మీకు ఏమి కావాలో దేవికి తెలుసా?
సద్గురు, "మానవులు దేన్నయితే శ్రేయస్సుగా భావిస్తారో, భైరవి దేవి అనుగ్రహాన్ని పొందితే, అదంతా వారి సొంతం అవుతుంది" అని అంటారు. ఇది విన్నప్పుడు మన మనసులో సహజంగానే, "దేవి అది జరిగేలా ఎలా చేయగలదు? ఆమెకు మన మనసు లోతుల్లోని కోరికల గురించి తెలుసా?" అన్న ప్రశ్న ఉత్పన్నమౌతుంది. దేవి అనుగ్రహం వల్ల మన జీవితాలలో విషయాలు ఎలా జరుగుతాయో సద్గురు వివరిస్తున్నారు.
ప్రశ్న: మన దైనందిన జీవితంలో మనకు ఎన్నో ఆశయాలు ఉంటాయి, ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. దేవికి మన కోరిక ఏంటో, మనం దేని కోసం ప్రయత్నిస్తున్నామో ఆటోమాటిక్‌గా తెలిసిపోతుందా?
సద్గురు: మీరు ఒక సైకిలో, పడవో కొనుక్కున్నారనుకోండి, ఆ సైకిలో లేక పడవో మీరు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయిస్తుందా? మీరు ఎక్కడికి వెళ్లాలనుకున్నా, అది మీ ప్రయాణాన్ని సుగమం చేస్తుంది. భైరవికి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారనే విషయం తెలుసుకోవాల్సిన పని లేదు. ఆమె మీ ప్రయాణ సామర్థ్యాన్నిపెంచుతుంది అంతే. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు. అందుకే నేను ఆమె ఒక యంత్రమని చెప్తున్నాను. అలా కాకుండా దేవిని ఒక నిర్దిష్ట దిశవైపు పనిచేసేలా రూపొందిస్తే, ఉదాహరణకి ముక్తి దిశగా పనిచేసేలా రూపొందిస్తే, ఇక అప్పుడు, మీరు ఏ వైపుగా వెళ్ళాలనుకున్నా సరే, ఆమె మిమ్మల్ని లాగి ముక్తి వైపుకే నెడుతుంది. వాస్తవానికి ఆమె మిమ్మల్ని శిఖర స్థాయి సంభావ్యతకు తీసుకువెళుతున్నా సరే, మీరు అయిష్టంతో వెళితే, ఆ జీవితం దయనీయమైన జీవితం మౌతుంది.కాని ఆమెని ఒక నిర్దిష్ట దిశవైపు పనిచేసేలా రూపొందించలేదనుకోండి, అప్పుడు మీరు ఏం కోరుకుంటారో దాన్ని భైరవి మెరుగు పరుస్తుంది. అది ఏమిటి అనేది ఆమె నిర్ణయించదు. కాబట్టి ముఖ్యమైన విషయం ఏంటంటే, పయనించగల మీ సామర్ధ్యం మెరుగైనప్పుడు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్ణయించుకోవాలి. మీరు కనుక గమ్యాన్ని మారుస్తూ పోతే, ఇప్పుడు ఆ యంత్రము మీ సామర్థ్యాన్ని పెంచింది కాబట్టి, మీరు చేసే తప్పిదాలు కూడా చాలా పెద్దవిగా ఉంటాయి. మీరు నడుస్తున్నట్లయితే, తప్పుదోవ పట్టినపుడు వెనుతిరిగి రావటం తేలిక. కాని అదే మీరు ఆకాశంలో విమానం నడుపుతూ ఉంటే, ఒక్కసారిగా వెనుతిరగడం కుదరదు, దానికి చాలా సుదీర్ఘ మలుపు తీస్కోవాల్సి ఉంటుంది. ఒకసారి మీ సామర్థ్యస్థాయి పెరిగాక, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో స్పష్టంగా నిశ్చయించుకోవడం చాలా ముఖ్యం. రోజుకో దిశ మారుస్తూ ఉంటే, జీవితం ఊరికే వృధా అయిపోతుంది.
