కాళీ దేవి - ఉగ్రదేవత
@కాళీ దేవి ప్రాముఖ్యత ఏమిటి ? ఆమెను భయానకంగా ఎందుకు వర్ణిస్తారు ? ఈ దేవతను ఒక ప్రత్యేక శక్తి రూపంగా, జీవంలోని ఒక ప్రత్యేక కోణం కోసం ఆమెను అలా ఎందుకు ఆవిర్భవింప చేశారో సద్గురు తెలియజేస్తున్నారు.
కాళీ దేవి ప్రాముఖ్యత ఏమిటి ? ఆమెను భయానకంగా ఎందుకు వర్ణిస్తారు ? ఈ దేవతను ఒక ప్రత్యేక శక్తి రూపంగా, జీవంలోని ఒక ప్రత్యేక కోణం కోసం ఆమెను అలా ఎందుకు ఆవిర్భవింప చేశారో సద్గురు తెలియజేస్తున్నారు.
సద్గురు : భారతదేశంలో ఎన్నో రకాల దేవుళ్ళు, ముఖ్యంగా దేవతలు తయారు చేయబడ్డారు. కొంతమంది యోగులు, మార్మికులు కొన్ని నిర్దిష్ట ప్రయోజనాల కోసం కొన్ని ప్రత్యేకమైన రూపాలను రూపొందించారు. ఈ రూపాలలో కొన్ని ప్రసన్నంగానూ, కొన్ని భయానకంగానూ, కొన్ని చైతన్యవంతంగానూ ఉంటాయి. మన జీవితంలోని వివిధ పార్శ్వాలకు వివిధ రూపాలు ఉన్నాయి. ఈ రూపాలన్నింటినీ వివిధ రకాల సాధనాలు అని నేను అంటాను.
ఉదాహరణకు ఇప్పుడు చదువు వివిధ శాఖలుగా విస్తరించబడింది. కానీ ఒకప్పుడు చదువు అంటే అందరూ అన్నీ నేర్చుకునేవారు. అయితే, ఈ రోజుల్లో, వేర్వేరు వ్యక్తులు వేర్వేరు శాఖలను ఎంచుకొని దానిలో నిష్ణాతులవుతున్నారు. అదేవిధంగా యోగులు కొన్ని ప్రత్యేక శక్తి రూపాలను స్థాపించి, ప్రజల జీవితాలలో కొన్ని ప్రత్యేక అంశాలలో వారికి ఈ శక్తి రూపాలు అందుబాటులో ఉండేలా చేశారు. అలాగే ఈ శక్తి రూపాలను ఎలా ఆశ్రయించాలో తెలియజేయడానికి ఒక వ్యవస్థను కూడా రూపొందించారు.
ఇటువంటి సైన్సు సౌత్ అమెరికాలో కూడా ఉంది, కానీ ఆ రూపాలు చాలా క్రూరంగా ఉంటాయి. వాళ్లు సామాన్యంగా జంతు రూపాలను రూపొందించి వాటి ద్వారా శక్తిని పొందుతూ ఉండేవారు. కానీ భారతీయ సంస్కృతిలో చాలా ఆధునికమైన రూపాలను రూపొందించారు. మీకు వాటి మీద సరైన పట్టు ఉంటే, వాటిని ఆవాహన చేసుకొని వాటి ద్వారా నమ్మశక్యం కానివి ఎన్నో చేయవచ్చు.
కాళీ - ఒక భయానకమైన స్త్రీ
కాళీ ఒక భయంకర రూపం. అటువంటి స్త్రీ రూపాన్ని నియంత్రించడానికి ప్రత్యేకమైన నైపుణ్యం కావాలి. ఇతర రూపాలతో పోలిస్తే, ఈ రూపాన్ని చాలా సులువుగా చేరుకోవచ్చు, కానీ ఈ రూపం చాలా చాలా భయంకరమైనది. ఎవరైనా భయంకరంగా ఉన్న వారిని మీరు ఆహ్వానించినప్పుడు వారిని ఎలా చూసుకోవాలో మీకు తెలియకపోతే వారు మిమ్మల్నే తినేయవచ్చు. ఇంతకంటే భయంకరమైన ఘోరమైన రూపాలు కూడా ఉన్నాయి. సామాన్యంగా యోగులు కొన్ని భయంకరమైన రూపాలు రూపొందిస్తారు, ఎందుకంటే వాళ్లు కూడా భయంకరమైన వాళ్ళు కాబట్టి. వాళ్లు సామాన్యంగా మచ్చికగా ఉండే స్త్రీలతో జీవించలేరు.
