అమెరికా దేశపు పీడకల

సద్గురు : న్యూయార్కు నగరంలో 70 % మంది రోజూ తాగుతారు అంటారు. ఇంకో 20 % ఎక్కువ మోతాదులో తీసుకోవడం చేస్తూ ఉంటారు. అక్కడి వాళ్ళు ఇటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, అందరూ ఇంకా న్యూయార్క్ కే వెళ్లాలని అనుకుంటూ ఉంటారు.

అసలు జనం, సమాజం , లేక ఒక దేశం సంపద కావాలని ఎందుకు కోరుకుంటాయంటే, మొట్టమొదటగా అది మనకు ఇష్టమైన పోషణ పొందడానికి అవకాశం వస్తుంది అని. ఆ తరువాత రెండవ స్థాయిలో, సంపద అంటే, ఇష్టమైన జీవన విధానం గడపడానికి అవకాశం. చక్కటి పోషణ, ఆరోగ్యం, సౌకర్యవంతమైన జీవన విధానం ప్రజలకు అందించే స్థాయి సాధించిన అమెరికా లాంటి సంపన్న దేశంలో, 70 % జనాభా డాక్టర్లు ఇచ్చిన మందుల మీద ఆధారపడి బతుకుతున్నారు. మిగిలిన 30% చీకటి బజారులో ఆ మందులు కొంటూ ఉంటారనుకోండి. 30 కోట్ల ప్రజల ఆరోగ్య సంరక్షణకోసం 3 లక్షల కోట్ల డాలర్లు అమెరికా ఖర్చు పెడుతోంది.

మంచి పోషణకీ, సౌకర్యవంతమైన జీవన శైలికీ అంత చక్కటి అవకాశం ఉన్నప్పుడు, సహజంగా మంచి ఆరోగ్యం కూడా ఉండాలి. ఆలా జరగట్లేదూ అంటే, మనం ఇక్కడ కొంచెం తరచి చూడాలి. ఎందుకంటే, ఇది కేవలం అమెరికా గురించే కాదు. ఏదో ఒకరోజు అందరూ ఆ స్థితికే చేరతారు. అందరికీ అమెరికా చేరటం ఒక అభిలాషగా మారింది; అందుకే ప్రతి ఒక్కరూ త్వరగా అక్కడికి చేరాలని కష్టపడుతున్నారు... వెళ్ళి అనారోగ్యం తెచ్చుకోవాలని!

ఉదాహరణకి, భారత దేశంలో 40, లేదా 50 ఏళ్ల కిందట, ఎవరైనా తమ కూతురికి పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు, " అయ్యో, వాళ్ళింట్లో అందరూ మద్యం తాగుతారు. ఆ ఇంటికి మా పిల్లనివ్వం" అనేవారు . కానీ, ఇవాళ చూస్తే, మీరు పెళ్ళిలో డ్రింక్స్ ఇవ్వకపోతే, పెళ్ళికి ఎవరూ రారు. ఈ యాభై ఏళ్లలో ప్రపంచమంతటా వచ్చిన మార్పు ఇది.

వృద్ధి చెందుతున్నట్టు భ్రాంతి

అంటే ముఖ్యంగా, మనమెక్కడికి చేరుకుంటున్నామంటే, ఆరోగ్యంగా ఉండాలంటే మనకి రసాయనాలు కావాలి, ప్రశాంతంగా ఉండాలంటే మనకి రసాయనాలు కావాలి, ఆనందంగా ఉండాలంటే మనకి రసాయనాలు కావాలి , ఇక పారవశ్యం పొందాలంటే “Ecstasy” అనే మందు ఉండనే ఉంది.

అంతర్గతంగా ఒక అనుభూతి సృష్టించుకోడం కోసం మనుషులు ఎందుకిలా రసాయనాల వెంటబడుతున్నారు? అది అయవాస్క, మారువానా, వైన్, విస్కీ, కొకెయిన్, LSD లేక ఏదయినా కావచ్చు, అది మీలోని ప్రతిఘటనా శక్తిని నాశనం చేసి, కొంత సేపు మీకేదో స్వేచ్ఛగా, హాయిగా ఉన్నట్టు అనిపించేట్టు చేస్తుంది. ఒకరేదో ఒక మత్తుమందు తీసుకున్నారనుకోండి. అతనికి చాల అద్భుతమైన అనుభూతులు వస్తాయి, అతనిక దాన్ని వదలలేడు. మనుషుల మెదడు ఎంతగా గడ్డకట్టుకుపోయిందంటే, దాన్ని కరిగించడానికి రసాయనాలు కావలసి వస్తోంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సినదేంటంటే, ఈ అనుభూతి కోసం మీరు మీ ఇంద్రియ శక్తులను తగ్గిస్తున్నారు. మీ ఒంట్లో శక్తి సామర్ధ్యాలు పోగొట్టుకుని మీరు జీవితంలో ఉన్నత స్థితులను అందుకోగలమనుకుంటున్నారా?

