మనం అత్యాధునికమైన కాలంలో ఉన్నాం. పగలనకా రాత్రనకా, దీపాల కాంతి మన కళ్ళను మిరుమిట్లుగొలుపుతూనే ఉంటుంది. ఆకాశంలో పున్నమి చంద్రుడు నిండుగా వెలుగుతున్నా, ఈనాడు నగర ప్రాంతాలలో నివసించే వారిలో చాలా మంది దాన్ని గమనించలేరు! పూర్ణ చంద్రుడిని గమనించలేక పోవటమేమిటో, అంత పెద్ద బింబం, అంత దేదీప్యమానంగా వెలుగుతుంటే!

మీరు తల ఎత్తి ఆకాశాన్ని చూస్తే, చంద్రుడి విభిన్నమైన కళలలో, ప్రతి భేదాన్నీ చక్కగా పరికించచ్చు. అంతే కాదు, అసలు మీ శరీర నిర్మాణ యంత్రాంగం లో భాగమైన చైతన్య శక్తినీ, జ్ఞాన శక్తినీ ఒకానొక స్థాయికి చేర్చగలిగితే, మీరు ఒక విషయాన్ని, ఆకాశం వైపు చూడకుండానే, మీ శరీరం ద్వారానే గమనించచ్చు. చంద్రుడికి కలిగే వృద్ధి క్షయాల దశలలో ప్రతి దానికీ, మీ శరీరం ప్రత్యేక విధాలుగా స్పందిస్తుంది. ఇది స్త్రీల శరీరాలలోనూ చూడ వచ్చు, పురుషుల శరీరాలలోనూ చూడచ్చు. అయితే స్త్రీల శరీరాలలో ఈ స్పందనలు మరింత స్పష్టంగా గమనించచ్చు.స్త్రీల శరీరాలలో జరిగే ప్రత్యుత్పత్తి సంబంధమైన శారీరక పరిణామాలకూ, చంద్ర గ్రహం భ్రమణానికీ లంకె ఉన్నదని అందరికీ తెలిసిన విషయమే. చంద్రుడు భూమి చుట్టూ తిరిగేందుకు పట్టే సమయ నియమాలకూ, మానవ శరీరంలో అంతర్గతంగా జరిగే మార్పులకూ దగ్గరి సంబంధం ఉంది. అసలు మనిషి పుట్టుక అనేదే - అంటే ఈ శరీర సృష్టి వెనక ఉన్న ప్రక్రియలు సర్వం - చంద్ర భ్రమణంతో ముడిపడి ఉన్నాయి.

మన దైనందిన జీవితాల మీద కూడా చంద్ర గ్రహం ప్రభావం గణనీయంగానే ఉంటుంది. అందుకే, ప్రాచ్య దేశాలలో- ముఖ్యంగా భారత దేశంలో- రెండు రకాల పంచాంగాలు వాడతారు. మామూలు లౌకిక వ్యహారాలకు మాత్రమే అయితే సౌరమాన పంచాంగం వాడతారు. కేవలం సమాచారానికీ, యాంత్రికంగా జరిగిపోయే వ్యవహారాలకూ తప్ప, సజీవమైన ఆధ్యాత్మిక సంబంధం ఉన్న విషయాలన్నిటికీ చాంద్రమాన పంచాంగం వాడతాం. హేతువాదానికి అతీతమై, ప్రత్యక్ష ప్రమాణాలకు అందని విషయాలన్నిటికీ, చంద్రుడితో సంబంధం ఉండి తీరుతుందని సాంప్రదాయికంగా వస్తున్న విశ్వాసం.

మనిషి మెదడు చేయగల తర్కబద్ధమైన ఆలోచనలూ, అంచనాలూ దాటి తర్కాతీతమైన అంతర్దృష్టి (intuition) ద్వారా జీవితాన్ని పరిశీలించవలసిన సందర్భాలలో చంద్రగ్రహం ప్రాముఖ్యత మరింత ఎక్కువవుతుంది.

సాధారణంగా చంద్ర గ్రహ ప్రభావానికీ, హేతుబద్ధతకూ చుక్కెదురు అని భావిస్తారు! పాశ్చాత్య దేశాలలో హేతుబద్ధతకు దూరమైన ప్రవర్తనను ఉన్మాదమూ, పిచ్చీ అని జమ కట్టేస్తారు. ఇంగ్లీషులో చంద్ర సంబంధమైన విషయాలను ‘లూనార్’ (lunar) అంటారు. దాన్నే మరి కొంచెం పొడిగిస్తే “లూనాటిక్’ అవుతుంది. అంటే ఉన్మాది, పిచ్చి వాడు. కానీ, మన ప్రాచ్య దేశాల సంస్కృతిలో మాత్రం, మనకు కేవలం శుష్క తర్కానికి ఉన్న పరిమితుల గురించి మొదటినుంచీ స్పష్టమైన అవగాహన ఉంటూనే ఉంది. మీలో తార్కికతతో, హేతు బద్ధతతో ముడిపడిన పార్శ్వం ఒకటి ఉంటుంది. అది మీకు తటస్థపడే భౌతిక, లౌకిక వ్యవహారాలను సవ్యంగా నిర్వహించుకొనేందుకు మీకు ఉపకరిస్తుంది. దానితోపాటు, మీలోనే, హేతుబద్ధతకు అతీతమైన పార్శ్వం కూడా మరొకటి ఉంది. దాని సహాయం లేకుండా ఆత్మాశ్రయమైన (subjective), అంతర్గతమైన విషయాలు అర్థం చేసుకోలేం.

