు పూర్తిగా సంసిద్ధులుగా ఉన్నారనే విషయాన్ని గమనించిన ఆదియోగి, ఇక తను ఏదీ దాచిపెట్టుకోలేదు. సర్వాన్నీ వారికి ఇవ్వక తప్పలేదు. కానీ, ఇప్పటి ప్రపంచం మాత్రం ఇందుకు విరుద్ధంగా తయారైంది. సద్గురూ! నేనిక్కడ రెండ్రోజులున్నా.. నాకు ఆత్మజ్ఞానం ప్రసాదించరూ?’’.. అంటూ వెంటపడుతున్నారు.

మన జీవితం ఉల్లాసంగా, అతిశయించిన స్థితిలో సాగాలంటే మనకు ఎంతో కొంత పిచ్చి అవసరం.
యోగవ్యవస్థలన్నీ నిరంతరం మూలాధారం మీదే కేంద్రీకరించి ఉంటాయి. కానీ, ఇటీవలి కాలంలో అనుభవం ఏమాత్రంలేని యోగులంతా పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు రాసేస్తున్నారు. దానికితోడు మూలాధారంపై కాకుండా, ఊర్ధ్వ చక్రాలమీద ధ్యానం నిలపాలని బోధలు చేసేస్తున్నారు. కానీ, జీవితం ఆ విధంగా నడవదు కదా..... కొన్నిసంవత్సరాల కిందట నేను రెండు, మూడు రోజుల హఠయోగ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించేవాడిని. కేవలం ఆసనాలు వేస్తున్న దశలోనే ప్రజలు పారవశ్య స్థితిల్లోకి వెళ్ళేవారు. తమ పరిమితులను అధిగమించడానికి చాలా మంది యోగులు అతి సామాన్యమైన భంగిమలనే ఆశ్రయిస్తారు. హఠయోగం ఆవిధంగానే ఉంటుంది. హఠయోగం అంటే నిలకడగా ఉండడం.

నిలకడ అంటే తెలివి కాదు. మన జీవితం ఉల్లాసంగా, అతిశయించిన స్థితిలో సాగాలంటే మనకు ఎంతో కొంత పిచ్చి అవసరం. కానీ మీ పిచ్చి ఓ నిర్బంధంగా మారితే, మీరు జీవితాన్ని కోల్పోతారు. మనం నిలకడ గురించి మాట్లాడినప్పుడు, మనం తెలివి గురించి మాట్లాడ్డం లేదు. మనం నిర్వహణ సామర్థ్యం ఇంకా సాహసాలు కలిగి ఉన్నప్పుడు, తెలివి ఇంకా పిచ్చికి మధ్య ఊగులాడే కొమ్మ గురించి మాట్లాడుతున్నాం. పిచ్చితనం అనేది నిజంగా సాహసమే. ఇది నియంత్రణలో ఉన్నంత కాలం చాలా అద్భుతమైన అంశం. మీరు నియంత్రణ కోల్పోతే అది భయానకంగా మారుతుంది. అదే విధంగా తెలివి చాలా అందమైనదే కానీ, మీరు మరింత వివేకంగా మారితే, మీరు మంచిగా ఉండవచ్చు గానీ, జీవచ్ఛవాలుగా మారిపోతారు. మీ మూలాధార చక్రం స్థిరంగా ఉన్నప్పుడు.. జీవితంలో ఎప్పుడైనా, మనం కోరుకొన్నదాన్ని సాధించడానికి, అందుకు సాహసించడానికి అవసరమైన సామర్థ్యం, మన మూలాధారం సుస్థిరమైనప్పుడే మనకు అందివస్తుంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

Pixabay/Wortflow-2411121