మీలో మీరు వికసిస్తున్న అనుభూతిని ఆ రసాయనం మీకు కలిగించవచ్చు, కానీ అది నిజమైనది కాదు. ఒకవేళ మీరు "సరే, అది నేను విస్తరించడానికి అవకాశం ఉందని, నాకు తెలిసేట్టు చేసింది" అని అనుకుంటే, అది అంతవరకే ఉపయోగిస్తుంది. కానీ, ఒకసారి మీరు ఆలా మొదలు పెట్టారంటే, అది క్రమక్రమంగా మీలోని శక్తి సామర్ధ్యాలన్నిటినీ పీల్చి వేస్తుంది. కొన్నాళ్ల తరువాత ఆ మత్తు మందే మిగుల్తుంది.

ఏదైనా పనిచేస్తుంది అంటే , అది రోజూ, ప్రతి సారీ పనిచేయాలి. రోజూ అయవాస్క తీసుకుని చూడండి ఏమవుతుందో..ఆ క్షణంలో అది మీ పరిమితులని, మీ నిరోధకశక్తిని అధిగమించి మీకేదో దొరికిన అనుభూతిని కలిగించవచ్చు. కానీ, అది మీకు ప్రతి క్షణం ఆ అనుభవం నిలబడేట్టు చేస్తుందా? లేదు. కేవలం మీరు ఆ మాత్ర వేస్తుకున్నప్పుడు మాత్రమే మీరు ఆ స్థితిని పొందుతారు, అది లేకుంటే ఏమీ లేదు. మీరు ఏదో ఒకే పని చేసే మందబుద్ధి గల మనిషిగా అవుతారు.

ఇక్కడ సమస్య కేవలం ఆ డ్రగ్ మీ శరీరాన్ని పాడుచేసి, చంపేస్తుందన్నది ఒక్కటే కాదు; అది మిమ్మల్నేదో స్వేచ్చాపరులైనట్టు ఒక అసత్యపు భావన కలిగిస్తుంది, అదే అసలు సమస్య - నిజానికది మిమ్మల్ని వ్యసనపరులను, బానిసలను చేస్తోంది.

మీరు ఒక పర్వత శిఖరాన్ని ఎక్కి అక్కడ నుంచున్నప్పుడు, ఒక్క క్షణం అకస్మాత్తుగా ఏదో అద్భుతమైన అనుభూతి కలగొచ్చు ..కానీ అది తరువాత నిలవదు. అది పర్వత శిఖరమైనా, మత్తు పదార్థమైనా, ఎంతో సేపు నిలవదు. ఇక్కడ ప్రశ్న అది ఎంత గొప్ప అనుభూతి అన్నది కాదు, అది ఎంత ప్రభావితం చేస్తూంది అన్నది. మీరు పరిశీలించి చూడండి, ఆ రసాయనాలను వాడే వారిని - వాళ్లలో ఏమైనా పరివర్తన జరిగిందా? అది మీ జీవితంలోని అన్ని అంశాలను అనుభవించగలిగే విధంగా మీ అవగాహనా శక్తిని మెరుగుపర్చగలిగిందా? లేదు. సాధారణంగా, వారికి క్షణికంగా కలిగిన ఆ ఒకే ఒక్క గొప్ప అనుభూతిని గురించి చెప్పడానికి తప్ప, మరేమీ లేదు వారి దగ్గర.

మరో రకమైన మధురానుభూతి

మాదక ద్రవ్యాలలోగానీ, మత్తు పానీయాలలోగాని ఆహ్లాదం కలిగిచేది ఏమీ లేకపోతే, జనం వాటి వైపు వెళ్లేవారు కాదు. కానీ అవి ఇచ్చే ఆనందం ఎలాంటిదంటే, "సిగరెట్ త్రాగడం ఆరోగ్యానికి హానికరం", అని హెచ్చరిక ఆ పెట్టె పైన రాసి ఉన్నా, పర్యవసానాలని గురించి ఆలోచించకుండా జనం తాగుతూనే ఉన్నారు.