“దేవి మీకు ఎదో ఇస్తుంది” అన్న విధంగా ఆలోచించకండి. భక్తితో దగ్గరవ్వండి అంతే. ఆమె ఏమీ చేయనవసరం లేదు. మీరు ఆమెను జాగ్రత్తగా చూస్కోండి చాలు. ఏది జరగాలో అది జరిగిపోతుంది. ఉత్తమమైన విధానం ఏంటంటే, ఆమెను ఏమీ అడగకుండా ఉండడం. ఉత్తమమైన విధానం ఏంటంటే, ఆమెతో మీరు ఎంత ప్రఘాడంగా కనెక్ట్ అవ్వగలరో చూడడమే. మీరు అడిగితే, మీకు తెలిసిన దానిలో నుంచే అడగుతారు. మీకు తెలియనిదాన్ని మీరు అడగలేరు. మీకు తెలిసిన దాన్ని అడగటం అనేది ఇప్పటి వృద్ధి లానే కనపడవచ్చు. కాని వాస్తవానికి అదొక వెనకడు.
మీకు తెలియనిది జరగాలంటే, మీరు అడగటం మానేయాలి. మీరు ఆ శక్తి తో కనెక్ట్ అయితే చాలు, విషయాలు జరుగుతాయి. అవి ఎలా జరిగినా, అది మంచిదే. ఇవన్నీ జరగాలంటే, మీ జీవిత నాణ్యత మీ చుట్టూ జరిగే విషయాలపై ఆధారపడని విధంగా మిమ్మల్ని మీరు స్థిమితపరుచుకోవాలి. మీ చుట్టూ జరిగే విషయాలు మీ పని నాణ్యతను ప్రభావితం చెయ్యవచ్చు, లేదా మీరు ప్రపంచంలో ఏం చేస్తున్నారో దాన్ని ప్రభావితం చేయవచ్చు. కానీ అవి మీ మనస్సును, మీ ఉనికి ని, ఇంకా దాని నాణ్యతను ప్రభావితం చేయకూడదు. ఒకసారి మీరు ఈ విధంగా అయ్యాక, ఇక అప్పుడు దేనినైనా అడగటం అనేది చాలా తెలివితక్కువ పనిగా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు అడిగేది ఏదైనా సరే, మీకు ఇప్పటికే తెలిసిన దానినే అడగుతారు.
మీకు తెలిసిన దాని కంటే అతీతమైనది జరగాలంటే, అత్యంత ఉత్తమమైన పద్ధతి ఏమంటే, అడగడం అనేది జీవించడానికి సరియైన మార్గం కాదని అర్ధం చేసుకోవడమే! అడగడం అనేది జీవించేందుకు చాలా మౌళికమైన విధానం. జీవించటానికి దీని కంటే ఎన్నో చక్కని, ఇంకా ప్రఘాడమైన మార్గాలు ఉన్నాయి. నా విషయంలో కూడా అంతే - నేను దేన్నీ నిర్ణయించను. నేను ఆ పరమ శివుడిని నా యాభై శాతం పార్టనర్ గా తీస్కున్నది, ఆయన ఏదో చేస్తారని కాదు. ఆయన ఏమీ చేయరు. పనంతా నేనే చేస్తాను. కాని నీను ఏ దిశలో పయనించాలో ఆయన సూచిస్తారు. ప్రయాణం మొత్తం చేసేది నేను, కానీ కేవలం దిశా నిర్దేశం చేసినందుకు ఆయన 50 శాతం పొందుతారు. బ్లింకర్లు (వాహనానికి ఇరు ప్రక్కలా వెలుగుతూ ఆరుతూ వెళ్లబోయే దిశను తెలిపే లైట్లు ) ఎటువైపు వెలిగితే, అటువైపుకే నేను వెళతాను. ఆ బ్లింకర్లను నేను ఆన్ చేయాల్సిన పని లేదు, వాటంతటవే వెలుగుతాయి. ఆ బ్లింకర్లు వెలగగానే, నేను అటు వైపు పయనించాలని నాకు తెలుస్తుంది. ఈ పద్ధతి పెద్దగా నైపుణ్యం లేని డ్రైవర్ల కోసం.
కాబట్టి ఫలానా విషయం జరుగుతుందా జరగదా అని ఆత్రుత పడకండి. జరిగిందా మంచిది, జరగలేదా మరీ మంచిది. “మరి భైరవి ఎందుకు? ఆమెతో నేను నా సమయాన్ని వృధా చేసుకోవటం లేదు కదా?” మీరు దైవాన్ని నడిపించాలా? లేక దైవం మిమ్మల్ని నడిపించాలా? ఆ విషయం మీరు అర్ధం చేసుకోగలిగితే, ఇక సమస్యే లేదు. కానీ ప్రస్తుతం మీరు దైవాన్ని నడిపించాలని ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఉండేందుకు ఇది చాలా తెలివితక్కువ విధానం.