ఈ రూపాలు, ప్రత్యేకమైన శక్తిని ఆకర్షించే కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియలకు స్పందిస్తాయి. కాళీ కేవలం ఒక రూపమో లేక మీ నమ్మకమో కాదు. ఆమె మీ కోసం సజీవంగా మారవచ్చు. ఆమె మీ ముందర నడవవచ్చు ఎందుకంటే ఒకసారి శక్తి శరీరం తయారయ్యాక, కావాలంటే దానిపై ఓ భౌతిక శరీరాన్ని కూడా నిర్మించవచ్చు.
ఉదాహరణకు, ధ్యానలింగ అత్యున్నతమైన సజీవ శక్తి శరీరం. సిద్ధాంత పరంగా ఆ శక్తి శరీరం మీద భౌతిక శరీరాన్ని నిర్మించవచ్చు. కానీ అది చాలా శ్రమతో కూడుకున్న పని, పైగా అంత శ్రమ పడడం అనవసరం. ఇంకొక మనిషిని సృష్టించాల్సిన అవసరం ఏమిటి? ఇప్పుడు, మీరు నన్ను నన్నుగా అనుభూతి చెందలేకపోవడానికి కారణం నా ఈ భౌతిక శరీరమే. నేను మీలా మాట్లాడతాను ఇంకా మీలా పనులు కూడా చేస్తాను. నేను మరో రూపంలో ఉండి ఉంటే అందరికీ చాలా సులువుగా ఉండేది. కానీ, ఒకసారి మీరు ఎవరినైనా మనిషిగా చూస్తే, అతను మీ తార్కిక బుద్ధిలో ఇమిడిపోవాలి. లేకపోతే అతనిని మీరు జ్ఞానిగా చూడరు. మీరు అతనిని పిచ్చివాడు అని అనుకుంటారు. అందుకే భౌతిక శరీరం సృష్టించడంలో ఉపయోగం లేదు.
ధ్యానలింగంలో అన్ని పార్శ్వాలు ఉన్నాయి. కానీ కాళీ ఒక ప్రత్యేక శక్తి పార్శ్వం. ఈ యోగులు ఈ శక్తిని సృష్టించి అలా వదిలివేశారు. చాలా ప్రదేశాలలో కొన్ని విధాలుగా ఈ శక్తిని ప్రతిష్ట చేశారు, ఎవరైనా వీటిని చేరుకోవచ్చు. ఇది సృష్టిలోని అత్యంత శక్తివంతమైన శక్తి.
యోగా సాంప్రదాయంలో కాళీ ఒక్కటే కాదు ఇంకా ఇటువంటి శక్తి రూపాలు చాలా ఉన్నాయి. సామాన్యంగా మామూలుగా మనం ప్రజలతో అటువంటి ప్రదేశాలకు వెళ్ళము. ఎందుకంటే వాళ్లకు అటువంటి అవసరము ఉండదు. కొన్ని ప్రత్యేకమైన పనులు చేసే వారికి మాత్రమే ఇటువంటి విషయాలు తెలుసుకోవలసిన అవసరం ఉంటుంది. మిగతావాళ్లు ఎవరైతే ముక్తిని కోరుకుంటున్నారో వాళ్ళు ఇటువంటి ప్రదేశాల్లో అడుగు కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ చాలా రకాలైన సంక్లిష్టతలు ఉంటాయి. ఇది సృష్టికర్తలా ఆడడానికి ప్రయత్నించడం లాంటిది.
అదేమీ తప్పు కాదు కానీ, అదెలాంటిదంటే ఇప్పుడే నడక నేర్చుకుంటున్న ఒక చిన్నపిల్లాడ్ని పరుగు పందెంలో పెట్టడం లాంటిది. దాని వల్ల అతనికి కచ్చితంగా నష్టం జరుగుతుంది. మీరు సిద్ధంగా లేనప్పుడు ఎంత మంచి విషయమైనా చెడు చేయగలదు.