ఇంద్రియాల ద్వారా మనిషికి తెలిసి వచ్చే ఇంద్రియ జ్ఞానం(perception) అంతా పరావర్తితమైన (reflected) జ్ఞానం. (యథార్థం అనే బింబానికి ప్రతిబింబం లాంటిది.) ఆ ప్రతిబింబం కాక మీకు మరేదయినా అదనంగా కనిపిస్తున్నదంటే, అలా కనిపించేది సత్యమైన జ్ఞానం కాదన్న మాట. ప్రత్యక్ష జ్ఞానం అంటే పరావర్తితమైన (reflected) జ్ఞానం. మీకు చంద్రుడిగా కనిపిస్తున్నది కూడా పరావర్తనమే(reflection). మీరు చంద్రుడిని చూడగలగటానికి కారణం చంద్రబింబం మీద పడి పరావర్తితమౌతున్న సూర్య కాంతి.

జీవితానికి సంబంధించిన లోతైన, ఆధ్యాత్మిక జ్ఞానానికి ఎప్పుడూ చంద్ర గ్రహాన్ని ప్రతీకగా భావిస్తారు. మార్మికత(mysticism)కూ, చంద్రగ్రహానికీ చాలా దగ్గరి సంబంధం ఉన్నదన్న భావన విశ్వ వ్యాప్తంగా, ప్రపంచంలో అన్నీ ప్రాంతాలలోనూ ఉన్నది. ఈ సంబంధానికి ప్రతీక గానే, శివుడు తన శిరస్సు మీద చంద్రవంకను ధరిస్తాడు. చంద్రశేఖరుడికి చంద్రుడే ఆభరణం.

యోగ శాస్త్రాలూ, యోగ మార్గమూ కూడా దీన్ని అనుసరించే తీర్చిదిద్దబడ్డాయి. యోగాభ్యాసంలో తొలి అడుగులన్నీ నూటికి నూరు శాతం హేతుబద్ధంగా ఉంటాయి. కానీ ముందుకు పోయి ఉన్నత దశలను చేరిన కొద్దీ హేతువాదానికి దూరంగా జరగవలసి వస్తుంది. ఇంకా పైకి వెళితే, పూర్తిగా హేత్వతీతమైన లోకంలో ప్రవేశిస్తాం. అక్కడ, తర్కాన్నీ హేతు వాదాన్నీ వదిలేస్తే తప్ప పురోగతి ఉండదు. జీవనానికీ, సృష్టి నిర్మాణానికీ మూలమైన రహస్యాలు అలాంటివీ మరి! అందుకే అప్పుడు చంద్ర గ్రహం ప్రాముఖ్యత పెరుగుతుంది.

ఏ శాస్త్రంలోనైనా పురోగమించేందుకు ఇదొక్కటే మార్గం. ఆదునిక విజ్ఞాన శాస్త్రాన్ని గమనించండి. (నిజానికి అదింకా శైశవ దశలోనే ఉన్నదని చెప్పాలి!) అక్కడ జరుగుతున్నదీ ఇదే. మొట్టమొదట్లో అక్కడా నూటికి నూరు పాళ్లూ హేతువాదం ఆధారంగానే ముందుకు సాగారు. కొన్ని అడుగులు వేసిన తరవాత, ఇప్పుడు వాళ్ళు కూడా హేత్వతీత మార్గమే పట్టవలసి వస్తున్నది. భౌతిక శాస్త్రజ్ఞులు మాట్లాడే మాటలు, దాదాపు మార్మిక యోగులు (mystics) చెప్పే మాటల లాగే ఉంటున్నాయి. శాస్త్రజ్ఞులు ఇప్పుడు ఈ భాష మాట్లాడటానికి కారణమేమిటి అంటారా, పురోగతికి అది తప్ప మరో మార్గం లేక పోవటమే! సృష్టి తత్త్వమే అలాంటిది కావటమే!

మీరు సృష్టినీ సృష్టి రహస్యాలనూ లోతుగా పరిశోధిస్తే, అవి అలాగే ఉంటాయి!

ప్రేమాశీస్సులతో,

సద్గురు