ఈ భూమి మీద అన్నిటి కంటే అధునాతనమైన, సంక్లిష్టమైన అయిన రసాయనిక కర్మాగారం మానవ శరీరం. ఇంతటి గొప్ప యంత్రాన్ని ఎవరైనా మీకిస్తే, మీకు ఇష్టమైనది తయారుచేసుకుందామని అనుకోరా మీరు ? ప్రస్తుతం మీరు దీంతో అసహ్యకరమైన వాటిని తయారు చేసుకోడంలో తలమునకలై ఉన్నారు ఎందుకంటే మీకు ఈ మానవ శరీర వ్యవస్థని ఎలా ఉపయోగించుకోవాలో తెలియటంలేదు కాబట్టి. మీరు గనక దీన్ని సమర్ధవంతంగా నిర్వహించుకోగలిగితే , అప్పుడు మీలో మీరు పొందే ఆహ్లాదం ఎంత హృద్యంగా ఉంటుందంటే ఇక మీకు ఏ పదార్థాన్నీ ముట్టుకోవాలని అనిపించదు. ఎందుకంటే కేవలం జీవించి ఉండడమే ఒక అద్భుతమైన విషయంగా ఉంటుంది, అప్పుడు. దురదృష్టవశాత్తూ , మనం ఆహ్లాదాన్ని పొందడానికి మరే ఇతర విధానాలనూ జనానికి బోధించలేదు. అందుకని వారు రసాయనాల వైపు వెళుతున్నారు.

మనుషుల్ని బలవంతంగా ఆ రకమైన మత్తునించి బయటి లాగే ప్రయత్నం ఫలించదు. దాన్ని మించిన ఆనంద స్థాయిని వారికి రుచి చూపాలి. మనిషిలోని చైతన్యం వీటన్నిటినీ మించిన స్థితిలో ఉంటుంది. ఈ సృష్టిలో అన్నిటికంటే శక్తివంతమైనది చైతన్యం. మీరు ఒక ఆకు, పండు, ఒక రసాయనం లేదా ఒక పానీయం, ఈ చైతన్యం కంటే గొప్పవని నమ్మజూస్తున్నారు. మీరు ఇక్కడ ఊరికే ఆలా కూర్చుని, సంపూర్ణమైన పారవశ్యంలో మునిగిపోతే, ఇక మీరు ఏ మత్తు పదార్ధాన్నీ తాగరు, ముట్టుకోరు. ఎందుకంటే, వాటన్నిటినీ మించిన రసాయన వ్యవస్థ మీ శరీరంలోనే ఉంది కనక.

అసలు మానవ శరీర వ్యవస్థ ఎలా పనిచేస్తోందని మీరు ఎరుకతో గమనిస్తే, మీకోసం మీరు సహజంగానే ఉన్నతమైన ఆహ్లాద స్థితిని సృష్టించుకోగలరు. ప్రశ్న ఏమిటంటే, మీరు అసలు ఆలా ప్రయత్నించారా?

భావి తరాలను కాపాడుకోవడం

బయటి పదార్ధాలతో లోపలి అనుభూతులను సృష్టించుకోవాలని ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో, మనం ఏమీ చెయ్యకపోతే, రాబోయే 15 - 30 సంవత్సరాలలో దాదాపు 90% జనాభా రసాయనాల మీదే ఉంటారు. మనమందరం అనుభవాల కోసం ఈ మత్తు మందుల మీద ఆధారపడితే, మనం సృష్టించే మన తరువాతి తరం మనకంటే అధ్వాన్నంగా ఉంటుంది. ఇది మానవాళి పట్ల తీరని నేరం. మన తరువాతి తరం ఎప్పుడూ మనకంటే గొప్పగా ఉండాలి.

అంతే కాదు, మానవ మేధస్సు పని చేసే తీరును గమనిస్తే, ఒకవేళ ఈ రసాయనాల వాడకం శృతి మించి పోతే, వచ్చే 65 - 70 ఏళ్లలో, జనాభాలో అధిక శాతం ఆత్మహత్యలకి పాల్పడినా ఆశర్య పోనవసరం లేదు. ఎందుకంటే మనిషికి కావలసింది కేవలం సుఖమే కాదు, తన ఉనికికి ఒక ప్రయోజనం. మాదక ద్రవ్యాల వాడకం వల్ల మీకు ఆనందం కలగచ్చుకానీ, అదే సమయంలో అవి మీ లక్ష్యం నుంచి మిమ్మల్ని దూరం చేస్తాయి. ఆలా జరిగినప్పుడు, ప్రపంచ వ్యాప్తంగా ఆత్మహత్యల శాతం గణనీయంగా పెరిగిపోతుంది.

మనం ఆలా జరగనివ్వకూడదు. చైతన్యవంతులైన మానవులను తయారు చేయటమే దీనికి గల ఒకే ఒక్క పరిష్కారం. మనిషిలోని చైతన్యాన్ని మేలుకొల్పడం అన్నిటికంటే ముఖ్యమైనది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు