‘‘ఏకాగ్రతతో ఉండడం, పరధ్యానం తగ్గించుకోవడం కష్టతరంగా ఉందా? దృష్టిని కేంద్రీకరించే ప్రయత్నం చెయ్యకండి, కేవలం నిమగ్నమవ్వండి’’ అని సద్గురు అంటారు. ఎలాగైతే చూసేవారిని ఆ సినిమా తెర వశపరచుకుంటుందో, అలాగ, కేవలం నిమగ్నమవ్వడం వల్ల జీవితంలో ఏదైనా మనోహరంగా మారిపోతుంది.

ప్రశ్న: నమస్కారం సద్గురూ, ప్రతిసారి నేను ఏదైనా చేయాలని లేదా పని ప్రారంభించాలనుకున్నప్పుడు "ఇంక ఎటువంటి దృష్టి మరల్చకుండా, నేను ఇది చెసేస్తాను" అనుకుంటాను, కానీ, తిండి, సినిమాలు అలా మరే కారణంగానైనా ఏదో ఒక విధంగా ఏకాగ్రత కోల్పోతాను. అనుక్షణం ఏకాగ్రతతో వుండడం ఎలా? మీరు “ఊరికే అలా కూర్చోండి’’ అంటారు, నాకు అది చాలా కష్టతరంగా ఉంది.

 

సద్గురు: ‘‘ఊరికే అలా కూర్చోవడం’’ ప్రస్తుతానికి మీకు ఇంకా అలవడకపోయి ఉండవచ్చు. కనుక మీరు ఏకాగ్రత పెట్టేందుకు ప్రయత్నించకండి. ఇది ఆహ్లాదకరమైన అనుభవం కాదు. కేవలం నిమగ్నమవ్వండి. ఉదాహరణకు మీరు ఒక సినిమా చూస్తున్నారంటే అది కేవలం రెండు ప్రమాణాలతో(2D) కూడుకుని ఉన్న ఒక  దృక్శబ్ద(కాంతి మరియు ధ్వని) ప్రదర్శన. అంత ప్రాముఖ్యత కలిగినదేం కాదు. కానీ నిమగ్నమై చూస్తున్నప్పుడు అది నిజ జీవితం కన్నా గొప్పగా మీకు అనిపిస్తుంది. జనం, హీరో రజనీకాంత్ ని తమసొంత కుటుంబంకన్నా ఎక్కువగా ప్రేమిస్తారు. మీరు అతన్ని ఎప్పుడూ చూడలేదు, అతను అలా ఉండడు కూడా, కానీ అతను వారి జీవితంలో ఒక భాగంగా మారాడు, ఇది కేవలం వారు నిమగ్నమవ్వడంవల్లనే. ఇతను 3D వ్యక్తి కాకపోయినా, కేవలం 2D కాంతి, ధ్వని ప్రదర్శనే అయినా జనం అతన్ని గొప్పగా ప్రేమించగలుగుతున్నారు.

ఏదైనా అద్భుతంగా మారేది, అది అటువంటిదైనందువల్ల కాదు. ఈ విశ్వంలో ప్రతిదీ అద్భుతమే లేక ఏదీ అద్భుతం కాదు. ప్రస్తుతానికి ఒక అణువుని పరిశీలిస్తున్నారనుకోండి వారు తమ జీవితమంతా దాన్ని గమనిస్తూనే గడిపేస్తారు. వారు నిమగ్నమవ్వడంవల్ల ఆ అణువే అద్భుతంగా మారుతుంది. చూసేందుకు చుట్టూ పెద్ద ప్రపంచం ఉంది కానీ, ఒకరు మైక్రోస్కోప్ లో ఒక అణువునో లేదా ఒక బాక్టీరియానో చూస్తున్నారు. వారు అందులో పూర్తిగా నిమగ్నమవ్వడం వల్ల ఆ బాక్టీరియా ఒక అద్భుతంగా మారింది.

 

ఏకాగ్రత చూపే ప్రయత్నం చేయకండి. దృష్టి కేంద్రీకరించే ప్రయత్నం చేయకండి. నిమగ్నమవ్వగలిగితే మీకు ఏదైనా సరే అద్భుతమైన అనుభూతిగా మారుతుంది. అప్పుడు నేను మీకు “దృష్టిని కేంద్రీకరించండి” అని చెప్పనవసరం లేదు. అలా ఉంటే, ఇక సమస్యంతా దానిలోనుంచి మిమ్మల్ని ఎలా బయటకు తేవాలనే అవుతుంది. దురదృష్టమంతా ఏమిటంటే, ఇప్పుడు ప్రపంచంలో అంతా లక్ష్యం వెంట పరిగెడుతోంది. మామిడిపండ్లు కావాలి, కానీ చెట్టు సంగతి వారికి పట్టదు. అలా కుదరదు. మీరు చెట్టుతో నిమగ్నమై, దాన్ని పోషించండి, పండ్లు అవే మీ పైన రాలతాయి. మీరు మామిడి పండ్లతో, ‘‘తియ్య తియ్యని మామిడి పండ్లూ, రండి, రండి’’ అనే అవసరం లేదు. మీరు కేవలం చెట్టుని పోషించండి, మామిడి పండ్లు రాలతాయి, అవి తియ్యగానే ఉంటాయి. ఇదే విధంగా దృష్టి, ఏకాగ్రతలు అనేవి నిమగ్నమవ్వడం వల్లవచ్చే పరిణామాలు. కానీ మనుషులు చెట్టు లేకుండానే పండ్లు కావాలనుకుంటున్నారు, అది వాళ్ళకు నరక ప్రాయమౌతుంది. నిమగ్నమవ్వకుండా విషయాలపై దృష్టి కేంద్రీకరించాలనుకోవడం మనుషులకు మరణ శాసనమౌతుంది.

సంపాదకుడి సూచన: ఈశా క్రియ ఆన్లైన్ లో ఉచితంగా అందుబాటులో ఉండే మార్గనిర్దేశిత ధ్యానం. మీరు గనక రోజులో కొద్ది నిముషాలు వెచ్చించడానికి సిద్ధంగా ఉంటే, ఇది మీ జీవితాన్నే మార్చగలదు.